Previous Page Next Page 
ఆనందోబ్రహ్మ పేజి 46

   

     ఇంత తర్కించినా-
   
    మనసు చీకటి కోణాన వీణియ తీగలపై అపశృతి కంపనాన్ని పుట్టించినట్లు మెడపై పాకిన చేతివెళ్ళు....రొమ్ముల మధ్య చంటిపిల్ల తల తగిలిన అనుభూతి....భర్తే చంటివాడై స్తన్యాన్ని అడిగిన కొంటె కోర్కె!
   
    ప్రభో! నన్ను నేను సమర్పించుకుందామని వచ్చిన క్షణం నన్ను నేను పారేసుకుని వెతుక్కోవడంలో ఒక జీవితకాలం ఆలస్యమయింది. క్షమించు. గడిచిన కాలం గురుతులుగా మిగిల్చిన అనుభవం మచ్చల్ని చెరిపి వేయలేమని తెలిసినా, ఆ విషాదమే ఆనందమై, వేదాంతమై, బ్రహ్మమై మిగులుతోంది.
   
    ఇప్పుడేం చేయాలి?
   
    ఈ పుస్తకాలే అతడికిస్తే.....
   
    అవును అది మంచి పని.

    వినగలిగితే మనసు పుటల మధ్య నిశ్శబ్దం పంక్తులు వినిపించే రాగాల కన్నా శ్రావ్యమయినది మరొకటి ఏది వుంటుంది?
   
    అతడికి పుస్తకాలనిస్తాను. జీరాడే కుచ్చిళ్ళు పైకెత్తి, పారే గోదారి పాయలో పాదాల్ని తడుపుకుంటూంటే రాధా మనోహర పూలల్లో ప్రతిబింబించే స్వచ్చదనం....అదీ కావాల్సింది. సముద్రం మీదనుంచి వచ్చే వేసవిగాడ్పు మామిడితోట చేరి వసంతమైనట్టు, గ్రీష్మకాలపు అనుభవం హేమంతపు తుషార కిరణమనీ! అదీ నేను కోరుకునేది.
   
    ఒకప్పుడు అనగలిగేదాన్ని ఏం! సోమయాజీ అర్ధమైందా? అని ఇప్పుడా అధికారం లేదు. పెద్దవాడు అయిపోయాడు కాబట్టి ఆ చొరవా లేదు. అయినా సాహసం చేసి అంటాను.
   
    'మిత్రమా! అర్ధమైందా?' అని.
   
                           *    *    *    *
   
    ఆఖరి వాక్యం పూర్తిచేసి అతడు తల పైకెత్తాడు. చదవడంలోనే రాత్రంతా గడిచిపోయినట్టుంది. గుడ్డిదీపం మసకబారింది. తూర్పురేఖ విచ్చుకుంది. అయినా అతడి కదంతా ఏమీ తెలియడంలేదు. కంటికి నీటిపొర అడ్డుగా వుంది.
   
    అతడి లేత చెక్కిళ్ళు, ఒకవైపు కిన్నెరసానికి మరోవైపు నాగావళికి నెలవులయ్యాయి.
   
    లేచి బయటకొచ్చాడు.
   
    అదే ప్రత్యూషం. అదే మందాకిని. అవే వ్రేళ్ళు. అదే ముగ్గు. అదే సూర్యకిరణం.
   
    వంగి మోకాళ్ళమీద కూర్చున్నాడు.
   
    నిశ్శబ్దం మాట్లాడినంత గొప్పగా శబ్దం మాట్లాడలేదు.
   
    అలికిడికి తలెత్తింది. అతడిని చూసింది.
   
    ఆ రోజు ఆమె పుట్టినరోజు.
   
    ఆ రోజు ఆమెతో మాట్లాడబోయే మొట్టమొదటి మాటని....పశ్చాత్తాపమూ క్షమించుకోవడములాంటి వ్యర్ధ పదాలతో నిర్వీర్యం చేయదల్చుకోలేదు. అందులోనూ శుభప్రదమైన ప్రాతఃకాల ప్రభాత సమయాన హిమాలయాల్లో గంగానది పుట్టిన వేళ.....
   
    "ఈ రోజు నీ పుట్టిన రోజు మందాకినీ! ఏం కావలి? నీకు నేనేమి యివ్వగలను?" అన్నాడు.
   
    - నాకింత యిచ్చిన నీకు నేనేమి ఇవ్వగలను అనుకున్నాడో, నాదంటూ ఏమీలేని నేను నీకేమి ఇవ్వగలను అనుకున్నాడో, అతడి మనసులోని భావం అతడికే అర్ధంకాలేదు. కాని అతడి మనసు ఆమెకి అర్ధమై ఆమె మోముపై స్వచ్చమైన నవ్వు వెలిసింది.
   
