"నేను మనుషుల్నే నమ్మను, కనిపించని దేవుడ్నెలా నమ్ముతాను?" అన్నది తేజ.
ప్రజ్ఞ ఉలిక్కిపడి ఆమె ముఖంలోకి చూసింది. ఆమె తనవంక చూడడంలేదు. కారు డ్రైవింగ్ చేస్తూ రోడ్డుమీద దృష్టి నిల్పి వున్నది.
అప్రయత్నంగా ఆమెవంక అలాగే చూస్తూ వుండిపోయింది ప్రజ్ఞ. చాలా అందంగా అపురూపంగా వున్నది. మెరిసిపోయే తెల్లని శరీరకాంతి. ఆమెలో ఇతరుల కందని లోతు వుందనిపించింది.
"మీరు మనుషుల్ని నమ్మరా?" అనడిగింది మెల్లగా.
"నమ్మను"
"ఎందుకని?"
"తనకు తాను అతీతమైన నిబంధనలు విధించుకుని అయా చట్రంలో తనని తాను బిగించుకుని అర్ధంలేకుండా నలిగిపోతూ అందులో ఇమడలేక బయటపడలేక తపనతో ఊపిరాడకుండా చేసుకునే వింతజీవి మానవుడు. అనుక్షణం తనని తానే మోసగించుకుంటూ ఇతరుల్ని మోసం చేసే ద్వంద్వ జీవి"
"ఒకవేళ మీరు చెప్పేవి నిజమే అనుకుంటే _ ఈ ఆత్మవంచన నుంచి విముక్తి పొందడానికి దేముడ్ని ఆశ్రయించడంలో తప్పులేదు కదా?"
"ఒకవేళ మీరు చెప్పేవి నిజమే అనుకుంటే _ ఈ ఆత్మవంచన నుంచి విముక్తి పొందడానికి దేముడ్ని ఆశ్రయించడంలో తప్పులేదు కదా?"
"అలా ఆశ్రయించిన కొద్దీ ఆత్మవంచన ఎక్కువవుతుంది కాని, ప్రయోజనం శూన్యం."
"దేముడ్ని ఆరాధించే ఈ లక్షల కొద్దీ భక్తులందరూ ఆత్మవంచన చేసుకునే వాళ్ళంటారా?"
"సందేహమేముంది?"
"అయితే వీళ్ళంతా అజ్ఞానులనే మీ ఉద్దేశమా?"
"అజ్ఞానులవునో, కాదో నేను చెప్పలేను కాని జ్ఞానులు మాత్రం కాదు" అంటూ తేజ నవ్వింది.
ఆమె చెప్పిన విషయాలేమీ ప్రజ్ఞకు నచ్చడంలేదు. కాని ఆమె అంటే విముఖత కలగకపోగా ఆ వ్యక్తికి ఇంకా ఇంకా చేరువకావాలనిపిస్తోంది.
మనిషి ఎలాంటివాడయినా _ అతన్లో వున్న వ్యక్తిత్వం ఇతరుల్ని ఇంకా ఇంకా దగ్గరకు చేరుస్తూ వుంటుంది.
ఆ తర్వాత ఆ అంశం గురించి సంభాషణ ఎక్కువగా పొడిగించబడలేదు.
* * *
బిజినెస్ మేగ్నేట్ ధర్మారావుగారింట్లో రాత్రి పదిగంటలవేళ పెద్ద ఎత్తున పార్టీ జరుగుతోంది. ఆయన్తో సన్నిహితంగా వుండే వివిధ డిపార్ట్ మెంట్ లలోని ఉన్నత శ్రేణి ఆఫీసర్లు, ఊళ్ళోని ఒకరిద్దరు ప్రముఖులు ఆ పార్టీలో పాల్గొంటున్నారు. రాయల్ సెల్యూట్ బాటిల్స్ ఒకదాని వెంట ఒకటి పూర్తవుతున్నాయి. జీడిపప్పు, చిప్స్, చికెన్, ఫ్రాన్స్ రకరకాల తినుబండారాలు ప్లేట్లమీద ప్లేట్లు ఖాళీ అవుతున్నాయి.
ఆ పార్టీలో జీతాలతో సంబంధం లేకుండా లక్షలకు సంపాదించిన ఆఫీసర్లున్నారు. జీవితంలోని అమరసుఖాలను నిర్ధాక్షిణ్యంగా జుర్రి పారేసిన వాళ్ళున్నారు. గోల్డ్ బిస్కెట్ దిగుమతి చేసుకుంటూ, కోటికి పడగలెత్తిన వ్యాపారస్తున్నారు.
"ధర్మారావ్! కొత్తగా వచ్చిన బ్లూఫిలిం ఏమీ లేదా ?" అనడిగాడు సివిల్ సర్వీసెస్ సంబంధించిన ఓ ఆఫీసరు.
"అరె! అన్నట్టు దాన్ని గురించి మరిచేపోయాను!" అంటూ ధర్మారావు వాడ్రోబు తెరచి అందులోంచి ఓ క్యాసెట్ తీసి వి.సి.ఆర్.లో ఫిక్స్ చేశాడు.
అక్కడ్నుంచి కేరింతలు, కేకలు మధ్య మధ్య చప్పట్లు.
"ధర్మారావు! ఈసారి సీలేరు ఏరియాలోని ఫారెస్టులో పార్టీ ఏర్పాటుచేసుకుందాం. గెస్ట్ హౌస్ గురించి బాధలేదు. నేను బుక్ చేయిస్తాను. సర్వసన్నాహాలతో వెడదాం" అన్నాడు కమర్షియల్ టాక్స్ డిపార్ట్ మెంట్ డి.సి.గారు.
సర్వసన్నాహాలు అనే మాటకు అర్ధం ధర్మారావుకు తెలుసు. "తప్పకుండా సార్, పది పదిహేను రోజుల్లోనే అన్ని ఏర్పాట్లు చేస్తాను" అన్నాడు ధర్మారావు.
రాత్రి పన్నెండు గంటలదాకా పార్టీ ఉధృతంగా సాగింది. అక్కడున్న వారిలో ప్రేలాపనలు, ప్రకర్షలు ఎక్కువయిపోయాయి. తర్వాత ఒకరి తర్వాత ఒకరుగా బయల్దేరి, ఎవరి కార్లలో వాళ్ళు ఇళ్ళకు వెళ్ళిపోయారు.