Previous Page
ట్రిక్ ... ట్రిక్ ... ట్రిక్ పేజి 44


    "నీతోనన్నూ తీసుకునిపో-" అన్నాడు గోపీ.
    "నిన్ను పంపించే నేనువెడతాను. అక్కణ్ణించి కదలబోకు-" అన్నాడు నాయుడు.
    నాయుడి చేతిలో పిస్టల్ ఉన్నది. గోపీ నిరాయుధుడిగా నిలబడిఉన్నాడు. నాయుడిలా తనకు ఎదురు తిరుగుతాడని గోపీ వూహించినట్లులేదు.
    "నేను నిన్ను పోలీసులనుంచి తప్పించాను. నామేలు అప్పుడే మరిచి పోయావా?" అన్నాడు గోపీ.
    "నువ్వు నన్ను పోలీసులనుంచి తప్పించావు. అందుకు ప్రతిఫలంగా నేనూ నన్ను తఃప్పిస్తాను- ఈలోకంనుంచి...." అన్నాడు నాయుడు.
    అతడు పిస్టల్ పేల్చబోతున్నట్లు గుర్తించాడుగోపీ. వెంటనే నోటితో కుక్కపిల్ల అరిచినశబ్దంచేశాడు. ఆ శబ్దంనాయుడికి తనవెనుకనుంచి వచ్చినట్లే అనిపించి వెనక్కుతిరిగాడు.
    గోపీకి ఆ ఒక్కక్షణంచాలు. ఆహాడు నాయుడిమీదకుదూకి అతడి చేతిలోని పిస్టల్ ఎగురగొట్టాడు.
    అయితే నాయుడిబుర్ర చకచకాపనిచేసింది. అతడు క్షణంలో తన జేబులోని పిస్టల్ తీసి- "ఇది నీదే-బహుశా నీపిస్టల్ తోనే నీచావురాసిపెట్టి ఉన్నదనుకుంటాను...." అన్నాడు.
    గోపీ నాలుగడుగులు వెనక్కు వేశాడు.
    నాయుడు పిస్టల్ పేల్చాడు.
    గోపీ-ఇహిహి-అని నవ్వి-పళ్ళమధ్య నుంచీ తూటాతీశాడు.
    నాయుడు ఆశ్చర్యపడినప్పటికీ మళ్ళీ పేల్చాడు. గోపీ మళ్ళీ పళ్ళమధ్యనుంచి తూటాతీశాడు. అప్పుడు నాయుడు చకచకా. వరుసగా, ఆగకుండా పిస్టల్ నాలుగుసార్లు పేల్చాడు. గోపీకూడా అలాగే అదే వేగంలో నాలుగుగుళ్ళు నోట్లోంచి తీశాడు.
    క్షణంపాటు నాయుడు దిగ్భ్రాంతుడై పోయాడు. గోపి అతడివంకే చూస్తూ నవ్వుతూ నిలబడి- "మృత్యువును హత్యా చేయాలనుకుంటున్నావు. సాధ్యపడుతుందా?" అన్నాడు.
    నాయుడు నెమ్మదిగా తేరుకున్నాడు. అతడి పాంటుకు లోపలకూ చుట్టూ మొత్తం ఆరుజేబులున్నాయి. ఆరింటిలోనూ చాకులున్నాయి.
    చాకులు విసరడంలో నాయుడు నేర్పరి. అతడు ఒక చకును గోపీ మీదకు విసిరాడు. గోపీదాన్ని ఒడుపుగా పట్టుకున్నాడు. నాయుడు మరో చాకు విసిరాడు. గోపీదాన్నీ పట్టుకున్నాడు.
    నాయుడు వరుసగా నాలుగు చాకుల్ని విసిరాడు. గోపీ అన్నింటినీ పట్టుకుని- "నీవు నా మిత్రుడివి కవలనుకుంటే నిన్నిప్పుడు నేను చంపగలను. కానీ అలా చేయను. అయితే నా శక్తి నీకు తెలియాలికదా-" అంటూ ఒక చకును విసిరాడు. నాయుడి కుడిభుజంలోనికి దిగబడిందది.
    నాయుడు వెనక్కు తిరిగి పరుగెత్తబోయాడు.
    "నావద్ద ఇంకా అయిదు చాకులున్నాయి. నన్ను సహృదయంతో అర్ధం చేసుకునేందుకు నువ్వు ఆగకపోతే నేను నిన్ను ఆపగలను-" అన్నాడు గోపీ.
