"హలో-" అన్నాడు నాయుడు. అంతలోనే అతడిముఖం వెలిగింది-"ఏమిటీ-అశోక్ ఇప్పుడు మా ఇంట్లోనే ఉన్నాడా? ఎలా జరిగిందిది?......ఇద్దరు మనుషులు పోయారా? ఫరవాలేదు-గోపీ ఒక్కడు మనచేతచిక్కితే మనవాళ్ళు పదిమంది పోయినా ఫరవాలేదు....."
గోపీ తాపీగా నాయుడిసంభాషణ వింటూ తనలోతాను అదోరకంగా నవ్వుకుంటున్నాడు. ఆనవ్వు నాయుడిని రెచ్చగొట్టేదిగా ఉన్నది.
నాయుడు కోపంగా-"ఇంక ఏం జరిగిందో ఫోన్ నువ్వు విను. అప్పుడు నవ్వుధువుగాని-" అంటూ ఫోన్ గోపీకి అందించాడు. గోపీ ఫోన్ అందుకాగానే నాయుడి కుడిచేయి యాష్ ట్రే పొజిషన్ అడ్జస్టు చేస్తున్నది. అప్పుడు సిగరెట్ నాయుడి ఎడమచేతి వ్రేళ్ళమధ్యనున్నది. నాయుడు సిగరెట్ ను యాష్ ట్రే మీదకు తెచ్చి ఒకసారి నుసిదులిపి మళ్ళీ పెదాల మధ్య ఉంచుకున్నాడు.
గోపీ ఫోన్ వింటున్నాడు.
అశోక్ నృత్యం ప్రారంభమైన అయిదునిముషాల్లో మంచినీళ్ళు అడిగాడు. నీల్లుతాగి కళ్ళుతిరిగి పడిపోయాడు. అశోక్ కి ఏం జరిగినా గోపీకి ప్రమాదమునందని గోపీమనుషులు భయపడి డాక్టర్ కు ఫోన్ చేశారు. నాయుడిమనిషి డాక్టరు వేషంలోవచ్చి వెంటనే నర్సింగ్ హోంకు తరలించాలన్నాడు. నాయుడిదే అంబులెన్సు వచ్చింది. అశోక్ క్షేమంగా ఇల్లు చేరాడు.
"ఫోన్ పెట్టేయొచ్చా?" అన్నాడు గోపి.
"అంతా విన్నావా?" అన్నాడు నాయుడు.
"ఫోన్ పెట్టేయొచ్చా?" అన్నాడు గోపీమళ్ళీ.
"ఎందుకని?"
"ఏమో-ఇంకా ఎన్నిఫోన్లు వస్తాయోనని ...." అంటూ గోపీ చటుక్కున రిసీవర్ని క్రేడిల్ చేశాడు.
నాయుడు యాష్ ట్రే పొజిషన్ అడ్జస్టు చేసి- ఎడమచేతిలోని సిగరెట్ దానిపై ఉంచబోతూండగా మళ్ళీ ఫోన్ మ్రోగింది. నాయుడు సిగరెట్ పెదాలమధ్య ఉంచుకుని ఫోన్ తీశాడు.
"అది నాకోసం అయుంటుంది-" అన్నాడు గోపీ.
నాయుడు గోపీకి ఫోన్ అందించాడు. గోపి ఫోన్ అందుకుని-"మాలతీఇప్పుడు మనింట్లోనే ఉన్నదా?" అన్నాడు కాస్తగట్టిగా.
"ఊఁ"
"విశాలకు ఫోనివ్వు-ఆమెతో మాట్లాడాలి-"
కొద్దిక్షణాల్లో విశాలగొంతు-"హలో గోపీ-" అన్నది.
"మాలతిని మర్యాదగా చూడాలి. ఆమెకు ఏ ఇబ్బందీ కలుగనివ్వకూడదు. ఆమె నా స్నేహితుడి భార్య-" అన్నాడు గోపి.
నాయుడు మధ్యలో కలగజేసుకుని-"ఈ మాలతి ఎవరు?" అని- "పాపం ఎవర్నైతేనేంలే-నువ్వు మళ్ళీ ఆమెను కలుసుకోలేవు-" అన్నాడు.
"విశాలా-ఫోన్ మాలతికి అందించు-" అని గోపి నాయుడివంక చిరుకోపంతో చూసి- "మాలతిగురించి అలావేళాకోళమాడకు. ఆమెనాకు వదినతో సమానం. ఆమె నాస్నేహితుడు నాయుడి భార్య......" అన్నాడు.
ఈమాట వింటూనే నాయుడు గతుక్కుమన్నాడు. అతడు వెంటనే ఫోన్ లాక్కుని-" నాయుడు స్పీకింగ్-అవతల ఎవరు?" అన్నాడు.
"ఏమండీ మీరేనా?....నేను మాలతిని మాట్లాడుతున్నాను....."
"ఎక్కన్నించి మాట్లాడుతున్నావు?"
