Previous Page Next Page 
అమ్మాయీ ఓ అమ్మాయీ.. పేజి 5

 

    భవానీశంకర్ భయంగా రూఫ్ వంక చూశాడు. సరిగ్గా అప్పుడే ఓ సిమెంటు పెళ్ళ ఊడి పెద్ద శబ్దంతో టేబుల్ మీద పడింది. అందరూ చెల్లాచెదురై బయటకు పరుగెత్తారు.

        
                                               *****

    ఎండ కాల్చేస్తోంది.
    మొఖం మీద నుంచి వర్షపు బిందువుల్లా జారిపడుతున్న చెమటను తుడుచుకుంటూ నడుస్తున్నాడు చిరంజీవి. ఉదయం ఎనిమిది గంటలకు మొదలుపెట్టాడు నడక. ఇప్పుడు టైము ఒంటిగంట! జీవితంలో ఇదే మొదటిసారి ఇంతదూరం నడవటం! అతని కాళ్ళు తెలిపోతున్నాట్లున్నాయ్. గొంతు దాహంతో ఎండిపోతోంది.
    ఎండ వేడికి ఉండుండి కళ్ళ వెంబడి నీళ్ళు తిరుగుతున్నాయ్!
    కళ్ళ వెంబడి నీళ్ళు తిరగడం ఎండ వేడి కెనా? చిరంజీవి అతికష్టం మీద దుఖమపుకున్నాడు. ఎందుకు తనను తనే భ్రమ పెట్టుకోవటం?
    తనున్న దారుణమయిన పరిస్థితికే కళ్ళ వెంబడి నీళ్ళు తిరుగుతున్నాయ్!
    టైము ఒంటిగంటన్నర.
    టక్కున అతనికి స్వప్న గుర్తుకొచ్చింది.
    తలుపు దగ్గరే నిలబడి తన కోసం ఎదురు చూస్తుంటుంది - ఆకలితో - తను యింటికి రాలేదన్న కోపంతో - దహించుకుపోతూ -
    అవునూ! స్వప్న కేందుకంత కోపం ఎక్కువయిపోయింది మధ్య? లేమికి కోపం సహజ గుణమా?
    బంగారు నగల దుకాణంలోకి నడిచాడు చిరంజీవి. లోపలి చల్లదనానికి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది.
    "కొంచెం మంచినీళ్ళిస్తారా?" ఓ స్టూల్ మీద కూర్చుంటూ అడిగాడు.
    కుర్రాడు మంచినీళ్ళు తెచ్చిచ్చాడు. గడగడ తాగి గ్లాస్ కౌంటర్ మీదుంచాడు. ఓ క్షణం తన వేలికున్న ఉంగరం వేపు చూచాడు.
    స్వప్న ముఖం అందంగా ఆనందంగా కనబడుతోందక్కడ.
    "ఈ ఉంగరం మా అమ్మదిట! తను చనిపోయేటప్పుడు నేను పెద్దయ్యాక నా కిమ్మని మా మామయ్యతో చెప్పిందట! అందుకని ఈ ఉంగరం అంటే ఎంతో ప్రాణం నాకు. మరి నువ్వు నా ప్రాణం కదా! అందుకే ఇది నీ వేలికి తొడుగుతున్నాను" ఆమె ఉంగరం తన వేలికి పెడుతూ అంది స్వప్న - తామిద్దరూ స్నేహితుల సమక్షంలో - రిజిస్ట్రాఫీసులో పెళ్ళి చేసుకున్నరోజున!
    అందుకే ఈ ఉంగరం ఇన్ని రోజులు తన చేతికుంది. లేకపోతే ఆరునెలల వయసు గల సంసారంలో ఏదొక రోజు దరిద్రానికి ఆహుతయిపోయేది.
    "చూడండి! నాకు అర్జంటుగా డబ్బు కావాలి! ఈ ఉంగరం తాకట్టు పెట్టుకోండి! వీలయినంత త్వరలో విడిపించుకుంటాను! నేను తీసుకుంటున్న డబ్బుకి పదింతలు వడ్డీ అయినా పర్లేదు! విడిపించుకు తీర్తాను! దయచేసి ఇది జాగ్రత్తగా ఉంచండి...."
    షాపతను డబ్బిచ్చాడు.
