రాఘవరావు రెండు చేతుల్తో నోట్లకట్టలు పట్టుకుని, ఆ చేతుల్తోనే నమస్కారం చేశాడు. ప్రభుత్వ యంత్రంలోంచి వూడిపోయిన బోల్టులా వున్నాడు అతడిప్పుడు.
"నా కూతురు జీవితాన్ని నిలబెట్టావు బాబూ ఇదంతా మా అమ్మాయికి చెప్తే..."
"ఇదేమీ చెప్పనవసరంలేదుగానీ-"రవితేజ నవ్వేడు. "చీరకి ఎటువైపు ఫాల్ కుట్టాలో పెళ్ళయ్యాకైనా సరీగ్గా తెలుసుకోమన్నానని చెప్పండి అర్ధమవుతుంది."
* * *
ఆ తరువాత జరగవలసిన కార్యక్రమాలన్నీ ఒక పద్దతిలో జరిగిపోయాయి. పోస్ట్ పార్సెల్స్ వెళ్ళటం మొదలైంది.
బ్యాచీల ప్రకారం చీరలు వెళ్తున్నాయి.
చెంచురామయ్య ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు కనుక్కుంటూనే వున్నాడు. చెయ్యవలసిన ఏర్పాట్లు చేసి రవితేజ అమెరికా వెళ్ళిపోయాడు. కేవలం విహారయాత్ర కోసం అతడు పర్యటనకు వెళ్ళినట్టుగా కలర్ ఇవ్వబడింది. చెంచురామయ్య కూడా దానికి అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. అతడి దృష్టి అంతా- తమ వాళ్ళకి రవితేజ చీరలు ఎప్పుడొస్తాయో- ఎప్పుడు ఈ వార్త పేపర్లకిద్దామా అని వుంది. ఇంకో పదిహేను రోజులకి గానీ ఆ పేర్లున్న బ్యాచ్ కి రవాణా సాగదని తెలిసింది.
ఈ లోపులో అతడికి ఈ వార్త తెలిసింది. దాదాపు పది- పదిహేను ప్రదేశాల్లో కస్టమర్లకి (తన వాళ్ళు కాదు, మామూలుగానే) కేవలం ఖాళీ పాకెట్లు మాత్రమే అందాయని, వారు పోస్టల్ డిపార్ట్ మెంటుకి ఈ విషయమై ఫిర్యాదు చేశారని!
చెంచురామయ్య మనసులోనే సంతోషించాడు. తను ఏదైతే చెయ్యదల్చుకున్నాడో, తన ప్రమేయం లేకుండానే అది జరుగుతూంది. వెంటనే తనకి పరిచయమున్న పత్రికల వారినిద్దరిని ఆ కస్టమర్లు దగ్గరికి పంపాడు. వారు వాళ్ళని ఇంటర్వ్యూ చేశారు. ఆ కస్టమర్లు రవితేజ కంపెనీవి తమకు పోస్ట్ లో చీరెలు అందలేదని సంజాయిషీ కోరుతూ ఇచ్చిన లీగల్ నోటీసుల కాపీలు చూపించారు. చెంచురామయ్య- రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు ఆనందించాడు. మరుసటిరోజు పేపర్లలో ఈ వార్త వచ్చేసింది, "రవితేజ టెక్స్ టైల్స్ పోస్టల్ స్కీమ్ వైఫల్యం" అన్న హెడ్డింగ్ తో.
పోస్టల్ చీరెలు మిస్సయిన దృష్ట్యా కస్టమర్లు కోర్టుకు వెళ్తున్నారనీ అసలీ స్కీమ్ లోనే లోపం వుందనీ ఆ రెండు పత్రికలూ ప్రముఖంగా ప్రచురించాయి. ఇద్దరు ముగ్గురు కస్టమర్ల ఫోటోలు కూడా ముచ్చటపడి ప్రచురించారు ఆ రిపోర్టర్లు
మరుసటిరోజు ఆ రెండు పత్రికలకి లాయరు నోటీసు వచ్చింది. దీన్ని పంపించింది రవితేజ కంపెనీ!
