అధ్యాయం - 2
ఒక అర్దరాత్రి ఎందుకో మెలకువ వచ్చి కళ్ళు విప్పగానే, మంచానికి అరంగుళం క్రిందుగా గదంతా నీళ్ళు నిండి, వస్తువులు తేలుతూ కనపడితే, అది కలో, నిజమో అర్ధంకాకా మనిషి అయోమయంలో ఎలా విభ్రాంతి చెందుతాడో .....అది కల కాదనీ నిజమైన వరద అని తెలుసుకోవటానికి ఎలా కొంత సమయం పడుతుందో - అలాగే తయారైంది ఆమె పరిస్థితి.
ఒక మధురస్వప్నం నుంచి మేలుకొన్నట్టు అనిపించింది.
అతడికన్నా ముందు ఆమెకే పరిస్థితి అర్ధమైంది.
"ఆ......అపురూపలక్ష్మి చచ్చిపోయిందా?" తనలో తనే గొణుక్కుంటున్నట్టు అతడు అనుకుంటూన్నాడు. అది నిజంగా అతడి అయోమయావస్థో లేక చూపరుల్ని కూడా మోసం చేసే అమాయకత్వపు నటనో అర్ధంకావటం లేదుగానీ, ఒకటి మాత్రం నిజం!
అపురూపలక్ష్మి అనే ఆమె ఒకరు నిజంగా వున్నారు.
అంతవరకూ వాస్తవం.
ఆమెవరో తన భర్తకు తెలుసు. అదికూడా నిజమే.
అతడు తనకు జోకు చెపుతూండగా కల్పితం అనుకుంది. కానీ అది 'కొంతవరకు'నిజం. హాస్టల్ కిటికీ నుంచి వేలాడటం అబద్దం అయివుండవచ్చు గానీ పదమూడో నెంబరు గది విష్యం మాత్రం నిజం. సాధారణంగా ఏదైనా కథ గానీ, జోకుగానీ చెప్పవలసి వచ్చినపుడు మన అనుభవాలకు కొసమెరుపు జోడించి చెపుతాం. కిటికీలోంచి వేలాడటం - అలాంటి కొసమెరుపు జోడించి చెపుతాం. కిటికీలోంచి వేలాడటం - అలాంటి కొసమెరుపు అయి వుండవచ్చు.
ఎంత లజ్జాకరమైన స్థితి! మల్లెపూల పక్కమీదనుంచి పెళ్ళి కొడుకు అరెస్టవటం! నునుసిగ్గు బరువుతో, తడబడే అడుగుల్తో తెల్లవారుజామునే గదిలోంచి బయటకు వెళ్ళవలసిన పెళ్ళికూతురు - అస్తవ్యస్తమైన బట్టలలో, ఆ గదిలో వుండాలో, బయటకు వెళ్ళాలో తెలియని స్థితిలో, ఏదీ నిశ్చయించుకోలేక శిలాప్రతిమలా నిలబడవలసి రావటం!
"ఇంత రాత్రి, అందులోను మొదటి రాత్రి-అతడెక్కడికీ పోడండీ, మేము హామీ వుంటాం. ఒకేసారి వచ్చే ఈ రాత్రిని భంగపర్చకండి." అని వారిలో ఒక్కరూ ఆ ఇన్ స్పెక్టర్ ని వారించలేకపోయారా?
అగరొత్తుల పొగ ఇంకా ఆ గదిలోంచి పూర్తిగా పోలేదు. పక్కమీద దుప్పటి పూర్తిగా నలగలేదు.
ఇన్ స్పెక్టర్, ఇంకా అలాగే నిలబడి రాయన్న చేతిని స్పృశిస్తూ "రండి" అన్నాడు మరోసారి. అప్పటికి రాయన్న కూడా పరిస్థితిని జీర్ణం చేసుకున్నట్లున్నాడు. నెమ్మదిగా కదిలాడు. కదిలి ద్వారంవైపు వెళ్ళలేదు. కిరణ్మయి దగ్గిరకు వచ్చాడు. ఆమె బేలగా అతడివైపు చూసింది. ఎంతైనా స్త్రీ కదా భయంవల్ల వచ్చినవో, ఇరుక్కున్న అసహ్యకరమైన పరిస్థితివల్ల వచ్చినయో తెలీదు కానీ ఆమె కళ్ళలో నీళ్ళు వచ్చాయి. అతడు తలదించుకుని, నెమ్మదిగా, ఆమెకు మాత్రమే వినబడేలా అన్నాడు.
