మాట పూర్తికాకముందే మదన్ చేతిలో ఆమె చెంపలు అదిరిపోయాయి.
"చేసింది చాలక నోటికి ఏదొస్తే అది మాట్లాడతావేమే? నేను లేనప్పుడు వాడిని యింట్లోకి ఎందుకు రానిచ్చావు? బయట నిలబెట్టి మాటాడోచ్చు కదా?"
"ఇంట్లోకి అంటే పడకగదిలోకి పిలిచానా? పేపరడిగితే, 'చెయ్యి ఖాళీ లేదు, అదిగో ఆ గూట్లో వుంది తీసుకోండి' అన్నాను. అది ముందు గదిలోనేకదా?"
"ఈరోజు ముందుగదిలోకి రమ్మంటావ్! రేపు పడక గదిలోకి రమ్మంటావ్!"
"ఛీఛీ! ఏం మనిషి మీరు? యింత నిష్కారణంగా అభాండాలు వేయడానికి మీకు మనసెలా ఒప్పింది?" ఏడుపు, కోపం రెండూ వచ్చేసి ఆక్రోశిస్తున్నట్లు అంది.
"నిష్కారణమట నిష్కారణం! నేను లేనప్పుడు పరాయి మగాడిని యింట్లోకి రానిచ్చావంటే నీవెంతటి పతివ్రతవో తెలుస్తూనే వుంది. ఇన్నాళ్ళూ అమ్మ వుండేది. యిప్పుడు ఫ్రీ! ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరింటి వరకు ఏ కాలక్షేపం చేస్తావో, ఎవరితో చేస్తావో ఎవరికి తెలుసు?"
పెట్రోల్లో ముంచి అగ్గిపుల్ల గీసి మీద విసిరినట్టుగా బాధ!
క్యాంప్ కి వెళ్ళడం కాన్సిల్ చేసుకొని ఆ రోజే తల్లికి రమ్మని టెలిగ్రాం యిచ్చాడు.
ఏం అనర్ధం జరిగిందోనని ఆవిడ హడలిపోతూ వస్తే కథ ఇదీ.
"అత్తయ్యా! నేనెలాంటిదాన్నో మీకు తెలీదా? మీ అబ్బాయి ఇంతటి అభాండం నా మీద ఎందుకు వేశారో అర్ధంకాకుండా వుంది!" అత్తగారిని పట్టుకొని ఏడ్చేసింది పల్లవి.
ఆవిడ తల పట్టుకొంది, "నేను భయపడ్డట్టే జరిగింది!" అంటూ "రోజూ నేను దేవుడికి దండం పెట్టుకొనేదాన్ని వాడికి తండ్రి బుద్దులు రానీయకురా అని. నా మొగుడు ముండాకొడుక్కి ఇదే రోగం! అనుమాన రోగం! నన్ను యింట్లో వుంచి తాళం పెట్టుకువెళ్ళేవాడు. ఆఫీసునుండి సడన్ గా వచ్చి పిల్లి అడుగుల్తో పక్క సందులోంచి పెరటివైపు వచ్చి యింట్లోకి తొంగిచూసేవాడు! నా శరీరం మీద వాడు కొట్టని చోటు లేదు. వాడు అతిసార వ్యాధితో పోయాడు. 'అయ్యో! చిన్న వయసులో వైధవ్యం ప్రాప్తించిందే' అని అందరూ ఏడుస్తూంటే నేను మాత్రం హాయిగా నిట్టూర్చాను ఇరవయ్యేళ్ళ చెరసాల వదిలిందే అని! మళ్ళీ నా కళ్ళముందు నా కోడలికి అదే నరకం!" ఆవిడ బాధపడిపోయింది.
"అందుకే నిన్ను బి.యి.డి. చేసి ఉద్యోగం చెయ్యమన్నాను. ఆడదానికి ఆర్ధిక స్వాతంత్ర్యం అన్నిటికీ మందు. ఇప్పటికయినా మించిపోయింది లేదు. చక్కగా చదివి బి.యి.డి.లో సీటు తెచ్చుకో" అంటూ ఎంతో చక్కని సలహా యిచ్చిందామె.
