Previous Page Next Page 
స్త్రీ పేజి 46

 

    "అప్పుడే తొమ్మిదయిందా?' అంటూ ఆశ్చర్య పోయింది సుజా.
    "ఆ అవుతోంది. ముహూర్తం కాస్తా ముగిసిపోతే వడ్డనలు ప్రారంభించాలి. మీరసలు మధ్యాహ్నం టిఫినైనా తీసుకున్నారా?"
    సుజాత కెందుకో తలనొప్పి చాలా ఎక్కువగా ఉంది. నిద్రపోయి లేచినా తగ్గినట్టు లేదు. చేసేది లేక చంద్రశేఖరం తోనే అంది: "మీదగ్గర తలనోప్పిమాత్ర లేమైనా ఉన్నాయా?"
    "ఏం? మీకు తలనొప్పి ఉందా? ఎప్పట్నుంచి?"
    "ఇప్పుడే లెండి. కాస్త నొప్పిగానే ఉంది. మాత్రా వేసుకుంటే బావుంటుందేమో?"
    "సరే! ఇక్కడే కూర్చోండి. ఇప్పుడే వస్తాను. గదిలో లైటు వేసుకోండి."
    పది నిమిషాల్లో ఓ గాజు గ్లాసుతో వేడి వేడి కాఫీ , రెండు మాత్రలూ తీసుకు వచ్చాడు చంద్రశేఖరం.
    "మిమ్మల్ని చాలా శ్రమ పెట్టాను. ఇప్పుడు కాఫీ...."
    "పెళ్లింట్లో కాఫీ టీల కి టైమేమిటండి? తెల్లవార్లూ ఉంటాయి. శుభ కార్యానికి మీరు మా యింటికి వస్తే మీ మంచి చెడ్డలు చూసుకోవలసిన ధర్మం మాది కాదూ? మరి, నాకు పనుంది. వెళ్తాను. కాఫీ తాగి కాస్సేపు కూచునే రండి. ఫర్వాలేదు."
    సుజాత మాత్రలు మింగి వేడి వేడి కాఫీ తాగింది. కూజాలో చల్లటి నీళ్ళు వంచుకుని కిటికీ దగ్గర మొహం కడుక్కుంది. కాస్సేపటికి తేలిగ్గా ఉన్నట్టు తోచి అద్దం ముందు నిలబడి ఒక్కసారి జుట్టు సర్దుకుని గది తలుపులు దగ్గరగా వేసి పందిట్లోకి బయల్దేరింది.
    పందిరి మధ్య ఎత్తుగా అమర్చిన పూల మందిరం లో వధూవరులు సింగారించిన బొమ్మల్లా కూర్చుని ఉన్నారు. కాలేజీ అబ్బాయిల నెందరి నో ఏడిపించిన వసుంధర బొత్తిగా అమాయకంగా తల దించుకుని బుద్దిగా కూర్చుంది.
    తనలో తనే నవ్వుకుంది సుజాత.
    బాండు మేళం ఉలిక్కిపడ్డట్టు ఒక్కసారిగా తారాస్థాయికి లేచింది. మేళతాళాల మధ్య ఎవరి గొంతు వాళ్ళకే వినిపించటం లేదు. వరుడు లేచి ధగధగ లాడే మంగాల్యాల పసుపుతాడు పురోహితుడి చేతుల్లోంచి అందుకున్నాడు.
    వసుంధర సిగ్గుతో మొగ్గలా ముడుచుకు పోయింది. నూతన వధూవరుల మీద అక్షింతల వర్ధం కురిసింది. వరుడు మాంగల్యం ముడి వేస్తుంటే పై నుంచి పువ్వుల జల్లు పడింది. గుప్పెడు మల్లెలు వరుని జుత్తు మీద నిలిచి పోయాయి. ఓ గులాబీ వధువు పాపిడి లో చిక్కుకుంది.
