రాఘవరావు దండీగా కట్నం ముట్టజెప్పేట్టుంటే అవేమీ కనిపించకుండా పోయేవేమోగానీ ఆయన మధ్యతరగతి కుటుంబీకుడు. వున్నదేదో ఊడ్చి పెద్ద దానికి ధారబోస్తే మిగతా పిల్లల మాటేమిటి అన్న ఇంగితం ఆయన చేతులకు పగ్గాలు వేసింది. లాంఛనాలు, నగదు-అంతా కలిపి ఏభైవేలకి మించిపోలేనని ఆయన ఖరాఖండిగా చెప్పేయడం వలన చాలా సంబంధాలు పెళ్ళిచూపుల వరకు రాకుండానే తప్పిపోయాయి. చివరికి ఫైనలియర్ పరీక్షల ముందు మదన్ అన్న ఒక ఎల్.డి.సి.తో సంబంధం ఖాయమైంది. అతడికి ఒక తల్లి తప్ప ఎవరూ లేరు. అక్కడి పెళ్ళయ్యి అత్తగారింట్లో వుంది.
పిల్ల పెద్ద అందగత్తె కాదని వెనుకడుగు వేసేడేగానీ, తల్లి ఒత్తిడి చేసి ఒప్పించింది. "అందానిదేముందిరా? కడుక్కు తాగుతావా? ఆ కాస్తా పరీక్షలయి పోయాయంటే పల్లవి బి.ఎ. అవుతుంది. నువ్వు చదివింది ఇంటరేకదా? నీకన్నా ఎక్కువ చదివింది. మంచి మర్యాదస్తుల కుటుంబం! చాలదూ?" అంటూ.
పల్లవికి పెళ్ళయి అత్తవారింటికి వచ్చేసరికి బి.ఎ. రిజల్ట్స్ వచ్చాయి. థర్డ్ క్లాస్ లో పల్లవి నెంబరు కనిపించింది. అత్తగారు రమణమ్మ ఆ మాత్రానికే సంతోషపడిపోయింది. నా కోడలు బి.ఎ. పాసైందంటూ నలుగురికీ స్వీట్స్ పంచింది.
"ఇంత కష్టపడ్డావు! ఆ కాస్తా బి.యి.డి. కూడా అనిపించుకోకూడదూ? చక్కగా టీచరుగా చేయొచ్చు! నా కొడుకు నిన్ను సాకలేడని కాదు! ఈ కాలంలో ఆడవాళ్ళకి కూడా సంపాదన వుండడం అవసరమని నా ఉద్దేశం! మూడు రూపాయల తిలకం కోసం, పది రూపాయల గాజుల కోసం మగడిముందు చెయ్యి చాచాలి. అలాంటి దురవస్థ పట్టకుండా నీ డబ్బుతో నువ్వు రాణిలా నీకు కావలసినవి కొనుక్కోవచ్చు!" అంది రమణమ్మ.
"నాకింకా చదివే ఓపిక లేదత్తయ్యా!" అంది పల్లవి.
చిన్న కుటుంబం. అత్తగారు చాలా మంచి మనిషి. మదన్ కూడా మంచివాడే. దురలవాట్లు ఏమీ లేవు. అతడిలో నచ్చనిది ఒక్కటే పల్లవికి! కాస్త అందంగా వున్న ఆడవాళ్లెవరయినా కనిపిస్తే పిచ్చిపిచ్చిగా కామెంట్ చేస్తాడు! బూతుమాటలు కూడా దొర్లిస్తాడు. 'చూడ్డానికి యింత నాగరీకంగా వుండి యింత అనాగరికంగా ఆ బూతుమాటలేమిటి?' అని పల్లవి చీదరించుకొనేది. కానీ, అతడి ధోరణి మారలేదు.
పడకమీద పల్లవితో గడుపుతూ ఎదురింటి రమనో, పొరుగింటి ఉమకో తలుచుకొనేవాడు. వాళ్ళను అనుభవిస్తున్నట్టు ఫీలయిపోయేవాడు. పల్లవికి చెప్పలేని కంపరంగా వుండేది. చీదరించుకొనేది. భరించలేక పోట్లాడేది! అతడి ధోరణి అతడిదే.
పల్లవికి అప్పుడు అయిదో నెల.
అత్తగారు కూతురికి కాన్పుచేసి పసిదానితో కూతురు పని చేసుకోలేదని ఓ రెన్నెల్లు వుండి వస్తానని కూతురి వెంట వెళ్ళింది.
ఓ రోజు మధ్యాహ్నం మదన్ ఆఫీసునుండి వచ్చాడు. మామూలుగా అయితే అతడు సాయంత్రానికి గానీ రాడు. ఆఫీసరు వెంట క్యాంప్ కెళ్ళాలని వచ్చాడు.
పక్క పోర్షన్ లో వుండే రాజయ్య అనే మెకానిక్ అప్పుడే యింట్లోంచి బయటికి వస్తున్నాడు_అతడి చేతిలో ఆ రోజు పేపరు వుంది.
"ఈ రోజు తొందరగా వచ్చేశారేం సార్?"
'మీ ఇద్దరి భాగోతం చూడ్డానికి!' అని మనసులోనే పళ్ళు కొరికి, అతడికి జవాబివ్వకుండా యింట్లోకి వచ్చేశాడు. చరచరా బెడ్ రూం లోకి నడిచి మంచంమీద పడుకుని పరీక్షగా చూశాడు, తన అనుమానానికి క్లూ ఏమైనా దొరుకుతుందేమోనని! బెడ్ షీట్ నీ, తలగడనీ తడిమి తడిమి చూశాడు.
"ఏం చూస్తున్నారు?" పల్లవి ఆశ్చర్యంగా అడిగింది.
మదన్ అదోలా ముఖం పెట్టి అడిగాడు_ "ఆ బ్రూట్ ఎందుకు వచ్చాడు?"
"బ్రూట్ ఎవరండీ?"
"అమాయకత్వం నటించకు! యిందాక నాకు యింట్లోంచి వస్తూ ఎదురుపడ్డాడు, ఆ రాజిగాడు."
"పేపరులో ఏవో ఉద్యోగ ప్రకటనలు పడ్డాయని పేపరు కోసం వచ్చాడు."
"పేపరు కోసం వచ్చాడా? పెళ్ళాం పురిటికి వెళ్ళింది, తోచడంలేదని వచ్చాడా?"
"రామ రామ! ఏం మాటలండీ అవి?"
"ఒంటరిగా ఆడవాళ్ళున్న చోటికి అతడికి ఏం పని వుందంట? నిజంగా పేపరు కోసమే వస్తే 'ఇవాళ తొందరగా వచ్చేశారేం సార్?' అన్నాడంటే అర్ధంఏమిటి?"
ఇందాక అతడు బెడ్ ని పరీక్షగా చూడడం గుర్తువచ్చి శరీరమంతా దహించుకుపోయినట్టుగా అయింది పల్లవికి. ముఖం రక్తం లేనట్టుగా పాలిపోయింది.
"హఠాత్తుగా నన్ను చూసి ఉలిక్కిపడ్డాడు తెలుసా? నా రాకపోకల మీద నిఘా పెట్టాడంటే అర్ధమేమిటి?"
"పెళ్ళాం పురిటికి పుట్టింటికి వెడితే పక్కింటి ఆడవాళ్ళ మీద పోయి పడే మనస్తత్వం మీకుందేమోగానీ అందరికీ అలాంటి రోగం లేదు లెండి! అతడు న్యూస్ పేపరు కోసమే వచ్చాడు."