ఆ రోజు నుండి ఆ ఇంట్లో రెండు పార్టీలు అయ్యాయి. మదన్ ఒక్కడూ ఒక పార్టీ, అత్తా కోడలు ఒక పార్టీ.
అత్తగారు పెద్దమనసుతో రక్షణకవచంలా నిలబడకపోతే పల్లవి ఎప్పుడో ఆత్మహత్య చేసుకు చచ్చిపోయేదే. బి.యిడి. చేయమన్న అత్తగారి కోరిక మాత్రం తీర్చలేకపోయింది. రెండుసార్లు ఎంట్రెన్స్ రాసినా సీటు రాలేదు. అసలు మనసు చదువుమీద లగ్నమయ్యేది కాదు.
భర్త అనుమానాల ఆరళ్ళ మధ్య పల్లవి ముగ్గురు బిడ్డల తల్లి అయింది.
ఒకరోజు రమణమ్మ కొడుకుతో చెప్పింది- "ఈ రోజు శ్రుతిని కాన్వెంట్ లో చేర్చడానికి తీసుకువెడుతుందట కోడలు. డొనేషన్, ఫీజు అంతా కలిసి పదిహేను వందలవుతుందట."
"వేలకి వేలు డొనేషన్లు కట్టి చదివించడానికి డబ్బులు రాసులు రాసులు పోసుకు కూర్చోలేదు. గవర్నమెంట్ స్కూల్లో చేర్చిరమ్మను."
"బాగుంది. మనింట్లో పాచిపని చేసే జానకమ్మ కూడా తన కొడుకును కాన్వెంట్ లో చేర్పిస్తానంటోంది. నీకేమొచ్చిందిరా? పిల్లల్ని గవర్నమెంటు స్కూల్లో చేర్చేకంటే గొడ్లను కాయడానికి పంపడం నయం."
"ఎవడైనా స్కూల్ టీచర్ విన్నాడంటే తంతాడు నిన్ను. గవర్నమెంటు స్కూల్ అంటే అంత పరిహాసమైందా నీకు? నే చదివింది గవర్నమెంట్ స్కూల్ లో కాదా? ఇంతటివాడిని కాలేదా?"
"అయ్యావులే దేశానికి ప్రెసిడెంటువి. ఊరికే ఇంట్లో గొడవలు పెట్టకు. అది ఇప్పటికే కుమిలి చస్తోంది."
"అయితే ఏం చెయ్యమంటావు? నా దగ్గర డబ్బు లేదు."
"డబ్బు లేక ఏమైందిరా? కలర్ టీ.వీ.లు, స్కూటర్లు తెచ్చుకోవడానికి డబ్బుందిగానీ పిల్లల్ని కాన్వెంట్ లో చేర్పించడానికి డబ్బు లేదా!"
"ఎవరికి పుట్టిన పిల్లలో! వాళ్ళకి కాన్వెంటు చదువులు, ఫీజులు" నిర్వేదంగా అన్నాడు.
"సాధ్విరా అది! ఆ మాట అన్నావంటే నోట్లో పురుగులు పడి చస్తావు. రోజూ దాని పక్కలో కుక్కలా దొర్లుతావు. పిల్లలు ఎవరికో పుట్టారంటావు, ఇదేం మాయదారిరోగం! ఈ రోగానికి ఒక్కటే మందు. నున్నగా బుర్ర గొరిగించి, పట్టెలు పెట్టి, గాడిదమీద ఊరేగించడమే" పళ్ళు కొరికింది రమణమ్మ. మొగుడిమీద కోపం కొడుకుమీద తీర్చుకుంటున్నట్టుగా వుంది.
నిజమే! ఒక్కరోజు భార్య పక్కన లేకపోతే నిద్ర రాదు. కానీ ఆత్మ విమర్శ చేసుకోలేరు ఈ రకం మనుషులు. ఎదుటి మనిషని బాధపెట్టి ఆనందించడమే తెలుసు. భార్య కుమిలిపోతుంటే మహదానందం.