Previous Page Next Page 
హిమసుందరి పేజి 7

    "మరేమంటారుట?" ఆవేశంగా అంటున్న సీతకి అడ్డుతగులుతూ అడిగాడు రామకృష్ణ.

    "పింజారి వెధవ అనాలి మళ్ళి మాట్లాడితే నికృష్ణుడు అనాలి. అతగాడికి సినిమా చూడాలనిపిస్తే ఒంటరిగా వెళ్ళి చూసి అఘోరించవచ్చు కదా తోడు పెళ్ళాం కావాలి. సినిమాలో అసభ్యమైన దృశ్యాలు కానరాంగానే పద పద ఇలాంటివి చూస్తే ఆడవాళ్ళు చెడిపోతారంటూ గొర్రెని తోలుకెల్లినట్లు తోలుకెల్లటం. ఈ బుద్ధివున్న మగవాళ్ళని నరికి పోగులుపెట్టాలి. అంతేకాదు. తనకో వ్యక్తిత్వం లేక అతగాడి వెర్రి మొర్రి వెధవ బుద్ధికి తల వగ్గుతున్న ఆమెని కూడా నరికిపోగులు పెట్టడంలో ఎంత మాత్రం తప్పులేదు."

    "ఆవేశంలో చాలా ముద్దు వస్తావ్ సీతూ!" అన్నాడు రామకృష్ణ.

    "కాసేపు దూరంగా ఉండి మాట్లాడండి" విసుక్కుంది సీత.

    "సరే తల్లీ!" అన్నాడు రామకృష్ణ దూరం జరుగుతూ.

    సీత ఎంత మంచి పిల్లో రామకృష్ణకి బాగా తెలుసు. సీతకి లోకానుభవం తక్కువ. ఎవరికో అన్యాయం జరిగితే అది తనకే జరిగినట్లు గంగ వెర్రులెత్తి గంతులు వేస్తుంది. ముఖ్యంగా స్త్రీ జన పక్షపాతి. స్త్రీ పురుషులు సమానంగా మంచిగా ఉండాలని పరస్పరం గౌరవించుకోటం అభిరుచుల్ని మన్నించుకోటం ఉత్తమ లక్షణమని ఏదేదో అంటుంటుంది. బుద్ధిమంతుడిలాగా వింటాడు రామకృష్ణ.

    "ఇంకా వాళ్ళ విషయమే ఆలోచిస్తున్నావా సీతా!" కొద్దిసేపు ఆగి నెమ్మదిగా అడిగాడు రామకృష్ణ.

    "సినిమా చూశానన్న మాటేగాని సినిమాలోని ఒక్క సంఘటన గుర్తుకు రావటం లేదు. పాపం ఆ అమ్మాయే గుర్తుకు వస్తున్నది. గట్టిగా సినిమా చూసే యోగం కూడా లేదు ఏం బతుకో!"

    "నీవు ఈ ఒక్క సంఘటన చూసి యింతగా చలించిపోయావ్. వెంకట్రావ్ మాష్టారి ఫార్స్. దశరధరామయ్య భార్య సంగతి చెపితే.....

    "వాళ్లెవరు?" ఆతృతగా అడిగింది సీత.

    "నీవు కనీ వినీ వూహించని కధలు వాళ్ళవి వాళ్ళ కధలు గాధలు వినిపిస్తాను. అవి విన్నావంటే సినిమా హాల్లోని దంపతుల గోల వినిపిస్తాను. అవి విన్నావంటే సినిమా హాల్లోని దంపతుల గోల మర్చిపోతావ్. వాళ్ళ ఫార్స్ వినాలంటే ఇలా లాభం లేదు. నీవు నా ఒడిలో తల పెట్టుకుని పడుకోవాలి. అప్పుడు నీ తల ప్రేమతో నిమురుతూ విషయం చెపుతాను."

    "ఇదో వేషం. విషయమంటూ ఏది లేదు నెమ్మది నెమ్మదిగా కబుర్లలోకి దింపి..... ఆ తర్వాత....

    "ప్రామిస్. వాళ్ళ జీవిత కధలు చెప్పటం తప్పించి నీ ఇష్టం లేనిది ఒక్కడుగు ముందుకు వేయను సరేనా?"
   
    సీత భర్త ముఖంలోకి గుచ్చి చూసి "సరే మీ మాట నమ్ముతున్నాను" అంది. రామకృష్ణ ఒడిలో తల పెట్టుకుని పడుకుంది.

    సీత ముఖంమీద పడి దోబూచులాడుతున్న ముంగురులతో ఆటలాడుకుంటూ "నీకు తల బిరుసు జాస్తీ సీతూ!" అన్నాడు రామకృష్ణ.

    "తుమ్మెద రెక్కలా నల్లగా నిగ నిగ లాడటమే గాక నా తలకట్టు బాగా వత్తు బిరుసును" అంది సీత.

    "నేనన్నది అది కాదులే!"

    "మరి.....?"

    "తలజుట్టు బిరుసుగా వున్న వాళ్లకి తల బిరుసు గూడా చాలా ఎక్కువగా ఉంటుందిట"

    "మా గొప్ప సత్యం కనిపెట్టారులెండి. ఇంతోటి గొప్ప విషయం గొడ్లకాచే బుడ్డోడు కూడా చెప్పగలడు. నా తలకున్న శిరోజములు బిరుసేమో గానీండి నా తల బిరుసుతనం నాకేం లేదు. మాటలు తప్పుదారి పట్టించటానికి ఇదో వేషం. వెంకట్రావ్ మాష్టారి కథ దశరధ రామయ్య కధ కానీండి" సీత గదమాయించింది.

    "తప్పదా?"

    "తప్పదు."

    "ఏం చేస్తాను చేసుకున్న వారికి చేసుకున్నంత చెపుతాను విను" అన్నాడు రామకృష్ణ.

    వళ్ళో సర్దుకు పడుకుంటూ "చెప్పండి." అంది సీతా మనోహరి.

 Previous Page Next Page