కూతురు లేని ఇంట్లో సుజాత తిరుగుతుంటే వసుంధర తల్లి కెంతో నిండుగా తోచింది. కొడుకు సుజాత తో మాట్లాడుతుంటే చూడ ముచ్చటగా కనిపించింది. పరాయి పిల్ల అలా ధైర్యంగా తమ యింట ఉంటె లక్షణంగా చూసి పంపవలసిన బాధ్యతతో ఆవిడ సుజాతను వేయి కళ్ళతో చూసుకోంటూనే ఉంది. సిగ్గుపడే సుజాతకు కొసరి కొసరి వడ్డిస్తుంది. ముభావంగా మసిలే సుజాత ను అభిమానంగా ప్రశ్నించి మాట్లాడిస్తుంది. జానకి చెప్పినట్టు ఆవిడ యెంత మంచిదో స్వయంగానే తెలుసు కోగలిగింది సుజాత.
"మీరు నదులూ, ఆనకట్ట లూ అవీ ఎప్పుడైనా చూశారా?" అన్నాడు చంద్రశేఖరం సుజాత తో.
"లేదు లెండి. వదిన వాళ్ళూ వచ్చాక వెళ్దాం."
"వాళ్ళు వస్తే మళ్ళా వెళ్ళకూడదా? ఏం భాగ్యం? పదండి. అలా షికారు గా వెళ్ళి వద్దాం. మా ఆనకట్ట ప్రాంతాలు అవీ చూపిస్తాను."
సుజాత సంశయంగా లేచి నిలబడింది.
"వెళ్ళిరా, అమ్మా! ఆ ఆనకట్ట లూ అవీ చూడవలసినవేను" అంది చంద్రశేఖరం తల్లి. ఆవిడ అపార్ధం చేసుకున్తుందేమోనన్న శంక తీరగానే స్లిప్పర్సు తొడుక్కుని బయల్దేరింది సుజాత.
ప్రశాంతంగా ప్రవహిస్తున్న నది ఒడ్డు వెంట నడుస్తుంటే అంది సుజాత; "ఎక్కడైనా కాస్సేపు కూర్చుందాం."
"ఏం ? అప్పుడే అలిసిపోయారా? ఇంకా కాస్త దూరం నడవండి. అక్కడ కూర్చుందాం. బావుంటుంది" అంటూ ముందుకు సాగాడు శేఖరం.
వెళ్లి వెళ్లి గుబురుగా వున్న చెట్ల నీడన ఆగాడు.
"ఇక్కడ నించుని , ఒక్కసారి నది కేసి, పరిసర ప్రాంతాల కేసీ చూడండి. ఉత్త కళ్ళతో కాదు. కళా హృదయంతో చూడండి. ఎంత మనోహరంగా కనిపిస్తుందో!"
'అలాంటి కళా హృదయం నాకు లేదే!"
"పోనీ, ఎలాంటి హృదయం ఉంది మీకు?"
"రక్తాన్ని శుద్ధి చేసి శరీరానికి సరఫరా చేసే హృదయం! "లూబ్ డబ్ లూబ్ డబ్" అంటూ కొట్టుకునే హృదయం...."
"ఆగండి, ఆగండి . మనం బొత్తిగా అంత పచ్చి నిజాల జోలికి పోవద్దు. ఇక్కడ కూర్చున్న కాస్సేపూ ప్రకృతి అందాలు తిలకించటానికే ప్రయత్నిద్దాం . ఏమంటారు?"
"సరే నంటాను. ఆ అందాలు తిలకించటం ఎలాగో కూడా మీరే చెప్పండి. ఉన్న కళ్ళు పనికి రావనీ, మనో నేత్రంతో చూడాలనీ-- కళ్ళు మూసుకు నడవ మనకండి సుమా!"
"మీరలా అభ్యంతరాలు చెప్పరాదు మరి. ఏం చెప్పినా వినాలి. చూడండి, ఆ నది వెన్నెలలా ఎంత ప్రశాంతంగా, హంస లా ఎంత వయ్యారంగా....."
"ప్లీజ్ , ఆగాలి ఒక్కసారి. హంసని మీ రేప్పుడైనా చూశారా?"
"ఏం? ఎందుకూ?"
"హంస ఎలా వుంటుందో తెలీకుండానే అది ఎలా నడుస్తుందో చూడకుండానే దానితో పోలుస్తా రెందుకూ?"
"అన్నీ మనం చూడగలమంటారా?"
"అదేం నాకు పనికి రాదు. మీ కళ్ళకి ఎలా కనిపిస్తోందో , మీ మనస్సుకి ఎలా తోస్తోందో మాత్రం చెప్పండి. వింటాను."