    సుజా చేతిలో అక్షింతలు అలాగే ఉన్నాయి.
`    ఈ కళ్యాణ కాండలో ఎంతటి మర్మం దాగి ఉందొ! ఇక ఆ వ్యక్తులిద్దరూ ఒక్కటిగానే జీవించాలి. ఒకరు రూపం, ఒకరు ఛాయ!
    ఒకరు చూపు, ఒకరు తావి!
    ఒకరు తనువూ, ఒకరు మనసు!
    చటుక్కున పద్మజ మెదిలింది సుజా గుండెల్లో. 'అక్కయ్య కూడా అలా తల దించుకు పెళ్ళి పీటల మీద కూర్చుని ఉంటే అమ్మ ఎంత సంతోషించేదో!"
    "జానకి మండపం దగ్గరే ఉందండీ! ఇక్కడ నిలబడి పోయారేం?' వెళ్ళుతున్న చంద్రశేఖరం ఆగి అడిగాడు.
    "ఫర్వాలేదు . ఇక్కడికి బాగా కనిపిస్తోందిగా?"
    "మీ తలనొప్పి తగ్గిందా?"
    "ఆ ఇప్పుడు తేలిగ్గానే ఉంది."
    చంద్రశేఖరం వెళ్ళిన కాస్సేపటికి జానకి వెతుక్కుంటూ వచ్చింది. "నీ మూలంగా నేను చివాట్లు తినలేక చస్తున్నాను. ఇలా స్తంభాలు పట్టుకు వెళ్ళాడటం ఫాషనా ఏమిటి? నిన్ను ఎక్కడి కక్కడే వదిలేసి తిరుగుతున్నానని అయన గారు నన్ను సతాయిస్తున్నాడు. రా తల్లీ! అక్కడికి వెళ్దాం. పెళ్ళి కూతురితో ఉంగరాలు తీయించాలి." అంటూ బలవంతంగా సుజా చెయ్యి పట్టుకుని లాక్కుపోయింది.
    పెళ్ళికొడుకునూ, పెళ్ళి కూతుర్ని అంత దగ్గరగా చూడటానికి సిగ్గు వేసింది సుజాత కు. నెమ్మదిగా వదిన గారి చెయ్యి వదిలించుకుని కాస్త వెనక్కు వెళ్ళి నించుంది.
    తెల్లవారుజామున నిద్రకు ఉపక్రమిస్తూ అంది జానకి: "సుజా! నీకో మాట చెప్తాను. ఏమీ అనుకోవుగా?"
    "ఏమిటి వదినా? నేనేం అనుకుంటాను?"
    "అది కాదమ్మా! రేపే వసూని అత్తారింటికి తీసుకు పోతారట. తనతో నన్నూ రమ్మంటోంది. నిన్ను అడిగి చెప్పవచ్చునని ఏమాటా చెప్పలేదు నేను. తిరిగి వచ్చేవరకూ నువ్వు ఉండగల నంటే....."
    "నేను ఒక్కదాన్నీనా?"
    "నీకు ఇష్టం లేకపోతే నేను వెళ్ళననుకో. అయినా నీకేం భయం? వసూ వాళ్ళ అమ్మా, అన్నయ్యా అంతా వేయి కళ్ళతో చూసుకుంటారు. లేకపోతె నేను మాత్రం వదిలేసి వెళ్తానా?"
    "మాళ్ళా ఎప్పుడొస్తావు?"
    "అక్కడ మూడు నిద్రలూ కాగానే నాలుగో నాటికి అంతా కలిసి వచ్చేస్తాం గా? రాగానే మన ఊరు వెళ్ళిపోదాం , ఏమంటావు?"
    "సరేలే. అలాగే ఉంటాను."
    "నిజంగా నీ ఉద్దేశ్యం చెప్పు. నువ్వు ఉండలేనన్నా నేనేం అనుకోను."
