జడ్జిగారే అతన్ని స్వయంగా కొన్ని ప్రశ్నలు అడిగారు.
"నీ పేరు వివరాలు కోర్టువారికి తెలియజేస్తావా?"
"ద్రవిడు మాహేశ్వరులం. నాగదేవతలను ఉపాసిస్తాం!"
"నీవు చెప్పింది మనిషి పేరు కాదు. నీవు చేసేది వృత్తి కూడకాదు"
"మానవులంతా మహేశ్వరులె అయినప్పుడు వేరువేరు పేరులెందుకు?"
"మూర్ఖుడా! పేరుతో ప్రారంభమయిన వేరు తనం కులాలుగా మతాలుగా వర్గాలుగా చీలి వికృతంగా కన్పిస్తోంది."
"మాదృష్టిలో నరులంతా నందివాహనులే!"
"నువ్వెక్కడ ఉంటావు. మాకు నీ అడ్రస్ కావాలి!" అని అడిగారు జడ్జి.
"జంబూ ద్వీపే భారతవర్షే భరతఖండే ద్రవిడ మాహేశ్వరః!"
ఇంకా లాభంలేదనిపించి న్యాయమూర్తి ఆ ప్రయత్నం మానుకున్నారు.
"అర్ధ నగ్నంగా తిరగటం తప్పని తెలియదా?"
"బట్టలతో పుట్టడురా మనిషి! బట్టలతో మట్టికాడు! ఈ పొట్ట పీడించినంతకాలమే మట్టిలోంచి వచ్చానని మర్చిపోతాడు!"
"క్రూర జంతువులను వెంట పెట్టుకురావటం బెదిరించటం తప్పుకదా?"
"స్వార్ధాన్ని మించిన క్రూరజంతువులేదు. అది మనిషిలోనే ఎక్కువగా ఉంది! పుట్టుకతో శిక్షార్హమయిన ప్రాణి ఎవరయినా ఉంటే అది మనిషేనని మీరంతా గుర్తించాలి!"
"అధికారులతో కలియపడటం హత్య చేయాలను కోవటం తప్పు కాదా?"
"అధికారులమనే అహంకారమే మీకు పనికిరాదంటున్నాను! కలయబడింది నేను కాదు. నాగదేవతను గాయపరిచి బంధించింది కూడ నేను కాదు. నేను కాని నాగదేవతకాని భస్మం చేయాలనుకుంటే క్షణకాలం పట్టేది కాదు."
తప్పు తెలుసుకుంటానని మనసు మార్చుకుంటాడని ఎదురు చూడటం పొరపాటు అయింది.
"నువ్వు చేసిన పనులు చట్టం దృష్టిలో నేరాలు! శిక్ష అనుభవించేందుకు సిద్దంగా ఉన్నావా?" అని ప్రశ్నించారు న్యాయమూర్తి.
"శక్తికి మించిన మాటలు మాటాడుతున్నావురా మూర్ఖుడా! మాహేశ్వరులను, నాగదేవతలను శిక్షించగల శక్తి నీకు ఉందా?" అని ఎదురు ప్రశ్న వేశాడు ద్రవిడ మాహేశ్వరుడు.
అతని మాటలు విని కోర్టు హాలంత ఉలికిపడింది.
జడ్జిగారు కన్నులు చికిలించి చూచారు. మరి ప్రశ్నించలేదు.
"ఉన్మాదిలా కన్పించే ఈ విచిత్ర వ్యక్తిని పదిహేను రోజుల తరువాత విచారణ కోసం కోర్టు ముందు తిరిగి హాజరుపర్చండి! అంతవరకు ప్రజలకు ఎలాంటి హానిచేయకుండా పోలీసు వారిని నిర్బంధంలో ఉంచండి!" అని తీర్పు చెప్పి ఆయన లేచి వెళ్ళిపోయారు.
బోను చుట్టూ పోలీసులు నిలబడ్డారు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆసక్తిగా అతని దగ్గిరకు వచ్చాడు.
"జటా జూటంలో పాముని ఉంచుకోవటం ఒక విచిత్ర విద్య! జనాన్ని భయపెట్టటానికి అలా చేస్తున్నావు. అవునా?" అని ప్రశ్నించాడు.
