నత్తిపోయి పద్యం పూర్తవగానే, అతడు గర్వంగా చూసిన చూపులో ప్రపంచాన్ని గెలిచిన ధిక్కారం చూసి నవ్వొచ్చింది.
దూరంగా ఎవరో పాడుకుంటూ వెళుతున్నారు.
"కనుగొంటిని ... శ్రీరాముని .... కనుగొంటిని
ఇనకులమందు ఇంపుగాను పుట్టి -
ఇలలోనూ సీతానాయకుని
నేడు కనుగొంటినీ...."
ఎంత మంచి త్యాగయ్య కీర్తన. ఈ మామూలు జీవితంలో త్యాగయ్య కీర్తనలు వినడం కాస్త ఓదార్పు. ఎంత తాదాత్మ్యతతో పాడుకుంటూ వెళుతున్నాడో ఆ దానయ్య. నా కనిపిస్తుంది-అర్పించుకోవటంలో వున్నంత ఆనందం మరెందులోనూ లేదని. అందుకే క్షేత్రయ్య నుంచి రామదాసు వరకూ ఒక మూర్తిని ఊహించుకుని 'మువ్వగోపాలా!' అనో - 'రామా!' అనో పలవరిస్తూ ఆ తాదాత్మ్యతలో సంతృప్తి పొందారు అనుకుంటాను.
ఈ మనుషుల్ని ప్రేమించడం కన్నా ఊహాజనితమైన కల్పననీ, ప్రకృతినీ, ప్రాణంలేని వస్తువుల్నీ ప్రేమించడం నయం. ప్రేమంటే దేముని ముందు నిశ్శబ్ద ధ్యానంలో కూడా అతడు నీ జ్ఞాపకాలలో నిలిచి వుండాలట. సముద్రపు చెరో రెండు అంచుల చివర నిలబడ్డా ఈ దరి నుంచి ఆ దరికి ప్రవహించే తరంగాల్లా ఒకళ్ళ స్మృతులు ఒకరికి చేరాలట. అదట ప్రేమంటే. ఇదంతా సాధ్యంకాదు కాబట్టి "నిది చాల సుఖమా-రాముని సన్నిధి చాల సుఖమా" అంటూ వాపోయాడు త్యాగయ్య తాతయ్య.
.....
ఈ రోజు వైదేహి అదోరకం కొత్తబట్టలు కట్టుకొంది. కొంతకాలానికి అమ్మాయిలు ఓణీలు, పరికిణీలు, ముద్దబంతి పూలూ అన్నీ మర్చిపోతారనుకొంటా. పసుపు సంగతి సరేసరి. స్త్రీ స్త్రీత్వం నుండి విడివడి ఆకారంలో పురుషుడికి దగ్గిరయి అతడి ఆరాధన నుంచి దూరమవుతోంది.
........
ఈ రోజు మనసంతా ఎందుకో అదోలా వుంది. (మరీ విషాదంగా వున్నప్పుడు నీ మనసువైపు చూడు. ఒకప్పుడు అమితమయిన సంతోషం ఇచ్చినదే కదా మందాకినీ) ఆ స్థాయిలో ఆలోచించటం సాధ్యమేనా! ఆనందం పై ముసుగు తీస్తే కనబడేది విషాదమట. అందుకే అన్నారు - విషాదాంత ఆనందోబ్రహ్మ అని.
.......
నే చెప్పలేదూ మళ్ళీ ఈవేళ మనసానందంగా వుంది. ఒక్కోరోజు ఒక్కోలా వుంటుంది. లేచిన వేళా విశేషమనుకుంటా.
నోటిమీద ఈ రోజెందుకో మాటిమాటికీ తాళ్ళపాక అన్నమాచార్యులవారి "విరహపు రాజదె విడిదికి రాగా" అన్న కీర్తన కదలాడుతూంది. పింగళి సూరన, ముక్కు తిమ్మన్న వీళ్ళ సంగతి వదిలేద్దాం. ఒక కావంటి పాపరాజు, ఒక కాసుల పురుషోత్తముడు, ఒక శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, త్రిపురనేని రామస్వామి, వేలూరి శివరామశాస్త్రి, ఒక దీపాల పిచ్చయ్యశాస్త్రి, వేరొక విశ్వనాథ సత్యనారాయణవారూ ఎవరూ మళ్ళీ పుట్టరేం? వెలవెలబోతున్న తెలుగుతల్లి నుదుట కుంకుమ దిద్దరేం?
నోటిమీద ఇంకా "విరహపు రాజదె" కదులుతూనే వుంది. అర్దరాత్రి ఆయన దగ్గిరకు తీసుకొబోతే అంత నిశ్శబ్దంలో వద్దన్నాడు. ఎందుకన్నాడు. 'కురు చిరు కడు నిడు శబ్దముల రడల కచ్చు పరమగునప్పుడు ద్విరుక్తటకారమగును" అన్నాను. ఆయనకీ అర్ధంకాలేదు.
