Previous Page Next Page 
క్లైమాక్స్ పేజి 7

ఆ తర్వాత పాదాలదాకా ఆ తర్వాత వీడ్కోలు చెప్పినట్లు ఒక్కసారి వాళ్ళ పాదాలకి గిలిగింతలు పెట్టి ఇంకా కిందికి వెళ్ళిపోయింది నీరు.

ఇప్పుడతనికి కనబడుతున్నాయి నీళ్ళలో నుంచి పైకి వచ్చిన చాలా చెట్లు. తలంటిపోసుకున్నట్లు పచ్చగా కనబడుతున్నాయి అవి.

తనూ, కరుణ చిక్కుకుని వున్న చెట్టే అక్కడ వున్న అన్నిటిలోనూ అతి పెద్దది.

'నీరు ఇంకిపోతోంది. ఇంక మనకు భయంలేదు" అన్నాడు హరీన్ తన మామూలు ధోరణిలోకి వచ్చేస్తూ.

సందిగ్ధంగా చూసి తల ఉపింది కరుణ. తర్వాత దిగులుగా అంది - "ఇంత లోతు వున్న లోయలో పడ్డాం మానవమాత్రువులెవరూ వుండే ప్రదేశంలా లేదు ఇది. చీమలు దూరని చిట్టడివి, కాకులు దూరని కారడవిలా వుంది ఇది. ఇక్కడనుంచి ఎలా బయటపడతాం మనం? ఎలా?

"నన్నడగండి చెబుతాను" అన్నాడు హరీన్ తేలిగ్గా. "ఇంతకంటె భయంకరమైన అనుభవాలు ఎన్నో ఎదుర్కొన్నాను నేను. తలకోన అడవులలో, శ్రీకాకుళం అరణ్యాలలో...ఒకటా.....రెండా......." అని ఆగి, ఏదో గుర్తువచ్చినట్లు అన్నాడు.

"తలకోన అడవుల్లో జరిగిన ఆ అనుభవం మాత్రం నా జన్మలో మర్చిపోలేను."

"ఏమిటీ?" అన్నట్లు చూసింది కరుణ.

"తలకోన అడవులు తెలుసుకదా! తిరుపతి కొండలకి వెనకగా, దాదాపు ఒక అరవై మైళ్ళ దూరంలో వుంటాయి. అడవిదారిలో నెరబైలు అనే ఊరువుంది.

అదే ఇంక ఆ ప్రాంతంలో వున్న చివరి ఊరు. ఆ తర్వాత ఇంక ఉళ్లు లేవు. అంతా చిక్కటి అడవి. ఆ అడవిలో మధ్య మధ్య ఆటవికుల గూడేలు మాత్రం వున్నాయి.

"ఊరంటే ఆ వేరభైలు కూడా పెద్ద ఉరేమీ కాదు. అతి చిన్న ఊరు అది. ఆ ఉళ్ళో ఒకే ఒక వీధి వుంది. ఆ వీధి ఒక్కటీ నడిస్తే చాలు. ఊరంతా చూసేసినట్లన్నమాట. ఒక పిక్చరు షూటింగ్ కోసం వెళ్ళి అక్కడ మకాం పెట్టాం మేము."

"అప్పుడేమయింది" అంది కరుణ ఆసక్తిగా.

మాడ్యులేషన్ కొద్దిగా మార్చి , ఉత్కంట కలిగిస్తూ చెప్పడం మొదలెట్టాడు హరీన్.

"అక్కడ బిక్కుబిక్కుమంటూ వున్నాం మేము. అంతలో మసక చీకటి పడింది. కీచురాళ్ళ రొద ఎక్కువయింది. ఎక్కడో దూరంగా చిరత అరుపు భయంకరంగా వినబడింది.
"ఆ వెంటనే ఒక మనిషి కేక! అది కూడా మాకు అతి సమీపంలోనే. వెంటనే వికృతంగా డప్పు శబ్దం!"

"అప్పుడేమయింది?" అంది కరుణ.

"ఒక మనిషిడప్పు వాయిస్తూ ఎగిరి ఆ వీధిలోకి దూకాడు. అతనే ఆ కేకలు పెడుతోంది. మాకు గుండాగిపోయినట్లయింది. ఏం చెబుతున్నాడు అతను? ఇవాళ ఇక్కడ ఏమన్నా జాతర వుందనా? నరబలి ఏదన్నా వుందనా?