"మూర్ఖుడా! జటా జూటమంటే అది వాల్మీకము. ఈ ద్రవిడ మాహేశ్వరుని శిరసు మీద నర్తించేవి రెండు దేవతా సర్పాలు! నేను ఆ వాహన చేయగానే మగ సర్పం వెలుపలకు వచ్చింది. అని పెనబాములు దానిలో ఒకదానిని మీరు బంధించారు.
శిఖలో నర్తించే జంట నించి ఒకదాన్ని మీరు వేరుచేశారు. వియోగంతో రెండవనాగు బుసలు కొడుతోంది.
తననించి జంటను వేరుచేసిన వాడిపై పగతీర్చుకునేంతవరకూ నిద్రపోనంటోంది! దాన్ని అప్పగించండి! లేదా మీరంతా భస్మీపటలమై పోతారు" అని చివరిసారిగా హెచ్చరించాడు.
"అయితే శిగలో మరొక పాము ఉందన్నమాట? ఎంతమాయల మారివి?" అంటూ పాములను పట్టేవాడి వంక చూచాడు పి.పి.
అతడు దగ్గరగా వచ్చాడు. గాయపడిన పాముని ఒకచేతిలో పట్టుకుని మరొక చేత్తో నాదస్వరం ఊదటం ప్రారంభించాడు.
అతడు చాలాసేపు అలా కవ్వించాడు. కాని ప్రయత్నం వృధా అయింది.
"ఈ బైరాగి చెప్పే మాటలు అబద్దం సార్! పాము ఉంటే పైకి రావలసింది. వీడిదంతా బూటకంలా కన్పిస్తోంది" అన్నాడు.
ద్రవిడ మాహేశ్వరుడి ముఖం మళ్ళీ కంది పోయింది.
"ఓం సర్పోపసర్ప! మహాసర్ప!! ఆవాహ! విజంభ మహానాగా!! అంటూ పోలిరంకెవేసి పిలిచాడు!
అంతవరకూ జటా జూటంలో జంటనాగు కోసం దురపిల్లుతున్న పింగళి వర్ణం కృష్ణనాగు ఖస్సుమని పైకి లేచింది. పడగవిప్పి జటాజూటం మీద ఆడటం ప్రారంభించింది!
నా ప్రియున్ని బంధించిన వారిమీద పగతీర్చుకుంటాను అని వెర్రెత్తినట్టు ఊగిసలాడింది. పాములను పట్టేందుకు వచ్చిన వ్యక్తి భయవిహ్వలుడై ఉలికిపడి వెనకడుగు వేశాడు.
ఆ కంగారుతో అతని చేతచిక్కిన పురుషనాగు క్రిందికి జారి ఊ ఫ్ ఫ్ ఫ్....మన పూత్కారం చేస్తూ అతని స్కంద మీద దెచ్చికొట్టింది. అతడు భయంకరంగా వెర్రికేక పెట్టి విరుచుకుని పడిపోయాడు. జనం చెల్లాచెదరు అయింది.
ద్రవిడ మాహేశ్వరుడు పైకి లేచాడు.
పురుషనాగు అతని జటా జూటంలోంచి ఎలా క్రిందికి దిగి వచ్చిందో అలాగే పైకి వెళ్ళి జటా జూటంలో దూరిపోయింది.
సర్పాలు రెండు పడగలు ఎత్తి ప్రజలను హెచ్చరిస్తున్నాయి.
అతనికి అతి దగ్గరలో ఉన్న పి.పి. ఈ దృశ్యాన్ని చూచి భరించలేక గంగ వెర్రులెత్తిపోయి ప్యాంటు తడిపేసుకున్నాడు.
దూరంగా ఉన్న శివరాజ్ జనాన్ని త్రోసుకొని ముందుకు రావాలని ప్రయత్నించాడు. మాహేశ్వరుడి తలమీద రెండు పాములు పడగవిప్పి ఆడుతూ ఉంటంతో ఆ దృశ్యాన్ని చూచి జనం సంక్షుభితమయింది. ఎవరికి వారే తొలగి దారి యిచ్చారు.