.... స్త్రీని ప్రకృతితో పోల్చిన కవి ఎవరోగానీ చాలా గొప్పగా పోల్చాడు. 'బాల్యం హేమంతం - కాస్త వయసు రాగానే పెళ్ళనే వసంతం కోసం ఎదురుచూసే శిశిరం - పెళ్ళయ్యాక గ్రీష్మం అట.'
అందుకేనేమో ఈ మనుష్యులంతా ఇంత నిస్సారంగా జీవితం గడుపుతున్నారు. వీళ్ళకి ఆనందాన్ని ఇవ్వడం తెలీదు. తీసుకోవడం అంతకన్నా తెలీదు. ఒక మంచి భావాన్ని ఆస్వాదించరు. ఒక మంచి ప్రబంధాన్ని చదవరు. వాసక సజ్జనకి విప్రలబ్దకి తేడా తెలియదు.
ఇలాటి శిలల్లాటి మనుష్యుల మధ్యనుంచి, అనుభూతి రాహిత్యమనే పర్వతాల మధ్యలోంచి, నిరాసక్త లోయల్లోంచి, నిశ్శబ్దపు అడవుల్లోంచి మందాకిని ప్రవహిస్తుంది. ఏ సాగర సంగమానికి?
నాన్న బాగా గుర్తొస్తున్నాడు.
.....
ఈ రోజు అతడిని చూస్తే జాలేసింది. ఇంట్లో సరిగా అన్నం కూడా పెట్టలేదు. ఒక క్షణం తల్లి ప్రేమ చివుక్కుమంది. కానీ సానుభూతి కిది సమయం కాదు. ఒకసారి అది చూపిస్తే మనసు మళ్ళీ మళ్ళీ మరీ మరీ దాన్నే కోరుతుంది. అందుకే కాస్త కఠినంగా వుండాల్సి వస్తుంది.
.... నిజమే చాలా మామూలుగా కన్పించే ఈ రాయి- దీన్ని చెక్కితే మంచి శిల్పమవుతుంది. ఈరోజే తెలిసింది.
'పీటవేసి అన్నం వడ్డిస్తాననుకున్నావా! ఇంత వయసు వచ్చింది కష్టపడి నువ్వు సంపాదించుకోలేవూ!' అన్నాను. పాపం ఒక్కక్షణం పాటూ ఆ లేత మొహం వాడిపోయింది. అంతలోనే ఎంత రోషమనీ! అట్లాగే బయటకు వెళ్ళిపోయాడు. ఎప్పుడో తిరిగి వచ్చాడు. దారి పక్కన కూర్చుని క్షురకర్మ చేశాడట. ఆ డబ్బులు తీసుకుని వచ్చి చూపించాడు. రవ్వంత రోషంతో, కాస్త ఠీవితో గర్వంగా అతడు అలా నిలబడి చేయిసాచి డబ్బుల్ని చూపించి, 'ఇప్పుడేమంటావ్' అని నిలదీసి అడిగినప్పుడు నీకేమని అనిపించింది మందాకినీ? నీకు తెలీదు పిచ్చిపిల్లా! నే చెబుతాను విను. కన్నడగౌళ రాగంలో దీశాది తాళం విన్పించింది.
సొగసు.... జూ....డ.... తరమా!
చిరునవ్వులు, ముంగురులు - మరి కన్నుల తేటో
వరత్యాగరాజ - వందనీయ! ఇటువంటి
సొ... గ.... సు..... జూ..... డ..... త.... ర.... మా
అనిపించింది.
చప్పున దగ్గిరకి తీసుకుని ముద్దు పెట్టుకున్నాను.
16 ఆషాఢము
ఇది నిజంగా జరిగిందా? లేక నా ఊహా?
ఎంత పని జరిగింది?
అతడు నా భుజాలమీద చేతులు వేసి దగ్గరకు లాక్కున్నక్షణం-ఈ ప్రపంచం భస్మీపటలమై పోలేదెందుకని! లిప్తమాత్రం - లిప్తమాత్ర మయితేనేం ఈ తనువు వణికిందెందుకని! ఎందుకు జరిగిందిలా?
