Previous Page Next Page 
ఈ దేశంలో ఒక భాగమిది పేజి 7

   

    'ప్రభా! ప్రభా!" అని పిలిచాడు.
   
    ప్రభావతి వంటింట్లో ఏదో తీవ్రమయిన  పనిలో నిమగ్నమైవుంది.
   
    మరో ఆరుసార్లు పిలిస్తేనే గానీ అవటానికి ప్రక్కగదే అయినా ఆమెకు వినిపించలేదు.
   
    చివరకు శారదమ్మగారే 'అబ్బాయి పిలుస్తుంటే మా అందరికీ వినబడుతుంది కానీ నీకు వినబడటంలేదూ?' అనేసరికి 'ఆయనకేం పని లేదత్తయ్యగారూ, ఇంట్లో ఉన్నంతసేపూ అలా కేకలు వేస్తూనే వుంటారు' అని చేస్తున్న పనిని ఆపి భర్తవున్న గదిలోకి వెళ్ళి 'ఏమిటి, కొంపలు మునిగి పోయేటట్లు అలా కేకలు వేస్తున్నారు? డ్రాయరు, బనియనుకోసమేగా? అవి ఇందాకతీసి తలుపుమీదే పెట్టాను. అదిగో ఎదురుగా వున్నాయి కనబడటం లేదూ?' అంది.
   
    కుమార్ 'రోజూ నీకు తీసిపెట్టే అలవాటు లేదుకదా? అందుకని.....' అన్నాడు.
   
    "చాల్లెండి, ఎంతచేసినా తృప్తిలేదు. ఒక్కరోజు మరిచిపోతే ఎప్పుడూ ఇంతేనన్నట్లుగా సాధిస్తారు. త్వరగా తెమలండి అవతల మీ నాన్నగారు చిందులు త్రొక్కుతున్నారు."
   
    "మీ నాన్నగారు! మీ అమ్మగారు!" అని  ఆమె అంటూంటే అతనికి ఒళ్ళు మండిపోతుంది. ఆమెకెప్పుడో అభిమానం, అనురాగం ఉట్టిపడినప్పుడు 'అత్తయ్యగారు, మామయ్యగారు' అంటూ మాట్లాడుతుంది.
   
    "ఈ బనీను చిల్లులు పడింది" అన్నాడు దాన్ని వెడల్పుగా చేసి ఆమెకు చూపుతూ.
   
    "చిల్లులుపడినా, తూట్లుపడినా ఇవాల్టికి అదే వేసుకోండి. ఏం చేస్తాం? చాకలాడు బోలెడు బట్టలు పారేస్తున్నాడు. 'నేనేమన్నా అరిస్తే నానోరే వినబడుతుందిగానీ నిజమెవరు గ్రహిస్తారు? బట్టలన్నీ మీరే పారేసి వాడిమీద రుద్దుతున్నారు' అని మీ అమ్మగారు చాకలి వెధవనే వెనకేసుకొస్తున్నారు. ఎన్ని బట్టలు పోయాయో! మీ బనీన్లు పోయాయి. మొన్న నాది వెంకటగిరి చీరె పోయింది. తలుచుకుంటేనే గుండె పగిలిపోతున్నది."
   
    అతను గబగబ డ్రెస్ చేసుకోవటం పూర్తిచేసి "సరిసరే, నాకు టిఫిన్ పెట్టు" అన్నాడు. అల అవదిలేస్తే ఆమె ధోరణి ఎంతవరకూ పొతుందోనని.
   
    డైనింగ్ టేబిల్ దగ్గరకొచ్చి కూర్చున్నాడు.
   
    ప్రభావతి ఉప్మాపళ్ళెం తీసుకొచ్చి అతనిముందు వుంచింది.
   
    బ్రేక్ ఫాస్ట్ అనగానే అతని కళ్ళముందు రకరకాల ఆకృతులు మెదుల్తున్నాయి. ఒకగాజు బేసిన్ నిండా వేడివేడి ఇడ్లీలు, అందులోకి మంచి కొబ్బరిపచ్చడి, కారప్పొడి, ఘుమఘుమలాడే సాంబారు లేకపోతే ఎత్తుగా పొంగివున్న పూరీలు, బంగాళాదుంపల కూరతో దొంతర్లుగా ప్లేటులో పెట్టివుంటే కావలసినన్ని తన పళ్ళెంలో వేసుకుని తృప్తిగా తినటం లేకపోతే ప్లేటునిండా పరచివున్న పల్చటి ఆమ్లెట్లు, అందులోకి సాల్టు పెప్పరు ప్రక్కనే వెన్నరాసి వున్న బ్రెడ్ స్లయిసెస్.....ఎందుకు ఇవన్నీ తను అనుభవించలేకపోతున్నాడు? తనకు అర్హతలేదా? ఆర్ధికంగా స్తోమతలేదా? తను సంపాదించుకుంటున్నాడు. అయినా ఇష్టమైనది తినడానికి నోచుకోలేకపోతున్నాడు పోనీ డబ్బేమయినా మిగల్చగలుగుతున్నారా అంటే అది మంచినీళ్ళలా ఖర్చవుతూనే వుంది.
   
