Previous Page Next Page 
వెన్నెల వేట పేజి 15

    ఫణి ఎటో చూస్తూ వింటున్నాడు ఆనందమూర్తి మాటల్ని. మళ్లీ ఆనందమూర్తే చెప్పడం మొదలెట్టాడు.

    "ఫణీ! తమకి ఇష్టంవచ్చిన చోట వైద్యం చేయించుకునే అధికారం, హక్కూ ఎవరికైనా వుంది. ఇతరుల హక్కులను తెలుసుకొని ఆదరించనంతవరకు మనం ఎప్పుడూ సంస్కారులం కాలేము. ఏవేవో అనుమానాలూ, అపోహలూ మనసులో పెట్టుకుని నన్నూ, హర్షితనీ నిందించి ప్రయోజనం లేదు. మేము కాలేజీమేట్సే కాదు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా. నీ శ్రేయస్సునికాంక్షించే వాళ్ళం. ఇది గుర్తుంచుకుంటే చాలు" అన్నాడు ఆనందమూర్తి. ఫణికుమార్ మౌనంగా వింటున్నాడు. ఆలోచనలు అతడి మెదడును చుట్టేశాయి. ఆవేశం చల్లారాక మెదడు ఆలోచించడం మొదలెట్టింది. ఆనందమూర్తి మాటలు ఒక్కొక్కటే బుర్రకెక్కాయి.


    "సారీ ఆనంద్!" ఇరిటేషన్ లో మిమ్మల్ని ఏదేదో అన్నాను. ఐ.యామ్.......వెరీ వెరీ సారీ!" అన్నాడు ప్రాధేయపూర్వకంగా.

    "మనలో మనకి సారీలు, క్షమాపణలు ఏమిటిలే! తనకు మాత్రమే దుఃఖాన్ని లేకుండా చేసుకునే ప్రయత్నంలో ఇంకెందరికో దుఃఖాన్ని కలిగిస్తుంటాడు మనిషి, అలాంటి మార్గంలో మనం నడవకుండా జాగ్రత్తపడితే చాలు" అన్నాడు ఆనందమూర్తి ఫణికుమార్ భుజం తడుతూ.

    "థాంక్యూ.....థాంక్స్.....ఎ..లాట్" అన్నాడు ఫణి.

    "ఫణీ! నువ్వు ఆవేశంలో అన్నా ఆలోచించి అన్నా మమ్మల్ని దూషిస్తూ మాట్లాడావు. ఆమాటలు మమ్మల్ని బాధపెట్టలేదని మేం చెప్తే ఆత్మద్రోహం అవుతుంది. ఎదుటివారిని ఒక మాట అనే ముందు నిన్ను నువ్వు సమీక్షించుకో! నీకు నువ్వు గొప్పవాడిగా చెప్పుకుంటే లాభం లేదు. సమాజంలో కాలాన్ని బట్టి మనం చేసే కార్యాలను బట్టి గౌరవం, అగౌరవం ప్రాప్తమవుతుంటాయి." అంది హర్షిత కొంచెం పదునుగానే.

    "నా తప్పుని ఒప్పుకున్నానుగా! నన్ను క్షమించు హర్షితా?" అన్నాడు ఫణికుమార్.

    "హర్షితా! ఫణిది చిన్నపిల్లాడి మనస్తత్వం. ఏ ఫీలింగ్ నీ మనసులో దాచుకోలేడు తప్పు రియలైజ్ అయ్యాడు చాలు. వెళ్దాం పద" అంటూ లేచినుంచున్నాడు ఆనందమూర్తి.

    హర్షిత, ఆనందమూర్తి, ఫణికుమార్ లతికలకు చెప్పి బయలుదేరి వెళ్ళిపోయారు.

    వాళ్ళ కారు గేటు దాటి వెళ్ళేవరకు ఉండి చేతులు ఊపారు ఫణి లతిక "భోజనానికి పిలిచి, అవమానించినట్టుగా మాట్లాడడం బాగోలేదు" అంది లతిక నెమ్మదిగా గొణుక్కుంటున్నట్టుగా.