"బావుంది . అయితే అటు చూడండి, దిగువ లోయలోకి. పాతాళం లా లేదూ? అందులోనే ఎత్తుగా ఎదిగిన ఆ చెట్లు శాప గ్రస్తులైన గందర్వుల్లా లేవూ?"
ఉస్సురని నిట్టూర్చింది సుజా. "అదే వద్దన్నాను. పాతాళాన్ని మీరు చూశారా? పోనీ, శాపాలైనా విన్నారా?"
"అయితే నా వల్ల కాదు, మీ కళ్ళ తో మీరే చూసుకోండి."
"నా కళ్ళ కేం వెర్రి వెర్రిగా కనిపించటం లేదే! నది నిండా నీళ్ళూ గట్టు నిండా చెట్లూ...."
"అందుకే మీది కళా హృదయం కాదని నే నెప్పుడో చెప్పాను." ఫక్కుమని నవ్వుకున్నారిద్దరూ.
అ ఇద్దరూ నించున్న ఆ విశాల వృక్షం దూరదూరంగా కొమ్మలు చాచుకుని పచ్చని పెళ్ళి పందిరి లా ఉంది. మనుషుల అలికిడికి రకరకాల పక్షులు మధుర మధురంగా పెళ్ళి సందరిలా అరుస్తూ ఎగురుతున్నాయి. శ్రావ్యంగా ధ్వని చేసుకుంటూ మంద మందంగా సాగుతుంది నదీ ప్రవాహం. ప్రేమికుల మూగ భాషలా ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉన్నాయి దూరంగా కనిపిస్తున్న దృశ్యాలు.
"ప్రకృతీ పురుషుడూ ఒక్కటే అంటారు . ఇదంతా ప్రకృతే అయితే పురుషుడేడీ?"
"వెదుకుదాం రండి. కాస్త పైకి వెళ్దాం."
ఆనకట్టల వరకూ నడిచా రిద్దరూ . చంద్రశేఖరం తన ఇంజనీరింగ్ స్కిల్ అంతా బోధించబోయాడు.
ఇబ్బందిగా మొహం పెట్టింది సుజాత. "మన్నించాలి. నేను ఇంజనీరుని కాబోటం లేదు."
"మీరే మన్నించాలి. నేను ఇంజనీరు ని కదండీ మరి?"
"ప్లీజ్, నా ప్రాణాలు తియ్యమని మాట ఇవ్వండి."
"నా ప్రాణాలైనా తీసి మీకు పోస్తాను సరేనా?"
"అదీవద్దు. నా ప్రాణాలు నాకే ఉంచరూ?"
నవ్వుతూ ఒత్తుగా పెరిగిన పచ్చగడ్డి మీద కూర్చున్నారిద్దరూ. సుజా ఓ గడ్డి పరక తెంచి కొరుకుతూ దూరంగా చూడసాగింది.
"మీరేమీ అనుకోనంటే మీరు గడ్డి పోచ కోరికే దృశ్యం నా కళ్ళ కేలా కనిపిస్తోందో , నా మనస్సు కేలా తోస్తోందో చెప్పమంటారా?"
"నిరభ్యంతరంగా చెప్పండి."
"గత జన్మ లక్షణాలు కొన్ని మీలో మిగిలి పోయాయేమోనని...."
కిలారుమంటూ నవ్వింది సుజా. "నిజం . మీ మొహంలోకి చూస్తోన్న కొద్ది ఆ గత జన్మ స్మృతులన్నీ నిజంగా నాకు గుర్తు వస్తున్నాయి. అప్పుడు.... నేను.... గంగి గోవు ని....మీరు.....మీరు....."
"అబోతునా?' పకపకా నవ్వాడు చంద్ర శేఖరం.
"లాభం లేదు. మీకూ మాట్లాడం వచ్కని తెలిసిపోయింది. ఇక నేనేం మాట్లాడలేను."
"ఫర్వాలేదు లెండి . ఎలా మాట్లాడుకున్నా ఇద్దరి భాషా ఒక్కటే. జంతు భాషా!"
"మన స్మృతులు ఇంకా ఏమైనా గుర్తు వస్తాయేమో? చూసుకుందాం రండి."
తిరిగి తిరిగి ఇంటికి చేరేసరికి దీపాలు కాంతిగా వెలిగెంత చీకటి అలుముకుంది.
* * * *
జానకీ సుజాతా ఇంటికీ వెళ్ళిపోయే రోజు . ప్రయాణానికి రెండు మూడు గంటల వ్యవధి ఉంది.
