"అరేయ్ అందరూ పైకోసారి చూడండిరా"
విజయ్ చేతిలో లైట అర్పేశాడు ఆ మాట అంటూ. అందరూ ఒక్కసారిగా తలలు పైకెత్తి చూశారు వాళ్ళకేమీ కనబడలేదు ఆ చీకటిలో.
విజయ్ పకపక నవ్వుతున్నాడు ఆ ప్రదేశమంతా అతని నవ్వు తెరతెరలుగా వ్యాపించి విచిత్రద్వని వినవచ్చింది.
"నీకేమన్నా మతిపోయిందా విజయ్!" కృతి అంది.
"అవును" అంటూ మరోసారి నవ్వాడు.
అర్ధంగాని సుబ్బారావు ముందే బిగుసుకుపోయాడు.
"విజయ్ కి ఏమన్నా......!" మాటలు మింగేసింది నిశ్చల
"అదే చూస్తున్నా" కమల్ నెమ్మదిగా అని "ఒరేయ్ విజయ్! ఏంటానవ్వు ఏం జరిగిందిరా?" గట్టిగా అరిచాడు.
"అరెపూల్స్ . టార్చ్ వెలిగించి పైకి వేసి చూడండిరా !" అంటూ మరోసారి నవ్వాడు.
అందరూ క్విక్ గా టార్చ్ లైట్స్ వెలిగించటం వెలుతురు పైకి ప్రసరింపజేసి చూడటం జరిగింది. జరిగింది అర్దమావుతూనే ఆనందంతో వెర్రికేకలేశారు. ఎవరేంమంటున్నారో వాళ్ళకే అర్ధం కావటం లేదు.
టార్చ్ లైటు వెలుతురుకూడా పొదుపుగా వాడటానికి విజయ్ పదినిమిషాలనుంచి లైటు వెయ్యలేదు. అతను ముందుకీ జరిగిపోతున్నాడు. అతని వెనుకనేపడి వాళ్ళూ వెళుతున్నారు. ఎనిమిది నిమిషాలుపాకే పనిలేదని వాళ్ళకి ముందే తెలిసివుంటే వాళ్ళపని చేసేవారుకాదు అక్కడిమార్గం కాస్త వెడల్పుగావుంది. నుంచుంటే సరిపోయే ఎత్తులో వుంది అవసరం లేనిచోట అనవసరంగా పాకామని గ్రహించగానే ముందు విజయ్ కి అందరికీ నవ్వొచ్చింది.
"ఇంక లేచి నిలబడదా౦, కాని నెమ్మదిగా లేవండి చాలాసేపు జెర్రిగోడ్డులా పాకాము. వీపున బరువు వుంది. చేతులూ కాళ్ళూ అధీనం తప్పివుంటాయి. ముందు నేను లేస్తున్నాను" అంటూ నెలకి చేతులా నించి మెల్లగా లేచి నిలబడ్డారు విజయ్.
అందరూ అదేపని చేశారు.
"చేతులూ కాళ్ళూ అని ఏమిటిరా నాయనా మొత్తం శరీరమే అదీనంలో లేదు. చూడు ఇంత విశాలంగా మార్గం వుంటే వెధవపొదుపూ నీవూనూ. లైటు వెలిగించక నా ప్రాణం తీసి కింద పాకించావ్!" సుబ్బారావు నడుం చేతులతో నొక్కుకుంటూ అన్నాడు.
ఏం ఫరవాలేదు . పొట్ట కాస్త కరిగివుంటుంది. మళ్ళీ యింటి కెళ్ళింతర్వాత పెంచుకుందువుగాని" కమల్ అన్నాడు.
"ఇప్పుడు చేయవలసిన కార్యక్రమం ఏమిటి?" కృతి అడిగింది.
"కింకర్తవ్యం?" నిశ్చల అంది.
"విజయ్ ! నిలబడటానికి చోటు ఉంది. అందుబాటులో నీళ్ళు ఉన్నాయి కాని ......!"
"నీ అనుమానం అర్దమైందిరా కమల్! ముందుగా మనం ఈ నీటిలో ఏదైనా జీవరాసి వున్నదేమో అన్నది చూడాలి . రెండు తాగొచ్చో లేదో చూసుకోవాలి. నీరు ఇక్కడ నిలవ ఎలా వున్నదన్నది చూసుకోవాలి. ఇక్కడితో మార్గం అంతమయితే మనపని ఖాళీ. అలాగాక మరోమార్గం వుందేమో కనిపెట్టాలి అవునా?"
