Previous Page Next Page 
రేపల్లెలో రాధ పేజి 44


    "మనిషి తెలివయినవాడయితే చాలదు.... కొద్దో గొప్పో హాస్యాన్ని ఆనందించగలగాలి. లేకపోతే హేండిల్ లేని బకెట్టులా అతన్ని హేండిల్ చేయడానికి కష్టపడాల్సొస్తుంది. అసలు మనలో మనమాట....హ్యూమర్ లేనివాడిని హేమర్ తో కొట్టాలి!" సిగరెట్ పొగని ముక్కులోంచి వదిలి చెప్పాడు నారాయణమూర్తి.
    
    అతను గొప్ప సరదా మనిషి ఎప్పుడూ తను నవ్వుతూ, నలుగుర్ని నవ్విస్తూ కాలక్షేపం చేస్తూంటాడు.
    
    మాధవ్ కి పెద్దమావయ్యలోని ఈ గుణం చాలా ఇష్టం. విచారం వీధుల్లో తారట్లాడుతూంటుంది. సంతోషం మాత్రం సందు చివర కాపుకాసి ఎవరొస్తారా అని ఎదురుచూస్తుంటుంది! కాస్త శ్రమపడితే ఆనందం అడ్రస్సు దొరకడం కష్టం కాదు ఈ సంగతి చాలామంది తెలుసుకోరు.
    
    విశాలాక్షీ ఆయన ఆకతాయి అల్లర్లకి మురిసిపోతూనే కళ్ళతో మందలిస్తూ హుందాగా తిరుగుతూంటుంది. ఎంత పనైనా తను కూర్చున్న చోటునుండి కదలకుండా నోటితో దాన్ని తేలిక చేస్తూ వేరొకరిచేత చేయించెయ్యడం ఆవిడ ప్రత్యేకత!
    
    "పురంధరా... ఆ వంకాయలు ఇటు పారెయ్! నాలుగు పక్షాలుగా తరుగుతుంటాను. ఇంతలో నువ్వు ఉల్లికారం దంపిపెట్టు... అది వీటిలో కూరి నూనెలో పారెయ్... వెన్నెపూసలా ఉడికి ఊరుకుంటాయ్! అసలీ గుత్తివంకాయకి ఎంతటి చరిత్రుందని... మా ముత్తాతలు జాగీర్లే దానాలు చేసేశారుట దీనికోసం అసలు కవులకి ప్రేరణనిచ్చి.....గుత్తివంకాయ్ కూరోయ్... కోరి వండాను రావోయ్...అని వ్రాయించుకున్న ఘనత ఈ కూరరాజానిదే!"
    
    అలా ప్రతి కూరకీ, పిండివంటకీ ఆవిడ చక్కని వ్యాఖ్యానాలు జతచేస్తూ ఎంత సేపైనా మాట్లాడగలదు.
    
    దేవుడి మందిరాన్ని శుభ్రంచేసి దీపారాధన చేసింది పురంధర.
    
    "ఎంతకాలానికి ఈ ఇంట దీపం పెట్టే గాజుల చెయ్యొచ్చిందో నమ్మా!" అన్నాడు తృప్తిగా సీతారామయ్య.
    
    గోవిందరావు అప్పుడే ఊరు చుట్టబెడతానికి వెళ్ళిపోయాడు.
    
    మాధవ్ అరటిపళ్ళూ, కమలాఫలాలూ పట్టుకుని లోపలికి వస్తూ "వాకిట్లో ముగ్గులూ, వంటింట్లో ఘుమఘుమలూ.... అదరగొట్టేస్తున్నారు పిన్నీ!" అన్నాడు.
    
    "కానీ.... నట్టింట్లో నయగారాలేవిరా?" ఉయ్యాల బల్లమీంచే అడిగింది విశాలాక్షి.
    
    ఆవిడ భావం అర్ధం కానట్లు చూశాడు మాధవ్.
    
    "కోడల్ని ఎప్పుడు చూపిస్తావయ్యా?" నేరుగా అడిగేసింది పురంధర.
    
    ఆమె పొరపాటున కూడా బావగారి అబ్బాయిని 'రా' అనదు. మాధవ్ అంటే చాలా గౌరవం.
    
    మాధవ్ నవ్వి, "ఒప్పందం ప్రకారం మనం అక్కడికి వెళ్ళకూడదు.... రాధ ఇక్కడికి రాకూడదు!" అన్నాడు.
    
    నారాయణమూర్తి నవ్వి, "చట్టప్రకారం.... న్యాయంప్రకారం కాదురా. యథాలాపంగా పిల్లని ఎలా చూడగలమో చెప్పు!" అన్నాడు.
    
    "యథాలాపంగా వెళ్ళి ఇంటికెళ్ళి చూసొద్దామా?" అడిగింది విశాలాక్షి.
    
    మాధవ్ జవాబు చెప్పలేదు. చిన్నగా నవ్వి అక్కడినుండి వెళ్ళిపోయాడు.
    
    "సీతారామోభ్యో నమః అంటూ పొద్దుటే చిడతలు తీసుకుని హరిదాసు వేషంలో వెళితే భిక్ష వేయడానికి రాదూ!" అన్నాడు నారాయణమూర్తి.
    