    చిరంజీవి బస్ స్టాప్ కొచ్చి నిలబడ్డాడు. వారం రోజుల తర్వాత ఇవాళ నడవకుండా బస్ లో ఇంటికి వెళ్తున్నాడు తను! తనను దగ్గరకు తీసి, పెంచి పెద్ద చేసిన లక్షాధికారి మామయ్య గుర్తుకొచ్చాడతనికి! 'ఓల్డ్ బాస్టర్డ్' అనుకున్నాడు కసిగా!
    బస్ దిగి , అంతదూరం నుంచీ ఇంటివేపే చూస్తూ నడుస్తున్నాడు.
    స్వప్న గుండ్రటి, అందమయిన ముఖం - విశాలమయిన కళ్ళల్లో కోపం నింపుకుని - తలుపు పక్కనే తచ్చట్లాడుతూ కనబడుతోంది. తనను చూచి చివాలున వెనక్కు తిరిగి గదిలోకి వెళ్ళిపోయింది.
    ఆమె వెనుకే లోపలికి నడిచాడతను.
    "కొంచెం ఆలస్యం అయిపొయింది డియర్! మా ఫ్రెండ్ రమణ లేడూ? వాడు కనబడి మాణింగ్ షో పిక్చరుకి లాక్కుపోయాడు! 'స్వప్న ఎదుర్చుస్తూ ఉంటుందిరా' అని ఎంత చెప్పినా వింటేనా? అన్నట్లు తమాషా చూశావా'? మన ఎకౌంట్లో డబ్బేమీ లేదని నీతో అన్నాను కదూ? తీరా ఇందాక వెళ్ళి చూస్తే నాలుగొందలు బాంక్ లో బాలెన్సుందింకా! ఎంత మతిమరుపో చూడు నాకు! నాలుగొందలు బాంకులో ఉంచుకుని - నిన్ను ఆకలితో చంపెస్తున్నాను ! త్వరగా రడీ అవ్! హోటల్ కెళ్ళి భోజనం చేద్దాం! అన్నట్లు రమణ గాడెం చెప్పాడో తెలుసా? వాడికి తెలిసిన కంపెనీలో ఓ ఉద్యోగం ఖాళీ ఉందిట! తప్పక నాకు ఇప్పిస్తానన్నాడు......బహుశా నాలుగయిదు రోజుల్లో జాయినవాల్సి ఉంటుందని అన్నాడు....."అబద్దాలు ఒకదాని మీద ఒకటి పొంగి పొరలు కొచ్చేస్తున్నాయి.
    స్వప్న నెమ్మదిగా అతని దగ్గరకొచ్చింది. అతని రెండు చేతుల్నీ తన చేతుల్లోకి తీసుకుని తన చెక్కిళ్ళ కేసి అదుముకుంది. అంతవరకూ బలంగా వేసిన ఆనకట్ట బ్రద్దలయిపోయింది. వెక్కి వెక్కి ఏడుస్తూ కన్నీళ్ళతో అతని చేతులు తడిపేయసాగింది.
    "ఏయ్ పిచ్చీ! ఇప్పుడు నేనేమన్నాననీ! నేనిచ్చిన ఉంగరం నాకు ప్రాణ ప్రదమాయినదే కావచ్చు దాంతో సెంటిమెంట్ ముడి పడి ఉండవచ్చు. అంతమాత్రాన నీకంటే దానికి ఎక్కువ విలువిస్తానా? దానికోసం నాతొ అబద్దాలు చెప్తున్నావా? మనం అందరినీ ఎదిరించి అన్ని సుఖాలు వదులుకుని పెళ్ళి చేసుకుంది, మనమధ్య ఇలా గోడలు కట్టుకోటానికా?"
    చిరంజీవి ఇంక తట్టుకోలేకపోయాడు. ఆమె గుండెల మీద తలవాల్చి చిన్నపిల్లాడిలా విలపించసాగాడు.
    అలా యెంత సేపు గడిచిందో తెలీదు. బయట అటో ఆగిన చప్పుడయింది. స్వప్న అతని నుంచి దూరంగా జరిగింది. చిరంజీవి కన్నీరు తుడుచుకుంటూ గది బయటకొచ్చాడు. శివతాండవం అటో దిగి లోపలి కొచ్చాడప్పుడే.
    ఓ క్షణం పాటు ఇల్లంతా పరీక్షగా చుశాడతను. ఆ తరువాత స్వప్న వేపూ, చిరంజీవి వేపూ చూశాడు.
    "ఆయామ్ సారీ చిరంజీవి! గంట క్రితమే మీ మావయ్య హాస్పిటల్లో పోయారు. మాసివ్ హార్ట్ ఎటాక్!"
    "ఓల్డ్ బస్టర్డ్' కసిగా అనుకున్నాడు చిరంజీవి.


