సుజా! నా బాధ మీకు ఎలా చెప్పుకోను? ఇంత మధురామైన బాధకు ఇంత సున్నితమైన భాష లేదే! మూగ భాష ఒక్కటే దానికి శరణ్యం కావచ్చు. ఈ చిన్న లేఖ నా హృదయాన్ని మీ పాదాల ముందు పరిచి పెట్టగలిగితే ధన్యుణ్ణి! మెత్తమెత్తగా దాన్ని తొక్కుకుంటూ పోరుగా?
చంద్ర శేఖరం."
ఏదో ఉద్వేగంతో దుఃఖం పెల్లుబికి వచ్చింది సుజాతకు. ఆ ఉత్తరం లో అక్కడక్కడా కొన్ని కొన్ని మాటలు మళ్ళా మళ్ళా చదువుకొంది. నిశ్శబ్దంగా అలా ఆకాగితాల కేసి చూస్తూ కూర్చుంది చాలా సేపు. చటుక్కున కలం తీసుకుంది చేతిలోకి.
"చంద్రశేఖరం గారికి,
హృదయపూర్వక నమస్కృతులతో. మీ ఉత్తరం చదివాను. చాలాసార్లు చదివాను. మీరెందుకు కలా వ్రాశారో అర్ధం కాలేదు. అర్ధం కానందుకు కన్నీళ్లు కూడా వచ్చాయి.
ఆనాడు రైలు కదిలి పరిగెత్తుతుంటే, మీరు క్రమంగా దూర దూరం అయిపోతుంటే నాకెంతో బాధ వేసింది. మీరూ మాతో పెళ్ళి వారిలా ప్రయాణం చేస్తుంటే బావుంటుందని పించింది. ఆ మాటే మీతో చెప్పాలను కుంటే మీరు లేరు. పాపిష్టి రైలు శరవేగంతో మీనుంచి దూరంగా లాక్కుపోసాగింది నన్ను. మీరు ఇంటికీ పోయి హాయిగా ఉంటారని ఈర్ష్య పడ్డాను కూడా.
అర్ధం లేని బెంగలతో ఉపవాసాలూ, జాగారాలూ చెయ్యటం వివేకం అనిపించుకోదు. అది నావంటి అవివేకులకు చెల్లుబడి గానీ మీలా ఎన్నో చదువులు చదివిన వారికీ, ఎంతో జ్ఞానం తెలిసిన వారికీ సమంజసం కాదు. మీరేదో పోగొట్టుకున్నానని వ్రాశారు. వేదుక్కోవాలని కూడా వ్రాశారు. లేదు, మీరేమీ పోగొట్టుకుని ఉండరు. ఒక్కోసారి మన వస్తువులు మన దగ్గరే ఉంచుకుని పిచ్చి వాళ్ళ లాగే ఎక్కడెక్కడో వెదుక్కుంటూ కూర్చుంటాము. కొన్నాళ్ళ కి పరధ్యానం పోయి మీరేమీ పోగొట్టు కోలేదని తేలిగ్గా నవ్వుకుంటారు.
నిజమే! మీరన్నట్టు ఆడపిల్లలు ఇంట్లో తిరిగితే చాలు కళ వస్తుందంటారుపెద్ద వాళ్ళు. అలాంటప్పుడు ఏ ఆడపిల్ల ఏ యింట్లో తిరిగినా కళ రావాలిగా? ఊహూ! అలా ఒప్పుకోరు. ఎన్నెన్నో బరువులూ, బంధాలూ పెడతారు. ఎన్నెన్నో నియమాలు నిబంధనలూ విధిస్తారు. మరెన్నో రీతులూ రివాజులూ వల్లే వేస్తారు.