    ఏదో అనబోయింది. అంతలోనే, అంతక్రితంరోజు 'నేను నీతో మాట్లాడను సుమా' అని చేసిన బెదిరింపు గుర్తొచ్చినట్టుంది. పెదవులు బిగించింది. నిశ్శబ్దం ఇద్దరి మధ్యా పర్ణశాల కట్టగా, మూతి బిగింపులో చిరునవ్వు దాచిపెట్టి వ్రేళ్ళ మధ్య ముగ్గుతో గచ్చు మీద చెంగల్వ పూల్లాంటి అందమైన అక్షరాల్ని జార్చింది. తన జన్మదిన కానుకగా అతడి ఉన్నతి కోసం దేముని చేసిన ప్రార్దనో లేక అది తన అభిలాషగా అతడి నుంచే ఆశించిందో తెలీదుగానీ గచ్చుమీద పిండితో ఒక్కో అక్షరమే ముగ్గులా వ్రాసింది.
   
    "ను.....వ్వు... గెలవాలి.....ఒక్కో.....గోలు.....కొ.....ట్టు.....కుం ....టూ...."

    ఆమె వ్రాయటం ఇంకా పూర్తికాలేదు. అతడు హుషారుగా లేచి "ఇంత చిన్న కోరికా" అన్నాడు.
   
    అది చాలా పెద్ద కోరిక అవబోతూ వుందని అతడికా క్షణం తెలీదు.
   
                                11
   
    ఆటస్థలం చుట్టూ జనం కిటకిట లాడుతున్నారు. ఆ రోజు క్రీడోత్సవానికి ముగింపు ఆఖరిపోటీ. ఆటస్థలం గీత అవతల జనం బారులుగా నిలబడివున్నారు. జిల్లా రెవెన్యూ అధికారి ముఖ్య అతిధిగా విచ్చేశాడు. అంతా హడావుడిగా వుంది. ఆటస్థలానికి నాలుగు గజాల అవతల వేసిన బల్లమీద పెద్ద కప్పు ఎండలో మిలమిలా మెరుస్తూంది.
   
    రెఫ్రీ నోటినుంచి గట్టిగా విజిల్ వినిపించింది. రమేష్ వాళ్ళ స్కూలు జట్టు ఒకవైపు నుంచీ, ఆ ఊరి స్కూలు జట్టు మరోవైపు నుంచీ ఆటస్థలంలోకి దిగాయి. తను వూరి జట్టుకి మద్దతునిస్తూ జనం పెద్ద ఎత్తున చప్పట్లు కొడుతూ వుండగా రెండు జట్ల ఆటగాళ్ళూ స్థలం మధ్యకి చేరుకున్నారు. ఆటగాళ్ళు తమ తమ స్థానాల్లో నిల్చున్నారు.
   
    సోమయాజి మాత్రం గీత అవతల, మోకాళ్ళ మీద కూర్చుని వున్నాడు. గోదాలోకి దిగిన వస్తాదుల్ని కాలు విరిగినవాడు చూస్తున్నట్టు నిస్సహాయంగా చూస్తున్నాడు.
   
    అతడా పోటీలో పాల్గొనడం లేదు. ఆ మాటకొస్తే అంతకుముందు పది రోజుల్నుంచీ జరిగిన ఏ పోటీలోనూ అతడు ఇంతవరకూ పాల్గొనలేదు.
   
    రమేష్ అతడి మీద చాలా తీయగా కసి తీర్చుకున్నాడు.
   
    సోమయాజిని జట్టులో చేర్చిన ముసలి డ్రిల్లు మాస్టారు జట్టుతోపాటూ పోటీలు జరిగే పట్టణానికి రాలేదు. వేసవి శలవులకు వెళ్ళిపోయాడు. ఇంకొక మాస్టారు వచ్చాడు. ఆఖరి నిముషంలో తనని తీసేశారని తెలిసి సోమయాజి మాస్టారి గదికి పరుగెత్తుకు వెళ్ళాడు.
   
    "డ్రిల్లు మాస్టారు నా ఆట చూసిన తరువాతే నన్ను జట్టులో చేర్పించారు సార్! ఆఖరి క్షణంలో ఇలా తీసెయ్యటం అన్యాయం" అన్నాడు. కన్నీళ్లు ఒక్కటే తరువాయి అతడికి.
   