ఎందుకు చేశాను నేనిదంతా? ఎందుకు అతడితోపాటూ కూర్చొని పుస్తకాలు వ్రాశాను. ఎందుకు అతడిని క్షణ క్షణం తీర్చిదిద్దుతూ వచ్చాను. నా సామీప్యంలో అతడిలో ఈ రకమైన భావాలు చెలరేగుతున్నాయని ఛాయా మాత్రంగానైనా నేను గ్రహించలేకపోవడం నా తప్పేనా? ఇన్ని వాక్యాలు చదివి, ఇన్ని మనో విశ్లేషణాల గురించి ఆలోచించి చివరికి ఒక చిన్న మనసు గురించ్బి ఆలోచించలేకపోయానే. ఒక లేలేత మనసులో ఉవ్వెత్తున లేచిపడే కడలి తరంగాల ఘోషని వినలేకపోయానే.
ఇదంతా తప్పేనా?
మందాకినీ! గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పు. అతడిని చూసిన మొదటి క్షణం నీకేమనిపించింది?
అప్పుడేమీ అనిపించాలేదు. కానీ కాలం గడుస్తున్నకొద్దీ అతడిని ప్రేమించసాగాను. అతడిలో.... అతడిలో నాకు నా....న్న కనబడసాగాడు.
భాద్రపద మాసారంభాన వీధి అరుగుమీద కూర్చుని చూరుమీద నుండి పడే వర్షపు చినుకుల్ని చూస్తూ నేను వూహించుకొన్న ఒక సౌందర్యమూర్తినీ, వివాహం ద్వారా నేను కోల్పోయిన నాన్ననీ అతడిలో ప్రతిష్టాపించు కుందామనుకున్నాను. ఒక రాతిని ఎన్నుకుని దాన్ని చెక్కేకొద్దీ కొత్త అందాల్ని సంతరించుకుంటున్న ఆ శిల్పాన్ని చూసి తన ఎంపికకు తాను మురిసిపోయిన శిల్పిలా మురిసిపోయాను.
వయసొచ్చే వరకూ ఇంట్లో అమ్మనీ నాన్ననీ చూసి, ప్రేమరాహిత్యంవల్ల నా భర్త అలా కాకూడదనుకున్నాను. కానీ నా వరకూ వచ్చేసరికి, స్త్రీ ఎంత అందించినా భర్త తీసుకోడని గ్రహించి ఓడిపోయాననుకున్నాను. మళ్ళీ ఇన్నాళ్ళకి ఇతడిని చూసి
ఇతడికి కాబోయే భార్య
ఎవరో నాలాటి ఒక అమ్మాయి
ఎప్పుడో ఎక్కడో భవిష్యత్తులో ఒక శ్రావణ శుక్రవారపు పేరంటంలో గెడ్డం మోకాళ్ళమీద ఆన్చి కూర్చుని కలల్లోకి జారిపోయిన ఒక కన్నెపిల్ల విశ్వాసాన్నీ, అభిరుచుల్నీ భస్మీపటలం చేసే మొగవాడు, ఈ ప్రపంచం నుంచి కనీసం ఒకరన్నా తగ్గాలని ఆశించి నడుము కట్టాను. మూర్తీభవించిన వ్యక్తిత్వంతో, ఆడదాన్ని అర్ధం చేసుకునే ఆర్ద్రతతో, ఆత్మ విశ్వాసంతో, అనంతానంతమైన ఆత్మీయతతో, దాన్ని ఆప్యాయంగా ప్రదర్శించగలిగే కళ్ళతో, ఒక సంపూర్ణమైన మొగవాడు తయారవ్వాలని ఆశించటం తప్పా! తప్పేనా?
ఒక మందాకినికి అతడు కొడుకు అవ్వాలనీ, ఒక మందాకినికి అతడు భర్త అవ్వాలని, ఒక మందాకినికి అతడు తండ్రి అవ్వాలనీ కోరుకుంటే -
అది తప్పా... తప్పేనా!
క్షీరసాగరం నుండి రెండు దివ్యమైన చేతులు పైకి లేచి సువర్ణ కలశంతో అమృతాన్ని అందించినట్లు, ఒక మందాకినికి యితడిని తీర్చిదిద్ది అందిద్దామనుకుంటే, అందులో నా స్వార్ధం వున్నదా! ఇదంతా నువ్వెందుకు చేశావూ అంటే-
మర్రిచెట్టు క్రింద మేకల్ని మేపుతూ కూర్చునే గొల్లపిల్లవాడు ఎందుకు పిల్లనగ్రోవి వూదుతాడు చైత్ర మాసపు రాత్రి నెమ్మదిగా విచ్చుకునే లేలేత పువ్వు అలా పుష్పించి ఏం చేస్తుంది? తను తయారుచేసిన కాగితం పడవ ప్రవాహంలో ఒడిదుడుకుల్ని అధిగమిస్తూ ఠీవిగా సాగిపోతూంటే చూసే పిల్లవాడి కళ్ళలో ఆనందానికి అర్ధం ఏముందంటే....ఏముంది?