"మీరుకంగారుపడకండి-కార్లోవస్తూంటే ఒకామె నాకారుముందు కళ్ళుతిరిగి పడిపోయింది. నేనామెను డాక్టరువద్దకు తీసుకునివెళ్ళాను. ఆమెగర్భవతిఅని తేలింది. డాక్టరు సూచనపై నేనామెను ఇంటివద్దదిగబెట్టాను. ఆమె అక్కచాలా మర్యాదస్థురాలు. ఓపట్టాన నన్ను వెళ్ళనివ్వడంలేదు....."
నాయుడు-"సరేలే-" అని ఫోన్ పెట్టేశాడు. జరిగిందేమిటో అర్ధమయింది. అప్రయత్నంగా అతడు తనఎడమచేతివైపు చూశాడు.
సిగరెట్ పూర్తికావస్తున్నది!
"మిస్టర్ నాయుడు! ట్రిక్.....ట్రిక్.....ట్రిక్.....అంటే తెలుసా?"
"తెలియదు-"
"అది నామారుపేరు-" అన్నాడు గోపి- "ఇప్పుడు నేనోనంబరు చెబుతాను. అక్కడికి ఫోన్ చేయి. నీకు చాలా అవసరమైన విశేషం తెలుస్తుంది-"
గోపినంబర్లు చెబుతూంటే నాయుడు నెంబర్లు తిప్పాడు.
"హలో-"
"నాయుడుగారేనా?"
"ఆఁ"
"మీ భార్య మాలతి మా అధీనంలో ఉన్నది. మా గోపి క్షేమంగా బయటకు రాకపోతే-ఆమె మీరు కనీ వినీ ఎరుగని కొత్తప్రాంతాల, చాలీచాలని బట్టల్లో, చౌకబారు మేకప్ లో-అర్ధరూపాయికి శరీరాన్నమ్ముకునే పడుపుగత్తెల మధ్య జీవనం చేస్తుంది...."
నాయుడు వెంటనే చేతిలోని సిగరెట్ క్రింద పారేశాడు.
గోపీ ఆశ్చర్యంగా-"నువ్వు యాష్ ట్రేని ఉపయోగించలేదు-" అన్నాడు.
"సరైన పనే చేశాను-" అన్నాడు నాయుడు.
అప్పుడు గోపీ తనూ సిగరెట్ వెలిగించి- "మిస్టర్ నాయుడూ! నువ్వు నీ కొడుకు అశోక్ ను నమ్మకానికి పంపిస్తానన్నావు. అందుకు ఒప్పుకున్నాప్పటికీ-నీ భార్యను నమ్మకానికి మా అధీనంలో ఉంచాలన్న నిర్ణయం అప్పుడే తీసుకున్నాను. నీ అసలు రూపం బయటపెట్టడానికి అశోక్ ను తప్పుకుపోనిచ్చాను-" అన్నాడు.
"నీముందు నేను ఓడిపోయాను-" అన్నాడు నాయుడు.
"నీకంటే చౌదరి వెయ్యిరెట్లు నయం. ఈ విషయం అతడు నన్ను కలిసిన మొదటిరోజే తెలుసుకున్నాడు-" అన్నాడు గోపీ.
"ఈ రోజునుంచీ మనం పార్ట్నర్స్...." అన్నాడు నాయుడు.
"పార్ట్నర్స్ సంగతి సరే-ఇద్దరిలోకీ అసలు బాస్ ఎవరు?"
"నువ్వే!" అన్నాడు నాయుడు.
"హిప్ హిప్ హుర్రే-" అంటూ గోపీసిగరెట్ యాష్ ట్రే పై ఉంచబోయాడు. నాయుడు కెవ్వున అరిచి- "మిస్టర్ గోపీ-సిగరెట్ అక్కడ ఉంచకు. నిష్కారణంగా చచ్చిపోతావ్. నీ ప్రాణాలునాకిప్పుడెంతో విలువైనవి-" అన్నాడు.
గోపీ ఆశ్చర్యంగా- "వ్వాట్-" అన్నాడు-
"నువ్విప్పుడు నా పార్ట్నర్ వి. కాబట్టి అసలు విషయంచెబుతున్నాను. నువ్విలా నా పక్కకురా-" అన్నాడు నాయుడు. గోపీ అలాగే చేశాడు "ఇప్పుడు సిగరెట్ ని యాష్ ట్రేలో ఉంచు-" అన్నాడు నాయుడు. గోపీ అలాగే చేశాడు వెంటనే తుపాకీ గుండు రివ్వున కుర్చీలోంచి దూసుకుని పోయింది.
"బాప్ రే-" అన్నాడు గోపీ.
"ఇన్నాళ్ళకు నేనూ ఓ మనిషి ప్రాణాలు రక్షించాను-" అన్నాడు నాయుడు.
"నేను మనుషుల స్వభావాలకు మార్చేయగలను-" అన్నాడు గోపి.
"మిస్టర్ గోపి-మనమిద్దరం ఒకటి కావడం చారిత్రాత్మక విశేషం. పెద్ద ఎత్తున పార్టీ జరగాలి. అలనాడు చౌదరి చేసినకంటే ఘనంగా...." అన్నాడు నాయుడు.
"ఏర్పాట్లు నేనే చేస్తాను...." అన్నాడు గోపి.