    రమేష్ కల్పించుకుని "అవును సార్ మాస్టారు మాస్టారు చెప్పారు కదా అని ముందు ఇద్దామనుకున్నాను. ఉన్న వాళ్ళందరిలోనూ కాస్త బలహీనమయినది మధుసూదన్ ఒక్కడే. అతడిని తీసేసి ఇతడిని పెడదామనుకున్నాను. కానీ ఇతగాడికి ఎడమకాలితో ఆడటమే రాదు. మధుయే నయం... ...." అన్నాడు.
   
    "ఎడమవైపు కాదు నేను కుడివైపు ఆడగలను" గొంతులో దుఃఖం అడ్డుపడుతూ వుంటే ఉక్రోషంగా అరిచాడు సోమయాజి.

    రమేష్ కిదంతా సరదాగా వుంది. సరిగ్గా ఇటువంటి అవకాశం కోసమే చూస్తున్నాడు. సోమయాజి మొహం చూస్తున్నకొద్దీ అతడికి పట్టలేని ఆనందంగా వుంది. మాస్టారివైపు తిరిగి "కుడివైపు ఆడగలిగితే వాళ్ళందరూ మన స్కూలు జట్టులో నాలుగైదు సంవత్సరాలనుంచీ ఆడుతున్న వాళ్ళే సర్. ఆఖరి క్షణంలో వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టడం అంత బావోదేమో....!" నమ్రత నటిస్తూ అన్నాడు.
   
    సోమయాజి పరిస్థితి ఇరకాటంలో పడింది. పూర్తిగా వెళ్ళకపోతే వేరు. దాని సంగతి మర్చిపోవచ్చు కానీ ఇప్పుడు వాళ్ళతో వుండాలి. ప్రతి రోజూ వాళ్ళు ఆ దినం తాలూకు ఆట సంగతి మాట్లాడుకుంటూ వుంటే శ్రోతలా వింటూ వుండాలి. నిజమైన ఆటగాడికి ఇంతకన్నా నరకం ఇంకొకటి వుండదు.
   
    అయినా అతడు సాధన మానలేదు. దీని గురించి తెలియాలంటే పదిరోజులు వెనక్కి వెళ్ళాలి.
   
    ఆ రోజు సాయంత్రం స్కూలు జట్టు పోటీల కోసం మరికొంచెంసేపట్లో బయల్దేరబోతూ వుంది. బస్సు తయారుగా వుంది. సోమయాజి భుజం వెనకనుంచి చెయ్యిపడింది. తిరిగి చూశాడు.
   
    సుబ్బారావు!
   
    చాలా దూరంనుంచి పరుగెత్తుకు వస్తూన్నట్లు రొప్పుతున్నాడు. "అమ్మయ్య! మీరు బయల్దేరి వెళ్ళిపోయి వుంటారనుకొన్నాను" అన్నాడు. అతనలా రావడం సోమయాజికి ఆశ్చర్యంగా వుంది. "కుడికాలితో ఆడే వారికీ, ఎడమకాలితో ఆడేవారికీ చాలా చిన్న తేడా! కుడికాలితో ఆడేవాళ్ళు బొటనవేలి పక్క ఎముక పైభాగంతో కొడతారు! ఈ కాస్త తేడా తెలుస్తే చాలు...."
   
    సోమయాజి విస్మయంగా చూశాడు.
   
    "నిన్ను లెఫ్ట్ స్టాపర్ గా తీసుకున్నారటగా?"
   
    "ఇంకా తీసుకోలేదు. తీసుకుంటే మాత్రం ఆ స్థానంలోకి తీసుకుంటారు."
   
    "అందుకే" అంటూ సుబ్బారావు చేతులు సాచాడు. అతని చేతిలో ఫుట్ బాల్ వుంది. సోమయాజి స్థబ్దుడయ్యాడు. సుబ్బారావు చెప్పటం మొదలు పెట్టాడు.
   
    కుర్రవాళ్ళు జట్టులు జట్టులుగా చేరి మాట్లాడుకుంటున్నారు. బస్సు పక్కనుంచి ఖాళీ స్థలంలోకి నడిచారు యిద్దరూ అతని భుజం మీద చేయి వేశాడు సుబ్బారావు. "ఒకప్పుడు రాష్ట్రస్థాయిలో ఆడేవాడిని నేను ఇంకొద్దిగా సాధనచేసి వుంటే ఎలా వుండేదో కానీ - అదే సమయంలో పెళ్ళయింది. దాంతోపాటు ఉద్యోగంలో బదిలీలు - ప్చ్ - భవిష్యత్తు సమూలంగా నాశనమయింది. అంతా, అంతా అయిపోయింది.....తనది తప్పులేదనుకో....కానీ ఒకసారి ఆ తేడా వచ్చాక ఇక అది అంతే."

 Previous Page Next Page