    నాయుడు ఆగి- "నామానాన నన్ను పోనీ-" అన్నాడు.
    "నాలో నేను చెప్పిన చోటుకువస్తే నిన్ను వదలిపెడతాను-" అన్నాడు గోపీ.
    "ఎక్కడికి?" అన్నాడు నాయుడు.
    "మాట్లాడకుండా నాతోరా-" అన్నాడు గోపీ.
    ఇద్దరూ ఆ బంగళాలో వేషాలు మార్చుకున్నారు. ఇద్దరూ ఇప్పుడు పండు వృద్దులకువలె ఉన్నారు.
    బంగాళానుంచి బయటపడేముందు గోపీ నాయుడికి ప్రథమచికిత్స చేసి భుజానికి కట్లు కట్టాడు. ఆ పైన డ్రెస్ వేసుకొనడంవల్ల కట్టుకనబడదు.
    బయటకు వచ్చేక నాయుడు గోపీని అనుసరించాడు.
    ఇద్దరూ తిన్నగా ఒక ఇంటికి వెళ్ళారు.
    "ఇది నీ రహస్య స్థావరమా?" అన్నాడు నాయుడు.
    "కాదు. నీది-"
    "అంటే?"
    "చెబుతాను పద-" అంటూ గోపీ అతఃడిని లోపలకు తీసుకుని వెళ్ళాడు.
    ఇంట్లో ఎవ్వరూ లేరు.
    "మిస్టర్ నాయుడూ! నువ్వు నీ బాస్ చౌదరిని మోసగించావు. నిన్నాయన కొంతవరకూ క్షమించాడు. తర్వాత స్నేహితుడిని పిలిచి నన్ను మోసగించావు. నేనూ నిన్ను కొంత క్షమించాను. కానీ నీచే మోసపోయిన వనిత ఒకామె ఉన్నది. ఆమె నిన్నెంతవరకూ క్షమిస్తుందో చూడాలి మరి...." అని "శకుంతలా-నాయుడొచ్చాడు-" అన్నాడు గోపీ కాస్త గట్టిగా.
    అప్పుడు పక్కగదిలోంచి ఆ హాల్లోకి శకుంతల వచ్చింది. నాయుడామెను పరీక్షగా చూశాడు. ఆమెనతడు గుర్తుపట్టలేదు.
    "గుర్తున్నానా?" అన్నదామె.
    నాయుడు తల అడ్డంగా ఊపాడు.
    శకుంతల గోపీవంక తిరిగి-"నాయుడిని నాకప్పగిస్తానన్నావు. అన్నప్రకారం తీసుకొచ్చావు. ధన్యవాదాలు...." అన్నది.
    "చౌదరికి నేనిచ్చిన మాట ఇది-" అన్నాడు గోపి.
    "ఏమిటిదంతా?" అన్నాడు నాయుడు.
    శకుంతల గోపీని సమీపించి అతడి భుజంపై చేతులాన్చింది. మరుక్షణంలో నాయుడు నేలమీద స్పృహతప్పి పడిపోయాడు.
    "థాంక్స్ గోపి- ఇది నా ఆఖరుకోరిక...." అన్నది శకుంతల.
    "మిస్ శకుంతలా! నాకోసం పోలీసులు అన్వేషిస్తూంటారు. ఇక్కన్నించి ఎలాగో తప్పించుకుపోవాలి. నువ్వూ నాతో వస్తావా?" అన్నాడు గోపి.
    "మరి విశాల సంగతేమిటి?" అన్నది శకుంతల.
    "ఎన్నో నాటకాలాడాను. వాటిలో అదీ ఒకభాగం-" అన్నాడు గోపి.
    శకుంతల అతడివంక అదోకలా చూసి- "అదే నిజమైతే అప్పుడు నీకూ నాయుడికి తేడా ఏమిటి?" అన్నది.
    "నాకూ నాయుడికీ తేడా ఉన్నదనుకుంటున్నావా?"
    "ఉన్నది-" అన్నది శకుంతల.
    "ఏమిటది?"
    "నువ్వు విశాలనింతవరకూ మోసం చేయలేదు-" అని- "ఇక ముందుకూడా ఆమెను మోసం చేయకు-" అన్నది శకుంతల.
    "విశాల గురించి నీకు బాధ ఎందుకు?"
    శకుంతల నవ్వి-" అక్కగా ఆమెకు ఏ బాధ్యతలూ నెరవేర్చని నేను కనీసం ఈ బాధ్యతనైనా తీసుకుందామని...." అన్నది.