చీరలు అందలేదంటూ ఫిర్యాదు చేసిన కస్టమర్లని తమ కంపెనీ రిప్రజెంటేటివ్స్ కలుసుకున్నారనీ, ఆ కస్టమర్లు తాము ఆ విధంగా ఫిర్యాదేమీ చేయలేదన్నారనీ....పత్రికలో పడిన వార్త తమకు కూడా ఆశ్చర్యం కలిగించినట్టు ఆ కస్టమర్లు చెప్పారనీ, తమ ఫోటోలు ఆ పత్రికల వాళ్ళకి ఎలా దొరికాయో తమకీ అర్ధంకావడం లేదని వాళ్ళు అన్నారనీ తమ వ్యాపారానికి ఈ విధంగా అబద్దపు వార్తలతో నష్టం కలిగించినందుకు ఎందుకు సివిల్ మరియు క్రిమినల్ చర్యలు తీసుకోకూడదో తెలుపవలసిందని రవితేజ కంపెనీ ఆ పత్రికాధిపతులకు పంపిన నోటీసు అది.
పత్రికల యాజమాన్యం కదిలిపోయింది.
అసలీ అబద్దపు వార్త తమ పత్రికల్లో ఎలా ప్రచురితమైందో వాళ్ళకీ అర్ధం కాలేదు. ఈ కస్టమర్ల అడ్రసులు తమ రిపోర్టర్లకి ఎలా అందేయన్న ప్రశ్న ముందు కలిగింది. తీగెలాగితే డొంకకదిలినట్టు దీని వెనుక చెంచురామయ్య వున్నట్టు బైటపడింది. ఒక అబద్దపు వార్తని సృష్టించి, ఒక ప్రముఖ కంపెనీకి పరువునష్టం కలిగించినందుకు ఆ రిపోర్టని సస్పెండు చేశారు. స్టేట్స్ నుంచి రవితేజ వచ్చేసరికి ఇక్కడున్న పరిస్థితి ఇది!
(ఆ కస్టమర్లు తమ మనుష్యులే అన్న విషయాన్ని అతడు మూడోకంటికి కూడా తెలియనివ్వలేదు.)
పత్రికల వాళ్ళతో బేరం పెట్టారు. తమ కేసు ఉపసంహరించుకొనేట్టు దానికి ప్రతిగా వాళ్ళు తమ కంపెనీకి 'కొంత' సహాయం చేసేటట్టు! అతడు అడిగింది చాలా చిన్న విషయాలు కాబట్టి వాళ్ళు వెంటనే ఒప్పుకున్నారు. పోస్టులో చీరెలు మిస్ అవుతున్నాయన్న వార్త అబద్దం నాయి మరుసటిరోజు తాటికాయంత అక్షరాల్తో వ్రాస్తారు. ఆ తర్వాత ఈ చౌక చీరెల స్కీమ్ గురించి, రవితేజ టెక్స్ టైల్స్ ప్రాశస్త్యం గురించి, వగైరా వగైరా వరుసకి ఆర్టికల్స్ వచ్చాయి. చీరలమీద వ్యాసాలూ ప్రచురింపబడ్డాయి. పత్రికల వాళ్ళకీ, రవితేజకీ సంబంధాలు మెరుగుపడ్డాయి. ఒకసారి స్నేహం కలిశాక అల్లుకుపోవటం పెద్ద సమస్యకాదు. అదంతా వేరే సంగతి. మొత్తంమీద-మీదపడబోయిన అణ్వస్త్రాన్ని అణుశక్తిగా మార్చుకుని, రవితేజ చెంచురామయ్యని సరియైన చోట ఆ విధంగా దెబ్బకొట్టాడు. వ్యాపారంలో అటువంటి విజయాలు యిచ్చే ఆనందాలు మరేవీ ఇవ్వవు. సహజంగానే రవితేజ చాలా జుబిలియెంట్ మూడ్ లో వున్నాడు. ప్రియంవదకి ధాంక్స్ చెప్పాడు.
"ఆ రోజు నువ్వు ఇన్ స్పెక్టర్ ని తీసుకొచ్చి ఆ విధంగా సాయపడటంతో మనం ఇది సాధించగలిగాం. నా తరఫున మీ అన్నయ్యకి కృతజ్ఞతలు చెప్పు" అన్నాడు.
ప్రియంవద నవ్వి "మీరు నన్ను క్షమించాలి" అంది.
అతడు ఆశ్చర్యంగా, "దేనికి?" అన్నాడు.
"మీరు తిట్టనంటే చెపుతాను."
"ఏమిటి విషయం?"
"భాస్కర్ మా అన్నయ్య కాదు."
అతడు మరింత విస్మయంతో "మరి?" అన్నాడు.
