Previous Page Next Page 
అమ్మాయీ ఓ అమ్మాయీ.. పేజి 4

 

    "హలో హలో హలో - గుడ్ మాణింగ్ ఎవిరిబడి ....." అన్నాడు భవానీశంకర్ ఇనుమడించిన ఉత్సాహంతో.
    అతని విష్హింగ్ ని ఎవరూ పట్టించుకోలేదు. అందరూ కలసి అసిస్టెంటు స్టేషన్ డైరెక్టర్ వేపు చూశారు.
    అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్ భవానీశంకర్ వేపు చూశాడు.
    "సో! యూ ఆర్ భవానీశంకర్!" అన్నాడు చాలా సీరియస్ గా.
    "సెంట్ పర్సెంట్ సర్! గోల్డ్ మెడలిస్ట్ భవానీశంకర్ అని కూడా అనవచ్చు మీరు! నో ప్రాబ్లం!"
    "స్టేషన్ డైరెక్టర్ గారు మిమ్మల్ని అర్జంట్ గా రమ్మంటున్నారు."
    "ఓ యస్! పదండి! విప్లవాత్మకమయిన అయిడియాలున్న టాలెంటేడ్ పీపుల్స్ ని చూడాలని ఎవరికయినా అనిపిస్తుంది- నధింగ్ అనూజవల్ - పదండి!" గుంపంతా వెంటరాగా ఇద్దరూ ఎస్.డి. చాంబర్ లో కెళ్ళారు.
    "సో- యూ ఆర్ భవానీశంకర్!" అన్నాడు స్టేషన్ డైరెక్టర్ కోపంగా.
    "యస్. మైడియర్ సర్! దిగ్రేట్ గోల్డ్ మెడలిస్ట్ భవానీశంకర్ నేనే!"
    "వాట్ గోల్డ్ మెడలిస్ట్?"
    "జర్నలిజంలో గోల్డ్ మెడల్ సంపాదించాను సర్! "వైజాగ్ కాలింగ్" లో బీచ్ రోడ్ శవం మిస్టరీ సాల్వ్ చేసిందేవరనుకున్నారు? నేను! నేనే ఇన్ వేస్టిగేట్ చేసి రాసిన రిపోర్టుని బట్టి పోలీసులు ప్రొసీడ్ అవగలిగారు. మీరు "వైజాగ్ కాలింగ్" చదవ లేదూ?"
    "లేదు! ఇప్పుడా సంగతి అనవ....."
    "ఆఫ్ కోర్స్! మీరు చదవకపోవచ్చు! ఎందుకంటే ఇంటలిజెన్స్ యా చదివే డెయిలీ అది! ది మోస్ట్ ప్రిస్టేజియస్ ఈవెనింగ్ న్యూస్ పేపర్ పబ్లిష్ డ్ సైమల్టేనియస్లీ ఫ్రం వైజాగ్ - వన్ అండ్ వైజాగ్ - టూ ! దాని స్పెషల్ రిపోర్టర్ గా......
    "మీరు కాసేపు నిశ్శబ్దంగా ఉంటారా?" రూమ్ ఎగిరిపోయేటట్లు అరచాడు యస్.డి .
    భవానీశంకర్ ఓ క్షణం రూఫ్ వంక చూసి ఆ తరువాత స్టేషన్ డైరెక్టర్ వంక చూశాడు.
    "అలా గట్టిగా అరవటం చాలా డేంజరస్ సార్! మనదసలె ఓల్డ్ బిల్డింగ్! మొన్న "డ్రామా" రూమ్ లో ఎవరో అరుస్తే - "టాక్స్" రూమ్ లో గోడ పగుళ్ళు చూపింది. ఒకవేళ ఇప్పుడది జరక్కపోయినా దగ్గరగా ఉన్న "జనరంజని "ప్రోగ్రాం లోకి మీ గొంతు జొరబడి తద్వారా ఆరుకోట్ల ఆంధ్రులు భయభ్రాంతులవవచ్చు!"