మీ యింటికి మరోసారి రమ్మంటారా నన్ను? మీరే పెళ్ళి కోడుకై నన్ను పిలుస్తా నంటారా? ఏం ప్రయోజనం? వసుంధర భర్త ఒక్క క్షణం కూడా విడవకుండా భార్య వెంట వెంట ఎలా తిరిగాడో మీరే చెప్పారుగా? అలాగే మీరు ఆవిడ కొంగు పట్టుకు తిరుగుతుంటే నా గతేం గాను? పోనీ, నన్నే పెళ్ళి కూతురి నై పిలవమంటారా? నేను పెళ్ళి సిగ్గుతో ముడుచుకు పోతుంటే మీతో మాత్రం ఎలా మాట్లాడగలను?
అయినా మీ రెందు కలాంటి ఉత్తరం వ్రాశారు> నాకు నచ్చలేదు. నిజంగా నచ్చలేదు. అన్నయ్యకు తెలిసినా, అమ్మకు తెలిసినా -- భయంతో నేను తల్లడిల్లి పోయానంటే నమ్ముతారా. ఊహూ! నా కిష్టం లేదు.'
క్షమిస్తారు కదూ?
సుజాత."
అవును, చంద్రశేఖరం తనకు ఉత్తరాలు వ్రాస్తే ఏం బావుటుంది? ఇంట్లో తెలిస్తే తనేం చెప్పగలదు? అందుకే నిర్మొహమాటంగా వ్రాయనే వ్రాసింది కదూ?
వారం దాటేసరికి మరో కవరు వచ్చి పడింది సుజాత పేర.
సుజాతా! సాహసించి ఈ ఉత్తరం వ్రాస్తున్నందుకు నన్నపార్ధం చేసుకోకు. నువ్వు నాకు బొత్తిగా పరాయిదానివి కాదు. జానకి నా చిన్ననాటి స్నేహితురాలు. అన్నయ్య కు జానకి కూడా ఓ చెల్లి వంటిదే! మా కుటుంబం తో స్నేహం చేసుకోవటానికి నీకు అభ్యంతర మేమీ ఉండదనుకుంటాను. అన్నయ్య ఉత్తరం కూడా ఇందులో జతపరిచి పంపుతున్నాను. తను నేరుగా వ్రాయటానికి ఇష్టం లేక నాకు ఇచ్చాడు. నీ జవాటు తిరిగి నా అడ్రస్ కే పోస్ట్ చేస్తే అన్నయ్యకు అందిస్తాను. ఈ వ్యవహారం మన ముగ్గురి మధ్యే ఉంటుంది. జానకి కి కూడా తెలియనీయనని మాట యిస్తున్నాను. నీ మనసును మభ్య పెట్టుకోకుండా నీ యిష్ట ప్రకారం ప్రవర్తించమని కోరుతున్నాను. వదిన కోరిక మన్నిస్తావని ఆశిస్తూ--
వసుంధర ."
నిర్ఘాంత పోయింది సుజాత.
వసుంధర తన కిలాంటి ఉత్తరం వ్రాయటంలో ఉద్దేశ్య మేమిటి? కేవలం అన్నగారి కోరికేనా? ఆ చంద్రశేఖరానికి ఇక ముందు కూడా తను ఉత్తరాలు వ్రాస్తుందా?ఎందుకని? ఇంత గోప్యంగా ఈ వ్యవహారం నడుపు కోకపోతే తనకేం నష్టం?
కవరు లోంచి రాలి పడ్డ మరో కాగితం తెరిచింది.
"సుజా!
మీ ఉత్తరానికి జవాబు వ్రాయకుండా నేను ఉండ లేననిపించింది. మీరు వ్రాసినంత తేలిగ్గా ఈ ఆలోచనలు మరిచి నవ్వుకోవటం నా వశం కాకపోవచ్చు.
వసు ద్వారా పంపుతున్న ఈ ఉత్తరాన్ని క్షమించి చదువు కుంటారని ఆశిస్తాను.
మీ జవాబు చూచి....."
ఎవరో వస్తున్న అలికిడైతే గబగబా చేతిలో కాగితం మడిచి పుస్తకంలో పెట్టి లేచి పోయింది సుజాత.