"హటాత్తుగా మాకు ఆ ఉరి పేరు గుర్తొచ్చింది నెరబైలు. "నేరభైలు" అనే పేరు నరబలి అనే పదానికి ఎంత దగ్గరగా వుంది.

"అది తలుచుకోగానే మా అందరికి గుండెలు జారిపోయాయి. చెవులు రిక్కించి విన్నాం."

"అప్పుడేం జరిగింది?" అంది కరుణ.

"అతడు పెద్దగా అరచి చాటింపు వేస్తున్నాడు వినండహో, ఇయాల రాత్తిరేళకి" అని చెప్పడం ఆపాడు హరీన్.

"రాత్తిరేళకి?" అంది కరుణ సస్పెన్సు భరించలేక.

"ఇయేల రాత్తిరేళకి ఈడియో మహాల్లో బూస్లి గారి ఎంటాడిన డేగని చూపిత్తారహో!" అని మళ్ళీ డప్పు కొట్టి వెళ్ళిపోయాడతను."

"ఎంటాడిన డేగా?" అంది కరుణ అర్ధం కాక.

నవ్వాడు హరీన్. "ఆ నెరబైలు లో ఒక వీడియో పార్లర్ వుంది కరుణా! అందులో ఆ రాత్రికి బ్రూస్ లీ పిక్చరు "ఎంటర్ ది డ్రాగన్" వేస్తున్నారని చాటింపు, మైండ్ యూ! నేరభైలులో!"


    "వెరీ ఫన్నీ" అంది కరుణ ఆశ్చర్యంగా.


    "ఉదయం తొమ్మిదింటికీ తిరుపతిలో కొత్త పిక్చరు రిలిజయితే, పన్నెండింటికీ ఆ వీడియో కేసెట్ నేరభైలు కి వచ్చేసేదిట. ఇప్పుడు లేదులే కానీ మొన్నమొన్నటిదాకా అలాగే ఉండేదట."

నవ్వేసింది కరుణ. హరీన్ కూడా నవ్వాడు.

"ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే , మీరు అనవసరంగా భయపడుతున్నారు కరుణా - కన్ను మిన్నూ కానని కారడవిలో నుంచి ఎలా బయటపడతామా అని. కానీ మీరు భయపడనక్కర్లేదు , మనం ఇంకాసేపట్లో ఈ చెట్టు దిగుతాం. ఒకటిరెండు కిలోమీటర్లు నడిచీ నడవకముందే మనకు ఏదో ఒక కాలిబాట కనబడుతుంది. దాన్ని అనుసరించి పొతే ఏదో ఒక రోడ్డు తగలకపోదు. అక్కడో అరగంట వెయిట్ చేస్తే చాలు - లారీనో, బస్సో లేకపోతే ఏ ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్ వాళ్ళ వ్యానో . పి. డబ్ల్యుడి వాళ్ళ జీపో తప్పకుండా దొరుకుతుంది. మనం సురక్షితంగా ఇంటికి చేరతాం. ఈలోగా య్\ట్రాన్సిస్టరు చెవి దగ్గర పెట్టుకుని పాటలు వింటున్న ఆటవికులు మనకి కనబడినా ఆశ్చర్యం లేదు" అని మధ్యలో ఆగిపోయాడు హరీన్.

"ఏమిటీ? ఏమయింది?" అంది కరుణ అనుమానంగా.

"మాట్లాడొద్దు" అన్నట్లు సైగ చేశాడు హరీన్.

పెదిమలు కదల్చడం మానేసి అతని చూపులను అనుసరించి తను కూడా దిక్కులు సారించింది కరుణ. ముందుగా అమెకేమీ కనబడలేదు.

కళ్ళు చిట్లించి చూసింది కరుణ.

అప్పుడు కనపడింది ఆమెకు.

వాళ్ళకు మరి రెండు కొమ్మల పైన పడుకుని వుంది ఒక చిరుతపులి.

సింహాలు, పెద్దపులులలాగా కాకుండా చిరుతలు చెట్లక్కేయ్యగలవు.

అక్కడున్న చెట్లన్నిటిలో అదే పెద్దది. మహా వృక్షం అది.

