Previous Page Next Page 
నెత్తుటిబొట్టు పేజి 7

    తల్లి రాఘవమ్మ వంట పనిలో వుంది.

    స్టవ్ దగ్గర కూర్చున్నదల్లా  తల వెనక్కి తిప్పి "వచ్చావా" అంది.

    రాఘవయ్య ఒకప్పుడు బలంగా, ఆరోగ్యంగా వుండేది. ఎప్పుడో ముప్పయి ఏళ్ళ క్రితం కాపరానికి వచినప్పుడు కావలసినంత అందంగాను వుండేది. ప్రపంచంలో వున్న అమాయకత్వాన్ని, ఆశలనూ కళ్ళలో నింపుకుని అత్తవారింట్లో అడుగు పెట్టింది. వచ్చిన మొదటి రోజు నుంచీ అత్తగారి గయ్యాళితనం, అనుక్షణం చవిచూసిన ఆర్ధిక బాధా, పిల్లలూ, పుట్టి చచ్చిపోయిన పిల్లలూ _ బ్రతికి వున్న వాళ్ళ అనారోగ్యాలూ _ క్రమంగా ఆమెను పీల్చిపిప్పిచేసి వంట్లోని ఆరోగ్యం, అందం హరించిపోయి జీవచ్చవంగా మిగిలింది. ఆమె మాట్లాడుతోంటే ఒక్కోసారి కన్న తల్లిలా కాకుండా సవతి తల్లి మాట్లాడుతున్నట్టు వుండేది.

    తల్లి కళ్ళలో నీళ్ళు కారడంలేదన్న సత్యం ప్రజ్ఞకు తెలుసు.

    "అన్నీ పూర్తిచేసుకొచ్చావా?"

    ప్రజ్ఞ తల ఊపింది.

    తమ కుటుంబంలోంచి ఒక సభ్యురాలు తొలగిపోయిందన్న సత్యం అందరి గుండెలను కలచివేస్తోందన్న నిజం అందరకూ తెలుసు. అయినా ఆ నిజం స్తబ్దుగా అణిగిమణిగి వుండిపోయింది.


                   *               *               *


    ప్రజ్ఞ రోజూ ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేస్తుంది. కార్తీకమాసంలో అయితే ప్రతిరోజూ, లేక శివరాత్రి, ముక్కోటి ఏకాదశిలాంటి పర్వదినాలకు తప్పకుండా ఇరుగుపొరుగుతో కలిసి కృష్ణ స్నానానికి వెడుతుంది.

    ప్రతిరోజూ లలితాసహస్రనామం  చదువుతుంది.  శుక్రవారం  శుక్రవారం తప్పనిసరిగా కనకదుర్గ గుడికి వెడుతుంది.

    ఆమెకు దేవుడిపై అపారమైన నమ్మకం, ఎనలేని భక్తి.

    ఆ రోజు శుక్రవారం. అసలే చలికాలం. ఉదయం ఏడు దాటినా మొగల్రాజపురం కొండలమీదుగా ఉదయించే సూర్యుణ్ణి కప్పేసిన మేఘాలు, మనిషికీ మనిషికీ ఒకరి నొకరికి కనిపించకుండా ఆవరించివున్న మంచు తెరలు...

    అలాంటి చలిలో ప్రజ్ఞ తెల్లవారుఝామునే నిద్రలేచి తలారా చన్నీళ్ళు స్నానం చేసింది. ప్రక్కింటి ముసలమ్మను వెంటబెట్టుకుని గుడికి వెళ్ళింది.

    ఆరోజు గుళ్ళో జనం ఎప్పటికన్నా ఎక్కువగా వున్నారు.

    ప్రజ్ఞ వరుసలో నిలబడింది.

    దేవాలయంలోకి రకరకాల వాళ్ళు వస్తున్నారు. కార్లలో దిగేవాళ్ళు పట్టుబట్టలు కట్టుకుని _ తలంటి పోసుకున్న శిరోజాలు విరబోసుకుని, శరీరమంతా బంగారం నింపుకుని వచ్చేవాళ్ళు, చలిలో కృష్ణలో స్నానం చేసి తడి బట్టలతో భక్తితో గంటల తరబడి క్యూలో నిలబడే వాళ్ళు...