"య్యా! సరీగా కనిపెట్టావురా నా మాన్సులో మాట"
"సరే, ముందు చూడ్డం పదండి" అని విజయ్ ముందుకునడిచి నీటిమీద లైటు ఫోన్ చేసి చూశాడు. నీళ్ళు నిశ్చలంగా వున్నాయి. చేతిలో ఉన్న కర్రతో నీళ్ళని వేగంగా కదిలించాడు. నీళ్ళుకదిలి మళ్ళీ యదావిధిగా ఆగిపొయ్యాయి చేతిలోకి కాసిన్ని నీళ్ళుతీసుకుని నాలుకతడిపే మాత్రమె రుచిచూశాడు.
విజయ్ చేస్తున్నాపని కళ్ళప్పగించి చూస్తూ వుండిపోయారు అందరూ.
"మార్వలెస్. అద్భుతమైన రుచితో అతి శీలంగా వున్నాయి. ఈ నీళ్ళు "విజయ్ ఆ మాట అనటం ఆలస్యం గబగబ నలుగురూ ముందుకువచ్చి దోసిటినిండా నీళ్ళు తీసుకుని ఆతృతగా తాగారు. తరువాత ముఖం కడుకున్నారు.
"ప్రాణం ఎంత హాయిగా వుంది."
"నీరు గాలి ప్రాణం నిలబెడతాయి. ఇక్కడ గాలి లేకపోయినా చల్లదనం వుమ్దతంతావు హాయిగా ఉంది" కృతికి సమాధానంగా నిశ్చల అంది.
"పిక్నిక్ కొచ్చామనుకుంటూ కాసేపు ఇక్కడవుండి విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది గదరా"
"చూడు సుబ్బూ! విశ్రాంతి అన్నమాట ఇంక మర్చిపో పదండి నీటిలోకి దిగుదాం. అడుగులు నెమ్మదిగా వేయండి. ఈ నీరు ఎందాకా ఉన్నది ఇటునుంచి ఎటైనా మార్గం ఉన్నదా అన్నది చూడాలి ' టార్చ్ లైటు వెలిగించేవుంచి నలువైపులా ప్రసరింపజేస్తూ ముందడుగేశాడు విజయ్
అందరూ అదేపని చేశారు.
పెద్ద విశాలమంత గది ఎంతమేర ఉంటుందో అంతమేర నీళ్ళు ఉన్నాయి చుట్టూ రాళ్ళతో కప్పబడింది. పైగా అవి పెద్దపెద్దరాళ్ళు మూరెడు ఎత్తు వచ్చేటట్లు ఆ గదిలో నీళ్ళు పోస్తే ఎలా ఉంటుంది అలా నిలిచివున్నాయి. నీళ్ళు.
"ఈ రాళ్ళతీరు చూస్తుంటే మార్గం వున్నట్లు కనపడటంలేదు
"ఎటునుంచి ఈ నాళ్ళు వచ్చినట్లు , నీళ్ళు చూడబోతే ఫ్రష్ గా విన్నాయి చాలా విచిత్రంగా వుంది"
"మరికటి గమనించావా కమల్! గోడలు పైదాకా తడిసి వున్నాయి. పైనుంచి గాని పక్కల నుంచి గాని నీళ్ళు వచ్చిన సూచన బొత్తిగా లేదు"
"ఇక్కడేదైన విచిత్రశక్తి వుందేమో!"
"ఏ మంత్రగాడి మాయగుహో కాదుకదా?" వాళ్ళతోపాటు నీళ్ళలో కలియతిరుగుతూ సుబ్బారావు అన్నాడు.
"చెప్పలెంరా అబ్బాయ్! మంత్రగాడంటూ వున్నాడే అనుకో. వాడి కంట మనం పడ్డామే అనుకో! ముందుగా వాడికన్ను యాపిల్ పండులా ఉన్న నీపైన పడటం ఖాయం ఆపై ........
కమల్ మాట ముగించకముందే విజయ్ అరిచాడు "డేంజర్ డేంజర్"
ఒక్కసారి బుస్సున శబ్దం అయింది.
నిర్ఘాంతపోయి కాళ్ళూ చేతులూ ఆడనివాళ్ళులా అలా నిలబడి పోయారు అంతా.
వచ్చిన మార్గానికి పక్కగా కాక ఎదురుగ నడిచి ఎదుటిగోడని పరిశీలిస్తున్నారు వాళ్ళు. ఇలాంటి ప్రమాదాలు౦టాయని క్షణాలలో ముంచుకోస్తాయని తెలిస్తే ముందుభాగానే వుండిపోయేవారు. వచ్చి వచ్చి ఘోరమైన ప్రమాదంలో చిక్కుపోయారు. ఇప్పుడు బుస్సుమన్న శబ్దం వీటిబుగ్గది. వీటిబుగ్గలనేవి నీళ్ళలో మధ్యనుంటాయి, అగ్ని పర్వతం పేలినట్లు లావా పొంగినట్లు అప్పటికప్పుడు వాటిపని అవి చేసుకుపోతూ వాటి దరిదాపుల ఉన్న వాళ్ళ ప్రాణాలు తీస్తాయి.