"ప్రత్యేకంగా నా బహుమతి మీకు. "ఓ అరడజను మంచి మంచి పుస్తకాల బంగీ చంద్ర శేఖరం సుజాతకు అందించబోయాడు.
"ఎందుకండీ? మీ లైబ్రరీ లో మళ్ళా ఇవి కొరత.' తీసుకోవటానికి నిరాకరించింది సుజాత.
"బహుమతులు ఇచ్చేవాళ్ళు మనస్పూర్తిగానే ఇస్తారు. తిరస్కరించటం మర్యాద కాదు."
అప్పటికీ ఆ బంగీ అందుకోలేదు , సుజా.
"నేను ఇస్తున్నాను మీకోసం. తీసుకోరా?"
సుజా, శేఖరం కళ్ళలోకి చూసింది. 'నేను ఇస్తున్నాను.' అ మాటల్లో ఏదో గూదార్ధం దాగి వున్నట్టు ధ్వనించింది.
అటుగా వచ్చిన జానకి సంగతంతా తెలుసుకుని, "బెట్టు చేయక తీసుకోవమ్మా! పుస్తకాల పురుగువేగా? తగ్గ బహుమానమే ఇస్తున్నాడు"అంది వంత పాడుతూ.
సుజా చెయ్యి చాచి బంగీ అందుకుంది. ఇచ్చిన సంతృప్తి చంద్రశేఖరం మొహంలోనూ, తీసుకున్న సంతోషం సుజా మొహంలోనూ స్పష్టం గానే కనిపించాయి. చంద్రశేఖరం అక్కడి నుంచి వెళ్ళినట్టే వెళ్ళి అంతలోనే మళ్ళా వచ్చాడు "జానకి లేదా?"
"వసుంధర పిలిస్తే వెళ్ళింది."
మరో గంటలో వెళ్ళబోతున్న సుజాతతో చాలా మాట్లాడాలనిపించింది చంద్రశేఖరానికి. కాని, సుజా మొహానికి పేపరు అడ్డంగా పెట్టుకు కూర్చుంది. చంద్ర శేఖరం అలా ఏదో వెతుక్కుంటూన్నట్టు తిరగటం సుజాకు వింతగా ఉంది. అస్తమానూ తనను పలకరించే అవకాశం ఇవ్వకుండా పేపరు నీడలో తల దాచుకొంది.
నిట్టూర్చి లేచి వెళ్ళిపోబోయాడు చంద్ర శేఖరం.
సుజా పేపరు తీసోతో, "అదేం? వెళ్ళిపోతున్నారు? కూర్చోకూడదు?"అంది మర్యాద కోసం.
"ఎందుకులెండి? నాతొ మాట్లాడటం మీకెలాగూ ఇష్టం లేదు . చదువుకోండి . వెళ్తాను."
"చ! ఇష్టం లేకపోవటం ఏమిటి? ఎవరన్నారు?"
"ఎవరో అనటం దేనికీ? నే నామాత్రం తెలుసుకోలేనూ? ఎలాగూ మీరు వెళ్ళే పోతున్నారు. నిజంగా నాకెంత బాధగా ఉందొ మీకు తెలిస్తే ఇలా ప్రవర్తించరు." వసుంధర కొత్తగా వెళ్ళిన రోజు కనిపించిన అమాయకత్వమే కనిపించిందా మొహంలో. అలాంటి పసితనమే ధ్వనించిందా మాటల్లో.
"నేను వెళ్తోంటే మీకు బాధ దేనికీ?"
"అది తెలిస్తే బాగానే ఉండేది."
"చుట్టం చూపుగా వచ్చిన వాళ్ళు వెళ్ళకుండా ఉండి పోతారా మీ ఇంట్లో? పెళ్ళికి వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోతుంటే మీరిలాగే బాధపడ్డారా ?" గంబీరంగా చూసింది.
"అదే నేనూ తర్కించుకుంటున్నాను. మీరు వెళ్ళిపోతారంటే నా కెందు కింత బెంగగా ఉందొ అర్ధం కావటం లేదు. పోనీ, పుస్తకాలు జాగ్రత్తగా ఉంచుకుంటారు గదూ? నేను గుర్తు ఉంటాను."
చురుగ్గా చూసింది సుజాత. 'అంత నమ్మకం లేని వ్యక్తుల కెప్పుడూ బహుమతులివ్వకండి."
అతని కళ్ళలో ఎర్ర చారలు తేలి ఏడవటానికి సిద్దంగా ఉన్నాయి. "క్షమించండి, సుజాత! నేనేం మాట్లాడుతున్నానో నాకే తెలీటం లేదు." అతని గొంతు కూడా దాదాపుగా పూడుకు వచ్చింది.