                                                *****

    సాయంత్రం అయిదు గంటలకు ఇందిరాపార్క్ ఎప్పుడూ తిరిగే రంగులతో కలకలలాడుతుంటుంది. మీరు మెయిన్ గేట్స్ ద్వారా లోనికి ప్రవెశించారనుకోండి.
    "నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను రజనీ! ఒట్టు! అవసరమయితే పెళ్ళి కూడా చేసుకుంటాను" అన్న డైలాగ్ మీకు మెయిన్ గెట్ పక్క పొదలలో నుంచి వినబడుతుంది. మీరు కొంచెం ముందుకు నడుస్తే దానికి పదిగజాల దూరంలో ఉన్న మరో చెట్ల గుబుర్లో నుంచి.....
    "నేను తల్లిని కాబోతున్నానన్నమాట నిజమే రాజేష్! కానీ నా ఉద్దేశ్యం ఏమిటంటే నీకు తల్లిని కాబోతున్నామా అని! నేనూ మీ ఫాదరూ పెళ్ళి చేసుకోవాలని నిన్నే డిసైడ్ చేసుకున్నాం" అంటూ మరో అందమయిన గొంతు వినబడుతుంది. మీరు అది కూడా పట్టించుకోకుండా ఇంకో యాభయ్ గజాల దూరం నడిచారానుకొండి! అక్కడ క్రోటన్స్ మొక్కల మధ్య మరో రసవత్తరమయిన సంభాషణ వినబడుతుంది.
    "చూడు శ్రీదేవి ! మనిద్దరం రేపే ఎవరికీ తెలీకుండా మైసూరు వెళ్ళిపోదాం! అక్కడ హాయిగా హోటల్లో వారం రోజులు కలసి గడుపుదాం! ఆ వారం రోజుల తరువాత మనం అలాగే జీవితాంతం హాయిగా కలిసి బ్రతగ్గలమన్న నమ్మకం కలుగుతే పెళ్ళి చేసుకొందాం! అలా కాకుండా మనిద్దరికీ సరిపడదని మనం పొరపాటు పడ్డామనీ అనుకుంటే ఎవరిదారిన వాళ్ళు వెళ్ళి పోవచ్చు! ఎలా వుంది ప్లాన్?"
    "బాగానే ఉంది కానీ .... ఆ తరువాత ఆ 'పొరపాటుని ' ఎవరు పెంచుకుంటారు?"
    మీరు వాళ్ళ గొడవ కూడా వదిలేసి ఇంకొంచెం లోపలకు నడుస్తే అక్కడ పచ్చగా  ఏపుగా , అందంగా పెరిగిన పచ్చిక కనబడుతుంది. 'ఇక్కడ చాలా బావుందే ' అని మీరలా కూర్చున్నారో లేదో మీ కుడి వేపునున్న చెట్ల మధ్య నుంచీ ఓ అమ్మాయ్ "నాతొ మాట్లాడవద్దు!" అని కోపంగా అనటం వినిపిస్తుంది. దాని వెనుకే "ఆయామ్ సారీ ! ఆరోజు చాలా పిరికిగా ప్రవర్తించాను! ఎక్స్ క్యూజ్ మీ! అన్న మగగొంతు పశ్చాత్తాపంతో దహించుకుపోతూ వినబడుతుంది.