    అసలతానికి ఉప్మా అంటే ఇష్టంలేదు ఆ విషయం ఇంట్లో భార్యకూ తల్లికీ, మరధలికీ అందరికీ తెలుసు.
   
    అన్నీ తినటం నేర్చుకోవాలి అని తల్లి వాదిస్తుంది.
   
    తినటానికి ఇష్టమేమిటన్నట్లుగా మిగతావాళ్ళు ప్రవర్తిస్తారు.
   
    బలవంతంగా ఉప్మాని నోట్లోకి పోనిచ్చి మింగుతున్నాడు. తండ్రి మధ్య మధ్య లోపలికి వచ్చి కొడుకు ఫలహారం ఇంకా అయిందా లేదా అని చూస్తూ ఫర్వాలేదు, నెమ్మదిగా కానియ్యి' అని అక్కడ్నుంచి వెళ్ళిపోతున్నాడు.
   
    కుమార్ యనత్రికంగా టిఫిన్ తినడం పూర్తయింది.
   
    చెయ్యి తుడుచుకోవటం కోసం నేప్ కిన్ వెదుక్కుని, అది కనబడకపోయే సరికి కాసేపు వెతుక్కుని, చివరకు జేబులోంచి కర్చీఫ్ తీసి తుడుచుకుని ముందుగదిలోకి వచ్చాడు.
   
    ఒక బూటు కనబడింది. రెండో బూటు పిల్లలెవరో బీరువాక్రిందికి తోసేసి నట్లున్నారు ఒంగి ఎక్కడుందో చూడటం సాధ్యం కావటంలేదు.
   
    తండ్రి మాటిమాటికీ వాచీ చూసుకుంటూ గుమ్మందగ్గర నిలబడ్డాడు.
   
    పనిపిల్లని కేకేసి బీరువాక్రింద బూటువుందేమో చూడమన్నాడు.
   
    ఇంతలో పిల్లలకి ప్రయివేటు చెప్పడానికి ప్రయివేటు మాష్టారొచ్చి కేకేశాడు.
   
    కుమార్ పెద్దకొడుకు మురళి లోపల్నుంచి పరిగెత్తుకువచ్చి 'ఇందాకట్నుంచీ ఊరుకుని, ఇప్పుడొచ్చారేమిటి మాష్టారూ! ఇంకా ఇంతవరకూ స్నానం చేయలేదు, తర్వాత అన్నం తినాలి, బడికి వెళ్ళాలి.......
   
    "ఏమిటి బాబూ? ప్రొద్దుటే వస్తే ఇప్పుడే నిద్రలేచాం. అప్పుడే వచ్చారేం? అంటారు. ఇప్పుడొస్తే స్కూలుకు టైమయిందంటారు. సాయంత్రం వస్తే ఆటలాడుకోకుండా ఇప్పుడేమిటంటారు. చీకటిపడ్డాక వస్తే నిద్రపోతూ వుంటారు. మీకెలా బాబూ ప్రయివేటు చెప్పడం?' అని ముసలి ప్రయివేటు మాష్టారు గోలపెట్టారు.
   
    లోపల్నుంచి ప్రభావతి దూసుకువచ్చింది.
   
    "ఏమిటంటున్నాడు వెధవ? చదువుకోనంటున్నాడా? ఇందాకట్నుంచీ స్నానాలుచేసి తెమలండిరా అని నెత్తీనోరూ బాదుకుంటే విన్నారా? నోరు మూసుకుని చదువుకోండి వెధవల్లారా!" అన్నది.
   
    మురళి డెస్క్ తెరచి పుస్తకాలు బయటకు తీస్తున్నాడు.
   
    పాప తన తెలుగుపుస్తకం ఎక్కడుందోనని వంటింటినుంచి బాత్ రూమ్ దాకా అన్వేషణ మొదలుపెట్టింది.
   
    మల్లిబాబు తన పెన్సిల్ చెక్కుకోవటానికి ఏ మూలనుంచో బ్లేడు తీసుకునివచ్చి, చెక్కుకోబోతూ వేలు తెగ్గొట్టుకున్నాడు.
   
    హరి మొదటిపిల్ల నాలుగేళ్ళది. ఈ మధ్యనే చదువు మొదలుపెట్టింది. తానీవేళ చదువుకోనని వంటింట్లో తల్లిదగ్గర మారాం చేస్తున్నది.
   
    పనిపిల్ల కుమార్ కి బూటు వెతికి ఇచ్చింది.
   
