చక్రపాణిని మొదటి చూపులోనే ఆకర్షించింది సంధ్య. వ్యాపార రీత్యా బయటికి వెళ్ళినా అతని మనస్సెప్పుడూ సంధ్యచుట్టూ తిరగసాగింది. ఆరోజు నౌకరు ఇంటిదానికి బాగాలేదని చెప్పి పెందరాళే సెలవు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. వంటమనిషికి జ్వరం రావడంతో, వంటచేసి డాక్టరు దగ్గరికి వెళ్ళి మందు తెచ్చుకొని ఓ గదిలో మునగదీసుకు పడుకొన్నాడు.
సంధ్య మాట్లాడలేదు. అన్నం కూడా నోటికి పోవడంలేదు. వంట మనిషి ఏ గదిలోనో మునగదీసుకు పడుకున్నాడు. నౌకర్లు ఇద్దరూ లేరు. పిల్లలు నిద్రపోతున్నారు. చక్రపాణితో ఏర్పడిన ఈ ఏకాంతం భయం గొల్పుతూంది సంధ్యకు.
"ఏదైనా మాట్లాడు, సంధ్యా!"
"నేను..... నేను మా ఊరికి వెళ్ళిపోవాలనుకొంటున్నానండీ. మీరు మరో ఆయాకోసం ప్రయత్నించండి." ఒక్కోమాట కూడదీసుకొంటున్నట్టుగా అంది.
"అక్కడే పుట్టి ఇరవై సంవత్సరాలు పెరిగా. పుట్టిపెరిగిన ఊరుమీది ప్రేమ, తల్లమీది ప్రేమకంటే తక్కువదికాదు! నా మనసు మా ఊరిమీదికి మళ్ళి చాలా రోజులైంది. ఇక్కడికంటే అక్కడే హాయిగా ఉంటుంది నాప్రాణం."
"ఇక్కడ నీకేం ఇబ్బంది ఉంది, సంధ్యా? నీకు కష్టం కలిగించేది ఏదైనా ఉంటే చెప్పు. తక్షణం తొలగించడానికి ప్రయత్నిస్తాను. నువ్వు వెళ్ళిపోతానని మాత్రం అనకు."
'నువ్వే నాకు ఇబ్బంది!' సంధ్య చిరాకుగా అనుకొంది.
"చెప్పు, సంధ్యా! ఏమిటి నీకిక్కడ కష్టం?"
"కష్టమనికాదు. మా ఊరిమీద ధ్యాస తిరిగింది."
"పెళ్ళయితే ఎలాగైనా ఆ ఊరు వదిలి పెట్టాల్సిందేగా?"
"కాలేదుగా?"
"అవుతుంది. నేను ఆ విషయమే ఈరోజు నీతో మాట్లాడాలనుకొన్నాను. నువ్వేమో మీ ఊరికి వెళ్ళిపోతానంటూ బాంబువిసిరావు." చనువుగా నిష్ఠూరమాడుతూ అన్నాడు.
కళ్ళెత్తి ప్రశ్నార్థకంగా చూసింది సంధ్య.
"నాకిద్దరు పిల్లలు. భార్యపోయింది. మళ్ళీ పెళ్ళి చేసుకోగల వయసు, అర్హత నాకున్నాయనుకొంటే, నేను నిన్ను పెళ్ళి చేసుకొంటాను, సంధ్యా!" ఇంచుక ఉద్విగ్న స్వరంతో చెప్పాడు చక్రపాణి.
సంధ్య తలొంచుకొని అన్నం కెలుకసాగింది.
"చెప్పు నీకిష్టంలేదా?"
"ఇంత హఠాత్తుగా అడిగితే నేనేం చెప్పను? నేను ఆలోచించుకోవాలి."
"ఎంత టైంకావాలి?" కొంచెం నిరుత్సాహంగా అన్నాడు చక్రపాణి ఆయాగా ఇంటికి వచ్చన మనిషిని అమ్మగారిని చేస్తానంటే ఎగిరిగంతు వేస్తుందనుకొన్నాడు. గంతువేయడం అలా వుంచి ఆ ముఖంలో కించిత్ ఆనందం కూడా కనిపించలేదు. తనకి ఈడుజోడూ కాదనా? రెండో పెళ్ళివాడనా? తనకి ఈమాత్రం సంబంధమైనా పడడం అదృష్టం కదూ?