Previous Page Next Page 
రాకోయి అనుకోని అతిథి పేజి 5

 

       ఆశతో, విశ్వాసంతో, ఆత్మబలంతో ఎదురైన ఎన్నెన్ని అఖాతాల్నయినా దాటుకు రాగలిగే బుద్దిబలాన్ని ప్రదర్శించిన ఆశ్రిత మాటల్లో పదును, ఔచిత్యం అందర్నీ అమితంగా సంతృప్తిపరిచినట్టు బోర్డు మెంబర్సు చూపులు స్పష్టం చేస్తుంటే చైర్మన్ అన్నాడు "ఓ.కె! మిస్ ఆశ్రితా....ఇంటర్వ్యూ పూర్తయింది. చివరగా మీరేదన్నా అడగాలని వుంటే అడగొచ్చు"
    
    ఆమెకది ఉద్రిక్త క్షణం..... కిటికీ ఆవలి దిగంతాలవేపు చూస్తూ దూరంగా భవంతుల శిఖరాగ్రాలపై పడి రగులుతున్న సూర్యగోళపు కాంతిని ఓ మరు చూసి అంది ఉద్విగ్నంగా.
    
    "థాంక్ యు సర్! అయ్ టు థాంక్ యు ఆల్ ఫర్ యువర్ కైండ్ నెస్ అండ్ కన్ సిడరేషన్! గుడ్ టు యు ఆల్ సర్స్" ఆశ్రిత శలవు తీసుకుని బయటకు నడిచింది. అక్కడ బయట ఆశ్రిత కోసం ఎదురుచూస్తున్న మార్గరెట్ ఉత్సాహంగా పలకరించలేదు.... పోస్టుగ్రాడ్యుయేషన్ లో ఆశ్రితకి క్లాస్ మేట్ అయిన మార్గనెట్ ఢిల్లీ నివాసి కావటంతో తోడుగా వచ్చింది....
    
    "ఏమైందే....ఇంటర్వ్యూ ఎలా చేశావు అని అడక్కుండా ఆ చూపులేమిటి.....మొత్తానికి దడదడలాడించేశా" చనువుగా అంది ఆశ్రిత "చెప్పు....ఇప్పుడు నీ ఇంటిలో ఎన్ని రోజులు వుండేది....వారం చాలా."
    
    "అవసరం లేదు" మార్గరెట్ తలవంచుకుని అంది. "నువ్వు వెంటనే బయలుదేరు"
    
    ఆశ్రిత విభ్రమంగా చూసింది. ఉదయందాకా కనీసం వారం అయినా ఢిల్లీలో వుండమన్న మార్గరెట్ అర్జంటుగా వెళ్ళిపొమ్మంటుంది. సంగతేమిటో అర్ధంకాక "ఏమిటీ.... అప్పుడే మొహం మొత్తిందా" అంది జోవియల్ గా.
    
    "అది సరే... దృష్టి మరెటో మరల్చుకున్న మార్గరెట్ "కావాలంటే మరోసారి వచ్చి నెల రోజులుండు. కానీ ఇప్పుడు మాత్ర నువ్వు అర్జెంటుగా ఇంటికి బయలుదేరు."
    
    "ఏమైంది?" ఆశ్రిత మొహంలో రంగులు మారాయి.... "ఇంటినుంచి ఏమన్నా ఫోన్ వచ్చిందా?"
    
    "అవును" అంది కాని మార్గరెట్ అక్కడ జరిగిన ఘోరం గురించి చెప్పలేదు....ఓ ఆదర్శవంతమైన కుటుంబంలో పుట్టి పెరిగిన ఆశ్రిత జీవితం ఆ తర్వాత ఎన్ని మలుపులు తిరిగేదీ ఆమెకి తెలీదుకాని దీనుని చెక్కిలిమీదనుంచి దీనంగా జారేకన్నీళ్ళలా ఆమె తండ్రి, తమ్ముడు ప్రస్తుతం ఏ స్థితిలో వున్నదీ చెప్పే సాహసం చేయలేకపోయింది. "మీ డాడీకి ఏదో బాగోలేదట... ఇందాకే ఫోన్ చేశారు."
    
    ఆశ్రిత అప్రతిభురాలై చూసింది. ఎంతెంతో చెప్పి ఎన్నెన్నో మాట్లాడి ఇంటర్వ్యూకి పంపిన నాన్నకి ఉత్సాహంగా జరిగింది చెప్పి నీ కూతురు నువ్వనుకున్నట్టు ఐఎఎస్ లో నెగ్గుకొస్తుందని హామీ ఇవ్వాలనుకుంటే ఇదేమిటి.....
    
    మార్గరెట్ చేతిలో ఆశ్రిత సూట్ కేసు వుంది.... "పద ఎయిర్ పోర్టుకి".
    
    మరోసారి విస్తుపోయింది ఆశ్రిత "ఎయిర్ పోర్టేమిటే..."
    
