Previous Page Next Page 
లవ్ మర్డర్స్  పేజి 9

   
                                               7

    ".......గారికి,

    నా పేరు అమల. భుజంగరావు ఆస్థి కాజేయడానికి ఇంట్లోంచి మాయమయిన సరోజ స్థానంలో సరోజ స్థానంలో సరోజ పోలికలు గల నన్ను, భగవాన్ అనే అతను తీసుకొచ్చి బెదిరించి నియమించాడు. అందరూ నన్ను సరోజ అనే అనుకుంటున్నారు. మా నాన్న, అమ్మగారి పేర్లు..... మా అడ్రస్..... ఇది.

    నేను మోసం చేయటానికి ఈ యింట్లో ప్రవేశించలేదు. భగవాన్ బెదిరింపుకి లొంగిపోయారు. దైవంలాటి భుజంగరావుగారిని మోసగించలేక నా వాళ్లకు దూరంగా వుండలేక ఈ నాటకం ఎన్నాళ్ళో తెలియక తెగించి ఈ లెటర్ రాస్తున్నాను. భుజంగరావుగారితోనే సమయం చూచి చెప్పొచ్చు. భుజంగరావుగారి పక్కన ఎప్పుడూ ఎవరో ఒకరు వుంటున్నారు. ఈ ఇంట్లో నలుగురు వ్యక్తులు భగవాన్ లాగానే వున్నారు. ఆ నలుగురిలో ఒకరు భగవాన్.

    నాకు నమ్మకం కలిగిన వారికి ఈ లెటర్ ఇస్తున్నాను. ఈ లెటర్ భుజంగరావుగారికి అందిస్తే, వారు మీకు బహుమతి ఇవ్వచ్చు. వారు చాలా దయా స్వరూపులని తెలిసిపోతూనే వుంది. తర్వాత మోసగాడు ఎవరైనదీ భుజంగరావుగారే చూసుకుని నన్ను రక్షిస్తారు.

    ఈ నా ఆలోచనే ఈ లెటర్ రాయటానికి కారణం.

    భుజంగరావుగారు నాటకానికి పై నాటకం ఆడితేగాని భగవాన్ గాడు బైట పడదు.
                   
                                                                                                                                     ఇట్లు,
                                                                                                                  సరోజగా చలామణీ అవుతున్న                

                                                                                                                                    అమల."

    అమల లెటర్ చదివి బాగుంది. సరిగానే రాశాను. ఇహ ఈ లెటర్ చేర్చే విధం చూడాలి. ఈ యింట్లో ఎవరికి అందించాలి?" అనుకుంది.

    అమల గదిలో అలమరలో అందమైన బొమ్మలతో అలంకరించి ఓ అర వుంది. బొమ్మల వెనుక పెన్ను కాగితాలు వుంచాడు భగవాన్ అమల లెటర్స్ రాయటానికి, అవి వుపయోగించి తాననుకొన్న ప్లాన్ ప్రకారం అమల లెటర్ తయారు చేసింది. లెటర్ చిన్న మడతపెట్టి జాకెట్లో దోపుకుని గదిలోంచి బైటకు వచ్చింది.

    అమల పిచ్చిగా చేతులు తిప్పుతూ గొణుక్కుంటూ వరండాలోకి వచ్చింది.

    వరండాలో ఏవో ఫైల్స్ చూస్తున్న శంకరం, అమలను చూచి చటుక్కున లేచి నుంచున్నాడు.

    'శంకరం, భగవాన్ అయి వుండడు. ఎందుకంటే తనని తీసుకొచ్చిన భగవాన్ పదిమంది చేత రేప్ చేయిస్తానని బెదిరించాడు గాని, తన శరీరంమీద చెయ్యి వెయ్యలేదు. అయినా శంకరంకి లెటర్ ఇవ్వకూడదు. తను సరోజ అయినా, అమల అయినా తన రూపంమీద అమితమోజు, ఎప్పుడు చూసినా శంకరం కళ్ళు తనని కాంక్షతో కామంతో చూస్తాయి.

    నాకు లొంగకపోయావా? భగవాన్ తో చేతులు కలుపుతానంటే మొదటికే మోసం వస్తుంది. ఉహూ, ఈ శంకరం తన పనికి ఏ విధంగా పనికి రాడు.'

    అమల కళ్ళార్పకుండా శంకరంని చూస్తూ అనుకుంది.

    "బాబాయ్, ఈ పిచ్చిదానికి మొన్న జరిగింది యింకా గుర్తున్నదల్లె వుంది. కళ్ళార్పకుండా తీక్షణంగా ఎలా నావైపు చూస్తున్నదో? మీదపడి రక్కినా రక్కుతుంది పిచ్చిది. ఏమండానికి వీలులేదు."

    భయంతో అమలను చూసి, గబగబా ఫైల్ మూసేసి, వరండాలోంచి వెళ్ళిపోయాడు శంకరం ఎవరో తెలియనట్లే.

    అమల నవ్వుకుంటూ వంట గదిలోకి వచ్చింది.

    దాసీ నర్సమ్మ, వంట నాయర్ తగ్గుస్వరంతో మాట్లాడుకుంటున్నారు. అమల రావటం చూసి, చటుక్కున మాటలాపేశారు. నాయర్ కనుసైగ గమనించి నర్సమ్మ వంట గదిలోంచి ఏదో పనున్నదన్నట్లు బైటకు వెళ్ళింది.

    నాయర్ తలెత్తి అమలవైపు చిరునవ్వుతో చూచాడు.

 Previous Page Next Page