సుజాత పేపరు పడేసి లేచింది. చంద్రశేఖరానికి కాస్త దగ్గరగా వెళ్ళింది. "చూడండి . మీరు నిజంగా బాధ పడుతున్నారు తప్పు కదూ? మిమ్మల్ని నేను మరిచి పోతానా? ఎప్పుడూ కాదు. నా మాట నమ్మండి. ఛ! ఎందుకంత దిగులు? అయినా మిమ్మల్ని నేనెలా మరిచి పోతానను కున్నారు? ఇద్దరిదీ ఒక్క జంతుజాతీ , ఒక్క జంతు భాషా."
విషాదం గానే నవ్వాడు చంద్రశేఖరం.
ట్రెయిన్ కదులుతుంటే కనిపిస్తూన్నంతసేపూ బయటికి చూసింది సుజాత. "మిమ్మల్ని విడిచి ఇలా వెళ్ళి పోవటం నాకూ బాధగానే ఉంది. నిజం" అని చెప్పాలని పించింది ఆఖరి క్షణాల్లో. వీలు కాలేదు. ప్లాట్ ఫారం మీద మూగవాడిలా నించున్న శేఖరం దూరం దూరం అయిపోయాడు.
"ఏమిటా ఆలోచన? చేతులు లోపలికి పెట్టుకు. సరిగ్గా కూర్చో. ఎలా వుంది పెళ్ళి ప్రయాణం?" అంటూ మాటల్లోకి దించింది జానకి.
* * * *
వారం తిరక్కుండా సుజాత కో ఉత్తరం వచ్చింది. అది చంద్రశేఖరం వ్రాసిందని తెలీగానే సుజా హృదయం ఆగిపోయినట్ట యింది. భయం భయంగా మేడ మీదికి పరిగెత్తింది .
"సుజాతా!
మీ అనుమతి తీసుకోకుండా ఇలా ఉత్తరం వ్రాసినందుకు ముందు నన్ను క్షమించమని కోరుకుంటున్నాను. మీరు వెళ్ళిపోయిన రోజు నేను అన్నం తిన లేక పోయానంటే, నిద్రే రాలేదంటే నమ్ముతారా? అసలిలా ఉత్తరం వ్రాడ్డామనే ఉద్దేశ్యం కూడా నాకు లేదు. ఉంటె ఇక్కడే మీ అనుమతి కోరేవాణ్ణి. ఎందుకో ఇప్పటికిప్పుడు మీకు వ్రాయాలని పించి ప్రారంభించాను.
వసూ లేనప్పుడు మీరు మా యింట్లో ఉంటే ఎంతో తృప్తి కలిగింది నామట్టుకు నాకు. అమ్మ కూడా మీరు ఉన్న నాలుగు రోజులూ ఇల్లు కళగా ఉందని పదే పదే అంటుంది.
ఈ నాలుగైదు రోజుల నుంచీ నా మనస్సు స్థిమితంగా లేదు. నేనేదో పోగొట్టుకున్నాను. వెదికి తెచ్చేసుకోవాలి. ఈ బాధా, ఈ ఆత్రుతా వెల్లడించుకోలేను. అసలేం పోగొట్టుకున్నాను? తెలిస్తే తప్పకుండా తెచ్చుకోటానికి ప్రయత్నిస్తాను.
ఏమిటో పిచ్చి పిచ్చిగా వ్రాస్తున్నాను కదూ? నిజమే. నాకేమీ తోచటం లేదు. అంతా పిచ్చిగానే కనిపిస్తుంది. మీరు ఇక్కడే ఉండి, మనం మళ్ళా అలా నది కేసి నడిచి వెళ్తే? మీరు గంగి గోవు లా గడ్డి పరకలు కొరుకుతూ నా మొహం లో గత స్మృతులు వెదుక్కుంటే? ప్రకృతి కి తోడుగా పురుషుణ్ణి వెదుకుతూ మీరు మనస్సంతా విప్పి ఫక్కుమని నవ్వితే? ఒక్కసారి అదంతా మళ్ళా జరిగితే? బావుండు ననిపిస్తుంది నాకు. మీరు చుట్టం చూపుగా మళ్ళా రాకూడదూ? పోనీ, మా యింట్లో మరో పెళ్ళి చేసి మిమ్మల్ని పిలుద్దామా అంటే నేను తప్ప ఎవ్వరూ లేరు. నేనే పెళ్ళి కొడుకునై మిమ్మల్ని పిలిస్తే బావుంటుందా? బావుంటుంది కదూ? పోనీ, మీరే పెళ్ళి కూతురై నన్ను పిలిచినా వస్తాను తప్పకుండా.