Previous Page Next Page 
లేడీస్ హాస్టల్ పేజి 9

 

     "అయ్యో పాపం! చాలా కష్టం అనుభవించి వుంటారు కదా" వెటకారంగా అంది.
   
    "కష్టమా- కష్టమా! అప్పటికది సరిపోలేదన్నట్టు పై అంతస్థు నుంచి ఎవరో అమ్మాయి గదిలోనే ఆమ్లెట్లు వేసుకున్నట్టున్నారు - ఆ కోడిగుడ్డు డొల్లలు, ఉల్లిపాయ ముక్కలు పడేశారు!! అంతలో నెమ్మదిగా తెల్లారింది. పదిమంది అమ్మాయిలు చుట్టూ పోగయి చూస్తున్నారన్న సంగతి వాళ్ళ మాటలబట్టి తెలిసింది. నేనెంత గోడవైపు తిరిగివున్నా వెనుకవైపంతా వెలుగులో వాళ్ళకి కనబడుతుందికదా. కళ్ళు గట్టిగా మూసుకున్నాను. క్రిందకి అలాగే దూకి ఆత్మహత్య చేసుకుందా మనుకున్నాను. అంతలో ఎవరో వెళ్ళి వార్డెన్ కి నా సంగతి చెప్పినట్టున్నారు. ఆవిడ వచ్చి, వేలాడే నన్ను చూసి, దగ్గిరకి వచ్చి, భుజం తట్టి "పోలీసులు వస్తున్నారబ్బాయ్. ఇక దిగు" అని అనేంతవరకూ తెలీదు నాకు అపురూపలక్ష్మి గది గ్రౌండ్ ఫ్లోర్ లోనే వుందనీ- రాత్రంతా నా కళ్ళు భూమికి ఆరంగుళాలు పైన వేలాడుతున్నాయని-"
   
    అప్పటివరకూ కోపంతో కుతకుతలాడుతూన్న కిరణ్మయి  అనుకోకుండా నవ్వేసింది. కేవలం తనని ప్రసన్నం చేసుకోవటానికే భర్త ఈ కథ అల్లి  చెప్పాడని అర్ధమై అప్పటివరకూ తను ఫూల్ అయిన విషయం కూడా మర్చిపోయి నవ్వేసింది. ఆమె మొహంలో ఆ మాత్రం ప్రసన్నత కనపడగానే అతడు వరదగోదారి అయ్యాడు. అతడి ఉధృతం నుంచి తప్పించుకోవటానికా అన్నట్టు "మీరు మీ గురించి చెప్పమన్నారు కదా !" అంది. 
   
    ఆమె ఊహించినట్టే అతడు దూరంగా జరిగి "చెప్పు" అన్నాడు హమ్మయ్య అనుకుంది మనసులో. ఆడవాళ్ళకి వెయిట్ లిఫ్టింగ్ కోర్సు లేకపోవటం దురదృష్టకరం.
   
    ఆమెకి అతడు భర్తయి రెండ్రోజులయినా, దగ్గరైంది రెండుగంటలలోపే! మనిషి మనస్తత్వాన్ని రకరకాల రంగులకి అన్వయిస్తూ మాక్స్ లూథర్ తయారుచేసిన శాస్త్రపు ఆధారంతో, ఈ రెండు గంటల పరిచయంలో ఆమె తన భర్త గురించి ఏమనుకుంటుందో చెప్పింది. ఒక మనిషి మనస్తత్వాన్ని పూర్తిగా తెలుసుకోవటానికి రెండుగంటల కాలం చాలా తక్కువే కానీ, ఆమె తనకు తెలిసినంతలో ఆ కొద్ది కాలంలో జరిగిన ప్రతి సంభాషణ అతడి ప్రతి చేష్టా, ప్రవర్తనా ఆధారంగా తన అభిప్రాయాన్ని ఏ మాత్రం మొహమాటం లేకుండా చెప్పటం మొదలుపెట్టింది. అయిదు నిముషాలపాటు ఏకధాటిగా ఆ మసకచీకట్లో ఆమె మంద్రస్వరం వినిపించింది. తన భర్త గురించి ఏ భార్యా ఒక నిర్ణయానికి అంత తొందర్లో రాదు. కానీ ఆమెకి తన సబ్జెక్టు మీద వున్న కమాండు అలాంటిది (కనీసం ఆమెకా నమ్మకం వుంది). దాని ఆధారంతో చెప్పింది. కాగితం అవసరమైన చోట నగ్నంగా వున్న అతడి ఛాతీని వుపయోగించుకుని చూపుడు వేలుతో ఛార్టు గీసింది. ఆమె అయిదు నిమిషాలపాటు చెప్పినదాన్లో ముఖ్యాంశాలు అతడికికూడా ఆశ్చర్యం గొలిపేలా వున్నాయి. అయితే ఆమె ఒక భార్యలా కాకుండా, అడ్వాన్స్ డ్ సైకాలజీ స్టూడెంట్ గా దాన్ని వివరించింది.
   