    ఫణికుమార్ మంచం మీద వాలిపోయాడు. వెల్లకిలా పడుకుని ఆలోచనలో పడ్డాడు.

    లతిక ఏదో అడుగుదామని అతని దగ్గరకొచ్చింది. అతను సీరియస్గా ఆలోచిస్తూ ఉండడం చూసి సంశయించి ఆగిపోయింది.

    ఉన్నట్టుండి ఫణి గభాల్న లేచాడుయ

    ఫోన్ దగ్గరికెళ్లాడు.

    ఏదో నెంబర్ కి ఫోన్ చేశాడు.

    అవతల రిసీవర్ ఎత్తారు.

    "హల్లో....! ఆనందమూర్తి స్పీకింగ్" అన్నాడు ఫణికుమార్.

    ఫణికుమార్ తన పేరు ఆనందమూర్తిగా చెప్పడం లతికకు ఆశ్చర్యం కలిగించింది.

    ఫోన్ లో అవతలి వ్యక్తి ఎవరో ఏం చెబుతున్నాడో అర్ధంకాలేదు. ఫణికుమార్ వింటూ "ఊఁ.....కొట్టడం, ఆహాఁ.... అలాగా" అనడం తప్ప ఏమీ అర్ధం కాలేదు.

    అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది లతిక.

    ఫణికేసే కన్నార్పకుండా చూస్తుండిపోయింది. క్రమంగా అతని ముఖ కవళికలు మారిపోయాయి. ముఖం ఎర్రగా కందిపోయింది. మనిషి ఆవేశంతో కోపంతో ఊగిపోసాగాడు.

    "సరే! వచ్చే వారం తీసుకురా. ఈలోగా నాకు ఫోన్ చెయ్యకు" అన్నాడు ఫోన్ లో.

    లతికకు అతని ప్రవర్తన ఆందోళన కలిగించింది. మెల్లగా వచ్చి ఫణి ప్రక్కనే కూర్చుంది.

    అతను ఫోన్ పెట్టెయ్యగానే లతిక అడిగింది.  "ఎవరికండీ ఫోన్ చేశారు?" అని.

    ఫణి లతిక మొహంలోకి తీక్షణంగా చూశాడు. అలా చూస్తే లతిక ఒణికిపోతుంది. వెన్నులోంచి చలిపుట్టుకొచ్చినట్టుగా ఫీలవుతుంది. అయినా ధైర్యం తెచ్చుకొని "ఎవరికండీ ఫోన్ చేసింది?" మళ్లీ అడిగింది.    

    "వామనరావు కొడుక్కి, అతనే మాట్లాడాడు" అన్నాడు ఫణికుమార్. మొహంలో లేని ప్రశాంతతని తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ.

    "ఆనందమూర్తి పేరుతో మాట్లాడారెందుకు?" అనుమానంగా అడిగింది.  "హాఁ అలా మాట్లాడితేనే అసలు విషయాలు బైటికొస్తాయి. నేనే ఆనందమూర్తిననుకొని వామనరావు కొడుకు నన్ను విపరీతంగా పొగిడేస్తున్నాడు. తన తండ్రిని ఫమికుమర్ బారి నుంచి రక్షించి, మంచి ట్రీట్ మెంట్ ఇచ్చి, అతని ప్రాణాలు కాపాడమని బతిమాలుతున్నాడు. ఆనందమూర్తిని కలవడానికి మన ఇంటికి వస్తే నేను చాలా సీరియస్ గా మాట్లాడుతూ వుండడం చూసి భయపడి, నా కంటపడకుండా పారిపోయాడట. స్కౌండ్రల్" అంటూ పళ్ళు పటపట కొరికాడు కోపంగా. లతిక మనసునిండా భయం ముసురుకుంది.

    "వాడి తండ్రికి వైద్యం చెయ్యడానికి ఎంత డబ్బయినా ఇస్తాడట. నాకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వడానికే ఏడ్చి చచ్చే వెధవకి ఆనందమూర్తి అంటే అంత ప్రేమా!" అంటూ పక్కనున్న బల్లమీద గ్టటిగా గుద్దాడు తన కోపాన్నంతా ప్రదర్శిస్తూ.

 Previous Page Next Page