    "భవానీశంకర్!" నెమ్మదిగా పిలిచాడు స్టేషన్ డైరెక్టర్.
    "యస్ సర్" వినయంగా జవాబిచ్చాడతను.
    స్టేషన్ డైరెక్టర్ కోపం దిగమింగి నెమ్మదిగా మాట్లాడటం ప్రారంభించాడు.
    "ధన్యజీవులు ప్రోగ్రాం చేసింది మీరేనా?"
    "ఓ! అదేనా? నాకు తెలుస్సార్! దానికి పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చెలరేగుతాయని! రేడియో స్టేషన్ హిస్టరీలోనే గొప్ప ఇంటర్యుఅది...."
    "మిస్టర్ భవానీశంకర్! నేనడిగిందానికి మాత్రమే సమాధానం చెప్పండి!"
    "అంటే! మీరనేది అన్సర్ టు ది పాయింట్ అని! అంతేనా! ఓకే ఎగ్రీడ్! ఎవరి టెస్ట్ వాళ్ళది. మా జర్నలిజం వాళ్ళకు ఎంత ఎక్కువ మాట్లాడితే అంత అనందం! మా జర్నలిజం క్లాస్ మేట్ కామేశ్వర్ కరాటే బాంబేలో ఓసారి...."
    "మిస్టర్ భావానీశంకర్....."
    "ఓ! అయాం సారీ! మనది అన్సర్ టు ది పాయింట్ ప్రోగ్రాం అన్న విషయం మర్చిపోయాను. "ధన్యజీవులు" ప్రోగ్రాం కింద నేనే మల్లి గాడిని ఇంటర్యు చేశాను సార్! ప్రతాపసింగారం అనే ఊరు బయట ఉంటాడు! పధ్నాలుగు పందులున్నాయి అతనికి! వెరీ రిచ్ ఫెలో! బైది బై ! ఆ ఇంటర్యు చాలా రివల్యుషనరీగా చేశాను! మీరు గమనించారో లేదో! మన రేడియో స్టేషన్ చరిత్రలో అంత ఫ్రీ అండ్ ఫ్రాంక్ ఇంటర్యూ ఎవరూ చేసి వుండరు! అన్నట్లు మీరా ఇంటర్యూ విన్నారా సార్?"
    "విన్నాను! అందుకే నిన్ను పిలిపించాను...."
    "నాకు తెలుస్సార్! కొత్తదనం కోరేవారు - ఆ ఇంటర్యూ వింటే నడిరోడ్డు మీదయినా సరే, పెద్ద ఎత్తున హర్శాధ్వానాలు చేస్తారు అంతేకాదు....."
    "అయ్యా! ధన్యజీవులు కార్యక్రమంలో మల్లిగాడితో ఇంటర్యూ సరికొత్త తరహాలో బ్రహ్మాండంగా ఉంది! ఇంటర్యూ చేసిన యాంగ్ మాన్ కి మా హృదయ పూర్వక అభినందనలు! దయచేసి అయన చిరునామా వెంటనే తెలపవలసిందిగా కోరుతున్నాము. ఇల్టు శారద, నీరద, వీరద, గీరద, ఎరోద మరియు వారి కుటుంబ సభ్యులు - వంగపల్లి! లాంటి ఉత్తరాలు 'లేఖావళికి గుప్పించేస్టారు......"
    "మిస్టర్ భవానీశంకర్ ...." మళ్ళీ అడ్డుపడ్డాడు స్టేషన్ డైరెక్టర్.
    "యస్ మైడియర్ సర్......"చిరునవ్వుతో అడిగాడతను.
    "మీరు కాసేపు నిశ్శబ్దంగా వుంటే...."
    "ఓ! విత్ ప్లెజర్! విత్ ప్లెజర్!"
    "యస్.డి. టేబుల్ మీదున్న టేప్ రికార్డర్ కేసెట్ ఉంచి "అన్" చేశాడు. భవానీశంకర్ గొంతు ఖంగున మోగింది అందులో నుంచి.