"మాతో కలిసి చదువుకున్నాడు అంతే. అంతకన్నా పెద్ద పరిచయం కూడా లేదు. మొన్న రెండు నెలల క్రితం కలిశాడు. ఉద్యోగం ఏమీ చేయటం లేదనీ, నాటకం ట్రూపు ఒకటి నిర్వహిస్తున్నాననీ చెప్పాడు. కాలేజీలో చదివే రోజుల్లో కూడా నాటకాలు వేసేవాడు లెండి.....మీరు 'ఇన్ స్పెక్టర్' అనగానే నాకు అతడు గుర్తొచ్చాడు. ఈ విషయం అతడికి చెప్తే 'తప్పకుండా' అన్నాడు. బట్టలు ఎరువిచ్చే నాటకాల కంపెనీనుంచి డ్రస్ తీసుకొచ్చాడు. మీకు ముందే చెప్తే తిడతారని....." నసుగుతూ ఆపింది.
రవితేజ క్షణంపాటు బిత్తరపోయి, ఆ తరువాత బిగ్గరగా నవ్వేశాడు. "అంతా సవ్యంగా జరగబట్టి సరిపోయింది. కానీ, ఆ రాఘవరావుగానీ పోలీసు స్టేషన్ కి తీసుకెళ్ళమని వుంటే ఏమైవుండేది" అన్నాడు. ఆమె జవాబు ఇవ్వలేదు.
"పోన్లే మొత్తంమీద అనుకున్నది సాధించాం."
.... సరిగా ఈ సంభాషణ జరుగుతున్న సమయానికి ఆ భాస్కర్ అనబడే వ్యక్తి ఫోన్లో మాట్లాడుతున్నాడు. "అవును ప్రియంవదని కలుసుకున్నాను. మీరు చెప్పమన్నట్టే నాటకాల కంపెనీ వుందని చెప్పాను. అదే సమయానికి రవితేజకి ఏదో సాయం కావాల్సి వచ్చింది. నన్ను ఇన్ స్పెక్టరుగా రవితేజకి పరిచయం చేసింది. అతడికి కావల్సిన పని చేసి పెట్టాను. "మరి నేను ఇన్ స్పెక్టర్ ని కాను. కేవలం తనకి సహాయం చేశాను" అన్న విషయం రావితేజకి ఆమె చెప్పిందో లేదో నాకు తెలీదు. చాలా - ఇంకేమయినా చెయ్యాలా?"
"ప్రస్తుతానికి చాలు"
ఫోన్ కట్ అయింది.
21
ఆ సాయంత్రం బోర్డు ఆఫ్ డైరెక్టర్ల అత్యవసర సమావేశం జరిగింది. డైరెక్టర్లు వర్రీడ్ గా వున్నారు.
జరిగిన సంఘటనలో రవితేజ టెక్స్ టైల్స్ కీ పత్రికలవారికీ మధ్య సంబంధాలు గట్టిపడిన మాట వాస్తవమే. పరువునష్టం దావా విషయంలో చాలా ఉదారంగా ప్రవర్తించి, రవితేజ కంపెనీ యీ విధంగా లాభం పొందింది. చెంచురామయ్య తేలుకుట్టిన దొంగ లాగా ఊరుకుండి పోవాల్సి వచ్చింది.
అయినా డైరెక్టర్లు అంత సంతోషంగా లేకపోవటానికి కారణం-జరగవలసిన నష్టం జరిగిపోయిందని!
-పోస్టులో పార్సెల్సు మిస్సవుతున్నాయన్న వార్త ఒకసారి జనంలోకి వెళ్ళిపోయాక, అది తప్పుడు వార్త అని ప్రచురించినా మొదట దానంత ప్రభావం వుండదు. రూమరు పాకినంత వేగంగా వాస్తవం పాకదు. దాదాపు కోటి రూపాయల ఖర్చుతో మొదలుపెట్టిన ఈ పథకం, మొదట్లోనే యీ విధంగా వెనకడుగువేస్తే- తిరిగి వేగం పుంజుకునేది ఎప్పుడు? అసలే సగం వ్యతిరేకతతో ప్రారంభమైణ ఈ స్కీము, ఈవిధంగా తలనొప్పి వ్యవహారంగా వాళ్ళకి తయారైంది.
రవితేజ మాత్రం ఉత్సహంగా వున్నాడు.
మీటింగు ప్రారంభమవగానే, తను స్టేట్స్ ఎందుకు వెళ్ళవలసి వచ్చిందీ చెప్తూ, తనతోపాటు తీసుకువచ్చిన పాంప్లెట్లు వారి ముందు పరిచాడు.
"ఏమిటవి?" డైరెక్టర్లలో ఎవరో అడిగారు.