Previous Page Next Page 
రీవెంజ్ పేజి 7

    "నేను ఎడారిలో అలా వెళుతుంటే కొంతమంది దుండగులు నా వెంట పడ్డారు.

    నేనెంత చెప్పినా వాళ్ళు వినలేదు. నేను ప్రపంచ సేవకోసం వెడుతున్నానని అంతగా కావలిస్తే నా ఆశయం తీరిన తరువాత ఈ దేహం ఏమయినా పర్వాలేదని, కానివాళ్ళు వింటేగా....

    నేను హెల్ప్ హెల్పని అరుస్తూ పరిగెడుతున్నాను. అసలేవరయినా అక్కడుంటేగా నన్ను రక్షించటానికి, వాళ్ళకి నేను దొరికిపోయాను.

    ప్రపంచ శాంతి కోసం రాజస్థాన్ వెళ్ళిన ఓ స్త్రీ మానభంగం అని మరుసటిరోజు పేపర్లో పడేదే కాని ఓ చిత్రం జరిగింది. ఎలా వచ్చాడో ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు గాని సిల్విస్టర్ స్టాలిన్ వచ్చి దుండగులందరిని చితక బాదేశాడు. తరువాత కొన్నాళ్ళకు ఊటిలో కలసి తన మనసులో మాట చెప్పాడు. సుజీ నువ్విన్నాళ్ళు నాకు కనిపించక వెతికి వేశారి విరక్తి చెందాను. నీకోసం ఒక ప్రాణి బ్రతుకుతుందని తెలిసి కూడా దూరంగా ఎడారిలో నీ ఆశయం కోసం వెళుతున్నావ్ నీకు ఇష్టమైతే మనం ఒకటవ్వచ్చు. నేనీ మాటలకి చాలా సేపు ఆలోచించి లేదు స్టాలిన్, ప్రేమ త్యాగాన్ని కోరుతుంది. నేను ఏనాడో బందరు చిట్లపల్లిలో వున్న మా బావకు మాటిచ్చాను, తననే చేసుకుంటానని అని చెప్పాననుకో అదీ థ్రిల్ అంటే.

    లేదంటే దీనినే అనుభూతి అన్నా అభ్యంతరం లేదనుకోండి"

    తను వాక్ప్రవాహాన్ని ఆపి ఊపిరిపీల్చుకొంది సుజిత.

    "నువ్ చెప్పింది బానే వుంది కాని అది ఫాంటసీ అవుతుంది

    ఒకరికి ఓ విషయం థ్రిల్ అనిపించింది, మరొకరికి అనిపించకపోవచ్చు. అయినా అది మాటల్లో చెప్పినా బాధపడడు" చెప్పింది అన్విత.

    "అంటే! అదేదో నువ్ చేసి చూపిస్తావ్ అంతేగా" ప్రశ్నించింది రిమి.

    "అవును"

    "ఎప్పుడు?" ప్రశ్నించారందరు, కాదు అరిచారంటే ఇంకా బావుంటుంది.

    "సమయం వచ్చినప్పుడు" ముక్తసరిగా సమాధానం ఇచ్చింది అన్విత.

    "కబుర్లకేం గాని నాకు ఆకలేస్తుంది బాబు" అడిగింది మమ్మి.

    "అలా అయితే ఒక పనిచేద్దాం అందరం కలసి ఐస్ క్రీమ్స్ తింటే ఎలా వుంటుంది" అడిగింది అన్విత.

    "ఐస్ క్రీమ్సా...? అదీ ఇంత వర్షంలోనా ...?" ఆశ్చర్యం వెళ్ళబుచ్చారందరూ.

    "తప్పదు! ఇలా వర్షంలో ఐస్ క్రీమ్ తినటం అనేది ఎవరూ చేయరు.

    అందుకే మనం చేద్దాం వెరైటీగా వుంటుంది. ఎలాగూ బిల్ నేనే పే చేస్తాను కాబట్టి ఎవ్వరికీ ఎటువంటి అభ్యంతరాలు వుండవని భావిస్తున్నాను" అన్నది అన్విత.

    "కావచ్చనుకో ! వర్షంలో ఐస్ క్రీమ్స్ తింటుంటే పిచ్చి వాళ్ళని చూసినట్లు చూస్తారు జనం. అయినా నాకు ఇస్నోఫిలియా ఉంది. నువ్ కాదూ కూడదూ అంటే ప్రయత్నిస్తాను" కొశ్చన్ మార్క్ మొహంతో ప్రశ్నించింది మమ్మి.

    "పోని మా వంతు డబ్బులిస్తే మిగతా డబ్బులు మేమేసుకుని బీరు కొడతాం" అన్వితాని ప్రశ్నించింది రమ.

    "అలా అయితే నాకు బ్లాక్ లేబిల్ కావాలి" కోరింది సుజిత.

    "ఇంకా నయం ఏ ఇమ్రాన్ ఖానో కావాలనలేదు. ఇంకేం మాట్లాడకుండా నాతో వస్తే రండి, లేకపోయినా నేనొక్కదాన్నే వెళ్ళగలను" చెప్పింది అన్విత.
 
    ఆ మాటకి ఇంకెవరూ సమాధానం చెప్పకుండా పది నిమిషాల్లో తయారయి అందరూ ఐస్ క్రీమ్ పార్లర్ కి బయలుదేరారు అలా వర్షంలోనే.



               *         *         *
     


    హాస్టల్ నుంచి బయటకి వచ్చిన అన్విత అండ్ పార్టికి దూరంగా ఓ వ్యక్తి కనిపించాడు.
    హాస్టల్ కి కొంతదూరంలో ఓ చెట్టు వుంది. ఆ చెట్టు క్రింద వర్షంలో తడవకుండా మాట్లాడుకుంటున్న ఇద్దరమ్మాయిలని ఆ వ్యక్తి ఏదో అడుగుతున్నాడు.

    అతను వర్షంలో నిలబడి ప్రశ్నిస్తున్నాడు. వాళ్ళ నుంచి అతను ఆశించిన సమాధానం వచ్చినట్లు లేదు. తలవంచుకొని వెళ్ళిపోతున్నాడు అతనిలో ఎందుకో నిరాశ కనిపించింది.

    ఈ దృశ్యాన్ని అన్వితతో పాటు అందరూ చూశారు ఒక్కరిని తప్ప.

    ఇవేని గమనించే స్థితిలో లేదు. ఆమెకు ప్రస్తుతం దృష్టంతా తినబోయ్ ఐటమ్స్ మీదే వుంది.

    "నాకు బాగా ఆకలేస్తుంది బాబు. నడిచే ఓపిక కూడా లేదు.

    ఐస్ క్రీమ్స్ తో పాటు లైట్ గా టిఫినూ .... అది" నసిగింది రిమి.

    ఆమె మాటలకు అన్విత కల్పించుకొని,

    "నువ్ తినేది నాన్ వెజేగా... !

    "నీ ఆకలి తీరాలంటే ఆ వెళ్తున్న అబ్బాయి మెదడు తిను సరిపోతుంది. సరిపోలేదనుకుంటే మేమెలాగు వున్నాం." అన్నది అన్విత. 
 

 Previous Page Next Page