    "మంచి గతే పట్టింది పెళ్ళికొడుకు పెద్ద మేనమామకి!" అంటూ నవ్వాడు సీతారామయ్య.
    
    "మాధవ్ నవ్వేశాడంటే ఈపాటికి ఏదో ఆలోచన చేసే ఉంటాడు!" అంది పురంధర.
    
    "మీరు వాడితోపాటు వెళ్లి ఆ స్థలాలవీ చూసిరండి. ఫ్యాక్టరీ పెట్టటం అంటే మాటలా.... చిన్న వెధవ....! అన్నీ ఒక్కడు చూసుకోవడం అంటే ఎలా?" అంది భర్తతో విశాలాక్షి.
    
                                                               * * *
    
    పెళ్ళికన్నా ఎదుర్కోలుకి హడావుడి ఎక్కువన్నట్లు ఉంది రైల్వేస్టేషన్ లో సందడి.
    
    చెల్లెళ్ళూ, బావగార్లూ, వారి పిల్లలూ... ఎటుచూసినా మావయ్యా...పెద్దనాన్నా.... అత్తయ్యా.... పెద్దమ్మా... అనే పిలుపుతో మార్మోగిపోతోంది ఆ ప్రదేశం.
    
    పార్వతమ్మకి నోట్లో పైటకొంగు దోపుకున్నా దుఃఖం ఆగడం లేదు. ఆమె ఒడిలో మూడేళ్ళ గోపిగాడు కూర్చుని గట్టిగా మెడని కావిటేసుకుని "నేను దిగను... నేను వత్తా!" అంటున్నాడు.
    
    "దిగరా, నాన్నా.... నీకు జాతరలో జీళ్ళ గడియారం కొనిపెడతాను. రంగుల కళ్ళజోడు కొనిపెడతాను!" అంటూ ప్రకాశం కొడుకుని మరిపించ ప్రయత్నించి వాడు వినకపోవడంతో, "దిగుతావా, లేదా?" అంటూ చెయ్యెత్తాడు.
    
    సుబ్బారాయుడు వెంటనే "ఇట్టా పిల్లాడ్ని రేపటినుండీ కొట్టి చంపుకుంటారా ఏంటి? అలాగయితే మాతోబాటే వస్తాడు!" అన్నాడు.
    
    "అదెట్టా కుదుర్తుందీ? రాధని కూడా తీసుకెళ్ళ కూడదన్నావుగా!" అలకగా అన్నాడు ప్రకాశం.
    
    పార్వతమ్మ ఏడుపు దిగమింగి, ప్రకాశం....! గోపీగాడి మీద ఇక్కడ మీరు చెయ్యి చేసుకుంటే, అక్కడ మీ అన్నయ్య ఉలిక్కిపడతారు! విడిచిపెట్టి ఒక్కరోజైనా ఉన్నాడు కాదు, కొట్టేముందు ఒక్కసారి మా ఇద్దరి మొహాల్నీ వాడిలో చూసుకుని.....అప్పుడు కొట్టండి!" అని ఏడ్చేసింది.
    
    వాతల తాతయ్య సుబ్బారాయుడి చెయ్యి పట్టుకుని "ఒరేయ్ సుబ్బాయ్....! రోడ్డుమీద ట్రాన్సిస్టరులూ, గడియారాలూ, సూట్ కేసులూ.... ఏం దొరికినా గబుక్కున లోపలేసుకోబోకు! బాంబులుంటాయి! అమ్మాయి....! నువ్వు కూడా!" అన్నాడు.
    
    "శుభమా అని వెళుతుంటే నువ్వొక్కడివీ!" రాజేశ్వరి విసుక్కుంది.
    
    ప్రమీలా, జానకీ పార్వతమ్మ చేతులు పట్టుకుని, "వదినా! నువ్వొచ్చే దాకా ఏ వ్రతాలూ, నోములూ నోచుకోము. తెఅరగా వచ్చేసేయ్!" అన్నారు.
    
    "అన్నయ్యా చలికోటు వేసుకో! సమయానికి అన్నం తిను ఆరోగ్యము జాగ్రత్త!" అంటూ చిన్నపిల్లాడిలా భోరుమన్నాడు ప్రకాశం.
    
    సుబ్బారాయుడు తమ్ముడి తల నిమురుతూ "అమ్మాయ్ శాంతా!  వీడుట్టి పిరికి సన్నాసి.....! జాగ్రత్తగా చూసుకో!" అని అప్పజెప్పాడు.
    
    "ఇంటికి! మీ అక్కయ్య ఇంట్లోలేని లోటు చుట్టపక్కాలకి కానీ, ఇరుగు పొరుగులకి కానీ రానివ్వకు!" ఆప్యాయంగా చెప్పాడు.    
    
    "రైలు కూతేస్తోంది... అందరూ కిందికి దిగండి!" అన్నాడు ప్రకాశం.
    
    అప్పుడు పిలిచింది రాధ "నాన్నా!" అని.
    
    పార్వతమ్మ రెండు చేతులతో రాధ తలని తన హృదయానికి హత్తుకుని, "బెంగెట్టుకోకమ్మా....నీకు అంతా ఉన్నారుగా....ఎవరూ లేకుండ వెళ్తున్నది మేము!" అంది.

 Previous Page Next Page