    ఆకుపచ్చ ఆత్మగౌరవానికి, పసుపుపచ్చ ఆత్మచైతన్యానికి, ఎరుపు ఆత్మవిశ్వాసానికి, నీలం ఆత్మావలోకానికి నిదర్శనాలైతే అతడి విషయంలో ఆకుపచ్చ, నీలం సంతృప్తికరంగా వున్నా ఎరుపు లేతగా వుంది. ఇంకా ఆత్మ విశ్వాసం పెరగాలి. లేత ఎరుపు సెల్ఫ్ పిటీకి నిదర్శనం. పసుపు గాఢంగా వుంది అంటే అవసరమైన దానికన్నా ఎక్కువ చైతన్యం వుందన్నమాట.
   
    ఆడవాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడేవాళ్ళు సాధారణంగా వారితో తక్కువ సంబంధాలు కలిగివుంటారు. ఈ లెక్కన, వారి గురించే ఎక్కువ సంభాషణ దొర్లింది కాబట్టి అతడికి ఎవరితోనూ సంబంధాలు లేకపోయి వుండవచ్చు. నిర్మలంగా లేనివాళ్ళు అన్ని జోకులు ఆడవాళ్ళ గురించి వేయలేరు కానీ ఈ విషయమై మరింత పరిశోధన అవసరం. (ఈ చివరి వాక్యం దగ్గిర కొచ్చేసరికి నవ్వేసింది.)
   
    23. 56. 00 Hrs.
   
    "ఇక చాలు ఇప్పటికే చాలాసేపట్నుంచి మాట్లాడుకున్నాం. మొదటి రాత్రి ఎక్కువ మాటలు ఆయుక్షీణం. ఈ  ప్రసారం ఇక్కడితో సమాప్తం" అని లైటార్పబోతూ, "....అన్నట్టు లాస్ట్ గా ఒక్క ఆఫర్....నా గురించీ నా  మనస్తత్వం గురించీ ఇంత బాగా వివరించి చెప్పినందుకు నీకేం కావాలి?" అని అడిగాడు.
   
    ఆమె నవ్వి "ఏమిస్తారు?" అంది.
   
    "ఏమిచ్చినా తీసుకుంటావా?"
   
    "ఊఁ" అంది అమాయకంగా.
   
    అతడు లైటార్పి, బెడ్ లైట్ వేసేలోపులో ఆమె దగ్గిరగా చేరి బుగ్గని, పంటితో నొక్కి పెట్టాడు. ఎంత గింజుకున్నా నిముషంపాటు వదల్లేదు. తరువాత బెడ్ లైట్ వేసి 'చాలా' అన్నాడు. ఆమె చేత్తో చెంపరాసుకుంది.
   
    నొప్పికి, కంట నీరొచ్చింది.
   
    జారిన నీటి చుక్కమీద పెదవి వెలుగు పరావర్తనం చెంది బుగ్గ మీద దంతక్షయం- ఇంద్రధనస్సులా మెరిసింది. శివుడి తపోభంగం కోసం ఇంద్రుడు పంపిన మన్మధుడు ఆ ధనస్సు అందుకున్నాడు.
   
