"కంప్యూటరైజ్ద్ మిర్రర్స్ మరొకలా చెప్పాలంటే, మ్యాజిక్ మిర్రర్-వీటి తాలూకు వివరాలు తెలిపే పత్రాలు ఇవి. సమీప భవిష్యత్తులో వస్త్రాల షాపుల్లోనూ, ముఖ్యంగా రెడీమేడ్ దుస్తులు, చీరల దుకాణాల్లోనూ నెలకొల్పే ఒకే ఈ అద్దాల్ని మన కంపెనీ సంవత్సరంపాటు భారతదేశంలో గుత్తకు తీసుకుంది. అంటే మొదటి సంవత్సరమంతా కేవలం మన షాపుల్లోనే ఇవి ఉంటాయన్నమాట,"
"ఇంతకీ ఏమిటవి? మనం చేస్తున్నది అద్దాల వ్యాపారమా- బట్టల వ్యాపారమా?"
అతడు చెప్పటం ప్రారంభించాడు.
"మనం బట్టల షాపుల్లో నిత్యం గమనించేది ఏమిటి? నలుగురైదుగురు ఆడవాళ్ళు గంటల తరబడి షాపుల్లో కుర్రవాళ్ళని వందలకొద్దీ చీరల్ని బయటకి తీయించి, చివరికి ఎటూ సంతృప్తి చెందక వెళ్ళిపోవటం చాలా సర్వసాధారణమైన విషయం అవునా? ఒక్క చీర కొనటం కోసం ప్రొద్దున్నుంచీ సాయంత్రం వరకూ బజారంతా తిరిగే ఆడవాళ్ళు కూడా వున్నారు."
అతడు ఆగి, అన్నాడు - "మన చీర అమ్మకాల్లో పదోవంతు ఈ షాపు అద్దెలకీ, కరెంటు ఖర్చుకీ, ముఖ్యంగా అమంకాల కుర్రవాళ్ళ జీతాలకీ ఖర్చు పెడుతున్నాం. ఈ అమ్మే కుర్రవాళ్ళ పరిస్థితి మరీ దారుణం. చీరెల అంచులన్నీ విప్పి చూపించాలి. చివరికి మళ్ళీ ఈ వందచీరలూ యధాతధంగా మడతపెట్టి తిరిగి పెట్టెయ్యాలి. పొద్దున్నుంచీ సాయంత్రం వరకూ యంత్రాల్లా పనిచేస్తూనే వుంటారు. ఒక్కచీర అమ్మటం కోసం వంద చీరెలు తీసి మళ్ళీ సర్దుతారు. అలాటి పనిని తొలగించే ఈ యంత్రమే హోమ్ కంప్యూటర్-మ్యాజిక్ మిర్రర్! ఈ పద్దతి ద్వారా కస్టమర్లకి చీరెలు, రెడీమేడ్ వస్త్రాలు.....టేబిల్ మీద కాకుండా, తన శరీరాలకు కట్టుకుంటే ఎలా వుంటుందో అద్దంలో కనపడుతుంది."
యధాలాపంగా వింటున్న డైరెక్టర్లు ఆసక్తిగా ముందుకు వంగారు. "షోకేసుల్లోంచి చీరలు మాటిమాటికీ తీసి మడత విప్పడం, నచ్చకపోతే తిరిగి పెట్టేయటం ద్వారా మన్నిక కూడా తగ్గుతుంది. ఈ చిన్న అద్దంవల్ల ఆ పని తప్పుతుంది. ఇక యీ అద్దం ఎలా పనిచేస్తుందో వివరిస్తాను" అతను ఆగి అన్నాడు.