వరద నీరు రావడంతో ఆ చిరుత ప్రాణాలు దక్కించుకోవడానికి ఆ చెట్టు ఎక్కి వుంటుంది.

"భయపడకు" అన్నాడు హరీన్ కరుణతో మృదువుగా. కాసేపటి తర్వాత అది దాని దారిన అది వెళ్ళిపోతుంది. ఒకవేళ అలాకాకుండా మనమీదకి వస్తే.........."అని ఆగి నడుముకి వున్న పటకాలాంటి బెల్టులో దోపి వుంచిన చిన్న బాకు బయటికి తీశాడు. అది అతని షూటింగ్ కాస్ట్యుమ్స్ తాలుకుది.

చిరుతపులి తలతిప్పి , చుట్టుతా పరికించి, పెద్దగా నోరు తెరచి ఆవులించింది. తర్వాత లేచి నిలబడి వళ్ళు విరుచుకుని కిందికి చూసింది.

చేతిలో బాకుని గట్టిగా పట్టుకుని, ఒళ్ళు వుక్కులా చేసి సిద్దంగా నిలబడ్డాడు హరీన్.

చెంగున కింది కొమ్మ మీదికి దూకింది. చిరుత అక్కడ ఆగింది మళ్ళీ.

అప్పుడు దాని చూపులు హరీన్ మీదా, కరుణ మీదా పడ్డాయి.

  అదే క్షణంలో ఆకాశంలోని సూర్యుడు మబ్బుల చాటునుంచి బయటికి వచ్చాడు.

సూర్యకిరణాలు హరీన్ చేతిలో వున్న బాకుమీద పడి చమక్ మని మెరిశాయి. చిరుతపులి కళ్ళలో సూదుల్లా గుచ్చుకున్నాయి. -ప్రతిఫలించిన ఆ కిరణాలు.

వెంటనే అలర్టుగా అయిపొయింది పులి దూకడానికి సిద్దంగా శరీరాన్ని సన్నద్ధం చేసింది.

అప్పుడు -

"హరీన్ ...అదేమిటి? మీ వెనకాల" అంది కరుణ ఆదుర్దాగా.

చటుక్కున వెనక్కి తిరిగి చూశాడు హరీన్.

సరిగ్గా అదేక్షణంలో చిరుతపులి పైనుంచి అతనిమీదికి దూకింది.
                                                 7

విశ్వనాధం బంగళాలో హాల్లోనే మేడమీదికి మెట్లున్నాయి. వాటిమీద ఎర్రటి కార్పెట్ పరిచివుంది. మెట్ల పై భాగాన దీపం పట్టుకు నిలబడిన ఒక పాలరాతి నగ్నసుందరి విగ్రహం వుంది. ఎక్కడ నుంచి వస్తోందో తెలియని పరిమళం ఇల్లంతా అలముకొని వుంది.

మేడమీద పెద్ద కారిడార్ వుంది. దానికి రెండువైపులా అనేక గదులు, వాటిలో వుంటోంది వరలక్షి. ఆమె విశ్వనాధం భార్య. బాగా నీరసించిపోయి వుంది. మనిషి కళ్ళు లోతుకి పోయి వున్నాయి.

ఆ బంగళాలో తక్కిన రూములకి కాంట్రాస్టుగా వుంది ఆ రూము. అందులో ఎక్కువ ఫర్నిచర్ లేదు. ఒక మంచం ఒక దుప్పటి - అంతే! రూం లోనే అటాచ్ డ్ బాత్ వుంది. రూముకి వెనకాతల వున్న  తలుపు తెరిస్తే అది చిన్న బాల్కనిలోకి దారితీస్తుంది.

ఆ కొద్ది చదరపు గజాలే వరలక్ష్మి లోకం. అది దాటి బయటకు ఎప్పుడూ అడుగు పెట్టదు ఆమె.

తలుపు తట్టిన శబ్దం అయింది. మంచం మీద కూర్చుని మోకాళ్ళు మీద తల ఆనించి ఆలోచిస్తూ వున్న వరలక్ష్మి లేచి నిదానంగా తలుపు తెరిచింది.

యూనిఫాం వేసుకుని వున్న బట్లరు లోపలికి వచ్చాడు. అతని చేతిలో ట్రే వుంది. అందులో భోజనం.

 Previous Page Next Page