    పలుకుబడి వున్నవాళ్ళు దబాయింపుగా లోపలకు తోసుకుని వెళ్ళిపోతున్నారు. గేటు కాపలావాడి దగ్గర కొందరికి పలుకుబడి, పూజారుల దగ్గర పలుకుబడి, కమిటీ మెంబర్ల దగ్గర పలుకుబడి...ఠీవిగా, దర్జాగా, దర్పంగా ఇట్టే లోపలకు వెళ్ళి క్షణాలమీద అర్చనలూ, పూజలూ ముగించుకుని అటునుంచి బయటపడుతున్నారు.

    పూజారులలో వయసులో వున్నవారు మంత్రాలు చదువుతూనే వచ్చిపోయే ఆడవాళ్ళ 'సౌందర్యా'లను అవలోకించి పారేస్తున్నారు. అంటే దాని అర్ధం వయసు మళ్ళిన పూజారులు చూడడంలేదని కాదు.
   
జనం రద్దీ పెరిగి తోపుడు ఎక్కువయింది. ఆడవాళ్ళూ ఆడవాళ్ళూ తోసుకుంటున్నారు. ఆడవాళ్ళూ మొగవాళ్ళూ తోసుకుంటున్నారు. మొగవాళ్ళ చేతులు కావాలని ఆడవాళ్ళ శరీరాలను తాకుతూ రకరకాలుగా ఆనందాన్ని అనుభవిస్తున్నాయి. 
    
    ఆ పుణ్యస్థలం నుంచి బయటపడడానికి ప్రజ్ఞకి రెండు గంటలకు పైగా పట్టింది.
    ఆమెతోపాటు వచ్చినామె దగ్గర్లో వున్న చుట్టాలింటికి వెళ్ళి వస్తానని, తమతోపాటు ఆమెను కూడా రమ్మన్నది. తనకు తెలియని చోటుకు, పరిచయం లేని మనుషుల దగ్గరకు వెళ్ళడం ప్రజ్ఞకిష్టంలేదు. అందుకని ఇంటికి వంటరిగానే బయల్దేరింది.

    వంటరిగా నడవడం ఆమెకు భయమే. అప్పుడప్పుడు గుండెదడ పుట్టించే సంఘటనలు జరుగుతూనే వున్నాయి. అటూ ఇటూ చూడకుండా తల వంచుకుని గబగబా నడుస్తోంది.

    మెల్లగా ప్రక్కనే ఓ కారాగినట్టయింది. వద్దనుకుంటూనే ప్రజ్ఞ తపత్రిప్పి చూసింది.

    బిస్కెట్ కలర్ ఫియట్ కారు స్టీరింగ్ ముందు నక్కుల నక్కుల జుట్టుతో చాలా అందంగా వున్న ఓ యువతి కూర్చుని వుంది. ఇరవై ఏళ్లకు మించి వయసుండదు.

    ఆ అమ్మాయి పేరు తేజ.
   
    తేజతో ప్రత్యక్షంగా పరిచయం లేదుగాని, ఆమె ఎవరో ప్రజ్ఞకు తెలుసు.

    ప్రజ్ఞ వాళ్ళింటికి కొద్దిదూరంలో వుంటుంది వాళ్ళ ఇల్లు. అధునాతనమైన మేడ. తేజ ఇంటివారమ్మాయని తెలుసు ప్రజ్ఞకు. అంతకుమించి వివరాలు తెలియవు.

    తేజ ఇటువైపు కొంచెం వొరిగి డోర్ మీద చెయ్యివేస్తూ "మీరు నాకు తెలుసు. కారెక్కండి, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను"

    "వద్దండీ. నడచి వెళ్ళిపోతాను" అంది ప్రజ్ఞ చాలా మొహమాటంగా.

    తేజ నవ్వింది. "ఏంటి నేనంటే భయమా?"

    "అహ ! అది కాదు."  
 

 Previous Page Next Page