    తండ్రీకొడుకులిద్దరూ గుమ్మందాటి బయటకు వచ్చి కారులో కూర్చున్నారు.
   
    ముగ్గురు పిల్లల తండ్రి. అయిదారేళ్ళుగా ప్రాక్టీసు చేస్తున్న డాక్టర్ కుమార్ అరవైఏళ్ల రంగారావుగారి ప్రక్కన చిన్నపిల్లాడిలా ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీలవుతున్నవాడిలా కూర్చున్నాడు.
   
    "డిసిప్లిన్ లేదు. మొదట్నుంచీ అలా పెంచారు. మొదట గారాబం చేసినప్పుడు ఉండాలి. ఇప్పుడు తిట్టుకుని, కొట్టుకుని ఏం లాభం?" అన్నాడు రంగారావుగారు.
   
    తానుగానీ, ప్రభావతిగానీ పిల్లల్ని గారాబం చేసిందెప్పుడో గుర్తురాలేదు కుమార్ కి. తనెప్పుడూ ముభావంగా వుండటం, ప్రభావతి చావగొట్టటం మాత్రమే తనకు తెలుసు.
   
    కారు కదిలింది.
   
                                3
   
    కారులో తండ్రిప్రక్కన స్వేచ్చగా మాట్లాడలేని స్థితిలో కూర్చోవటం కుమార్ కి చాలా ఇబ్బందిగా వుంది. ఎన్నోరోజులు, ఎన్నోసార్లు తండ్రితో కూర్చుని ప్రయాణం చేసినా అతనికి సాంప్రదాయం అలవాటుకాలేదు. మనసు కిష్టంలేనివి చెయ్యటానికి మనస్సు నిరాకరించేవి ఎంతకాలం అదేపనిగా ఆచరిస్తూ వచ్చినా వంటికి అలవాటు పడవు.
   
    ఈ కారు తండ్రిది. తనది కాదు. ఈ ఆలోచన అతన్లో ఎప్పుడూ అశాంతిని కలుగజేస్తూ వుంటుంది. ఒక వయసువచ్చాక 'ఇది మనది' అనుకోవటానికి అవకాశమూలేదు, ఆస్కారమూ లేదు. 'ఇది నీది, ఇది నాది, అనుకోక తప్పదు.
   
    ఈ పట్టుదల లేనివాళ్ళు ఈ భూమ్మీద, అంటే ఈ దేశంలోని భూమిమీద చాలామంది వున్నారు. అది వేరే విషయం. దురదృష్టవశాత్తూ చాలామంది ఎంతోమందికంటే చాలా ఎక్కువ వున్నారు.
   
    డ్రైవరు కొత్తగా వచ్చాడు. మిగతావారి సంగతి తెలియదుగానీ తమదగ్గర ఏ డ్రైవరు కూడా అయిదారు నెలలకంటే ఎక్కువగా పనిచేయడు. మొదట పనిలో చేరేటప్పుడు అమాయకంగా. దీనంగా మొహంపెట్టుకువస్తారు. రెండు మూడువారాలు కారుపనితప్ప ప్రపంచంతో నిమిత్తం లేనట్లు కారు తుడుచుకుంటూనో, చక్రాలు కడుగుతూనో, బానెట్ ఎత్తి మరలూ అదీ సరిచేస్తూనో కనిపిస్తూ వుంటారు. రావల్సినవేళకంటే ఓ అరగంట ముందుగానే వస్తుంటారు పనిలోకి. తర్వాత తర్వాత వాళ్ళ నిజస్వరూపం బయటపడుతూ వుంటుంది. అరగంట ముందు రావటమల్లా పోయి ముప్పావుగంట ఆలస్యంగా రావటం, కారు విషయం పట్టించుకోవటం మానేసి బీడీదమ్ము లాగుతూ ప్రక్కనున్న ఏ బార్బరుషాపువాడితోనో లేక ఏ కిళ్ళీ కొట్టు వాడితోనో హస్క్ కొడుతూ కూర్చోవటం, చెప్పకుండా గైర్హాజరు కావటం...ఈ అలవాటు రానురానూ ఎక్కువయి చివరకు చెప్పకుండానే ఏ లారీమీదో, బస్సుమీదో ఛాన్సు వచ్చిందని పత్తాలేకుండా పోవటం పరిపాటయిపోయింది. బహుశా ఈ డ్రైవర్లకు నిశ్చలంగా ఒకరిదగ్గర పనిచేస్తూ ఊళ్ళోనే అటునుంచి ఇటూ, ఇటునుంచి అటూ తిరుగుతూ ఉండటంకంటే లైన్ మీదకి వెళ్ళి వేళపట్టున తిండీ తిప్పలూ, నిద్రా లేకుండా తిరుగుతూ వుండటంలో మజా వున్నట్టుంది.

 Previous Page Next Page