"ప్రతిమకాదు. నా ఫ్రెండ్ ఇతడు. మద్రాసీ. మొదటిసారిగా ఈ ఊరొచ్చాడు. అతడికి ఇక్కడి విశేషాలు చూపుతున్నాను." ప్రక్కనున్నతడిని పరిచయం చేశాడు. "పిల్లలతో వచ్చారు! ఏమిటి విశేషం, అంకుల్?"
"ఇవాళ ప్రేమ పుట్టినరోజు. ఇంట్లో ఎవరి పుట్టినరోజైనా క్రొత్త బట్టలు ధరించి దైవదర్శనం చేయడం అలవాటు చేసింది మీ ఆంటీ సరళ."
"ప్రేమ పుట్టినరోజా?" అంటూ ప్రేమను ఎత్తుకొని, "నీ పుట్టిన రోజుకి నా ప్రజంటేషన్" అంటూ ఆ పిల్ల రెండు బుగ్గల్నీ గట్టిగా ముద్దుపెట్టుకొన్నాడు అరుణ్.
"చూడడానికి కూడా ఇష్టంలేదన్నమాట! రాజుని చూచిన కంట...."
"రాజెవరు? మొగుడెవరు?" సంధ్యకి కోపం వచ్చింది.
"జవాబు నేను చెబితే తప్ప తెలుసుకోలేనంత అమాయకురాలివా? నిజంగా నువ్వు చాలా సంతోషంగా వున్నావు! నిన్ను గురించి అనవసరంగా నేను బాధపడ్డాను - పెళ్ళిపీటల మీదినుండి లేవదీసుకువచ్చింది, ఆయాని చేసేందుకా అని. అమ్మ ఆయాగా ఆ ఇంట్లో ప్రవేశపెడితే, నీ అందమో, అదృష్టమో నిన్నాఇంటికి అమ్మగారిని చేస్తోందన్నమాట!"
"అరుణ్!" సంధ్య కళ్ళు ఎర్రబడగా కోపంగా, గద్దించినట్లుగా పిలిచింది, "ఏమిటి నువ్వు మాట్లాడేది? నేనా ఇంటికి అమ్మగారినౌతున్నానని ఎవరు చెప్పారు నీకు?"
"నువ్వు క్రిందపడకుండా అంకుల్ నిన్ను పొదివి పట్టుకోవడం, ఆయన నిన్నెంత అపురూపంగా చూస్తున్నారో, ఇహముందు ఏం జరుగుతుందో చెప్పక చెబుతూంది."
"లోకులు కాకులంటే ఏమిటో ఇప్పుడు తెలుస్తుంది. ఒక మనిషి కాస్త సుఖంగా, నిశ్చింతగా ఉంటే కూడా చూడలేరు. ఇలాంటి అపవాదులతో బాధపెట్టి తృప్తిపడతారు" బాధగా అంటున్న సంధ్యకళ్ళలో నీళ్ళు! 'నన్ను బాధపెట్టి తృప్తిపడే మొదటిమనిషివి నువ్వు అవుతున్నావు. ఆప్తుడు, స్నేహితుడు అనుకొన్న మనిషే నన్ను బాధపెట్టి సంతోషపడుతున్నాడు.'
కాని, అరుణ్ అన్న వేళావిశేషం ఏమిటోగాని, అతడి మాట నిజమయ్యే రోజు త్వరలోనే వచ్చింది.
చక్రపాణి ఈమధ్య ఇంటిపట్టున నిలకడగా ఉంటున్నాడు. చాలా సమయం పిల్లలతో గడుపుతున్నాడు.
సాయంత్రం కాగానే పార్కుకో, సినిమాకో ప్రోగ్రాం వేస్తున్నాడు.
"ఆంటీ రావాలి మాతో" అంటారు పిల్లలు. వచ్చేదాకా విడువరు. సంధ్యకి చెప్పలేనంత ప్రాణసంకటంగా ఉంటుంది. అతను బిజినెస్ అంటూ బయట తిరిగినప్పుడే ఎంతో హాయిగా ఉండేది ప్రాణానికి. పిల్లల్ని ఆడిస్తూ పాడిస్తూ హాయిగా గడిచిపోయేవి రోజులు. ఇప్పటికే లేనిపోని అపవాదులు బయల్దేరాయి తనమీద. అతడితో కలసి ఇలా తిరిగితే వాళ్ళ ఊహలకు ఇంకా బలమిచ్చినట్టు అవుతుంది.
"అమ్మగారున్నప్పుడు కూడా అయ్యగారు ఇలా ఇంటి పట్టునుండేవారుకాదు." అంటూ నౌకర్లు చెవులు కొరుక్కుంటున్నారు.
పిల్లల విషయంలోనేకాదు, ఇంటి విషయంలోనూ శ్రద్ధ తీసుకొంటున్నాడు చక్రపాణి.
అతడితో సినిమాలకీ, షికార్లకీ తిరగడంలోనూ, అతడు ఇంటి విషయాల్లో కల్పించకోవడంలోనూ తమ మధ్య దూరం తరిగిపోతున్నట్టుగా అనిపిస్తూంది సంధ్యకు పిల్లలసాకుతో అతడు సన్నిహితంగా, చనువుగా ప్రవర్తిస్తున్నాడు. ఒక్కోసారి అతడు చూసే చూపుకి జన్మలో అతడికంట మళ్ళీ పడకుండా ఎక్కడికైనా పారిపోదామా అనిపిస్తూంది.