మోకాలు కిమ్దదాకా వున్న నీరు నిశ్సబ్దంగా వూరి మోకాలు దాకా రావటం ముందు విజయ్ గ్రహించి కమల్ తో చెప్పాడు. కమల్ తోపాటు అంతా అది గ్రహించేలోపల "బస్సు" మంటూ ఆ ప్రదేశం దద్దరిల్లేలా శ్శబ్దం చేస్తూ సరీగా నీటి మధ్యభాగాన తాటిచెట్టు ప్రమాణాన నీళ్ళు లేచాయి. ఆ నీళ్ళ పైభాగాన్ని తాకి పాంటేన్ లా చుట్టూ పడుతున్నాయి. అమిత స్పీడ్ గా శబ్దంచేస్తూ నీళ్ళు పై పైకి వచ్చేస్తున్నాయి.
అది గ్రహించి గుహా మార్గంవేపు పరుగెట్టబోయారు కాని ఆ ధారా వాళ్ళని పక్కకు నెట్టింది.
"క్విక్ క్విక్ . మనం గోడఅంచులు ఆధారంతో పట్టుకు నడుస్తూ మార్గంవేపు వెళదాం రెడీ" అంటూ విజయ్ గోడ గట్టిగా పట్టుకుని పక్కనుంచి నడిచారు. వెనుకనే అందరూ నడిచారు. జారి వక్కళ్ళూ పడకుండా తాడు గట్టిగా పట్టేస్తుకున్నారు. అప్పటికే వాళ్ళ నడుందాకా నీళ్ళు వచ్చాయి. అడుగు వేయటం కష్టంగా వుండి. నీళ్ళలో తేలిపోయే ప్రమాదం ఏర్పడింది.
మరోపక్క అదేనిముషాన "బస్సు" మంటూ మరో నీటి బుగ్గ పైకి లేచింది.
నీళ్ళ వుధ్రుతం ఎక్కువయ్యింది.
"బాబోయ్ ! బామ్మోయ్?" సుబ్బారావు అరిచాడు.
"నోరుము..... య్యి" అనబోతున్న విజయ్ మూడో అక్షరం పలికి తానె నోరుమూసుకున్నాడు వీళ్ళ కాళ్ళకిందనే మరో నీటి బుగ్గలేచింది. దాంతో బ్యాలెన్స్ తప్పి ఒకరి నెత్తిన ఒకరుపడ్డారు ఆ నీటి బుగ్గలోని నీరు పైకి కొట్టినట్లయితే పై భాగానికెళ్ళిరాతికి కొట్టుకునే వారే అంతా ఆ నీటి బుగ్గ సగం ఎత్తునే లేచింది." దాంతోపాటే అందరూ పైకిలేచారు. వాళ్ళ ప్రయత్నం అంటూ ఏమీ లేకుండానే అలా జరిగింది.
సరీగ అప్పుడే జరగవలసిన ఘోరం జరిగిపోయింది.
బుస్సున పైకి లేచిన నీటి బుగ్గ అదే స్పీడుతో మళ్ళీ లోపలి పోయింది దాంతో పాటే ఒకరి మీద వకళ్ళుపడి లోపలి జారి పోతున్నారు.
అందరికి అయోమయంగా వుంది. ఏకకాలంలో స్పృహా తప్పిపోయారు.
వాళ్ళ కాళ్ళ కింద ఏర్పడిన నీటిబుగ్గతోపాటు మిగతా రెండునీటి బుగ్గలు వాటి ప్రతాపం ఆపి లోపలి జారుకుమ్తున్నాయి.
కొద్ది నిముషాల తర్వాత .......
ఆ ప్రదేశంలో ఎప్పటిలా ఏ కదిలికా లేకుండా మూరెడేత్తు మూత్రమే నీళ్ళు నిలిచి వున్నాయి.
అలా నీటి బుగ్గలోంచి పైకి నీరు రావటం నెలకి ఒకటి రెండుసార్లు మాత్రమే జరుగుతుంది.
ఇలా జరగటం ఈ నెలలో యిది రెండోసారి.
సరీగా వీళ్ళు నీటిబుగ్గ పక్కగా నిలబడ్డప్పుడే నీటిబుగ్గ తన ప్రాణం చూపించి వాళ్ళని అధఃపాతాళానికి అత్యంత వేగంగా లాక్కెళ్ళింది.
పాతనీరు పారిపోయి కొత్తనీరు వచ్చి నిలిచింది.
ఆ ప్రదేశమంతా మరింత చల్లగా తయారయింది.