"మిమ్మల్ని హద్దులు దాటవద్దన్నానా? అంతమాట చెప్పడానికి నేనెంతదాన్ని? నా హద్దుల్లో నన్నుండనిస్తే చాలు."
"ఇద్దరి మధ్య ఉన్నది ఒకటే హద్దు సంధ్యా,! నీకొక హద్దూ, నాకొక హద్దూ ఉండవు. ఈ ఒక్కసారికి నా కోరిక మన్నించి తీసుకో! నా నుండి చీరెలు తీసుకొన్నంతమాత్రాన మనమధ్య ఉన్న హద్దు ఏం చెడదు."
అతడు యజమాని! తను నౌకరు!
మరీ అంత బెట్టుచేయడం బాగుండదేమోనని, శ్రీకాంత్ చేతులనుండి అట్టపెట్టెలు తీసుకొంది సంధ్య. నాకని తెలిస్తే, ఇంత ఖరీదైనవి సెలెక్ట్ చేయకపోదును."
"అందుకే ముందు చెప్పలేదు."
ఆ రోజు సంధ్యకూడా తలంటి పోసుకొని పట్టుచీర కట్టుకొని గుడికి తయారైంది, పిల్లల్ని తీసుకొని.
"డాడీ, మీరూ రండి" ప్రేమ పిలిచింది.
"మీ ఆంటీని అడగండి. నేను రావచ్చునేమో!" సంధ్య అక్కడుండగానే అన్నాడు చక్రపాణి.
"మీ పిల్లలతో మీరు గుడికి రావడానికి నన్నడగాలా?" సంధ్య విస్మయంగా అంది.
"ఇక నుండి నీకు సంబంధించిన ఏ విషయాల్లోనైనా నిన్నడగకుండా, నీ పర్మిషన్ లేకుండా హామీ చేయదలుచుకోలేదు, సంధ్యా!"
అటువైపు నౌకరు రావడంతో తర్కం పెంచలేదు సంధ్య. స్టీల్ బుట్టలో కొబ్బరికాయా, పూలూ, పళ్ళూ, వగైరా పూజసామాగ్రి తీసుకొని ప్రేమ చెయ్యందుకొని కారు దగ్గరికి నడిచింది సంధ్య.
"ఒక్క అయిదు నిమిషాలు! ధోవతి కట్టుకువస్తాను. పాంటుతో గుడికివస్తానంటే సరళ భలే కోప్పడేది. "పదినిమిషాల తరువాత చక్రపాణి లాల్చీ, ధోవతి ధరించి, భుజంమీద జరీ ఉత్తరీయం వేసుకొని, కనుబొమల మధ్య ఎర్రటి కుంకుమ బొట్టు పెట్టుకొని బయటికి వచ్చాడు.
లాల్చీ పంచెలో అతడు క్రొత్తగా కనిపిస్తున్నాడు. సూటులోకంటే, ఈ పంచెకట్టు అతడికి హుందాగా ఉంటుందనిపిస్తుంది.
చక్రపాణి కొడుకుచెయ్యి పట్టుకొని ముందు సీట్లో కూర్చొంటే, సంధ్య ప్రేమని ఒడిలో కూర్చోబెట్టుకొని వెనుకసీట్లో కూర్చొంది. డ్రైవరు కారు పోనిచ్చాడు.
దూరంగా కొండమీద బిర్లా టెంపుల్ కనిపిస్తూనే చేతులు జోడించి నమస్కారం చేసింది సంధ్య.
ఆరోజు శనివారం కావడంవల్ల భక్తులసందడి బాగానే ఉంది. ఎక్కేవాళ్ళు ఎక్కుతూంటే దిగేవాళ్లు దిగుతున్నారు.
"ఇదే మొదటిసారి అనుకొంటాను, నువ్విక్కడికి రావడం!" ప్రాంగణంలో నడుస్తూ అన్నాడు చక్రపాణి.
"అరుణ్ తీసుకువచ్చాడు ఒకసారి."
"అరుణ్ తో మంచి స్నేహమనుకొంటాను నీకు?"
"మా చిన్నప్పుడు ఒక్కచోట ఆడుకొన్నాం."
"పార్వతీ, దేవదాసుల్లాగా?"
సంధ్య జవాబు చెప్పలేదు. మనసులో మాత్రం 'అంతకంటే ఎక్కువే. పార్వతీ దేవదాసు మగడూ పెళ్ళాల ఆట ఆడలేదనుకొంటాను. మేం ఆడుకొన్నాం.' ఆలోచనల్లో పట్టుచీర కాళ్ళక్రిందపడి ముందుకు పడబోయింది. చక్రపాణి భుజాలచుట్టూ చేతులువేసి చప్పున పట్టుకొన్నాడు.
శ్రీకాంత్ చెయ్యి చూపినవైపు సంధ్య, చక్రపాణి ఒకేసారి చూశారు. అరుణ్ ప్రాంగణం చివర ఫెన్సింగ్ ని ఆనుకొని చేతులు కట్టుకుని నిలబడి ఇటే చూస్తున్నాడు. అతడి కళ్ళు చెప్పలేనంత విభ్రాంతిగా చూస్తున్నాయి.
"ఓ! అరుణ్! నువ్వూ వచ్చావా? ఒక్కడివేనా?" అంటూ అటు నడిచాడు చక్రపాణి.
"లేదు! జంటగానే!" అతడు పెదవులమీదికి నవ్వు తెచ్చుకొంటూ అన్నాడు.