భారతి తలవూపి వూరుకుంది.
"అదృష్టవంతురాలివి తల్లీ నీ తండ్రి నిజాయితీ గుణమే నీకీ శుభాన్ని చేకూర్చింది....మీ అమ్మ జీవించివుంటే ఎంత సంతోషించేదో!" గత స్మృతులు మనసులో మెదిలి గొంతు తడబడి కళ్ళు చెమ్మగిల్లాయి.
భారతికి కూడా ఏడుపు వచ్చింది. పమిట చెంగుతో కళ్ళు తుడుచుకుని తల వంచుకుని కూర్చుంది. తనకు తెలిసిన తల్లి రూపాన్ని గుర్తు తెచ్చుకోవటానికే ప్రయత్నిస్తూంది.
శారదమ్మగారు దీర్ఘంగా నిట్టూర్చి "నీ పెండ్లి వేడుక చూద్దామని ఎంత ఉబలాటంగా వుంటే ఏం లాభం? నా శరీరం నేను చెప్పినట్లు వినదుగా! అమ్మాయిని తప్పక పంపిస్తాను" అని "భారతీ! నీ సమస్య తీరిపోయింది. దానికెక్కడ రాసిపెట్టి వున్నదో? అన్నది చేతులు జోడించి పరమేశ్వరుణ్ణి అభ్యర్ధిస్తున్నట్లుగా.
తన పెండ్లి ప్రసక్తిరాగానే అంతవరకూ కదలకుండా నిలబడి వున్న మల్లిక ,ఉలికిపడినట్లయి అక్కడ నుంచి గబగబ బయటకు వెళ్ళిపోయింది.
"చూశానమ్మా, ఇదీ ధోరణి? నీకు లాగానే ఒక్కగానొక్క పిల్ల కదా. దాన్ని అచ్చటా ముచ్చటా చూడాలని నాకు వుంటుందంటావా? చిలిపిగా వున్నట్లుగానే వుంటుంది. మళ్ళీ పెళ్ళంటే కస్సుమంటూ వుంటుంది. చదువుకుని ఏదో సాధించాలని దాని ఆశ. దాని ముద్దూ ముచ్చటా చూడాలని మా ఆశ కాస్త నువ్వయినా చెప్పమ్మా. మీరిద్దరూ ఒకరంటే ఒకరు ప్రాణమిస్తారు కాబట్టి నువ్వు చెబితే అలకిస్తుందేమో" అన్నది శారదమ్మగారు ప్రాధేయపూర్వకంగా.
భారతి బయటకేమీ అనలేక "అలాగేనండి" అంది.
కాసేపక్కడ కూర్చుని సెలవు తీసుకుని బయటకు వచ్చేసింది భారతి. గుమ్మం దగ్గర నిల్చుని దీర్ఘంగా బయటకు అవలోకిస్తున్న మల్లిక బుగ్గను పుణికి, వస్తానని చెప్పి బయల్దేరింది.
ఇంటికి చేరేటప్పటికి హాల్లోంచి, తండ్రి ఎవరినో ఉద్దేశిస్తూ పెద్దగా అరుస్తున్న అరుపులు వినిపించి క్షణకాలం బయటే నిలబడిపోయింది. తరువాత గుండె దిటవు చేసుకుని లోపలకు అడుగు పెట్టేసరికి, తండ్రి కేకలు పెడుతూండటమూ, నాగరాజు ఆయన కెదురుగా నిలబడి ఎర్రబడ్డ కళ్ళతో చూస్తుండటమూ కనిపించాయి.
"నాగరాజూ! చుట్టానివని ఇంతవరకూ కనికరించాను. సభ్యతా సభ్యతలు గుర్తించకుండా ఇహ అనవసరంగా గొడవ చేశానంటే బలవంతంగా బయటకు పంపించాల్సి వస్తుంది. భారతిని నా కూతురు నా ఇష్టం వచ్చిన సంబంధం నేను చేసుకుంటాను కాదనటానికీ ,వాదించటానికీ నువ్వెవరిని?" గౌరీపతిగారి శరీరం వణుకుతూ, కంఠం మీది రక్తనాళాలు ఉప్పొంగుతున్నాయి.
