భారతి చాలాసేపటిదాకా అక్కడినుంచి కదల్లేదు. గోడకానుకుని బద్ధకంగా కూర్చుంది. రాధమ్మ కొంతసేపటికి ఇవతలకు వచ్చి "ఆ....యీ" అని పిలిచి, "స్నానానికి లేవవేం?" అని సంజ్ఞలు చేస్తూ అడిగింది.
"చేస్తాలే పిన్నీ!"
"ఊఁ హుఁ!" అంటూ రాధమ్మ ఆమెను బలవంతంగా భుజాలు పట్టుకుని లేవదీసి లోపలకు తీసుకు వెళ్ళింది.
* * * *
రెండు రోజులు గడిచాక భారతి ఉదయం పదిగంటలవేళ మల్లిక ఇంటికి వెళ్ళింది. మల్లిక గదిలోంచి మృదుమంజులమైన వీణావాద్యం వినిపిస్తూ వుంది. భారతి ఆ గదిలోకి అడుగుపెట్టేసరికి తలంటు పోసుకుని, విరబోసుకున్న జుట్టుతో ఈ లోకాన్ని మరచి వీణాతంత్రులను మీటుతూ ఆ మధుర ధ్వనిలో లీనమై ఉన్న మల్లిక అపర సరస్వతీదేవిలా గోచరించింది. భారతి అడుగుల సవ్వడి ఆమెకు వినిపించనే లేదు.
భుజంమీద చల్లని స్పర్శ తగిలేసరికి, ఉలికిపడి చటుక్కున వీణను మీటటం ఆపు వేసి, తల ఎత్తి "నీవా?" అంది విచలిత కంఠంతో.
"అవును. నేనే. అనగా అనగా ఓ భారతిని. నేనేం చేశానని కనిపించకుండా దాగుడుమూత లాడుతున్నావు?" అంటూ ఆమె చాపమీద స్నేహితురాలి ప్రక్కగా కూర్చుంది.
మల్లిక విప్పారిన కళ్ళతో ఆమె వంక మాటా పలుకూ లేకుండా చూస్తూ వుండిపోయింది. చూస్తూ చూస్తూండగానే తరళిత మవుతున్నాయామె కన్నులు.
"నువ్వు....నువ్వు...." అంది చివరకు ఎలాగో. ఆ తరువాత పూర్తి చేయలేకపోయింది.
"ఈ దీనురాల్ని నువ్వు కూడా అసహ్యించుకుంటున్నావా మల్లికా!" భారతి గొంతు గాద్గదికమై వణికింది.
"భారతీ!" ఒక్క అరుపు అరిచి మల్లిక స్నేహితురాలిచుట్టూ చేతులు వేసి ఆమె హృదయానికి అంటుకుపోయింది.
"నిన్నా నేను అసహ్యించుకోవటం? నలుపు అంటే ఏమిటో తెలియని నిర్మలమూర్తివి. స్నేహ మాధుర్యంతో నన్ను ముంచెత్తి, పులకింపజేసి, బాల్యం నుంచీ నా జీవితంలో వెన్నెల కురిపిస్తూ వచ్చిన అమృతమూర్తివి, నిన్ను నేను అసహ్యించుకుంటానా? నీకష్టం నేను భరించలేక, ఆ మహాదుఖంలో నిన్ను చూడలేక, అలాంటి విషమ పరిస్థితిలో నా ఉనికిని సహించలేక పారిపోయి వచ్చాను. అది నా దౌర్భల్యమవుతుందిగాని, అసహ్యమెందుకవుతుంది భారతీ! అక్కా! అలాంటి మనక్లేశం నీకు కలిగించానా? నన్ను క్షమించు"
ఆ గాఢలింగనంలో ఆమెను బంధించి వేసి, వెక్కి వెక్కి ఏడుస్తూంది మల్లిక, ఆ కౌగిలిలో తనను దాచుకుంటూ.
భారతి చలించిపోయింది. ఆమె శరీరం గగుర్పొడిచింది. ఒక నిమిషం ఆమెకు ఊపిరాడలేదు. హఠాత్తుగా ఆమెకు కూడా ఏడు పొచ్చింది. కాని తాను మరీ బేలగా ప్రవర్తించకూడదు. అని హెచ్చరిక చేసుకుంటూ బలవంతంగా నిగ్రహించుకుంది. తరువాత బలవంతంగా ఆమె ముఖాన్ని తన భుజంమీద నుండి విడదీసి, పమిటచెంగుతో ఆమె కళ్ళు తుడుస్తూ అంది. "పిచ్చిపిల్లా! ఇంత చిన్న విషయానికి అంతగా మనసు పాడుచేసుకుంటారా ఎవరయినా?"
దీనికి సమాధానంగా మల్లిక అంది ఆవేశంగా. "ఇదంత చిన్న విషయమని అనుకోవటంలా నేను. నాకే యిలాంటి దురవస్థ వస్తే ఒక్క నిమిషం కూడా భరించలేకపోయేదాన్ని. వెంటనే ఆత్మహత్య చేసుకునేదాన్ని.
"కాని నేను చాలా మొండిదాన్ని. ఆత్మహత్య చేసుకునేంత ధైర్యం నాకులేదేమో మల్లికా!"
"ఛ అలా అనకు. నీలో చాలా అతీతపు శక్తులు వున్నాయి. అందుకే అంత దృఢంగా ఈ సంఘటనను స్వీకరించి సునాయాసంగా జీవితపధాన్ని నిర్ణయించుకోగలిగావు."
