"నన్ను మించినవాడివి. అన్నీ నీకే వదులుతున్నాను ....." అన్నాడు నాయుడు.
24
గోపి పెద్ద పార్టీ ఏర్పాటు చేశాడు. దానికి మొత్తం చౌదరి, నాయుడిల అనుచరులందరూ వచ్చారు.
పార్టీ హడావిడిగా జరుగుతున్నది.
పార్టీలో పాటగాళ్ళు, ఆటగాళ్ళు, బేరర్సు-అందరూ మారువేషాల్లోని పోలీసులే! కోటలో పాగా వేసిన గోపికి ఫిరంగిపురంలో పోలీసులను ప్రవేశపెట్టడం అత్యంత సులభమయింది.
సర్వ్ చేస్తున్న పదార్ధాల్లో మత్తుమందు కలపబడింది. ముఠా మనుషులోక్కొక్కరే-తాగి తూలిపోతూంటే- కొందరు బేరర్సు - వారిని పక్కకు తీసుకుపోతున్నట్లుగా నటించి సంకెళ్ళువేసి అక్కణ్ణించి దారి తప్పించేస్తున్నారు.
నాయుడిది గమనించి అనుమానంగా గోపివంక తిరిగాడు. అదే సమయంలో గోపి నాయుడిని సమీపించి- "మిస్టర్ నాయుడూ! ఏదో పెద్ద మోసం జరిగింది. ఎవరో మనని పూర్తిగా మోసగించారు. నేనని నువ్వూ, నీవని నేనూ అనుమానించుకుని కాలయాపన చేసేకంటే-ముందు మన మిద్దరమూ ఇక్కడినుంచి బయటపడడంమంచిది- ఏమంటావ్?" అన్నాడు.
పరిస్థితి చేయిదాటి పోయిందని నాయుడికీ అనిపించింది. అతడు అంగీకార సూచకంగా తలాడించి- "ఆలోచించడానిక్కూడా టైంలేదు-" అంటూ జేబులోంచి పిస్టల్ తీశాడు. గోపికూడా పిస్టల్ తీశాడు.
అప్పుడే ఇద్దరు పోలీసులు వాళ్ళను సమీపించారు.
గోపి, నాయుడు పిస్టల్సు ఉపయోగించి అక్కడనుంచి బయటపడ్డారు. హోటల్ గేటు చేరుకునేసరికి పిస్టల్స్ లో తూటాలు లేవు. అక్కడ పోలీసు జీపు, పోలీసులు సిద్దంగా ఉన్నారు.
"మిస్టర్ గోపి-ఒకప్పుడీ పోలీసులు కుక్కల్లా నా పనులు చేశారు. ఇప్పుడు మనల్ని కుక్కల్లా తరుముతున్నారు-" అన్నాడు నాయుడు.
"ఇప్పుడేం చేద్దాం?" అన్నాడు గోపి.
"ట్రిక్ ట్రిక్ ట్రిక్ అంటావు గదా-నువ్వు చెప్పలేవా?" అన్నాడు నాయుడు.
"నన్ను నేను రక్షించుకోగలను. నిన్ను రక్షించడంవల్ల నాకు లాభమేమిటీ అని ఆలోచిస్తున్నాను-" అన్నాడు గోపి.
"నిన్ను నా స్థావరాలకు తీసుకుని వెడతాను. అక్కడ మనం వీలైనంత డబ్బు తీసుకుని విదేశాలకు వెళ్ళిపోవచ్చు-"
"ఎలా?" అన్నాడు గోపీ.
"నన్ను రక్షించు-అప్పుడు తెలుస్తుంది...."
"ఓ కే-" అన్నాడు గోపీ- "అయితే నేను చెప్పినట్లు చేయి. మనం పోలీసులకు లొంగిపోతున్నాం-"
నాయుడు అంగీకరించాడు. ఇద్దరూ హోటల్ గేటు సమీపించారు ఎంతో నెమ్మదిగా. గోపి అక్కడున్న ఇన్ స్పెక్టర్ని చూసి- "సార్-డబ్బు కోసం మేము చేయని ఘోరాలు లేవు. అందుకు సిగ్గుపడుతున్నాం. మా చేతులకు సంకెళ్ళు బిగించండి-" అంటూ తన రెండు చేతులూ పైకి ఎత్తాడు. అప్పుడే అతడి చేతినుంచి ఓ గోలీ కిందపడింది. వెంటనే అక్కడ బుస్సుమంటూ ఒక రకమైన గ్యాసురాసాగింది.
గోపి నాయుడి ముక్కు మూశాడు.
అక్కడ చిన్న కలకలం. పోలీసులు స్పృహతప్పి పడిపోతున్నారు.
"ఇదే మంచి సమయం-నా చేయి వదలకు-" అంటూ గోపీ నాయుడి చేయి పట్టుకుని ఓ కారు వద్దకు తీసుకుని వెళ్ళాడు. ఇద్దరూ కారెక్కారు.
నాయుడు డ్రైవింగ్ సీట్లో కూర్చుని- "శబాష్ గోపి-" అన్నాడు. కారు రివ్వున దూసుకుపోయి ఒకచోట ఆగింది. అది చిన్న పెంకుటిల్లు. నాయుడు గోపిని అందులోనికి తీసుకుని పోయాడు.
