"ఏంటి రాజూ? ఆలోచిస్తున్నావు? రహస్యంగా స్నేహితుల నెవరినయినా కలుసుకోవాలా? ఏమిటీ?" అంది రాజేశ్వరమ్మ.
" రేపు ఊరికి వెళ్ళిపోతున్నా కదా, మరి ..... స్నేహితులకు చెప్పి రావద్దేమిటీ?" అన్నాడు. రాజు .అత్తయ్యతో ఏమి వంకచెప్పి ఇంట్లోంచి బయటకువెళ్ళాలి అనుకుంటూంటే రాజేశ్వరమ్మ స్నేహితులు మాట ఎత్తింది. రాజుకి అబద్ధం చెప్పేపని లేకపోయింది.
"తొందరగా పచ్చేసేయ్! మామయ్యకి తెలిస్తే కోప్పడతాడు."
"ఇప్పటికిప్పుడు రానూ.....?" అంటూ బయటకు పరుగుతీశాడు రాజు.
"రాజూ.... రాజూ!" పార్వతమ్మ వంటింట్లోంచి బయటకు వచ్చి గట్టిగా పిలిచింది.
రాజు వీధి గుమ్మం దాటాడు.అక్కడే నుంచుని "తొందరగా వెళ్లాలి. దేనికో చెప్పమ్మా?" అన్నాడు.
"జీలకర్రా? వచ్చేటప్పుడు తెస్తాలే." అని మళ్ళీ పరుగుతీశాడు.
"ఎంత జీలకర్ర కావాలో అడక్కుండా, డబ్బులయినా తీసుకెళ్ళక ఆపరుగేమిటమ్మా?పిచ్చి సన్యాసి.ఇలాంటివాడు అంత పట్నంలో ఎలా ఒంటరిగా వుంటాడో?" అనుకుంటూ వంటింట్లోకి పోయింది పార్వతమ్మ.!"
రాజు ఎక్కడా ఆగకుండ సరాసరి బలరామయ్యగారి.పెరట్లోకి వచ్చాడు. పెరడంతా నిశ్శబ్దంగా వుంది. పిల్లలెవరూ ఆపూట ఆటలాడుకోటానికి రాలేదని స్పష్టంగా తెలిసిపోతున్నది. మరి.... అనుపమ ఎందుకు రానట్టు? వచ్చి తనకోసం చూచి చూచి వెళ్లిపోయిందా? ఉహూ! మామూలు వేళకన్నా కాస్త ఆలస్యం అయింది. అంతే! అనూ వచ్చి నట్లయితే ఇక్కడ కూర్చునివుండేదే, వుండేదే!" అనుకుంటూ రాజు అక్కడే కూర్చుండిపోయాడు. వెంటనే లేచి పెరడు దాటి బయటకొచ్చి చూచాడు, దూరంగా అనూ వస్తున్నదేమో. అని.
" ఇక యీ పూటకు రాదు." అనుకుని కాళ్ళీడ్చుకుంటూ బయలుదేరాడు రాజు.
"రామభద్రయ్య ఇంటికెళితే మామయ్య ఊరుకోడు. తెలిసిందంటే కాళ్ళిరగగొట్టి కూర్చోపెడతాడు. దూరంగా వుండిచూద్దామన్నా అనూ తనని చూడలేదు. వెంకట్ ఇంటికో, శేఖరం ఇంటికోవెళ్ళి వాళ్ళను కనుక్కోవాలి అనూ రాని కారణం!పరీక్ష పాస్ అయ్యాను. ఏదో ఒక రోజు పట్నం వెళ్లిపోతాను. ఎప్పడు రమ్మని కబురంపితే అప్పుడు రావాలి. చాలా సంగతులు చెప్పుకుందామని అనూతో గట్టిగా చెప్పాడు. ఇవాళ అనూని చూడకపోతే మళ్ళీ ఎప్పుడో యీ వూరు వచ్చినప్పుడు చూడాల్సిందే!"
ఆలోచిస్తూ వెంకట్ ఇంటికి వచ్చాడు రాజు.
వెంకట్ ఇంట్లో లేడు. వాళ్ళ మామయ్యతో ఊరికి ఉదయమే వెళ్లాడు.
శేఖరం ఇంటికి బైలుదైరాడు రాజు.
అక్కడా చుక్కెదురయింది. శేఖరంకి నిన్నటినుంచీ జ్వరమయితే ఆచార్లుగారివద్ద మందుతెచ్చుకోటానికి తండ్రితో గంటక్రితం వెళ్ళాడు.
అవధాన్లు ఇల్లు చాలాదూరం.
ఉమ, శారద, నీరజ,అలివేణి ఎవరిళ్ళకీ ఎప్పుడూ వెళ్ళలేదురాజు. అందరూ కలిసి ఆడుకోటానికి కలుసుకోటం తప్ప.
" మామయ్య వచ్చే వేళకూడా కావస్తున్నది. ఇంటికి పోవాల్సిందే." అనుకుంటు కాళ్ళీడ్చుకుంటూ ఇంటిమొహంపట్టాడ రాజు.
ఇల్లు దగ్గర అవుతుండగా "రాజూ! రాజూ!" అంటూ కేకలుపెట్టి పిలుస్తూ అవధాని వచ్చాడు.
"ఇవాళెవరూ ఆడుకోటానికి రాలేదేం?" ఆతృతగా అడిగాడు రాజు.
"ఎవరూ రాలేదా? నేను ఆడుకోటానికి వెళ్ళలేదుగా నాకు తెలియదు."
" ఏం? ఎందుకెళ్ళలేదు ఆడుకోటానికి?"
అవధాన్లు సిగ్గుపడుతూ మెలికలు తిరిగాడు. " ఏం లేదు ఊరికేవెళ్ళ లేదు అంతే." అన్నాడు నసుగుతూ.
అవధాన్లు అబద్ధం చెపుతున్నట్లు గ్రహించాడు రాజు.
" దాస్తున్నావు అవధాన్లూ! నిజం చెపితే ఏం పోయింది?"
"చెపితే నవ్వుతావు." రాజుకి కోపంవచ్చిందని తెలిసి నెమ్మదిగా అన్నాడు అవధాన్లు.
"నేను నవ్వను. కావాలంటే వట్టుపెడతాను."
"మరి....మరి.... అమ్మతో పేరంటం వెళ్ళాను. మరి..... మన అనుపమ పెద్దమనిషయిందిగా పేరంటంపిలిచారు." ఆగి ఆగి రాజుముఖం చూడకుండ ఎటోచూస్తూ చెప్పాడు అవధాన్లు.
"ఏమిటీ, మళ్లీ చెప్పు?"
తను చెప్పింది విని రాజు నవ్వకపోగా తన భుజంమీద చేతులు వేసి గట్టిగా నొక్కుతూ "మళ్ళీ చెప్పు" అంటుంటే అవధాన్లుకి విచిత్రంగా అని గట్టిగా నొక్కుతూ "మళ్ళీ చెప్పు" అంటుంటే అవధాన్లుకి విచిత్రంగా అనిపించింది. అమ్మతో అన్నిపేరంటాలకి వెళతాడు.అది తెలిసి అందరూ నవ్వుతారు. ఎగతాళిచేస్తారు. రాజు మంచివాడు, నవ్వలేదు. పేరంటంటో ఏం జరిగిందో అంతా చెప్పాలి అనుకున్నాడు అవధాన్లు.