"ఎప్పుడైనా మనలో ఒకరు ఏదో ఆలోచనలో వున్నప్పుడు రెండోవాళ్ళు ఏమిటిప్పుడు నువ్వు ఆలోచిస్తున్నది? అని అడుగుతే, వాళ్ళు ఏమాలోచిస్తున్నదీ చెప్పాలి అనుకున్నాం గుర్తుందా కిరణ్మయీ. ప్రతీసారీ నేనే అడుగుతూ వచ్చాను. ఈ రాత్రి ఒక్కసారి కూడా నువ్వు నన్నేమీ అడగలేదు. అడక్కపోయినా నేనే చెపుతున్నాను. ఇప్పుడు నేనేం అనుకుంటున్నానో తెలుసా కిరణ్? కనీసం నా భార్య అయినా నన్ను నమ్మితే చాలు......అనుకుంటున్నాను. ఒక్క రాత్రి పరిచయంతో ఎంత సైకాలజిస్ట్ అయినా ఎదుటి మనిషిని అంచనా వేయటం కష్టం - అని నువ్వు అన్నావు. మనసులో మాట- ఎంత ఇబ్బంది కల్గించేదైనా, ఎంత మోమాట పెట్టేదైనా ఒకరికొకరు చెప్పుకోవాలి అని కూడా మనం అనుకున్నాం. అపురూపలక్ష్మి నాకు తెలుసు అంతే. అంతకన్నా వేరే ఏ సంబంధమూ లేదు. మనస్సాక్షిగా చెబుతున్నాను. నన్ను నమ్ము" అని అక్కన్నుంచి నడిచాడు. అతడి వెనుకే ఇన్ స్పెక్టర్ కూడా సాగిపోయాడు.
వాళ్ళిద్దరూ ఆ గదిలోంచి బయటకు నడవగానే వెల్లువలా లోపలికి వచ్చారు ఆత్మీయులు.
"ఇలా జరిగిందేమిటే. నీ జీవితం నిండా తెల్లారి పోయిందేమిటే" అని ఏడుపు లంకించుకుంది తల్లి.
తండ్రి నలుగుర్ని పోగేసుకుని, అసలు ఇన్ స్పెక్టర్ వచ్చిన దగ్గిర్నుంచీ తాము అతడిని ఎలా ఎదుర్కొన్నదీ ఒకటికి నాలుగు కల్పించి చెపుతున్నాడు.
పెళ్ళికొడుకు తల్లి మరోమూల తన తరపు బంధువుల్నేసుకుని శోకాలు సాగిస్తోంది. "ఆ క్రికెట్టు వద్దురో దేవుడా అంటూంటే దాంట్లో దింపారు. పట్నంలో చదువులు మనకెందుకంటే వినకుండా చదివించారు. దాన్నెవత్తెనో తగులుకున్నాడు అదిప్పుడు చచ్చింది. నా మాటెప్పుడైనా ఎవరైనా విన్నారా?"
ఈలోపులో ఇటువైపు తల్లి అందుకుంది. "నిప్పులేందే పొగరాదంటారు. ఇంత చదువుకున్న నా కూతురికి ఈ సంబంధం ఏమిటా అని నేను మొత్తుకుంటూనే వుంటాను. నా మాట వినేదెవ్వరూ ఇప్పుడు అఘోరించండి."
తండ్రి బంధువుల్తో చెపుతున్నాడు- "కొద్దిగా పేరొస్తే ఇంతేనండీ వళ్ళూపై తెలీదు. పాపం ఆ ఆడపిల్ల గొంతు కోసాడు. ఇలాటి వాడని మాకసలు అనుమానం రాలేదు సుమండీ."
కిరణ్మయి తన తల్లిదండ్రులవైపు, అత్తగారివైపు విస్మయంతో చూస్తోంది. గంటక్రితం వరకూ అతడు లవ్వబుల్ బోయ్! కిరణ్మయి అదృష్టవంతురాలు. క్షణాల్లో ఇద్మతా దురదృష్టం ప్రారబ్ధం.
మానవ విలువలకు ఏ మాత్రం నిలకడలేదు. తన తల్లిదండ్రుల సంగతి అలా వుంచితే, అతడి స్వంత తల్లి కూడా కొడుకు గురించి అలా మాట్లాడటం చాలా ఘోరంగా అనిపించింది. తల్లి ప్రేమ గురించి ఎందరో ఎన్నో కథలు అల్లారు. కావ్యాలు వ్రాశారు. వీళ్లెవరికీ నిజంగా తల్లులెలా వుంటారో తెలీదా? లేక 'తల్లి' అనేది ఊహాలోకంలో అల్లుకున్న ఒక శుభప్రదమైన పేరేనా? రాయన్న ఎలాటివాడు, ఏం చేస్తాడు అన్నది కాదిక్కడ ప్రశ్న! తన తల్లి-అతడి తల్లి-అందరూ ఇంతేనా అన్నది ఆమెకు అర్ధంకాని విషయం...