* * * *
దోషిలా తల దించుకు కూర్చున్న సుజాను చూస్తె ఎంతో జాలి కలిగింది పార్వతికి. కొంతసేపటికి ఏదో అభిప్రాయాని కిస్తూ అందిన "ఆ మొట్టమొదటి ఉత్తరాలతో నైనా నువ్వతని స్నేహం అపు జేయ్యాల్సింది,సుజా! చాలా పొరపాటు చేశావు."
సుజా తనను తను నిందించుకొంటున్నట్టు అంది: "నిజంగా పొరపాటే చేశాను, పార్వతీ! ఎప్పటి కప్పుడు నన్ను నేను హెచ్చరించుకొంటూ కూడా శేఖరం దగ్గర్నించీ వచ్చిన ఉత్తరాలకీ జవాబులు వ్రాయకుండా ఉండలేకపోయాను. నేను ఉత్తరాలు వ్రాయకపోతే అతను తిండి తినలేని పరిస్థితికి వచ్చాడు. అతనే మైపోతాడో నన్న బాధ తప్పితే మరేమీ ఆలోచించ లేకపోయాను. చివరి కిలా గాలిలో కొట్టుకునే దీపం లాగ దారీ తెన్నూ తోచక, మనస్సు విప్పి ఎవ్వరి తోనూ చెప్పుకోలేక , గుండెల్లో దాచుకోలేక -- అబ్బ! ఎంత నరాకయాతన అనుభవించా ననుకున్నావు! ఇప్పుడు నా కెంతో తేలికగా ఉంది. ఏదెలా జరిగినా నాకు మాత్రం హాయిగా ఉంది."
పార్వతీ మీ మాట్లాడలేదు.
"ఒక్కసారి జరిగినదంతా నెమరు వేసుకుంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంది. పార్వతీ!నేనేనా ఇంత సాహసం చేస్తున్నానని అపనమ్మకం కలుగుతోంది. నువ్వన్నట్టు ఆదిలో ఏమాత్రం నిగ్రహంతో ప్రవర్తించినా పరిస్థితి ఇంత విషమించేది కాదు. తప్పంతా నాదే, అక్కయ్యా! తప్పంతా నాదే!" సుజాతకు దుఃఖం ముందుకు వచ్చింది.
నిశ్చలంగా చూస్తూ అంది పార్వతి: "ఈ తప్ప ఎవరిదీ కాడు, సుజా! భగవంతుడిది. మనుష్యుల మధ్య ఇన్ని మమతలూ, బాధలూ , వేదనలూ సృష్టించిన వాడిది. ప్రకృతి ధర్మాలు మీరగలగటానికి మనమేం మానవా తీతులం కాదుగా?"
సజల నేత్రాలతో చూస్తూ అడిగింది సుజా:
"ఇప్పుడు నేనేం చేయాలి, అక్కయ్యా?"
అయోమయంగా చూసింది పార్వతి. అవును. సుజా ఏం చేయాలి? ఇప్పుడు సుజాకు మార్గం ఏది? ఏమని సలహా ఇస్తుంది తను? ఏం చేయమని బోధపరుస్తుంది? పద్మజ మాట మరిచి పోనేలేదే! పద్మ చేసిన సాహసం మళ్ళా సుజా చేస్తుందా? చెయ్యగలదా? పద్మను విమర్శించిన సుజా, పద్మను అసహ్యించుకున్న సుజా -- చివరికి పద్మ అడుగు జాడల్లోనే నడుస్తుందా?
నిశ్చలంగా నిలిచిన నీటిలో రాయి పడి కెరటాలు అల్లకల్లోలంగా లేచాయి.
"అయితే నువ్వేం చేయాలను కుంటున్నావు, సుజా?"
సుజా అధైర్యంగా నవ్వింది. "అది తెలిస్తే ఎందుకిలా బాధపడతాను?"
పార్వతి సానుభూతి గా అంది : "అతన్ని పెళ్ళి చేసుకోటానికి ప్రయత్నించలేవా?"
"నిరాశతో నిట్టూర్చింది సుజాత. "పెళ్ళి! ఎలా సాధ్యం?"
"సాధ్యనికేముంది? మనిషి తలపెడితే సాధ్యం కాని దేవటంది?"
