"పోనీ ఫ్రీగా పనిచేసే పనిమనిషి ఏర్పాటు చేయమంటారా?"
"ఫ్రీగానా! ఎవరొస్తారండీ బాబూ" నవ్వాడు అభినవ్.
"నన్ను చెయ్యమంటే చేస్తాను" అంది కావ్య.
"మీరా? పనిమనిషిగానా? బాగానే వుంది. జోకులాపేసి మీ పని మీరు చూసుకోండి."
ఆమె మాటలు ఏ మాత్రం అతనికి అర్థం కాలేదు. అది కూడా అర్థం కానందుకు చిన్నగా నుదురు కొట్టుకుంది కావ్య. "నేను వెళుతున్నాను. నిజం చెప్పండి..... పెయింటింగ్ మీకు నచ్చిందా?" చాదస్తంగా అడిగాడు అభినవ్.
"మీరు చేసే చాలా పనులు నాకు నచ్చుతాయి. ఎందుకంటే....." మిగతా సగభాగం పూర్తి చేయలేదు కావ్య.
"నచ్చడం-నచ్చకపోవడం, ఇష్టం-అయిష్టం, ప్రేమ-ద్వేషం, పగ, కక్ష..... ఇవన్నీ మామూలు మానవ స్వభావనికి అద్దం పడతాయి. మనుషులు వీటికి అతీతంగా ఆలోచించగలగాలి. అతీతంగా వ్యవహరించగలగాలి. ఏ కళయినా బోధించేది అదే" అలవోకగా అనేసి ఆ రూంలోంచి బయటికొచ్చాడతను. పెయింటింగ్ మీకు నచ్చిందా? అని అడిగినా అభినవ్ కి అతీతంగా వ్యవహరించగలగాలి అని చెప్పిన అభినవ్ కి మధ్య ఎంతో వ్యత్యాసం. ఆ వ్యత్యాసాన్ని స్పష్టంగా గుర్తించలేకపోయింది కావ్య. "సీ యూ గురూజీ!" అని అనేసి- ఈయన ఆర్టిస్టో, ఫిలాసఫరో నాకేం అర్థం కావడం లేదు అని మనసులో అనుకుంటూ తన ఛాంబర్ లోకి వెళ్ళి పోయింది కావ్య.
* * *
సాయంత్రం అయిదు గంటలకు ఆటోలో వచ్చింది కావ్య. అప్పటికే సూటుకేస్ తో రెడీగా వున్నాడు అభినవ్.
ఆటోలో ఆమె పక్కన కూర్చున్నాడు అతను. ఆటో ఎయిర్ పోర్ట్ కేసి పోసాగింది.
"ఏమైనా మాట్లాడండి గురూజీ! మౌనంగా ఋషుల్లా వుండేవాళ్ళంతా క్రైమ్స్ గురించి ఆలోచిస్తారని ఎక్కడో చదివాను."
కావ్య కనురెప్పల వైపు చూస్తూ చప్పుడు చెయ్యకుండా నవ్వాడు అతను.
అదే సమయంలో రాజ్ భవన్ రోడ్డుచివర, బేగంపేట వెళ్ళే మలుపు తిరుగుతోంది ఆటో
రోడ్డుపక్కన నడుస్తున్న వ్యక్తుల్ని చూస్తున్న అతను భుజానికి తగిలించుకున్న హేండ్ బ్యాగ్ తో ముందుకెళ్ళిపోతున్న ఓ అమ్మాయిని చూసి వెంటనే గుర్తుపట్టి ఎక్సైట్ మెంటుతో పెనుకేక వేశాడు.
ఆటో డ్రైవర్ ఏం కొంపమునిగిందోనని సడన్ బ్రేక్ వేశాడు.
కావ్య బిత్తరపోయి అతని ముఖంలోకి చూసింది.
"వాట్ హేపెండ్ గురూజీ?"
పూర్తిగా మెడను బయట పెట్టేసి అతను "అదే.....అదే.....ఆ అమ్మాయి....." ఆ అమ్మాయి పేరును గుర్తుకు తెచ్చుకుంటూ కంగారుగా అన్నాడతను.
"ఎవరండీ బాబూ?" కావ్య ఆశ్చర్యపోతూ అడిగింది.
"ఎవరూ?" వెంటనే చచ్చినా పేరు గుర్తుకురాలేదతనికి.
"ఆటో పోనియ్" అని ఆటో డ్రైవర్ తో చెప్పి "గర్ల్ ఫ్రెండా గురూజీ?" అని కన్నుగొట్టి అడిగిందామె.