"ఇది నా రహస్య స్థావరమని ఎవ్వరూ ఊహించలేరు. ఇక్కడ ప్రమాదం ఏర్పడితే తప్పించుకునిపోయే మార్గంకూడా ఉన్నది-" అంటూ నాయుడు గోపిని-ఓ గదిలోనికి తీసుకునివెళ్ళాడు. అక్కడ ఒక మామూలు బీరువా ఉన్నది. ఆ బీరువాలోంచి నాయుడు రెండు బ్రీఫ్ కేసులు తీసి "ఒకటి నాకు.....ఒకటి నీకు..." అన్నాడు.
గోపి తన బ్రీఫ్ కేస్ తెరిచాడు. అందులో తళతళలాడే నోట్ల కట్టలూ, ధగధగలాగే వజ్రాలూ ఉన్నవి.
"నోట్లకట్టలు మన దేశంనుంచి బయటపడడానికి - వజ్రాలు ఏ దేశంలోనైనా బ్రతకడానికి...." అన్నాడు నాయుడు.
అతడి మాటలు ఇంకా పూర్తికాకుండానే ఎవరో ఆ ఇంటి తలుపులు తట్టారు. నాయుడు తలుపు సందుల్లోంచి చూసి- "పోలీసులు!" అని చెప్పాడు.
"ఏం చేయాలి?" అన్నాడు గోపి.
"ఈ ఇంట్లోంచి సొరంగమార్గం ఉన్నది-" అన్నాడు నాయుడు. గదిలోని రాతిపలక నొకదాన్ని నాయుడు తొలగించాడు. ఇద్దరూ సొరంగ మార్గంలో ప్రవేశించి ఆ రాతిపలకను మూసి వేశారు.
"ఇప్పుడు మన ఉనికి ఆ బ్రహ్మదేవుడికి కూడా తెలియదు-" అన్నాడు నాయుడు గర్వంగా, ఇద్దరూ బ్రీఫ్ కేసులతో ఆ సొరంగమార్గాన నడిచి మరో ఇంట్లో ప్రవేశించారు.
అది ఒక పూరిగుడిసె.....
"ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుందాం-" అన్నాడు నాయుడు.
అతడి నోటివెంట మాటలు పూర్తికాకుండానే ఆ గుడిసెబయట కలకలం వినిపించింది. నాయుడు బయటకు తొంగిచూసి- "పోలీసులు!" అన్నాడు.
అక్కణ్ణించీ ఓ రహస్యమార్గం ఉన్నది.
ఎన్నిరహస్యమార్గాలు మారినా పోలీసులు వాళ్ళను వెంటతఃరుముతూనే ఉన్నారు. అలావారు మొత్తం నాలుగు ప్రాంతాలు మారి అయిదవసారి ఒక బంగళాలోనికి వచ్చారు.
అప్పుడు నాయుడు కంగారుగా- "మిస్టర్ గోపీ- మన ప్రయాణం ఈ రోజు అస్తవ్యస్తంగా ఉన్నది. మనప్రయాణమంతా సొరంగమార్గంలోనే నడుస్తున్నది. అయినాపోలీసులు మన స్థావరాలను తెలుసుకుంటున్నారు. మనమిద్దరం పరస్పరం పరీక్షించుకోవలసి ఉన్నది-" అంటూ చటుక్కున గోపీని పిస్టల్ తో బెదిరించి వెనక్కు తిరగమన్నాడు. గోపీ మాట్లాడకుండా వెనుదిరిగాడు.
అప్పుడు నాయుడు గోపీవీపుపై ఒకచిన్న బొత్తాంవంటి వస్తువును చూసి చటుక్కున దాన్ని లాగి- "ఎలక్ట్రానిక్ బగ్...." అన్నాడు.
గోపీ మాట్లాడలేదు.
నాయుడు గోపీజేబులోని పిస్టల్ని కూడాలాక్కుని తనజేబులో ఉంచుకున్నాడు. తనుతీసిన వస్తువుని గాలిలోకి ఎగురవేసి పిస్టల్ తో పేల్చాడు.
గోపీ మనసులో దిగులు చెందాడు. ఈబగ్ ఆధారంగా తమననుసరించి తెలుసుకోగలుగుతున్న జీపుకు బహుశా వెంటనే బ్రేకుపడి ఉంటుందని అతడనుకున్నాడు. మామూలుగా నాయుడువంక తిరిగి-"హోటల్లోంచి మనం పారిపోతున్నప్పుడు ఎవ్వరోతెలివిగా మనకిది అంటగట్టి ఉంటారు-" అన్నాడు గోపీ.
"నాకిప్పుడు ఎవర్ని నమ్మాలో నమ్మకూడదో తెలియడంలేదు. ఇదేనా ఆఖరు రహస్యస్థావరం. పోలీసులు దీన్నికూడా కనిపెట్టేలోగా నన్ను నేను రక్షించుకోవాలి-" అన్నాడు నాయుడు.
"మరి నీ భార్యాబిడ్డల సంగతేమిటి?" అన్నాడు గోపీ.
"వాళ్ళపేరున బ్యాంకులో డబ్బుంది. వాళ్ళజీవితానికేలోటూ లేదు. నాభార్య నన్నుభర్తగా ఆదరించిగౌరవించింది. నా కొడుకు నన్ను తండ్రిగా ప్రేమించి అభిమానించాడు. ఇద్దరికీ సుఖజీవనానికి లోటులేకుండా డబ్బిచ్చాను. నాకిప్పుడు మచ్చవచ్చింది. ఆమచ్చ తెలియనిచోటుకు వెళ్ళిపోతాను....." అన్నాడు నాయుడు.