    ఆ గొంతు మరెవరిదో కాదు! వర్ధమాన రచయిత దీప్ చంద్ ది! అతనిని కోపంతో చివాట్లెస్తున్న అందమైన అమ్మాయి పేరు అమ్మాయి. అతను ఆమె వంకే దీనంగా చూస్తున్నాడు.
    'అయినా సరే! నాతొ మాట్లాడవద్దు!' అంది అమ్మాయి ఇంకా కోపంగా.
    'అమ్మాయి! ప్లీజ్! నేను చెప్పేది అర్ధం చేసుకో! అసలు ఆ రోజు జరిగిందేమిటంటే ...." అంటూ జరిగినదంతా చెప్పాలని ఉత్సాహ పడ్డాడతను.
    కానీ అమ్మాయి వినిపించుకోలేదు. 'జరిగిన కద' అంటే ఆమెకు బొత్తిగా ఇష్టం లేదు. వారపత్రికల్లోనూ, మాసపత్రికల్లోనూ, సీరియల్ నవలల కింద అంతవరకూ జరిగిన కధను క్లుప్తంగా వివరించే 'జరిగిన కధ' ను కూడా ఆమె ఆ కారణంగానే ఇంతవరకూ చదవలేదు -- ఇకముందు చదువుతుందన్న గ్యారెంటీ కూడా లేదు.
    "నాకేం చెప్పక్కరలేదు!" అందామె ఇంకా కోపంగా.
    అతనికేం చేయాలో తోచలేదు.చుట్టూ వున్న చెట్ల కేసీ, పూల మొక్కల కేసీ ఓ క్షణం చూశాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆడపిల్లలను ఎలా మచ్చిక చేసుకోవాలో అతనికి తెలుసు! "నేటి పిచ్చాల్లె రేపటి ప్రేమికులు" అనే ఇంగ్లీషు పుస్తకంలో అలాంటి కిటుకులన్నీ రాశారు. ఆ పుస్తకం కొని లోపలి మేటరంతా కంఠతా పట్టాడతను.
    ఇలా "నాకేం చెప్పక్కర్లేదు" - "నాతొ మాట్లాడవద్దు " అనే అమ్మాయిలను చల్లబరచాలంటే ఆమె కేదురుగ్గా వెళ్ళి , ఆమె రెండు భుజాల మీదా చేతులేసి ఆమె కళ్ళల్లోకి చూడటమే ఉత్తమ మార్గమని ఆ పుస్తకంలో రాశాడు రచయిత గ్రిస్టన్ క్రిస్ట్ ఫర్ద్! అంచేత అదేపని చేశాడు దీప్ చంద్."
    "నా ప్రియమయిన అమ్మాయీ! నన్ను క్షమించు! ఇంకోసారి అలా పారిపోనని హామీ ఇస్తున్నాను! ఈసారి మీ డాడీతో ధైర్యంగా , నిర్భయంగా మన ప్రేమను తెలియజేస్తాను. పెళ్ళికి పర్మిషన్ అడుగుతాను!" అన్నాడు ఆమె భుజాల మీద చేతులేసి ఆమె కళ్ళల్లోకి చూస్తూ.
    అమ్మాయి అతని చేతులు విసురుగా తోసేసింది గానీ కోపం మాత్రం తగ్గు ముఖం పట్టింది.

 Previous Page Next Page