Previous Page Next Page 
రేపల్లెలో రాధ పేజి 43


    "అగ్రిమెంటా?" ప్రకాశం అడిగాడు.
    
    "మనిద్దరమే మాట్లాడుకుందాం మావయ్యా!" అతని కంఠంలో గాంభీర్యాన్ని ఎదిరించే ధైర్యంలేనట్లు సుబ్బారాయుడు, ప్రకాశాన్ని వెనక్కి తగ్గమని సైగ చేశాడు.
    
    "చెప్పు" అన్నాడు దర్పంగానే"
    
    "నువ్వు కలలుగనే నగరవాసం గురించి నీకు పూర్తిగా తెలియదు! నేను చెప్పినా అర్ధంకాదు. అందుకని నువ్వు కొన్నాళ్ళు అంధేరీలోని లోఖండ్ వాలా కాంప్లెక్స్ లోని మా ప్లాట్ లో కొన్నాళ్ళు అత్తయ్యతో సహా ఉండు. కొంతకాలం అంటే ఓ ఆర్నెల్లు... చాలు! అప్పుడు కూడా సిటీలంటే స్వర్గసీమలనేదే నీ ఉద్దేశ్యమైతే నేను నీ ఆజ్ఞకి కట్టుబడి మీ అమ్మాయిని పెళ్ళిచేసుకుని టాటాస్ లో ఉద్యోగాన్ని ఒప్పుకుని ముంబై వెళ్ళిపోతాను. ఏమంటావు? అంతవరకూ ఈ సంబంధాలూ, నిశ్చితార్దాలూ వాయిదా వెయ్యాలి!" అన్నాడు.
    
    సుబ్బారాయుడు మాధవ్ మాటలకు నోరు తెరిచి బొమ్మలా ఉండిపోయాడు.
    
    "నీకూ, అత్తయ్యకి ఏ ఇబ్బందీ రాకుండా చూసేందుకు బాగా హిందీ తెలిసిన ఓ మేనేజర్ని కూడా ఏర్పాటు చేస్తాను!" అన్నాడు మాధవ్.
    
    ప్రకాశం చిరాగ్గా "ఉన్న ఊరూ, ఇన్ని బాధ్యతలూ వదులుకుని మా అన్నయ్య ముంబై ఎందుకు వెళ్ళాలి?" అన్నాడు.
    
    "మరి నా వాళ్ళందర్నీ వదులుకుని మీ కోసం నేనెందుకు వెళ్ళాలి?" అన్నాడు మాధవ్.
    
    ప్రకాశం కోపంగా "నీకు మతిపోయింది! వెళ్ళు.... మా అన్నయ్యా, వదినా ఎక్కడికీ వెళ్ళరు!" అన్నాడు.
    
    "ఏం వ్యవసాయం పనులు చూసుకుంటూ మీరు సంగీతం మానెయ్యాల్సొస్తుందనా?" నవ్వుతూ అడిగాడు మాధవ్.
    
    "అదేం కాదు!" అహం దెబ్బతిన్నట్లుగా అన్నాడు ప్రకాశం.
    
    "మరి మావయ్య కొన్నాళ్ళు స్వేచ్చగా ఉండటం కాదా మీకు కావాల్సిందీ? మీ అందరికీ బతకడానికి సరిపడా గ్రాసం సంపాదించి పెట్టడమేనా మీకు కావాల్సిందీ?" అన్నాడు.
    
    ప్రకాశం చిన్నబుచ్చుకుని "మేం ఎప్పుడూ ఆయన లేకుండా ఉండలేదు!" అన్నాడు.
    
    "ఆ మాట ఆయన చెప్పాలి!" అన్నాడు మొండిగా మాధవ్.
    
    "చెప్పు, అన్నయ్యా!" అన్నాడు ప్రకాశం.
    
    ఆపాటికే సుబ్బారాయుడు సూటూ, బూటూ వేసుకుని సల్వార్ సూట్ వేసుకున్న పార్వతమ్మతో బొంబాయి వీధుల్లో తిరుగుతున్నాడు. ఆయన కలల్లో మునిగిపోయాడని తెరిచిన ఆయన నోరే చెప్తోంది.
    
    'కలవారి కోడలూ కలికి కామాక్షీ.... కడుగుతున్నది పప్పు కడవలో పోసీ....' అన్నట్లుగా ఇంటి గడప దాటడానికి పేరుపేరునా అందరి దగ్గరా అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితిలో, ఇన్నేళ్ళూ కాపురం చేసిన పార్వతమ్మకి భర్త చెప్పిన విషయం ఒకంతట జీర్ణం కాలేదు.
    
    "పార్వతీ! మనం బొంబాయి వెళుతున్నాం. అంతే! అన్నాడు సుబ్బారాయుడు.
    
    "ఇదేం రచ్చబండ కాదురా! నీమాట తీర్పు అనడానికి!" కోపంగా అరిచింది మంచంలోంచే తాయారమ్మ.
    