"కాదు..... కాదు..... ట్రైన్ ..... మోడల్..... ఆ అమ్మాయి" నిద్రలో కలవారిస్తున్న వాడిలా అన్నాడతను.
అతను చెబుతున్నాది వినిపించుకోలేదు కావ్య.
"గురూజీ! పాండిచ్చేరి నుంచి వచ్చినప్పటి నుంచీ గమనిస్తున్నాను. మీ ముఖం ఫ్లోరో సెంట్ లైట్లా వెలిగిపోతోంది. నాకప్పుడే అనుమానం వచ్చిందనుకోండి. ఇప్పుడు కం ఫర్మ్ అయింది. చెప్పండి మీ గర్ట్ ఫ్రెండ్ ఎవరో.... ఎడ్రస్ చెప్తే మాట్లాడతాను" ఏదో రకంగా అతని చేత ఏదో విషయం మాట్లాడించాలని ఆమె ఆశ.
"అలాంటిదేం లేదు."
"అలాంటిదేదయినా వుంటే మీరు నాకే ఫస్టు ఫస్టున చెప్పాలి. ఎందుకో తెలుసా?" కోపాన్ని నటిస్తూ అందామె.
"ఫిల్టర్ చేస్తారా?"
"కాదు......" ఆ తర్వాత ఓ మాట విసురుగా నోట్లోంచి రాబోయి ఆగిపోయింది.
"ఇప్పుడు కాదు ఎప్పుడైనా చెప్తాను" మాట మార్చేసిందామె.
ఆకస్మాత్తుగా రెండో వైపుకి తల తిప్పేసిందామె.
నదికి ఇవతల ఒడ్డున నిల్చున్న వ్యక్తి అవతల ఒడ్డున నిల్చున్న వ్యక్తిని చూసినట్టుగా చూశాడామె వైపు.
అదే సమయంలో కావ్య భుజాల మీదున్న చున్నీ గాలికెగిరి అతని చెంపలకు తాకింది మృదువుగా. అయినా అతని ఆలోచనలన్నీ ఆ అమ్మాయి మీదే వున్నాయి.
* * *
న్యూఢిల్లీ.....
కరోల్ బాగ్ కి వెనుకభాగంలో ఓ పోష్ ఏరియాలో వున్న ఓ పింక్ కలర్ బిల్డింగ్ ...... దాదాపు రెండెకరాల విస్తీర్ణంలో వున్న ఆ బిల్డింగ్ ని ఎవరయినా సడన్ గా చూస్తే మహారాజుల ప్యాలెస్ అనుకుని భ్రమపడతారు.
విశాలమైన గేటు - ఆ గేట్లోంచి లోనకు వెళితే అందమైన గార్డెన్, పోర్టికో. పోర్టికో ముందు ఇటలీ నుంచి తెప్పించి అమర్చిన పాలరాతి శిల్పం.
నిశ్శబ్దంగా యూనిఫారంలో పనిచేసుకుపోయే సిబ్బంది.
మెయిన్ బిల్డింగ్ వెనుక ఇంకో బిల్డింగ్!
ఆ బిల్డింగు పక్కన స్విమ్మింగ్ పూల్.
ఆ బిల్డింగు వైపు, ఆ స్విమ్మింగ్ పూల్ వైపు ఎవరూ వెళ్లరు. దానిక్కారణం ఆ బిల్డింగు అధిపతి అయినాయి గ్రేట్ ఇండస్ట్రియలిస్టు అమరదేవ్ ఏకైక కుమార్తె చీనాంబర నివాసం ఆ బిల్డింగు.
చీనాంబర.....
దాదాపు ఐదడుగుల తొమ్మిదంగుళాలు పోడవుండే చీనాంబర అరేబియా గుర్రంళా పొగరుగా, అందంగా వుంటుంది.
ఆమె అమెరికాలో ఎమ్.బి.ఏ పూర్తిచేసి ఇండియా వచ్చి మూడు నెలలే అయింది.
"అంబరా! ఇప్పుడు నువ్వేం చేస్తావో చెప్పు. మన ఎలక్ట్రానిక్స్ కంపెనీ చూసుకుంతావా? మన గ్రూప్ ఆఫ్ హొటల్స్ ని చూసుకుంటావా? లేదా నువ్వే స్వయంగా బిజినెస్ ను స్టార్ట్ చేస్తావా?" వచ్చిన మూడో రోజున ఆమె డాడీ అమరదేవ్ ప్రేమగా అడిగాడు కూతురు చీనాంబరను.
"నేను ఓన్ బిజినెస్ స్టార్ట్ చేస్తాను. ఎందుకో తెలుసా?"
"ఎందుకు?" ఆశ్చర్యంగా అడిగాడు అమరదేవ్.