    "పోనీ, వదినా! నేను మీ వాళ్ళింటి కెళ్ళి వుంటే?"
    "ఎక్కడున్నా ఒక్కటే , సుజా! అమ్మా వాళ్ళ కన్నా వీళ్ళెం పరాయి వాళ్ళు కారు. ఈ పెళ్ళి గొడవలతో వసూ అమ్మగారు అన్నీ చూసుకోలేక పోతున్నారు గానీ లేకపోతె ఆవిడ ఒక్క క్షణం ఆదమరిచి ఉండదు. ఇక్కడైతే తీరిగ్గా కూర్చుని పుస్తకాలూ అవీ చదువుకోవచ్చు. నీ యిష్టం. మా వాళ్ళింట్లో ఉంచటం నిజంగా నా కిష్టం లేదు. ఎందుకో చెప్పమంటావా? మా బామ్మా వాళ్ళూ వెనకటి గొడవలన్నీ తవ్వి నానా ప్రశ్నలూ వేస్తారు. వాళ్ళ విమర్శలకి నాకే బాధగా ఉంటుంది గదా -- ఇక నువ్వయితే తట్టుకోలేవు. అదంతా ఆలోచించే నేను...."
    "సరే, వదినా! నీ యిష్టం! ఇక్కడే ఉంటాను."
    "ధైర్యంగా ఉంటావు కదూ?"
    "నాకేం భయం? చిన్న పిల్లనా?" సుజా ధైర్యంగానే ఒప్పుకుంది.
    మర్నాడు మధ్యాహ్నం రైలుకు పెళ్ళి కూతురి తో సహా పెళ్ళి వారంతా బయల్దేరారు. చాలావరకూ చుట్టాలు కూడా వాళ్ళతోనే ప్రయాణ మయ్యారు. చంద్రశేఖరం పెళ్ళి కూతుర్ని సాగ నంపటానికి వెళ్ళాడు. వసుంధర తల్లి సామాను గదిలో ఏమిటేమిటో సర్దు కుంటుంది.
    సుజాత నిశ్చింతగా పుస్తకాల గదిలో కూర్చుంది. చంద్రశేఖరం స్టేషన్ నుంచి తిరిగి వచ్చాడు. వంటింటి వేపు వెళ్ళి ప్రయాణం విషయాలన్నీ తల్లికి చెప్పాడు. తర్వాత తన గది ముందుకు వచ్చి నిలబడుతూ "రావచ్చు నంటారా?" అన్నాడు సుజాతను ఉద్దేశించి.
    పుస్తకం లోంచి తలెత్తి చటుక్కున లేచి నిలబడింది సుజాత. "రండి, రండి. అలా నిలబడిపోయారేం?' అంది. చంద్రశేఖరం గదిలోకి  వచ్చి ఓ కుర్చీ లాక్కుని కూర్చుంటూ అన్నాడు. "ఇంటికి వెళ్ళగానే మీకు కనిపించమని చెప్పింది జానకి. రైలు కదిలేసరికి ఎన్ని సార్లు చెప్పిందనుకున్నారు?"
    "ఊ ట్రెయిను ఖాళీగా ఉందా?"
    "సీట్లు రిజర్వు చేయించాం కందండీ? ఫరవాలేదు. కూర్చోటానికి చోటు దొరికింది. ఇష్!" అంటూ అతను రుమాలుతో మొహం తుడుచుకున్నాడు. సుజాత చంద్రశేఖరం కేసి చూసింది. ఆ మొహం నిండా అలసటే కనిపించింది. కళ్ళు కూడా చెమర్చి ఎండిన వాటిలాగ తడిగా పొడిగా ఉన్నాయి.
    "ఈ పెళ్ళి పనులతో మీరు బాగా అలిసి పోయినట్టున్నారు. ఇక ఇవాళ్టినుంచీ కాస్త విశ్రాంతి తీసుకోవచ్చనుకుంటాను" అంది సానుభూతిగా.
