పక్కగదిలోని వీళ్ళ మాటలు వింటున్న సేత తండ్రేమంటాడో అని జాగ్రత్తగా ఆలకించింది.
"పిల్లదేవూరు? వయసెంత? నాకు రెండో పెళ్ళాని అయుదుగురు పిల్లలున్నారని వాళ్ళతో చెప్పవా బాబాయ్," రామచంద్రం శాంతంగా అడిగాడు.
సీత నెత్తిన పిడుగుపడినట్లయింది. "నాన్న మళ్ళి పెళ్ళి చేసుకుంటున్నారా? అంటే..... అంటే.... తనకి సవతి తల్లి రాబోతున్నదన్నమాట!" ఆపై ఎమలోచించాలో సీతకర్ధం కాలేదు. అదే వీధిలో వున్న భాక్తవత్సలము అయన రెండో భార్య, ఆమె సవతి తల్లిగా మొదటి భార్య పిల్లలను నానా కష్టపేట్టడము, ఆమె పెట్టె కష్టాలకి తట్టుకోలేక ఓ పిల్లవాడు యింట్లోంచి పారిపోవడము, మరో పిల్లవాడు ఆత్మహత్య చేసుకోవడము. ఎంతో మంచివాడైన భక్తవత్సలం రెండో భార్యని పువ్వుల్లో పెట్టి చూసుకోవడం.....గిరగిర సినిమా రీలులా తిరుగుతూ కళ్ళముందు కనిపించింది. గజగజ వణుకుతూ వుండిపోయింది.
రామచంద్రం దారికోచ్చాడని సంతోషిస్తూ "పిల్లదాని ముఖం చంద్రబింబమే అనుకో, వయసంటావ్ మరీ చిన్నదేమీ కాదు. ఇరవై ఒకటి. ఏమంత ఆస్తి పాస్తులున్నవాళ్ళు కాదు. కట్నమిచ్చుకోలేకనో పిల్ల వయసు ముదిరి పోతుందనో పెళ్ళి చేయాలని తొందరపడుతున్నారు. నీకు పిల్లలున్నందుకు వాళ్ళేం పట్టించుకోరు. నీవు ఊ అనటమే తరువాయి" అంటూ వివరించాడు శివరావు.
"పిల్లెమయినా చదువుకుందా?"
"పి.యు.సి. పాసయింది టైపొచ్చు."
"మంచిది చిన్న సాయం చేస్తావా బాబాయ్! ఎలాగు ఈ పెళ్ళి భారం నీ నెత్తిన వేసుకున్నావు.....
"సంశయం దేనికి చెప్పరా! పిల్లతో మాట్లాడాలంటే ఆ ఏర్పాటు చేస్తాను."
"అంతవరకు లేదులే బాబాయ్! వక్కసారి వాళ్ళ దగ్గిర కెళ్ళి ఆ పిల్ల కేదయినా ఉద్యోగ ప్రయత్నం చేయమని చెప్పు. ప్రయత్నిస్తే ఏదో ఓ ఉద్యోగం దొరక్కపోదు....
"ఉద్యోగం ఏమిటిరా?"
"నా మాట సాంతం విను బాబాయ్! కట్నం యిచ్చుకోలేని స్థితిలో వాళ్లు వుండబట్టే కదా రెండో పెళ్ళి వాడికయినా, మూడో పెళ్ళి వాడికయినా, పదిమంది పిల్లల తండ్రికయినా, ఇచ్చిచేద్దామని చూస్తున్నారు. పెళ్ళి చేసుకునేది భర్తతో సుఖపడదమనా? ఆ భర్తగారి పిల్లల ఆలనా పాలనా చూద్దామన? చదువుకున్న పిల్లకాబట్టి ఉద్యోగం చేసుకుంటే కట్నం డబ్బులు కుదబెట్టుకోవచ్చు. తనమాననా తాను బతకవచ్చు."
శివరావు ముఖం చిట్లించాడు, "ఇదా నువ్వు చెప్పేది. నేను పనికట్టుకుని వెళ్ళి ఆ పిల్ల చేత ఉద్యోగం చేయించండి అని చెప్పనా!"
"ఆ ఒక్క మాటే కాదు బాబాయ్! ఉద్యోగం చేయటం వల్ల కట్నం డబ్బు కూడా..."
"వరేయ్!వరేయ్"
శివరావు కని విని ఎరుగని సంగతి విన్నట్లు నిర్ఘాంత పోతుంటే రామచంద్రంకి జాలి నవ్వూ వచ్చాయి.
"లేకపోతె ఏమిటి బాబాయ్ నీ పిచ్చి మళ్ళి పెళ్ళిచేసుకోవాలనే ఆశ నాలో వుంటే నీ వీ ప్రయత్నం చేస్తే అర్ధముండేది. పెళ్ళి చేసుకోను మొర్రో అంటుంటే వేధిస్తుంటివి..."
"నువ్వు ఉప్పుకారం తినడం మానేశావేమిటిరా?"
"లేదు బాబాయ్! ఉప్పుకారం తింటూనే వున్నాను, నాలో చీము నెత్తురూ వుంది."
రామచంద్రం వరస శివరావుకెమి నచ్చలేదు. పిలిచి పిల్ల నిస్తానంటే మోకాలడ్డు పెట్టె మూర్ఖుడు అనుకున్నాడు. ఓ పక్క వచ్చిన పని సానుకూల పడలేదని చింత గాను వుంది. మరికాస్త బలవంతం చేస్తే వచ్చిన పని జరుగుతుందేమోనని ఏ మూలో ఆశా వుంది.
"నాలోనే కాదు. ప్రతివాడిలోనూ చీము నెత్తురూ వుంటుంది లేవోయ్! పెద్ద నాకు చెపుతున్నావ్. చీము నెత్తురూ వుంది కదా అలాగే కోరికా వుంటుంది. కోరికలని చంపుకోవటం ఎంతకష్టమంటావ్?"
"చీము నెత్తురూ అందరిలో వుంటే కోరికలు కొందరిలోనే వుంటాయి."
"సరే నీ మాటే నిజం అనుకుందాం. సావిత్రి బతికున్నప్పుడు కూడా నీలో కోరికలు లేవా?"
"ఉన్నాయ్!"
"మరి...."
"సావిత్రితో పాటు అవి పోయాయి."
"సావిత్రి స్థానంలో మరో పిల్ల వస్తే అవే వస్తాయి."
"నే కోరటం లేదు. ఈ ప్రస్తావన యింతటితో అపుచేద్దాము బాబాయ్!" రామచంద్రం ముఖం ముడుచుకుని అన్నాడు.
"వీడి ఖర్మ, వీడిని మార్చటం నా తరం కాదు కదా ఆపై వాడి తరం కూడా కాదు. అనుకున్నాడు శివరావు. ఇంకా ఏ మూలో ఆశ మిణుకు మిణుకు మంటుంటే "నీ మనసులో మళ్ళి పెళ్ళి చేసుకుందాం అనే కోరిక పుడితే ఎప్పటికైనా సరే సిగ్గుపడక నాతో చెప్పు" అన్నాడు.