ఈలోపులో .... తన తల్లిదండ్రులు, అతన్ని దుయ్యబట్టటం అతడి తల్లి విన్నట్టుంది. ఉన్నట్టుండి అందుకుంది.
"కొంతమంది అడుగుపెట్టిన వేళావిశేషమమ్మా, జాతకం లేదన్నప్పుడే అనుకున్నాను ఇలాంటిదేదో అవుతుందని. కొత్తకోడలు రాగానే ఈ అరిష్టం దాపురించింది. ఇంకా ఎన్ని దారుణాలు చూడాలో ఏమిటో - ఇదంతా మా ప్రారబ్ధంరో నాయినో - ఇప్పుడేం చేయాల్రో దేవుడో....."
ఆమె ఇలా ప్లేటు తిప్పేసరికి అట్నుంచి తల్లి అందుకుంది.
"గురివిందే మచ్చెరగదని, చివరకొచ్చేసరికి ఇలాగేనమ్మా తోసేసేది. అయినా ఇలాటి లొసుగులు ఇంకా ఎన్నున్నాయో, ముందు ముందు ఎన్ని బయటపడతాయో."
కిరణ్మయికి అసహ్యమేసింది. కొడుకు గురించిగానీ, కోడలు గురించిగానీ ఇద్దరూ ఆలోచించలేదు. తన వాదనలకు క్రమక్రమంగా బలం చేకూర్చుకోవడానికి ఇద్దరూ ప్రయత్నిస్తున్నారు.
ఈలోగా మూడో అన్న రెండో అన్నతో "నాకు తెలిసిన యస్సై వన్ టౌన్ లో ఒకడున్నాడు. రేపొద్దున్నే వెళ్ళి కలుసుకుంటే బావని విడిపించవచ్చు" అన్నాడు. కిరణ్మయి అభావంగా అతడివైపు చూసింది. ఇటువంటి మనుష్యుల మనస్తత్వం చాలా చీదరింపుగా వుంటుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు తమకు తెలిసిన ఒక చిన్న పరిష్కారం ఏదో చెప్పి, ఇక దాంతో ఆ సమస్య తీరిపోయినట్టుగా అనుకొమ్మని తాము కూడా పూర్తిగా దానిగురించి మర్చిపోతారు. చాలా సులభంగా తమ సలహాల్తో (కేవలం సలహాల్తో) సమస్యల్ని పరిష్కరించేస్తూ వుంటారు.
కిరణ్మయి నెమ్మదిగా తేరుకున్నది. చుట్టూ చూసింది.
అంతలో అతడి తండ్రి (తన మామగారు) దగ్గిరికి వచ్చాడు. "అమ్మా" అన్నాడు. కిరణ్మయి తలెత్తి చూసి మళ్ళీ దించుకుంది. అతనొక్కడే ఈ వాదప్రతివాదన ల్లోనూ, అసందర్భ ప్రేలాపనల్లోనూ పాల్గొననిది.
"అమ్మా! ఇలా అయిపోతుందని నేను అనుకోలేదు. ఎవరికీ జరగనిది జరిగిపోయింది. నా కొడుకు ఏం చేశాడో మాకు తెలీదు. మేమేమో అక్కడ దూరంగా పల్లెలో .... ఇక్కడ ఉద్యోగం చేస్తూ వీడు. మరి ఆ పిల్లతో స్నేహం ఎప్పుడు కుదిరిందో, వీడేం చేశాడో ఎవరికీ తెలియదు. నిజంగా వాడేగానీ ఈ పని చేస్తుంటే, డానికి వాడికే శిక్ష పడిన సంతోషమే. నేను బాధపడుతున్నది వాడి గురించి కాదమ్మా! నీ గురించి. అనవసరంగా నీ జీవితం పాడు చేసిన వాళ్ళమయ్యాం. మమ్మల్ని క్షమించు....."
కిరణ్మయి పెదాల్ని బిగబట్టింది. ఈ ఓదార్పు ఆమె ఆశించలేదు. తన ఇంట్లో ఎప్పుడూ దొరకనిది ఇది. తడికళ్ళని పక్కకి తిప్పుకుని ఆమె అక్కడనుంచి కదిలిపోయింది.
ఇంకా బంధువులు అక్కడక్కడా చేరి చిన్న స్వరాల్తో కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇన్ స్పెక్టర్ రాగానే కనపడిన భయం, ఉద్రిక్తతపోయి, ఆ బంధువుల్లో ఇప్పుడు ఒక రకమైన ఆనందంతో కూడిన ఉద్వేగం నిండుకుంది. ఆనందం అనేది ఇక్కడ పూర్తిగా సరిఅయిన పదమే. ఒక విచిత్రమైన సంఘటనకి వాళ్ళు ప్రత్యక్షసాక్షులు. దీనిగురించి అందరికీ కథలుగా చెప్పే అవకాశం లభించింది.