సోమయాజి మాట్లాడలేదు. ఆకాశంలో రెండు కొంగలు పడమటి దిక్కుగా ఎగురుతూ పోతున్నాయి.
"....ఆ కసి దేనిమీద తీర్చుకోవాలో తెలియలేదు.....పేకాట అలవాటయింది....! చెప్పాను కదా కసి అని...." నవ్వాడు.
సోమయాజి తలెత్తి చూశాడు. అతనికి అర్ధం కాలేదు. మనిషి ఓడిపోవడం గురించీ, ఆ ఓటమి తాలూకు నైరాశ్యాన్నించి విముక్తి పొందటం కోసం ఒక వ్యసనాన్ని ఆశ్రయించడం గురించీ తెలుసుకొనేటంత లోకజ్ఞానం అతనికి లేదు. అతడేదో అనబోయేటంతలో సుబ్బారావు అతనికి బంతి నందిస్తూ "తీసుకో" అన్నాడు. "చాలాకాలం నుంచీ మూలపడి వుంది. దీన్ని ఎవరడిగినా యివ్వలేదు. ఒకప్పుడు నా ప్రాణంలో ప్రాణం యిది. పెళ్ళయ్యేంతవరకూ భార్య కన్నా ఎక్కువగా నాతో కలిసిపోయింది. ఒక రాత్రనీ లేదు. పగలనీ లేదు. వయసూ మీరిపోయింది. కానీ ఎక్కడా వదిలి పెట్టకు. పాడయిపోయింది కదా అని పారెయ్యకు."
సోమయాజి దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఆ దగ్గరగా తీసుకోవటంలోనే ఒక రకమైన ఆత్మీయత కనబడుతూంది.
"ఇంతకాలం నుంచీ ఒకే ఇంటిలో వుంటూ కూడా నువ్వూ ఫుట్ బాల్ ఆడతావని నాకు తెలియదు. తెలిసుంటే ముందునుంచే మెలుకువలు చెప్పి వుండేవాణ్ణి."
"ఎడమవైపు నుండి ఆడే అవసరం నాకు యింతకాలం రాలేదు. కేవలం నన్ను ఇబ్బందిలో పెట్టడానికే యిలా చేసారు" అన్నాడు సోమయాజి.
"అవునట మందాకిని చెప్పింది. తనే పంపించింది. ఇంతకాలం నోరు విప్పి 'ఇది కావాలీ' అని అడగలేదు. అందులోనూ ఈ రోజు తన పుట్టిన రోజు" నవ్వాడు సుబ్బారావు. "నువ్వేం కంగారుపడకు. సాధన వుంటే వాళ్ళందర్నీ కొట్టవచ్చు....."
సోమయాజి వినడం లేదు. అంతకుముందు వాక్యాన్ని, "నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకున్నా నీ బంతిని" అన్నమాటని సమన్వయ పరుచుకొని - ఏదో చెప్పలేని ఉద్విగ్నతతో, కృతజ్ఞతా భావంతో వూగిపోయాడు.
"మళ్ళీ తిరిగి ఎప్పుడొస్తావ్?"
"పండుగరోజు ఆఖరిపోటీ."
"పండుగ రోజా?"
"అవును ఏం?"
"అదే రోజున మా పేకాట వుంది. పెద్ద ఎత్తులో..."
"ఎడమకాలితో ఒక మాదిరిగా ఆడగలగాలీ అంటే ఎంతకాలం పడుతుంది?" మాట మార్చి అడిగాడు.
"బాగా రావడానికి - అంటే నువ్విప్పుడు కుడికాలితో ఎలా ఆడుతున్నావ్ అలా ఆడటానికి అయితే ఆర్నెల్లు పట్టవచ్చు. అలా కాకుండా మీ స్కూలు జట్టు స్థాయీ అంటే ఒకటి రెండు నెలలు చాలు."
"ఒకటి రెండు నెలలు" మనసులో అనుకున్నాడు. "....రోజుకు ఎన్ని గంటలు సాధన చేస్తే" అని అడిగాడు.
సుబ్బారావు అతనివైపు విచిత్రంగా చూసి "ఎన్నేమిటి? రోజుకు రెండు మూడు గంటలు-" అన్నాడు.
"రోజుకి రెండు గంటలు చేస్తే రెండు నెలలు పడుతుంది. పదహారు చేస్తే వారం చాలుగా!"
మొదట సుబ్బారావుకి అర్ధంకాలేదు. అర్ధమవగానే ఒక అనుభవజ్ఞుడయిన క్రీడాకారుడు, అప్పుడే కొత్తగా ప్రవేశిస్తున్నవాడిని తీసుకున్నట్లు అతడిని దగ్గరకు తీసుకున్నాడు. అంతలో బస్సు దగ్గర నుంచి పిలుపు వినబడింది.