    "మిస్టర్ మల్లిగాడూ! పాపం మీ బలహీన వర్గాల కోసం ప్రభుత్వం ఎంతో ఖర్చు పెట్టి ఇళ్ళు కట్టించింది కదా! మరి యిప్పుడు మీరుంటున్న ఇల్లు అదేనా?"
    "ధూ నీయవ్వ! గిసవంటి యిల్లంటారువయ్యా! గింత వర్షమొస్తే నీళ్ళు కారబట్టే - నా పెద్ద కొడుకు దిల్లగీల తాకితే గోడ పక్కకి పడిపాయే...."
    "ఓహో! అయితే ఆ ఇల్లు చాలా బావుందన్నమాట! ఇకపోతే....."
    "అదో! మళ్ళ గట్లంటవు! నీయవ్వ సర్కారోడి ఇంటి కంటే గుడిశె మంచి గుంటది.... ఏమంటున్న!"
    "సరే! ఇక మనం పందుల విషయానికొద్దాం! ఇన్ని పందుల మధ్య నువ్వు ఎంతో సుఖంగా జీవితం గడుపుతున్నావ్ కదా!  మరి ఈ పందుల్ని సమకూర్చుకునేందుకు ప్రభుత్వ బాంక్ నీకు చాలా పెద్ద ఎత్తున బుణసహాయం అందజేసినది కదూ?"
    "ధూ నీయవ్వ! తోమ్మిదోందలియ్యనికి ఆరు నెలలు తిప్పబెట్టె! శాంక్షనయింక కూడా మినిస్టరోచ్చి ఇస్తడు -- మినిస్టరోచ్చి ఇస్తడు అని ఇంకొక ఆరునెల్లు దుకాయించే- ఆ పైసలు చేతికియ్యనికి మా సర్పంచి రాజిగాడు పైసలినబట్టే! బాంక్ గుమస్తా పైసల్దినే! అందరు తినంగ ఇంక నాకేం మిగిలెడిదున్నదివయ్య- బూడిద!"
    స్టేషన్ డైరెక్టర్ టేప్ రికార్డర్ స్విచ్చాఫ్ చేశాడు.
    "ఏమిటిది?" అన్నాడు తన గొంతు వాల్యూం పెంచేస్తూ.
    "అంటే మీ ఉద్దేశ్యం......" అని ఏదో డౌటు క్లియర్ చేసుకోబోయాడు గానీ స్టేషను డైరెక్టరు అందుకు అవకాశం ఇవ్వలేదు.
    "ఆ మల్లిగాడు ఓపక్క గవర్నమెంటునీ, గవర్నమెంటు బాంకుల్నీ అంత దారుణంగా విమర్శిస్తూ మాట్లాడుతుంటే అదంతా రికార్డు చేస్తావా? మన రేడియో , టీవీ ఉన్నది ఎందుకు? గవర్నమెంటు తరపున ప్రచారం చేయడానికి! అధికారంలో ఉన్న పార్టీని ఆకాశాని కెత్తటానికి! అందుకే గవర్నమెంటు మనకి జీతమిస్తోంది! వాళ్ళ డబ్బు తిని తిన్న ఇంటి వాసాలు లెక్క పెడతావా?"
    భవానీశంకర్  చిరునవ్వు నవ్వాడు.
    "పొరపాటు సార్! చాలా పొరపాటు పడ్డారు మీరు! మనది డెమోక్రసీ! డెమోక్రసీలో ప్రతి పౌరుడికి వాక్ స్వాతంత్యం ఉంది! మన రేడియో స్టేషన్ పేరు ప్రఖ్యాతులు పొందాలంటే వాక్ స్వాతంత్యాన్ని గౌరవించాలి! బైదిబై డిగ్రీ కోర్సులో మీ సబ్జెక్టు ఏమిటి సార్?"
    "భవానీశంకర్...." నెమ్మదిగా పిలిచాడు స్టేషన్ డైరెక్టర్.