".....బట్టలు కావలసిన కస్టమరు షాపుకి రాగానే ఆమె ఎత్తు- లావుకి తగినట్టుగా అద్దాన్ని ఎడ్జెస్టు చేస్తాం. దానిముందు ఆ కస్టమరు నిలబడగానే, కంప్యూటర్ కి యీ వివరాలు ఫీడ్ చేస్తాం. మొహమూ చేతులూ మామూలు అద్దంలోలాగే కనబడతాయి. కంప్యూటర్ స్టార్టు అవగానే అయిదు సెకన్లకొక చీర చొప్పున ఫోటో మారిపోతూ వుంటుంది. అంటే.....మరోలా చెప్పాలంటే, ఆ చీర కట్టుకుంటే తను యెలా వుంటుందో చకచకా ఫోటోలు ఆమెకే కనిపిస్తాయి. మన షాపులో వున్న అన్ని రకాల చీరల్నీ దాదాపు అరగంటలో ఆమె ఆ విధంగా చూసెయ్యగలదు."
"అసంభవం... ఇంపాజిబుల్-" అన్న మాటలు వినబడినయ్. రవితేజ నవ్వాడు.
"ఇంతకన్నా సైన్సులో మనం చాలా సాధించాం. ఇంత చిన్న విషయం ఇన్ని రోజులవరకూ మనకి ఇలా చెయ్యవచ్చని తట్టలేదంటేనే ఆశ్చర్యంగా వుంది. ఇందులో నిజానికి కష్టం ఏముంది? OUTER PART OF THE BODY మామూలు అద్దంలా ఎడ్జెస్టుచేసి, మన దగ్గిర వున్న చీరెలన్నిటినీ కోడ్స్ రూపంలో కంప్యూటర్ కి ఫీడ్ చెయ్యటమే" అన్నాడు.
"ఫాషన్స్ సిస్టమ్స్, న్యూయార్క్ వారు ఆర్నెల్లక్రితం ఈ కంప్యూటర్ మిర్రర్ ని రెండు షాపుల్లో పరిచయం చేశారు. ఆ షాపులో వున్నా రెడీమెడ్ దుస్తులు తాము ధరిస్తే ఎలా కనపడతాడో అద్దంముందు నిలబడి చూసుకోవచ్చు నన్నమాట. పది నిముషాల్లో ఎనభై రకాల పాంట్లనీ షర్టులనీ ఈ విధంగా చూసుకోవచ్చు. 2-డై మెన్షన్ లో ఇది కనపడుతుంది. ఆక్యూరసీ తొంభైతొమ్మిది శాతం! L.S. Ayres అన్న డిపార్ట్ మెంట్ లో ఈ అద్దం ప్రవేశపెట్టిన మొదటి నెలలో అమ్మకాలు 86.7 శాతం పెరిగాయని తేలింది. ఇంకొక అయిదు సంవత్సరాల్లో బట్టల షాపుల్లో చీరలు అద్దాల బీరువాల్లో వుండవు. షాపుల్లో కేవలం అద్దాలు వుంటాయి. దాన్ని రవితేజ టెక్స్ టైల్స్ ముందుగా ప్రవేశబెడ్తుంది." ఆ రూమ్ చప్పట్లతో మార్మోగింది.
(ఈ నవలలో ఇప్పటివరకూ పరిచయం చేయబడిన-పోస్టు ద్వారా అమ్మటం, మ్యాజిక్ మిర్రర్ అన్నవి అభూత కల్పనలు కావు. ఒక ప్రముఖ సంస్థ పోస్ట్ ద్వారా చీరల్ని అమ్మటాన్ని 1982లో ప్రారంభించింది. అయితే కొన్ని కారణాల వల్ల మనదేశంలో ఈ పథకం సక్సెస్ అవలేదు.)
"పోస్ట్ ద్వారా చౌకధరకి చీరలమ్మే మన పథకాన్ని చెంచురామయ్య దెబ్బకొట్టాడు. మనం అతడిని ఎదురుదెబ్బ తీసాము. అది వేరే సంగతి. ఇప్పుడు ఈ పోస్టల్ సిస్టమ్ ద్వారా పెట్టిన పెట్టుబడిని తిరిగి వెనక్కి తీసుకోవాలి అంటే మ్యాజిక్ మిర్రర్ ని ఈ పథకానికి కలపాలి. ఇప్పటికే మనం యాభైలక్షలు వ్యాపార ప్రకటనకి ఖర్చు పెట్టి ప్రజల మనస్సులో ఈ చౌక చీరలని గాఢంగా ముద్రించాం. ఇప్పుడు ప్రజల భయమల్లా ఈ చీరల కోసం తీరా ఎమ్.ఓ. చేశాక అవి పోస్ట్ లో మిస్సయితే ఎలా అని."