    "అంటే?"
    "విశాల నాకు స్వయానా చెల్లెలు. ఈ విషయం దానికిచెప్పి నేను సాధించగలిగేదేమీ లేదు. నా జీవితం నా తల్లి, చెల్లెలు - జీర్ణించుకోలేని పరిణామాలు చెందింది..." అన్నది శకుంతల.
    సరిగ్గా అప్పుడే నాయుడికి స్పృహ వచ్చింది. అది గమనించిన శకుంతల అతడు లేచి నిలబడగానే మరోసారి గోపీని ఊతగా చేసుకుని తన్నింది. నాయుడు మళ్ళీ పడిపోయాడు.
    గోపి శకుంతల గురించిన అసలు నిజం తెలియగానే- "మిస్ శకుంతలా- అయితే నీవు నేను చెప్పినట్లు చేయాలి-" అన్నాడు.
    "ఏమిటో చెప్పు!"
    "నేను పోలీసులదృష్టిలో ఉన్నాను. నా కోసం అన్వేషణ ప్రారంభమవుతుంది. నాకీ జీవితం నచ్చలేదు. నేను విషయాలను తీసుకుని అజ్ఞాతం లోనికి వెళ్ళిపోతాను. సామాన్యుడిలా జీవితం గడుపుతాను. నువ్వు నాయుడిని పోలీసులకు నీ చేతులతో అప్పగించు. చౌదరి అనుచరురాలిగా నీ గురించి ఏ శిక్షలెదురు చూస్తున్నాయో నాకు తెలియదు. కానీ నాయుడిని అప్పగించడం వలన నీకు చాలా శిక్షలు తగ్గుతాయి. నీ కున్న నేర్పు పోలీసు డిపార్టుమెంటులోకూడా నీకో స్థానం కల్పించగలదు-" అన్నాడు గోపి.
    "ఆ అవకాశం నువ్వే తీసుకొనవచ్చు గదా - " అన్నది శకుంతల.
    "నేను పోలీసులకు పట్టుబడదల్చుకోలేదు. అందువల్ల ఎంతో కొంత జైలు శిక్ష అనుభవించక తప్పదు. అదీకాక నాయుడిపై నాకు పట్టరాని కోపం ఉన్నది. అతడు నా తండ్రినీ, తల్లినీ హత్య చేశాడు. నా కనుల ముందే నా తల్లిని చంపాడు-కానీ ఒక యువతిని ప్రేమించానని మోసగించడం-అన్నింటికీ మించిన ఘోరం. అందుకే అతడిని నీకే వదిలిపెడుతున్నాను...."
    గోపీ మాటలు పూర్తయ్యేసరికి నాయుడికీ మళ్ళీ స్పృహ వచ్చింది. అతడు మళ్ళీ లేచి నిలబడి శకుంతల కాలి మడమ దెబ్బను మళ్ళీ రుచిచూశాడు.
    "నాయుడు నీ తల్లిదండ్రులను హత్య చేశాడా? అలాంటి వాడిని నువ్వు ప్రాణాలతో వదిలిపెడుతున్నావా?" అన్నది శకుంతల ఆశ్చర్యంగా.
    "అందులో ఆశ్చర్యమేమున్నది? నాయుదలా చేయడంవల్లనే నేను నాయుడినంతం చేయాలనీ పట్టుబట్టి ఈ స్థితికి ఎదిగాను. నా సామర్ధ్యాన్ని నాయుణ్ణి చంపడానికి వినియోగిస్తే-నాకూ నాయుడికీ తేడా ఏమున్నది?...." అని- "నీ ఇంటిముందు హడావుడి అవుతున్నది. పోలీసులు వస్తున్నారను కుంటాను...." అంటూ గోపి అక్కణ్ణించి మాయమయ్యాడు.
    శకుంతల వెడుతున్న అతడివంకే ఆశ్చర్యంగా చూస్తూ-"ఎందరో హీరోల గురించి విన్నాను, చదివాను. కానీ అసలైన హీరోవి నువ్వే గోపి! నీ ద్వేషం ప్రజలకుపయోగం అవుతుంది తప్పితే- నిన్ను హంతకుణ్ణి చేయదు. విశాల నీతో తప్పక సుఖపడుతుంది-" అనుకున్నది.
    అప్పుడామె నెమ్మదిగా నాయుడిని సమీపించింది. అతడి నుదుటిపై మూడు L గుర్తులున్నాయి.

 

                                              --* * * --

 Previous Page