* * * *
పెద్ద చప్పుడుతో హర్షధ్వానాలు వినపడటంతో ఆలోచనల నుంచి విడివడి చూశాడు. స్థానిక స్కూలు జట్టు గోలు కొట్టింది. ఆ వూరి జనం చప్పట్లు కొడుతున్నారు. ఆ రోజే ఆఖరిపోటీ.
ఒకవైపు నుంచి రమేష్ స్కూలు జట్టు, మరోవైపు నుంచి స్థానిక స్కూలు జట్టు గెలుచుకుంటూ పైకి వస్తున్నాయి. ఇది ఫైనల్సు.
జిల్లా స్థాయి పాఠశాల పోటీల్లో ఒక గమ్మత్తు వుంది. పల్లెటూళ్ళ నుంచి వచ్చిన స్కూలు జట్టులో పెద్ద చెప్పుకోదగ్గ ఆటగాళ్ళు వుండరు. కేవలం పోటీలో పాల్గొనాలి కాబట్టి వాళ్ళు వస్తూ వుంటారు. మొత్తం మీద జిల్లాలో నాలుగో అయిదో మంచి జట్టులుంటాయి. "మంచి" అంటే అందరూ పెద్ద ఆటగాళ్ళని కాదు. రమేష్ లాంటి వాళ్ళు ఇద్దరో ముగ్గురో వుంటారు. వాళ్ళు మిగతా పిల్లల్ని వేసుకొని గోల్స్ కొడుతూ వుంటారు. అలాగే అప్పటివరకూ కొట్టుకుంటూ వచ్చారు కూడా.
జిల్లా కేంద్రపు స్థానిక జట్టు నిజంగా బలమైంది. రమేష్ లాంటి వాళ్ళు అందులో ఆరుగురుదాకా వున్నారు. పైగా ఆ జట్టు నాయకుడు ఆరడుగుల ఎత్తులో బలంగా వున్నాడు. అతడెక్కడ నుంచి బతి అందుకున్నా గోలు వరకూ తెస్తున్నాడు. ఆట ప్రారంభమయిన మొదటి అయిదు నిమిషాల్లోనే ఒక గోలు కొట్టారు అవతలివాళ్ళు.
సోమయాజి అలాగే నిశ్చలంగా కూర్చుని చూస్తున్నాడు. పదిరోజుల్నుంచీ అతడలా చూస్తూనే వున్నాడు. అతనికి ప్రవేశం దొరకలేదు. ప్రతిసారీ రమేష్ వాళ్ళ జట్టుగెలుస్తూరావటంతో అతడి గురించి దాదాపు అందరూ పూర్తిగా మర్చిపోయారు.
కానీ అతడు మాత్రం తన గురించి మర్చిపోలేదు.
ఆ ఊరికి రాగానే వారికి విద్యార్ధుల హాస్టల్ ని వసతిగా యిచ్చారు. దిగిన మరుక్షణమే అతను బంతిని పట్టుకుని పక్కనే వున్న ఆట స్థలానికి వెళ్ళిపోయాడు. అప్పటినుంచీ ప్రారంభమయింది సాధన.
తమ తమ హడావుడిలో వున్న మిగతా వాళ్ళెవరూ అతడిని పట్టించుకోలేదు. కానీ లేకపోతే అతను తెల్లవారుఝామున నాలుగింటికీ వెళ్ళిపోవటం తెలిసి వుండేది. అలసిపోయేవరకూ ఆడేవాడు. రాళ్ళు, రప్పలు, గడ్డి, మైదానం - ఏదీ చూసుకోకుండా గంటలతరబడి పరిగెత్తేవాడు. అతడి కాళ్ళమధ్య బంతి ఒక ఆట బొమ్మ అయింది. గోలుని పరిమాణం కన్నా చిన్నదిచేసి మధ్యలో రాళ్ళు పెట్టి, ఆ చిన్న సందులోంచి కూడా కొట్టడం సాధన చేశాడు. ఒకటని లేదు. అతనికి అతనే గురువు. జుట్టునుంచి కారే చెమట, కాలివేళ్ళమధ్య నుంచి కారే రక్తం - ఏదీ అతడిని వెనక్కి లాగలేదు. అలసిపోయి కళ్ళు మూసుకుంటే, ముగ్గుతో "నువ్వు గెలవాలి.....ఒక్కోగోలు కొట్టుకుంటూ" అన్న అక్షరాలే కనపడేవి. అతను ఆ ఊరు చేరుకున్న నాలుగు రోజులకి గజం ఎడమున్న రాళ్ళమధ్య నుంచి రెండు వందల గజాల దూరంలో నిలబడి ఎడమకాలుతో బాలుని సరిగ్గా కొట్టగలిగే స్థాయికి వచ్చాడు.