అందరూ రవితేజ మాటలు వింటున్నారు.
"....బొంబాయి, హైద్రాబాద్, మద్రాస్ లాంటి పెద్ద నగరాల్లో ఈ కౌంటర్లు ప్రారంభిస్తాం. పెద్ద పెద్ద బట్టల షాపుల్లా వుండవని. చిన్న చిన్న ఫోటో స్టూడియోల్లా, డార్క్ రూమ్' కంప్యూటరైజ్ద్ అద్దమూ వుంటాయంతే. ప్రవేశ రుసుముగా 5 రూపాయలు పెట్టి చీరె ధరలోంచి దాన్ని తగ్గిస్తాం. నా వూహ నిజమైతే, రకరకాల చీరల్లో తామెలా వుంటామో చూసుకోవటానికే ఆడవాళ్ళు వేలం వెర్రిగా ఎగబడతారు. మనం అద్దంమీద పెట్టిన పెట్టుబడి నెలరోజుల్లో వచ్చేస్తుంది." నవ్వులు.
"...... మనకి ఇప్పటికే లక్షాయాభై వేల చీరలకి ఆర్డర్లు వచ్చినయ్. ఈ నగరాల్లో కస్టమర్లకి పోస్టులో కూపన్లు పంపిస్తాం. మీరు అడిగిన చీరెలే కాదు మా దగ్గర ఇంకా వెరైటీలున్నాయి. మా కంప్యూటరైజ్ద్ విభాగాన్ని దర్శించండి అని ఆహ్వానం పంపుతాం. ఈ విధంగా వారంరోజుల్లో నగరమంతా ఈ వార్త పాకిపోతుంది. మనం చేయవలసిందల్లా మన గోడౌన్లు ఆయా నగరాల్లో విశాలం చేసుకోవటమే! తన లావుకీ, పొడుక్కీ శరీరఛాయకీ ఆ చీర కట్టుకుంటే ఎలా కనపడతానన్నది చూసుకుని అది బావుంది అని కస్టమరు అనుకోగానే, ఆ కోడ్ నెంబరు ప్రెస్ చేస్తే అందమైన పాకెట్ వచ్చేస్తుంది. మనకి పదిమంది మనుష్యులు, అద్దాల బీరువాలు, హడావుడి అక్కర్లేదు. వచ్చిన కస్టమరు లావు పొడవుల్ని మిషనుకి ఫీడ్ చేసే మనిషి, డబ్బు తీసుకునే క్యాషియరు వుంటే చాలు. కస్టమరు ముట్టుకుని చూసి 'వాసి' పరిశీలించటానికి మాత్రం వెరైటీకొక్క చీర పక్కన పెడతాం. రకరకాల ధరలు కాకుండా మొత్తం అన్ని రకాల చీరల ధరల్నీ అయిదారు లెవల్స్ లో ఫిక్స్ చేస్తాం. ఇప్పటికే ఈ అద్దాల్ని ప్రవేశపెట్టిన షాపుల్లో అమ్మకాలు పదిరెట్లు పెరిగిన విషయం మనం మర్చిపోకూడదు.
"ఇంతకీ ఈ అద్దానికి ఎంతవుతుందో చెప్పలేదు!"
"విదేశాల్లో ఇప్పటివరకూ రెడీమేడ్ దుస్తులు వేసుకుంటే ఎలా కనపడతారో చూపించే అద్దాలే వున్నాయి తప్ప చీరెలకు లేవు. ఇవి మనం స్పెషల్ గా తయారు చేయించుకోవాలి. అదీగాక మన దగ్గిరున్న చీరెలన్నీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిజైన్లతో సహా వేర్వేరు ఎత్తు, లావు వున్న బొమ్మలకి కట్టి ఫోటోలు తీసి కంప్యూటర్ కి ఫీడ్ చేస్తూ వుండాలి. దీనికి వేరేగా మరొక డిపార్ట్ మెంట్ వుండాలి. ఈ మిషన్లకీ ఎస్టాబ్లిష్ మెంట్ కీ కలిపి 50 లక్షల దాకా అవుతుంది." ఒక్కసారిగా అందరూ 'ఆ' అన్నారు.