    "అప్పుడే విశ్రాంతెక్కడండీ? వాళ్ళు తిరిగి రావాలి. బావగార్ని మర్యాదలు చేసి పంపించే వరకూ ఏ విశ్రాంతి లేదు."
    ఇంకేం మాట్లాడాలో తోచలేదు సుజాతకు.
    "పెళ్ళికొడుకు బుద్ది మంతుడిలాగే ఉన్నాడు లెండి. కాస్త లోటు పాట్లున్నా సర్దుకు పోగలడనుకుంటాను" అన్నాడు చంద్ర శేఖరం.
    "సర్దుకుపోక చేసేదేముంది? ఏ లోటూ రాకుండా ఎవరు చూడగలరు?"
    సుజా మాటలకు అడ్డు వచ్చాడు శేఖరం. "అలా అనకండి. అల్లుడి హోదాతో ఉన్న కాస్సేపూ ఏదైనా చెయ్యగలడు. అదో రాజ శాసనమే. ఈ ఆడపిల్లలతో ఎన్ని సమస్యలనుకున్నారూ? వాళ్ళ కోసం ఏదైనా భరించాలి."
    సుజా మాట్లాడకుండా ఊరుకుంది.
    "మన పెద్ద వాళ్ళేది చెప్పినా అందులో ఎంతో నిజం ఉండి తీరుతుంది లెండి. ఎదిగిన ఆడపిల్ల గుండెల మీద కుంపటేనంటారు. అలాగే అనుకుని వాళ్ళకి పెళ్ళి చేసి పంపెయ్యాలని ఆరాట పడతాం. తీరా ఆ కుంపటి కాస్తా దింపేసుకుందామా అంటే చేతులాడవు. ఎవ్వరూ లాక్కుపోకుండా దాచేసుకోవాలని పిస్తుంది."
    చంద్రశేఖరం మాటలు ఆసక్తిగా వింటూ కూర్చుంది సుజాత.
    "మా వసూ ఆ కొత్త వ్యక్తీ పక్కన కూర్చుని వెళ్ళి పోతుంటే నిజంగా .... ఎంత బాధ కలిగిందనుకున్నారు? దుఃఖం వచ్చేసింది.
    తెల్లబోయింది సుజాత. అతనలా కళ్ళు తుడుచుకుంటుంటే సిగ్గు కూడా వేసింది. "అదేమిటి? మీరు....ఏడుస్తున్నారేమిటి?" అంది నవ్వబోతూ.
    "ఛ! లేదండీ! ఏడవటం కాదు." అతని కంఠస్వరం చాలా బాధగా మారింది. "ఏదో బాధగా ఉంది. వసూ నేనూ ఎప్పుడూ ఇలా విదిపోలేదంటే నమ్మండి. ఇప్పుడిక మా యిద్దరికీ ఏం సంబంధం ఉంది? తను పెళ్ళి చేసుకుని అందర్నీ విడిచి వెళ్ళే పోయింది."
    చంద్రశేఖరం మొహం నిండా ఏదో అమాయకత్వం నిండుకుంది. 'నా తాయిలం ఎవరో ఎత్తుకు పోయారు చూడమ్మా!' అని ఫిర్యాదు చేసుకునే పసి పిల్లవాణ్ణి గుర్తు చేస్తుంది. ఆ మొహం చూస్తున్న కొద్దీ జాలివేసినా కొంచెం నవ్వుతూనే అంది సుజాత.
    "మూడు రోజుల్లో వచ్చేస్తారు కదండీ!"
    "వస్తే మాత్రం ఎంతకాలం ఉంటుంది. చెప్పండీ? మళ్ళా తనతోనే తీసుకు పోతానంటాడో ఏమో వాళ్ళాయన! అలాగే కనిపించాడు . అస్తమానూ దానికేసి చూట్టం, నవ్వటం .....ఏమంత మంచివాడిలా లేడు."