ఇంత చేసినా అదృష్టం అతనివైపు చూడలేదు. తన సామర్ధ్యం ప్రదర్శించే అవకాశం అతనికి రాలేదు. అప్పటివరకూ వాళ్ళ జట్టు చిన్న చిన్న వాళ్ళనందరినీ కొట్టుకుంటూ వస్తూంది. ఆఖరి పోటీకి ముందు పోటీలో మాత్రం కాస్త తాకిడి ఎదురైంది. కాని దాన్ని సమం చేయగలిగారు.
ఈ ఆఖరి పోటీలో మాత్రం మొత్తం అంతా తలక్రిందులయ్యేటట్టు వుంది.
అన్నిటికన్నా ఎక్కువైంది జనం గోల. తమ ఊరి వాళ్ళు ఎప్పుడయితే ప్రత్యర్ధుల జట్టుని నల్లుల్లా నలిపేస్తున్నారో ఇక వాళ్ళ ఆనందానికి పట్టపగ్గాల్లేవు. అందులోనూ బంతి వాళ్ళ కెప్టెనుకి దొరికితే చాలు గోల మొదలైపోతుంది. అతడు దాన్ని పట్టుకొని ముందుకు కదులుతూంటే గోలు దగ్గరవుతున్న జలపాతంలా ఆ గోల క్రమ క్రమంగా కొద్దీ ఎక్కువయ్యేది. గోలులోకి బంతి వెళ్ళడంతో చప్పట్లతో సమాప్తమయ్యేది.
అరగంట గడిచింది. అప్పటికి స్థానిక జట్టు మూడు గోలులు కొట్టింది. రమేష్ ఎంత ప్రయత్నించినా ఏమీ చేయలేకపోతున్నాడు. నలభై అయిదు నిమిషాలు అయ్యాయి. పది నిమిషాలు పాటు విశ్రాంతి దొరికింది.
రమేష్ వాళ్ళ జట్టు బయటకు వస్తూంటే జనం ఎగతాళిగా ఈలలు వేయసాగారు. రమేష్ తప్పు చేశాడన్న సంగతి సోమయాజికి తెలుసు. మొదట వాలుగాలి తీసుకోకుండా ఎదురుగాలి తీసుకున్నాడు. ధాంతో అవతలి జట్టు బాదేసింది. ఇక ఈ దెబ్బనుంచి తేరుకోవడం దాదాపు అసాధ్యం.
విశ్రాంతి అయిన తరువాత ఆట తిరిగి ప్రారంభమైంది. ప్రారంభమయిన అయిదో నిమిషంలో గోలు చేశారు ప్రత్యర్ధులు. నాలుగో గోలు.
దాదాపు ఆట వదిలేసుకున్నారు రమేష్ వాళ్ళు అవతలి జట్టు నాయకుడికి గానీ బంతి దొరికితే గౌరవంగా ప్రక్కకి తొలగి దారి యివ్వటం మంచిదనే అభిప్రాయానికి దాదాపు వచ్చేశారు.
సరిగ్గా ఆ సమయంలో జరిగింది ఆ సంఘటన.
ఏ అవకాశం కోసం సోమయాజి ఈ పదిరోజులు ఎదురుచూశాడో - ఎన్ని నిశ్శబ్దపు అర్ధరాత్రులు మౌనంగా దేవుడిని "ఒక్కసారి.... ఒక్కసారి అవకాశం యిప్పించు స్వామీ" అని ప్రార్ధించాడో తెలియదు కానీ, అది ఆ క్షణం మధుసూధన్ కాలు బెణకడం ద్వారా వచ్చింది. నిజానికి అతడు చాలా అర్భకుడు. ఏదో కొంత కాలం ఆ స్థానంలో నిలబడుతూ వచ్చాడే తప్ప ఇంత వత్తిడిని తట్టుకోలేడు. అందుకే కాలు బెణికిన నెపం మీద బయటకు వచ్చేశాడు. అలా సోమయాజికి అవకాశం దొరికింది.
ఎడమవైపు గోలు దగ్గర లెఫ్ట్ స్టాపర్ స్థానంలో నిలబడి వున్నాడు మామూలుగా.
ఆట తిరిగి ప్రారంభమయ్యింది. ఇంకా ముఫ్ఫై నిముషాలు వుంది ఆట పూర్తవడానికి.