"కలనైనా తలచని విధంగా ఈనాడు గొప్పింటి సంబంధం వచ్చిందని గర్వపడకు మామయ్యా! భారతి పుట్టినప్పుడే మా ఇద్దరికీ మనువవుతుందని నలుగురూ అనుకోలేదా? అది నాకు వరుస కాదా? నా కోరిక నీ ముందు ఎన్నిసార్లు వెళ్ళబుచ్చాను కాదు? నాకేం తక్కువని నన్ను తృణీకరిస్తూ వచ్చావు? డబ్బుంది. అలా అని ఊరికినే కూచోక సంపాదించుకుంటున్నాను నా ఉసురు నీకు తగలక పోదు మామయ్యా" నాగరాజు ఉద్రేకంతో రొప్పుతూ అంతకంటే అరుస్తున్నాడు.
"నాగరాజూ వెయ్యిసార్లు అదే మాట అనకు. అసలు భారతికి నువ్వంటే ఇష్టంలేదు. ణీ బుద్ధులూ, దుర్వ్యసనాలూ తెలిసిన ఏ ఆడదీ కూడా నువ్వంటే ఇష్టపడదు నీలాంటివాడు పదే పదే మా ఇంటికి రావటం కూడా నాకు గిట్టదు, చెపుతున్నా"
"మామయ్యా! ఆప్తబంధువనే ఉద్దేశ్యంతో ఎంత సవ్యంగా అడుగుతున్నా నన్నవమానిస్తూ రెచ్చగొడుతున్నావు. ఈ నాగరాజును నువ్వు సరిగా అర్ధం చేసుకోలేదు తిక్క తిరిగిందంటే...."
"నీ బెదిరింపులను వీసమెత్తుకూడా లెక్కచేయను. నాగరాజూ! ఒకరికి కీడు తలపెట్టకుండా, న్యాయంగా రాజమార్గాన పోయేవాడిని, నీ లాంటి వాళ్ళు పదిమంది కలసినా ఏమీ చేయలేరు. ఇహ వెళ్ళు."
"మామయ్యా! ఆఖరిసారిగా అడుగుతున్నా. అదేనా నీ సమాధానం?" నాగరాజు కళ్ళు పెద్దవిచేస్తూ నిలదీసినట్లుగా అడిగాడు.
"ఇన్నిసార్లు చెబుతున్నా అర్ధం చేసుకోనంతటి మూర్ఖుడివా నువ్వు? భారతి పెళ్ళి స్థిరపడి, శుభలేఖలు కూడా అచ్చయిపోతుంటే మళ్ళీ మొదటికొస్తావా?"
"సరే. వెడుతున్నాను మామయ్యా. ఇల్లలకగానే పండగయిందని సంబరపడకు దీని ఫలితం మీరు తప్పక అనుభవించి తీరుతారు" అని నాగరాజు ఎర్రబడ్డ ముఖంతో గిరుక్కున వెనుదిరిగి, కుంటుకుంటూ గుమ్మం వైపు అడుగులు వేసి అక్కడ నిలబడివున్న భారతిని ఢీ కొనినంత పని చేశాడు.
వెంటనే సర్దుకుని ఆమెవంక తీక్షణంగా చూస్తూ, "భారతీ కాబోయే మొగుణ్ణి తలుచుకుని కులుకుతూ, ఉవ్విళ్లూరుతున్నట్లున్నావు. ఈ కుంటివాడి బ్రతుకు ఎగతాళి చేసినట్లే నీ బ్రతుకూ ఒకసారి నవ్వులపాలు కాకపోదు" అని ముఖం త్రిప్పుకుని ,గబగబా నడిచి బయటకు వెళ్ళిపోయాడు.
నిరుత్తరురాలై నిలబడిపోయిన భారతి, తేరుకుని తండ్రి దగ్గరకు పోయేసరికి, ఆయన చలికాలంలోనూ చెమటలు పట్టిన ముఖాన్ని పైకండువాతో ఒత్తుకుంటున్నాడు.
భారతి ఆయన భుజంమీద చేయివేసి ఆదరంగా "నాన్నా!" అని పిలిచింది.