    "ఇది నాకూతురి భవిష్యత్తుకి సంబంధించిన అతిపెద్ద తీర్పు ఇవ్వాల్సిన సమయం. ఇందులో మీ ఎవరి ప్రమేయం అవసరంలేదు" గంభీరంగా చెప్పాడు సుబ్బారాయుడు.
    
    ప్రకాశం మాట రానట్లు దీనంగా అన్నగారివైపు చూశాడు. అతని కాళ్ళూ, చేతులూ అన్నగారి పెద్దరికంతో కట్టేసినట్లుగా ఉంది.
    
    శాంత పార్వతమ్మని కౌగలించుకుని ఆడపిల్లని మొదటిసారి పుట్టింటికి సాగనంపుతున్నట్లు ఏడ్చింది.
    
    వార్తల తాతయ్య సన్నగా "నేనూ రానా?" అడిగాడు.
    
    సుబ్బారాయుడు కయ్యిమని "గారెముక్కా...గారెముక్కా పూసుకోకే అంటే.....నేతిబొట్టేదీ? అందట.... మళ్ళీ మీ అందర్నీ వేసుకెళ్ళే మాటయితే అసలు బొంబాయెందుకూ? నక్కబొక్కలపాడు చాలు అని అరిచాడు.
    
    "అక్కాయ్ ని వదిలి ఎప్పుడూ ఉండలేదు బావా!" కన్నీళ్ళు పెట్టుకున్నాడు సన్యాసిరావు.
    
    "ఆర్నెల్లు .... ఎంతలోకి గడుస్తుందీ?" అన్నాడు అందరివంకా ధైర్యం చెపుతున్నట్లు చూస్తూ సుబ్బారాయుడు.
    
    సూరమ్మ కొద్ది ధైర్యంచేసి, "వస్తూ పోతూ ఉండొచ్చా?" అంది. "ఊహుఁ, ఆర్నెల్లపాటు రాకూడదు. ఉత్తరాలూ, ఎప్పుడయినా డాక్టర్గారింటికి ఫోనూ చేసుకోవచ్చు!" .... అన్నాడు సుబ్బారాయుడు.
    
    "ఇన్ని కండీషన్లా?" గణపతి ఆశ్చర్యంగా నోరు తెరిచేశాడు. అతని మెదడులో అప్పుడే ఈ ఫ్లాట్ ఏ డైరెక్టర్ కైనా అమ్మేద్దామనే రంగు రంగుల ఊహలు తిరుగాడుతున్నాయి.

    ఇదంతా గొప్ప థ్రిల్లింగ్ గా చూస్తోంది తిలక కొయిరాలా.
    
    ఆనందంగా గమనిస్తోంది రాధ.
    
    "మాధవ్ తక్కువవాడేం కాదు..... మొన్నటి పాతాళభైరవిలో తోటరాముడూ...నిన్నటి మరోచరిత్ర బాలూ తర్వాతివాడు మిలీనియంహీరో" అని రాధ చెవిలో గుసగుసలాడింది తిలక.
    
    సుబ్బారాయుడు తమ్ముడ్ని దగ్గరికి రమ్మని సైగచేసి చెప్పాడు. "నువ్వే నేను వచ్చేదాకా ఇంటికి పెద్ద! ఆర్నెల్లు మమ్మల్ని అవతలికి నెట్టి ఈ పిల్లనేసుకునివాడు గదిదాటి తిరుగుతాడేమో....అటువంటివేమీ కుదరవు! నీ గారాబాలన్నీ అటకెక్కించి కఠినంగా ఉండు. రాధ ఆ మాధవ్ తో కలిసి తిరగడానికి వీల్లేదు. మాకేకాదు, ఈ ఆర్నెల్లూ వాళ్ళకీ పరీక్షే, దాన్ని చూడడానికి లేదు....ఇంకొకత్తి మెడలో తాళికట్టడానికి లేదు.
    
    ఆర్నెల్లు ఎప్పుడు తిరిగొస్తాయా అని వాడు గంటలు లెక్క పెట్టుకుంటూ గడపాలి! ఆ తర్వాత ... పరీక్షలో నేనే నెగ్గుతాను కాబట్టి... మన అమ్మాయిని చేసుకుని బొంబాయిలో కాపురం పెడతాడు! ఒక వేళ వాడు...." అని ఆపి తల అడ్డంగా తిప్పి, "నెగ్గే ప్రసక్తేలేదు! ఈ సుబ్బారాయుడి ముందే కుప్పిగంతులు వేస్తున్నాడు. పిల్లకాకికేం తెలుసు..... ఉండేలు దెబ్బ" అని మీసాలు మెలేస్తూ హేళనగా నవ్వాడు.
    
    ప్రకాశం అన్నగారి ప్రతి మాటకీ అంగీకారంగా తల ఊపాడు.
    
    ఆ రోజే ఆడపిల్లలు జానకీ, రాజేశ్వరీ, కాత్యాయినీ, ప్రమీలకి రమ్మని కబురు పంపించారు.
    
                                                          * * *

 Previous Page Next Page