Previous Page Next Page 
లవ్ మర్డర్స్ పేజి 8

    "అదేనమ్మా నీ బావ కృష్ణ. అమెరికాలో  చదువు ముగించుకుని వస్తున్నాడు. నా చెల్లెలి కొడుకు. "బావ...... బావ" అంటూ ఎంతల్లరి చేసేదానివి? ప్రభాకర్ మధ్యలో రాకపోతే కృష్ణ, నీవు పచ్చని దాంపత్యంతో నా కన్నుల పండుగగా ఉండేవారు. ప్చ్."

    "ఎవడీ కృష్ణ, ఏమా కధ? ప్రభాకర్, వింటున్నావా? కృష్ణట కృష్ణ. హరేరామ హరేరామ, హరేకృష్ణ ఆరేకిట్టా, హరేప్రభ అరెరె ప్రభ," అమల చప్పట్లు చరుస్తూ అంది.

    భుజంగరావుగారికి దూరపు చుట్టం, అల్లుడు వరస అయిన సుందరమూర్తి అమల గదిలోకి వచ్చాడు. సుందరమూర్తి ఎత్తు, లావు భగవాన్ లాగానే వుంటాడు. భగవాన్ అవునో, కాదో ఆ పరమాత్ముడికి తెలియాలి.

    "మామయ్యా!" సుందరమూర్తి అమలవైపు చూస్తూ పిలిచాడు.

    "ఏంటి సుందరం?"

    "కృష్ణ మామూలు డాక్టర్ కాదు. బ్రెయిన్ స్పెషలిస్ట్. అమల పిచ్చి కుదర్చవచ్చు."

    "అదేరా సుందరం నా ఆశ. పెద్ద పెద్ద డాక్టర్లు రోజా తల్లి పిచ్చిని కుదర్చలేమన్నారు. మన కృష్ణ ఫారెన్ లో చదివి వస్తున్నాడు. నా తల్లి బాగయి మామూలు మనిషవుతుంది."

    "కృష్ణ నాకు బావ అవుతాడు. అతను బ్రెయిన్ కి సంబంధించిన పెద్ద డాక్టర్. నా పిచ్చికి ఏమీ ట్రీట్ మెంట్ యిస్తాడో! భగవంతుడా యీ ఇంట్లోంచి బైటపడే మార్గం లేదా? మాయదారి భగవాన్ గాడు బైటపడడా? ఏమిటి దారి?"

    "ఏంటమ్మా ఆలోచిస్తున్నావ్?"

    'కృష్ణప్రభా, రామప్రభా...... ఇంకేం ప్రభుంటుందబ్బా?' భుజంగరావు మాట వినిపించుకోకుండా బుగ్గన వేలేసుకుని అంది అమల.

    భుజంగరావు బాధగా సుందరమూర్తి వైపు చూచాడు.

    "రంగారావ్ సాబ్, ఫోన్ లో అర్జంటుగా పిలుస్తున్నారు. మీతోనే మాట్లాడాలిట" శంకరం వచ్చి చెప్పాడు.

    భుజంగరావు, సుందరమూర్తి గదిలోంచి వెళ్ళిపోయ్యారు.

    శంకరం గదిలోంచి వెళ్ళలేదు. అటూ ఇటూ చూచి అమల వద్దకు వచ్చాడు. అమల ఎదురుగా నిలిచి భుజంమీద చెయ్యి వేశాడు.

    'వీడే భగవాన్ గాడు' అనుకుంది అమల.

    శంకరం చటుక్కున అమలమీదకు వంగి గాఢంగా బుగ్గమీద ముద్దు పెట్టుకున్నాడు. శంకరం చెయ్యి అమల భుజంమీద నుంచి కిందకు పాకింది. అమల చెయ్యిచాచి ఫెడేల్ మని శంకరం ముఖంమీద కొట్టింది. సరిగా ఆ దెబ్బ ముక్కు మీద తగిలింది.

    "అబ్బా" అంటూ శంకరం చేత్తో ముక్కు తడుముకుంటూ కోపంగా అమలవైపు చూచాడు.

    అమలకు యిల్లంతా తిరగటానికి స్వేచ్ఛ వుంది. కాకపోతే భగవాన్ ముందే చెప్పాడు. సరోజ ఎక్కువకాలం తన గదిలోనే గడిపేది. రోజు మొత్తంమీద మూడు నాలుగు సార్ల కన్నా బైటకు తానంతట తాను వచ్చేది కాదని.

    "వీడు చూడు ప్రభా! నన్ను ముట్టుకున్నాడు. వెధవ గాడిద, పందికొక్కు" పెద్దగా అంటూ, అమల గదిలోంచి బైటకు వచ్చింది.

    "పిచ్చిముండ. దీనికేం తెలుస్తుంది. ఇంటినిండా మనుషులు వుండబట్టి నా చేతికింద యింకా నలగలేదు. అందంగా వుంటుందని ఓ ఛాన్స్ ఈ పిచ్చిలో చూద్దామనుకుంటే ముఖం పగలకొట్టింది. పిచ్చిబలం అంటారు యిదే కావచ్చు. ముఖం అదిరిపోయింది."

    గదిలోంచి బైటకోస్తూ అనుకున్నాడు శంకరం.

 Previous Page Next Page