అయన ముఖం ఎత్తి ఆమెవంక దీనంగా చూస్తూ "చూశావా, తల్లీ. ఆ వగరుబోతు వాగుడు?" అన్నాడు.
ఆ స్థితిలో తండ్రిని చూస్తే ఆమెకు జాలివేసింది. "నాగరాజు ఎంత జులాయికోరు మనిషో అందరకూ తెలుసు. ఆ పిరికివాడి మాటలకు దిగులు పడకండి, నాన్నా!" అంది సానునయపరుస్తున్నట్లుగా.
ఆ సమయంలో గౌరీపతిగారు కూతురి కళ్ళలోకి ఓ చూపు చూశాడు. ఆ చూపులో 'నా భయానికి కారణాలు చాలా ఉన్నాయమ్మా' అన్న భావం గోచరించింది. ఆ చూపుకు, ఆ భావానికి తట్టుకోలేక భారతి కళ్ళు దించుకుని, ఆయన భుజంమీద నుంచి చెయ్యి తీసివేసి మెల్లిగా లోపలకు నిష్క్రమించింది.
ఆ రాత్రి భారతికి ఎంతసేపటికీ నిద్రపట్టలేదు. తమ మామూలు మనిషి కాదు. ఒక భయంకరమైన అంటువ్యాధి: ఇతరులు గుర్తించి చీదరించుకుని దూరంగా తొలగిపోయే వ్యాధి తనకు సంక్రమించింది. ఒక్కసారి ఆమె మనసు తరతరాల వెనక్కి, చరిత్రను ఛేదించుకుని వెళ్ళింది. మిగతా జబ్బులన్నీ ఇటీవల పుట్టినవే అయి వుండాలి. వాటి ప్రసక్తి ఎప్పుడోగాని, ఎక్కడోగాని కనిపించదు. కాని కు....ష్టు....పురాణకాలంలో కూడా అతి భయంకరంగా వర్ణించబడింది. బైబిలు కధల్లో ఆ వ్యాధి పీడితుల్ని ప్రజలు అసహ్యించుకొని సమాజానికి దూరంగా ఎలా వుంచేవారో అతి దుర్భరంగా వ్రాయబడింది. ఆమె విజయవాడ వెళ్ళినప్పుడు అనేక పర్యాయాలు వీధుల్లో ఆ వ్యాధితో పీడించబడుతూ జట్టుగా తిరిగే ముష్టివాళ్ళనూ, వాళ్ళ వికృత రూపాలనూ, వాళ్ళను చూసి దూరంగా తొలగిపోయే ప్రజలనూ చూసింది. వాళ్ళ వికృత రూపాలు....వాళ్ళ మచ్చలతో, బొడిసెలతో నిండి వున్న మొహాలు, వాళ్ళ చట్టి ముక్కులు, వాళ్ళ వ్రేళ్ళు లేని చేతులు, వాళ్ళ పుళ్ళతో నిండివున్న కాళ్ళు, వాళ్ళ దుర్గంధం వ్యాపిస్తూన్న శరీరాలు....!
అవే ఆలోచనలు....అవే రూపాలు కళ్ళెదుట....అవే జ్ఞాపకాలు.
ఎప్పుడు నిద్రపోయిందో తెలియదు....ఎక్కడి నుంచో ఓ స్త్రీ నడిచి వస్తూంది .ప్రపంచంలో అంతకంటే కురూపి ఎవరూ ఉండరు. ముఖమంతా కాయలు ఎగుడు దిగుళ్ళు, ముప్పాతిక భాగం తినేసిన ముక్కు, వ్రేళ్ళు హరించిపోయి మొండిగా కనిపిస్తూన్న కాళ్ళూ ,చేతులూ.
"ఏయ్, ఎవరు నువ్వు?" ఎవరో ఎక్కడి నుంచో గర్జించి అడిగినట్లయింది.
"నా పేరు....నా పేరూ....భా....ర....తి."
ఒక్కసారిగా రక్తం గడ్డకట్టినట్లయి పోయింది. "భారతినా నేను? నేనేనా భారతిని? ఇందాకటినుంచీ ఇంత వికృతరూపంలో తిరుగుతూన్న పాపిష్టిదాన్ని నేనేనా?