రవితేజ అందరివైపు పరికించి చూశాడు. ఇక అసలు విషయం చెప్పవలసిన సమయం వచ్చేసింది.
"నేను ఈ కాంట్రాక్టు కుదుర్చుకు వచ్చేశాను" అన్నాడు నెమ్మదిగా ఆ గది ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. ".....మీకు తెహ్లియకుమ్డా ఇంత పెద్ద నిర్ణయం నేనూ శర్మగారూ తీసుకోవటం పట్ల మీరు అసంతృప్తి చెందుతారని నాకు తెలుసు. కానీ దేశంలో మనమే ప్రధానంగా దీన్ని ప్రవేశపెట్టాలనుకున్నప్పుడు ఈ వార్త చివరి వరకూ బైటకు పొక్కకుండా వుండటం మంచిది. ఇది మీ పట్ల అపనమ్మకం కాదు. మనం ఏమనుకున్నా ఆ చెంచురామయ్యకి తెలుస్తున్నాయి. అందువల్ల ఈ నిర్ణయం తీసుకోవలసివచ్చింది."
"బోర్డు దీనికి ఒప్పుకోకపోతే...?" ఎవరో అడిగారు.
"ఆ విషయం కూడా మేము ఆలోచించాము. సంవత్సరం వరకూ భారతదేశంలో ఇంకెవరికీ ఈ అవకాశం ఇవ్వకూడదు అని మనం కండిషన్ పెట్టినప్పుడు, వాళ్ళు మన దగ్గర్నుంచి పెద్ద మొత్తం అడ్వాన్సుగా అడుగుతారు. అది వారంరోజుల్లో నేను వెళ్ళి అందజేయబోతున్నాను. మన కంపెనీ ఇన్ని లక్షలు తిరిగి ఇన్వెస్టు చేయడానికి ఒప్పుకోని పక్షంలో మరో కంపెనీ ప్రైవేట్ గా పెట్టి కేవలం అమ్మకాల వరకే పరిమితం చేయడానికి నిశ్చయించుకున్నాను. దానికి పెట్టుబడి, నన్ను నమ్మినవాళ్ళు నాతో కలిసి పెడతారు."
"లేదు లేదు. ఇది మనకే వుండాలి" ఎవరో ఒక మూలనుంచి అన్నారు.
"అవును వుండాలి. వుండాలి."
దాదాపు ఏకగ్రీవంగా ఈ తీర్మానం ఆమోదించబడింది. సభ్యులందరూ చాలా ఆశాభావం వెలిబుచ్చారు. కంప్యూటరైజ్డ్ మిర్రర్ సిస్టమ్ ని ఒక గొప్ప విప్లవాత్మకమైన మార్పుగా అభివర్ణించారు. తన డైరెక్టర్లు తను తీసుకున్న నిర్ణయం పట్ల, ఇలా స్టేట్స్ వెళ్ళటం పట్లా అలుగుతారేమో అనుకున్న రవితేజ వారంతా వెంటనే దీనికి ఒప్పుకోవటంతో ఆనందభరితుడయ్యాడు. ఇది బంపర్-సక్సెస్ అవుతుందని అతని కెందుకో అనిపిస్తూంది. మిగతా పోటీదార్లందరూ మట్టిగొట్టుకుపోతారు. ఇంకో పది లక్షలు ఎక్కువ ఖర్చయినా సరే, మరో సంవత్సరం ఎక్కువ కాంట్రాక్టు సంపాదించాలి. ఈ రకమైన షాపులు వీలైనన్ని ఎక్కువ పెట్టాలి. తాను చేసిన దానితో డైరెక్టర్లు ఇంత తొందరగా ఏకీభవించటంతో చాలా అపూర్వమైన విజయం సాధించాడు తను!
హుషారుగా ఇంటి కొచ్చాడు.