"ఇదంతా నాకోసం కాదు మల్లికా. నా స్వార్ధం ఇందులో రవ్వంత కూడా లేదు కృతజ్ఞతాభరితమైన మనస్సును, వినయంగా విప్పతమే నేను చేసినపని."
"తెలుసు" అని మల్లిక ఆమెను కొంచెం వదలి దూరంగా జరిగి "బాబయ్యగారు వచ్చారా నూజివీడు నుంచి?" అని అడిగింది.
"వచ్చారు" అని భారతి తన అందమైన పలువరుసను వ్యక్తం చేస్తూ నవ్వి "నా పెళ్ళి ఖాయమయింది. ముహూర్తాని కింక పదిరోజుల కంటే వ్యవధిలేదు. చాలా ఆదుర్దా పడుతున్నారట పెళ్ళివారు" అంది.
"అరె, చెప్పావు కాదూ రేపటి నుంచి పెళ్ళి పనులు మొదలవుతాయన్నమాట మీ యింట్లో నీ ఒక్కదానివల్ల కాదేమో! నన్ను వచ్చి మకాం పెట్టమన్నావా మీ యింట్లో?" మల్లిక ధోరణి మారింది.
"ఊహూ. పెళ్ళి ఇక్కడకాదు మల్లికా. పెళ్ళివారిది చాలా భారీ సంబంధమాయె. మా పెంకుటిల్లూ, ఇక్కడి వాతావరణమూ....వారి అంతస్థుకు మేము తూగవద్దూ. నూజివీడులోనే పెద్ద భవంతి....ఏ జమీందారుగారిదో అనుకుంటాను మాట్లాడి అక్కడ జరిపిస్తున్నారు పెళ్ళి నీకు తెలుసుగా_కట్నం దమ్మిడీలేదు. పెళ్ళి ఖర్చులు మనకు పడతాయి."
మల్లిక నిట్టూర్చి "బాగానే ఉంది" అంది మళ్ళీ ఆమె కొంచెం ఆగి "చందరాల విడిచి వెళ్ళిపోతున్నా వన్నమాట అయితే. ఎంత కఠినురాలివే?" అంది.
భారతి ఏదో చెప్పబోయేలోపల మళ్ళీ తనే "కానీ ఒక్క సలహా. తొందర తొందరగా పిల్లల్ని కని గార్హస్థ్య జీవితాన్ని మాత్రం నరకం చేసుకోకు. పెళ్ళంటే పిల్లల్ని కనటమని నిరూపించకు" అన్నది.
భారతి "పో" అని వూరుకుంది.
అంతకు మినహాయించి ఆ సన్నివేశంలో సహజంగా ఉద్భవించవలసిన ప్రశ్న లేమీ ఉదయించలేదు. పరిహాసోక్తు లేమీ జరుగలేదు.
"నువ్వదృష్టవంతురాలివే! మంచి మొగుణ్ని సంపాదించుకున్నావు. పెళ్ళి చేసుకుంటుంటే ఎలా వుంది? ఈ మధురానందంలో ఓ రకం విషాదమేఘాలు కమ్మివేయటంలేదూ? నీ పెనిమిటి ధ్యాసలో పడి నన్ను మరచిపోతావు కదూ భారతీ!"
ఇత్యాది ఊహలెన్నో మల్లిక మనసులో కలిగాయి. అయినా ఒక్కటీ బయటికి వెలిబుచ్చలేక పోయిందామె. ఆ వాతావరణంలో ఏదో సహజత్వం లోపించినట్లయింది.
అలాగే భారతి 'నా పెళ్ళికి తప్పక వస్తావు కదూ' అని అనలేకపోయింది. ఆమె గొంతుకేదో అడ్డుపడినట్టయింది.
అసలు ఎంత సుందరంగా వుండవలసిన సన్నివేశం! దౌర్భాగ్యం కొద్దీ అందులో ఈనాడు సహజత్వం, లాలిత్యం, మాధుర్యం మరుగుపడినట్లయింది.
తరువాత ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారుగానీ, ఆ మాటలు పొడిపొడిగానే ఉన్నాయి. అట్లా కొంతసేపు గడిపి "ఇహ వెడతాను మల్లికా. పొద్దుపోతుంది చాలా" అంటూ లేచి నిలబడింది భారతి.
శారదమ్మగారు శుష్కించిన శరీరంతో మంచంమీద పడుకుని ఇంటిపైకప్పు కేసి చూస్తూంది .అలికిడి విని ముఖంత్రిప్పి ప్రక్కకు చూసి సంతోషంతో "రా అమ్మా రా! పెళ్ళికూతురి వవుతున్నావటగా" అంటూ ఆహ్వానించింది ఎంతో సాదరంగా.
భారతి వెళ్ళి మంచంమీద కూర్చుని ఆమె ఒంటిమీద చెయ్యి వేసి "ఎలా వుంది పిన్నిగారూ మీ ఒంట్లో?" అని ప్రశ్నించింది.
"బాగానే వుందమ్మా. పది లంఖణాలు చేసిన మీదట కలిగిన నీరసం తప్పితే. రోగం నయమైపోయింది. అమ్మాయిని ఇంకో నాల్గు రోజులపాటు వుండమన్నాను" అని ఆమె తలమీద చేయి వేసి నిమురుతూ "పెళ్ళివారిది నూజివీడా? పెళ్ళికొడుకు బాగానే వుంటాడటగా, మల్లిక చెప్పింది. తను కూడా చూసిందట" అంది.