    "ట్రైనంటే చాలా ఎక్కువసేపు ప్రయాణం ఆశ్రితా! అందుకే నీ కోసం ఫ్లయిట్ టిక్కెట్టు తెప్పించాను"
    
    మార్గరెట్ ఏదో దాస్తుందని తెలుసుకాని ఏ స్థాయిదాకా అసలు నిజాన్ని దాస్తోందో అర్ధంకాలేదు...
    
    మామూలుగా అయితే ఆందోళనతో మార్గరెట్ ని నిలదీసేదే... కానీ ఆశ్రిత భావరహితంగా చూసింది చాలాసేపటిదాకా.
    
    "ధైర్యమంటే సమస్యమీద తిరుగుబాటు కాదు.... తనమీద ఓ సమస్య పటిష్టంగా దండయాత్ర చేయబోతోందని తెలిసీ నిబ్బరంగా స్పందించడం...." ఇదీ నాన్నగారు చెప్పిందే...
    
    లోలోన ఆందోళనగా వుంది....అయినా తనను తాను నిగ్రహించుకుంటూ ఎయిర్ పోర్టుకి బయలుదేరింది ఆశ్రిత.
    
    సుమారు రెండున్నర గంటల వ్యవధిలో తను తండ్రిని చూడగలుగుతుంది. అలా తనను తాను ఊరడించుకుందే తప్ప ఓ అసాధారణ మేధావి అయిన ఆశ్రిత ఎలాంటి దారుణాన్ని చూడబోతూందో ఊహించలేకపోయింది.
    
                                                               *    *    *
    
    "హల్లో" ఆజానుబాహుడైన ఓ వ్యక్తి పలకరింపుతో ఆలోచనల నుంచి తేరుకున్న ఆశ్రిత సీటులోనుంచి తల పైకెత్తి చూసింది. "మై సీట్ ఈజ్ అడ్జెసెంట్ టు విండో"
    
    "ప్లీజ్" తను మోకాళ్ళను ముడుచుకుని అతడికి చోటిచ్చింది. ఫ్లయిట్ విండో పక్కన వున్న హెచ్ నెంబరు సీటులో సెటిలయ్యాడు.
    
    ఆ తర్వాత ఆశ్రిత అతడ్ని పట్టించుకోకుండా ఓ తెలుగు నవలని తీసుకుని చదవడం ప్రారంభించింది. అయినా ఏకాగ్రత కుదరడంలేదు.... ఏమీ తోచక తలపక్కకి తిప్పిచూసిన ఆ యువకుడు వున్నట్టుండీ "అరె.... మీరు తెలుగు...అమ్మాయా" అన్నాడు ఉత్సాహంగా.
    
    ఆశ్రిత కూడా క్షణం ఆశ్చర్యంగా చూసి "అవును" అంది....అప్పటిదాకా అతడు కూడా తెలుగువాడిలా అనిపించకపోవటానికి కారణం పసిమి ఛాయలో అతడు నార్త్ ఇండియన్ లా కనిపించడమే...
    
    "నాపేరు వశిష్ఠ"
    
    మామూలుగా అయితే ఆశ్రిత జవాబు చెప్పేదే కానీ ఇప్పటి మూడ్ వేరు... నవలవేపు తల తిప్పుకుంది.
    
    "నా అంతట నేనుగా పేరు చెప్పుకున్నాను....మీపేరు చెప్పడం సభ్యత."
    
    ఆశ్రిత చివాలున తలతిప్పి చూసేసరికి "అదీ మీకు అభ్యంతరం లేకపోతేనే" అన్నాడు నీళ్ళు నముల్తూ....
    
    "నాకు అభ్యంతరంగా వుంది".
    
    "గుడ్" టక్కున అన్నాడు "కనీసం ఓ విషయం అర్ధమైంది."
    
    "ఏమిటది?" సీరియస్ గా అడిగింది.
    
    "మీరు స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా మాట్లాడగలరని"-
    
    "థేంక్స్".
    
    ఆమె అలా ప్రసక్తిని ముగించడం ఇష్టంలేనట్టు "మీకు తెలుగు నవలలు చాలా ఇష్టం అనుకుంటాను" అన్నాడు.
    
    ఇక విడిచిపెట్టేట్టు లేడనుకుందేమో "వట్టి తెలుగు నవల్సు మాత్రమే కాదు బాగున్న ఏ భాష నవల్సయినా చదువుతుంటాను."
    
    "అంటే మీకు చాలా భాషలు వచ్చన్నమాట"
    
    "అవును! నాలుగైదు భాషల నవల్సు చదువుతుంటాను"
    
    "అదృష్టవంతులు"
    
    "దేనికి?"
    
    "మీకు అన్ని భాషల్లో పాండిత్యం వున్నందుకు"
    
    "మీరూ డెవలప్ చేసుకోవాల్సింది."
    
    "చేసుకునేవాడ్నే కానీ ఖాళీ వుండదు."
    
    "అంత బిజీగా వుంటారా?"

 Previous Page Next Page