    ఫక్కుమని నవ్వేసింది సుజాత. బిత్తరపోయాడు చంద్రశేఖరం. నవ్వు ఆపుకోలేక పోయి నందుకు సిగ్గు పడిపోయింది సుజా. తన పొరపాటు గ్రహించుకుని తనూ నవ్వుతూ అన్నాడు చంద్రశేఖరం : " ఓ నెల్లాళ్ళలో ఇద్దరూ కలిసే వెళ్తారు. వాళ్ళకో ఇల్లూ సంసారం అన్నీ ఏర్పాటై పోయాయి."
    "మీరేగా అవన్నీ ఏర్పాటు చేశారు?"
    "నిజమే. ఇంత తొందరగా పెళ్ళెందుకు చేశామా అనిపిస్తోందిప్పుడు. ఇక ఏమనుకుంటే ఏం లాభం?" తనను తనే ఓదార్చుకున్నాడు శేఖరం. "అమ్మ అసలే బాధ పడుతోంది. స్టేషన్ నుంచి రాగానే చెప్పటానికి వెళ్తే ఏడుస్తూ కూర్చుంది. నాలుగు మాటలు చెప్పేసి ఇలా వచ్చాను."
    సుజా మనస్సు ఆర్ద్రమైంది. చంద్రశేఖరాన్ని తనేమైనా ఓడర్చితే బాగుండు ననిపించింది. అతని మొహంలోకి మృదువుగా చూస్తూ అంది: "వసుందర కేమండీ! ఎక్కడున్నా సుఖంగా ఉంటుంది. మీ అందరి ఇష్ట ప్రకారం పెళ్లి చేసి పంపించారు. వస్తూ ఉంటుంది. వెళ్తూ వుంటుంది." ఆ మాటలు అన్నదే గానీ అంతలోనే సుజా మొహం పాలిపోయింది.
    'ఆనాటి నుంచీ అక్కయ్య మా యింటి గడప ఎక్కనే లేదు, చూశారా?" అని ఎడ్చేయ్యాలనిపించింది.
    కళ్ళెత్తి చంద్రశేఖరాన్ని చూస్తె అతను తనకెంతో ఆప్తుడై సన్నిహితంగా ఉన్నట్టూ, తన బాధ చెప్పుకుంటే అతను మాత్రమే అర్ధం చేసుకోగలిగేట్టూ అనిపించింది.
    "కాస్సేపలా మొక్కల కేసి వెళ్దాం , వస్తారా?" అంటూ లేచాడు చంద్రశేఖరం.
    అతని మాట కాదనలేక పోయింది సుజా' వసుంధర కో అన్నయ్య ఉన్నాడని ఎప్పుడో తెలిసిన కబురే అయినా, ఆ అన్నయ్య ఇంత మెత్తని మనస్సు కల సహృదయుడనీ, బాధ్యతలన్నీ నిర్వర్తించగల సమర్ధుడనీ , కష్టసుఖాలు అర్ధం చేసుకో గల వివేక వంతుడని , ఎదుటి హృదయాన్ని ఆకర్షించ గలిగే అందగాడనీ స్వయంగా అర్ధమైంది సుజాత కు. అతనితో కలిసి తోటకేసి నడిచింది.
    సంధ్య వెలుగు లో కేంపుల్లా మెరుస్తూ పిల్ల గాలి తాకిళ్ళ కు వయ్యారంగా కదులుతూ, ఆకుల మద్య దాగి విస్మయంగా లోకాన్ని పరికిస్తున్నాయి గులాబీ పువ్వులు.
    చంద్రశేఖరం ఒక గులాబీ తెంచి సుజాత కు అందించాడు. సుజా దాన్ని ఒక్కసారి ఆఘ్రాణించి జడ మీద సర్దుకుంది.

 Previous Page Next Page