    ఆ ధనుస్సుమీద, ఆరిన కంటి నీటిచార ఎక్కుపెట్టిన బాణంలావుంది. అది క్రిందికి సాగి, మన్మధ చాపం అయింది. మెడవరకూ వెళ్ళిన మన్మథుడు-పార్వతికోసం హిమాలయాల్లో వెతికాడు. అతడికి భయపడిన పార్వతి, (సవతి అన్న విషయం కూడా మర్చిపోయి) గంగని వెతుక్కోమ్మంది భర్తకోసం! మన్మధుడు భగీరథుడు అయ్యాడు. కడుపు గంగాసిక తస్థలి, నాభి గంగోత్రి- కొంచెం క్రిందికి జారితే -
   
    23. 59. 30 Hrs.
   
    - ఇరవై నాలుగు సంవత్సరాలుగా పర్వత శ్రేణువుల మధ్య ఘనీభవించిన నీటిచుక్క కోర్కె స్పర్శకి కరిగి ఆవిరి కాబోతున్న వేళ-
   
    23. 59. 35 Hrs.
   
    - పదహారు సంవత్సరాల ప్రాయం నుంచీ పరువాన్ని నింపుకుంటూ వస్తూన్న పౌరుషం-పురుషత్వం ముందు ఓడి గెల్చి-గెలుపు సిగ్గుతో తలవంచుకునే సమయాన-
   
    23. 59. 45 Hrs.
   
    ఎనిమిది సంవత్సరాల్నుంచీ దాహంతో ఒక మేఘం, దట్టమైన అడవుల మీదుగా పయనించి పయనించి అల్లాడినవేళ.
   
    23. 59. 53 Hrs.
   
    తడి సముద్రం   
   
    ఆ మేఘానికి చేబదులిచ్చి-
   
    తిరిగి తడిచిపోవటానికి ఆయత్తమయే తరుణాన.
   
    23. 59. 56 Hrs.
   
    రక్తం కొత్తదారుల్లో ప్రవహించటానికి సిద్దపడి, నరాలు వీణాతంతుల్లా కదనకుతూహల రాగాన్ని ఆలపించటానికి ఆయత్తపడి శరీరాల మధ్య తూనీగలా అటూఇటూ పరుగెత్తే గాలి - నీటిమధ్యే వున్నా దాహంతో వికసించే కలువపువ్వు ఆయాసంకూడా నిశ్చలత్వం పొందే అనుభూతి.
   
    23. 59. 57 Hrs.
   
    చంద్రుడు ఆకాలం పక్కమీద అటూ ఇటూ పొర్లగా రాలిన మేనిగంధపుపోత వెన్నెలైతే, పక్కమీద తెగి రాలిన మల్లెమొగ్గలు నక్షత్రాలయితే , ఇక వేగుచుక్క పొడవటమే మిగిలివుంది. జడపిన్ను మన్మధుడి రథపుసీల, ముక్కుపుడక గుర్రపు తలకట్టు, జెడ చెర్నకోల, చనుకట్టు కళ్ళేన్ని వదిలేయగానే పరుగెత్తే గుర్రాల తాకిడికి భ్రమణాన్ని కంపనంలోకి మార్చుకున్న భూదేవి-
   
    23. 59. 59 Hrs.
   
    వర్షపు చినుకుల మధ్య ప్రేమ పరిపూర్ణత్వాన్ని పొందే సమయాన-
   
    0. 0. 0.
   
    తలుపుమీద టక్ టకా లాఠీకర్రతో కొట్టిన చప్పుడు.
   
    .... .....
   
    ఆమె బిత్తరపోయింది.
   
    అతడు అయోమయంలో చిత్తరువు అయ్యాడు.
   
    మళ్ళీ చప్పుదయ్యింది.
   
    రెండు నిమిషాల తరువాత తలుపు తీశాడు.
   
    ఎదురుగా పోలీస్ ఇన్ స్పెక్టర్ నిలబడి వున్నాడు.
   
    "మిస్టర్ రాయన్నా! లేడీస్ హాస్టల్ రూం నెంబర్ పదమూడులో అపురూప లక్ష్మి అనే అమ్మాయిని హత్య చేసిన కారణంగా మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాను."
   
    షాక్ కే షాక్ తగిలినట్టు-
   
    ఆ సమయంలో ఆ వార్తకి రాయన్న విభ్రాంతి చెందాడు.
   
    కిరణ్మయి కట్రాటయింది.
   
   
           
                                                                            --* * * *--

 Previous Page Next Page