"పార్వతీ! ఈ జీవితాని కది సాధ్యం కాదు. అలాంటి సాహసం జరగటానికి ఈ యింట ఒక్క అవకాశమే ఉంది. అది అక్కయ్య వినియోగించుకుంది."
"పద్మజ ని నువ్వు మనస్పూర్తిగా సమర్దిస్తున్నావు కదూ?"
"నా స్వలాభం కోసమే అక్కయ్యని సమర్ధిస్తున్నా ననుకోవు గదూ? ఈ అనుభవంతో అక్కయ్య ని అర్ధం చేసుకో గలిగాను."
"అయితే పద్మ లా నువ్వూ ధైర్యం చెయ్య రాదూ?"
"వీల్లేదు, పార్వతీ! నేను తెగించి వెళ్ళిపోయి చంద్రశేఖరాన్ని పెళ్ళి చేసుకోనా? ఊహూ! నా వశం కాదు. అంతంత మాత్రంగా ప్రాణాలు నిలుపు కుంటోన్న అమ్మ గుండెలు పగిలి చచ్చి పోదూ? అవమాన భారంతో తలదించుకు తిరుగుతున్నా అన్నయ్య సిగ్గుతో చితికి పోడూ? ఈ కుటుంబ చరిత్ర విని మరోసారి లోకం ఫక్కు మని నవ్వుకోరూ? ఈ అన్నిటి కన్నా నా స్వార్ధం ఎక్కువా నాకు?"
బాధగా అంది పార్వతి : "అన్నీ తెలిసి కూడా అంత అవివేకంగా ఎందుకు ప్రవర్తించావు సుజా? ఎందు కటువంటి అర్ధం లేని మమకారాలు పెంచుకున్నావు?"
"నన్నిలా నిలదీసి అడిగితె జవాబు చెప్పలేను పార్వతీ! నా కళ్ళెందు కలా మూసుకు పోయాయో నా మనస్సెందు కలా మూగదై పోయిందో ఇప్పుడేమీ చెప్పలేను. అతన్ని నేను ఎంత దూరంగా ఉంచాలనుకున్నానో అంత చేరువయ్యాడు. అ ఆకర్త్షణ కు లోబడి దీపం పురుగులా మాడి మసైపోతానన్న ఆలోచనైనా నాకు రాలేదు."
కొంతసేపు నిశ్శబ్దంగా గడిచింది.
"అయితే నీ పెళ్ళి మాటేమిటి, సుజా? అమ్మా వాళ్ళూ నిర్ణయించే సంబంధమే చేసుకుందా మను కుంటున్నావా?"
సుజా గుండె లెవరో పిండి నట్ట యింది. వెంటనే మాట్లాడలేక పోయింది. అస్పష్టంగా అంది : "మరేం చెయ్యగలను?" దీర్ఘంగా నిట్టూర్చింది.
"నాకైనా సాంప్రదాయంగా పెళ్ళి చేసి కన్నుల పండువుగా చూసుకోవాలని ఎంతో ఆశ పెట్టుకుని కూర్చుంది . అమ్మని మరోసారి అఘాతం లోకి తొయ్యగలనా?"
"నీ పరిస్థితి ఎంతో దయనీయంగా ఉంది, సుజా! ఏమని సలహా ఇవ్వాలో కూడా తోచటం లేదు. సరే! నువ్వనుకున్నట్టే ఈ పెద్ద వయస్సు లో అమ్మకి మరే చీకూ కలిగించకు. జరిగినదంతా ఒక చిత్రమైన కలే అనుకుని మరిచిపో. ఇక చంద్రశేఖరానికి ఉత్తరాలు మాత్రం అపు జెయ్యి. అతన్ని నెలల తరబడీ ఆశపెట్టి, మోసం చెయ్యటం ధర్మం కాదు. నీ మనస్సులో మాట తేల్చి వ్రాసేయ్యి."
సుజా చెంపల మీదుగా కారుతున్న కన్నీళ్ళ ను చూడనట్టే ఊరుకుంది పార్వతి.