    "ఓ! అయాం సారీ! అన్సర్ టు ది పాయింట్ ప్రోగ్రాం కదా మనది! మర్చిపోయాను."
    "ఇంటర్యూ నుంచి అభ్యంతరకరమైన మేటర్ తొలగించి 'దబ్' చేయమని ప్రొడ్యుసర్ గారు నీకు చెప్పారా లేదా?" మళ్ళీ అరచాడు ఎస్.డి.
    "ఓ యస్ చెప్పారండీ! నిజానికి తొలగించేశాను కూడా! కాని ఇంటి కెళ్ళాక మళ్ళీ ఆలోచిస్తే -- అన్ సెకెండ్ థాట్స్ - ఇంటర్యూ ఉన్నదున్నట్లుగా బ్రాడ్ కాస్ట్ చేస్తేనే వెరైటీగా వుంటుంద'నిపించింది.....పర్సనల్లీ నేను ఫ్రాంక్ టాక్ వే లైక్ చేస్తాను."
    "టు హెల్ విత్ యూ అండ్ యువర్ ఫ్రాంక్ టాక్! దీనివల్ల ఇప్పుడు నష్టం ఎవరికో తెలుసా/ ప్రొడ్యుసర్ రావ్ కి! 'ధన్యజీవులు' ప్రోగ్రాం అతనిది కనుక అతను పనిష్మెంట్ అనుభవించాలి!"
    భవానీశంకర్ వెనక్కు తిరిగి గుంపులో ముందు లైన్ లో నిలబడ్డ రావ్ వంక చూశాడు. పలుకరిస్తే చాలు భోరున ఎడ్చేసేట్లు కనిపించింది రావ్ వాలకం!
    భవానీశంకర్ ఆప్యాయంగా అతనిని చూసి చిరునవ్వు నవ్వాడు.
    "డిస్కరేజ్ అవకండి సర్! మన్దేశంలో సిసలయిన డెమోక్రసీ పునరుద్దరించడానికి పాటుపడ్డ వీరుల స్మృతి చిహ్నాల్లో నా పక్కనే మీది కూడా ఉంటుంది...."
    "భావానీశంకర్ ! ఫర్ గాడ్ సేక్ స్టాప్ దిస్ నాన్సెన్స్!' గట్టిగా అరిచాడు.
    "అలా అరవకండి సార్! అలా తరచి కొలాప్స్ అయిపోయిన ఫెలోస్ ని చాలామందిని చూశాన్నేను."
    స్టేషన్ డైరెక్టర్ అతికష్టం మీద కోపం అణచుకొని పక్కకు తిరిగి ఏఎస్డీ వేపు చూశాడు.
    "ఎవరి రికమెండేషన్ తో ఈ మాద్ ఫెలోకి ఉద్యోగం ఇచ్చాం మనం!" కోపంగా అడిగాడు స్టేషన్ డైరెక్టర్.
    "పార్వతమ్మగారి రికమెండేషనండి!"
    "ఐసీ! ముందు ఇతనిని ఇక్కడ నుంచి బయటకు గెంటండి! ఇంకోసారి రేడియో స్టేషన్ ఆవరణలోకి రాకుండా కట్టుదిట్టాలు చేయండి!"
    'అలాగే సార్"
    భవానీ శంకర్ నవ్వాడు.
    "కోపంలో మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలీటం లేద్సార్! తీరా నేను వెళ్ళిపోయాక 'వేరీజ్ దట్ గ్రేట్ యాంగ్ మాన్? రివల్యుషనరీ అయిడియాలతో క్రిక్కిరిసిపోయిన భవానీశంకర్ ని తీసుకురండి! అతను ఏ పరిస్థితిలోనూ రేడియో స్టేషన్ ఆవరణ వదలకుండా చూడండి - " అంటూ మీరే పశ్చాత్తాపపడి దుఃఖం భరించలేక -"
    "గెటౌట్....." మళ్ళీ రూఫ్ ఎగిరెట్టు అరిచాడు స్టేషన్ డైరెక్టర్.

 Previous Page Next Page