Previous Page Next Page 

  

      ఇటీవలి కాలంలో అతడు అంత ఆనందంగా వున్నది చాలా తక్కువసార్లు. మాధవి బాత్ రూమ్ లో స్నానం చేస్తూంది.
   
    అతడు సన్నగా తనలో తనే పాట పాడుకుంటూ బెడ్ రూమ్ లోకి వచ్చాడు. అతడి దృష్టి.....
   
    అప్రయత్నంగా మంచం పక్కనున్న టేబిల్ మీద పడింది.
   
    అతడు ఆ సమయంలో వస్తాడనీ వూహించని మాధవి. మంచంమీదే విప్పిన చీర పడేసి లోపల స్నానం చేస్తూంది. పక్క నలిగి వుంది. మధ్యాహ్నం పూట రోజూ రెండు గంటలు నిద్రపోవటం ఆమె అలవాటు. ఆమెకీ అప్పుడప్పుడు సన్నబడాలన్న ఆలోచన హఠాత్తుగా వస్తూ వుంటుంది. ఓ నాల్గు రోజులపాటు రాత్రుళ్ళు డైటింగ్ చేస్తుంది. మధ్యాహ్నం పూట నిద్ర మానుకోదు. పెళ్ళయిన కొత్తలో అతడు చెప్పాడు. "నువ్వు లావు తగ్గాలంటే మధ్యాహ్నం నిద్ర మానెయ్యాలి మాధవీ" అని.
   
    "మీకేం అలాగే చెపుతారు. ఇంటిడు చాకిరీ ఒక్కదాన్ని చేసుకోవాలి ఆ మాత్రం కునుకు తియ్యకపోతే ప్రాణం మిగలదు. ఇంటి పనంటే ఆఫీసుల్లో బల్లముందు కూర్చొని కబుర్లు చెప్పటం కాదు."
   
    "అలాంటప్పుడు డైటింగ్ మానెయ్యి, మరింత నీరసం వస్తుంది దాని వల్ల."
   
    "నా ఇష్టం నేను డైటింగ్ చేసుకునే హక్కు కూడా లేదా ఈ కొంపలో." అలా జరిగేది ఆ సంభాషణ. అప్పుడంటే ఇంటిపనితో అలసట. ఇప్పుడు నిద్ర మరొక గంట ఎందుకు ఎక్కువయింది?
   
    అతడు టేబిల్ దగ్గరకు నడిచాడు. దానిమీద కవరు వుంది. మధ్యాహ్నం పోస్టులో వచ్చినట్టుంది. మీద మాధవి పేరుంది. నాలుగైదు కాగితాలున్నాయి. అంత పెద్ద ఉత్తరం మాధవి కెవరు వ్రాస్తారబ్బా అనుకుంటూ తీసి చదివాడు.
   
    మాధవిగారూ,
   
    నమస్తే మీరు బహుశ ఈ ఉత్తరం చూసి, ఆశ్చర్యపోతూ వుండి వుండవచ్చు. ఇంత ఉత్తరం వ్రాసిందెవరా అని నేనే సుధాకర్ ని అవును మాధవిగారు ఎంతసేపు కలిసివున్నా చెప్పుకోలేని కొన్ని విషయాలు ఉత్తరాల ద్వారానే మాట్లాడుకోవచ్చేమో ముఖ్యంగా మనలాగా ఈ సామాన్య ప్రపంచంలో ఇమడలేని మనుష్యులు ఈ ప్రకృతీ అదీ చూస్తుంటే మీతో చెప్పాలనిపిస్తుంది. ఇక్కడ కిటికీలోంచి చల్లటిగాలి, ట్యూబ్ లైట్ వెల్తుర్లో నాతోపాటు ఇంకా కొన్ని వస్తువులు ఈ గదిలో వున్నాయి సుమా అని తెలియటం నా కిష్టంలేదు. అందుకే ఫ్లోరోసెంట్ లైటు ఆర్పి టేబిల్ లైట్ వేసుకుని వ్రాస్తున్నాను. ఇదికాక నేను ఎప్పుడూ ఇటువంటి సమయంలో ఇష్టపడి పెట్టుకునే సంగీతం, హెడ్ ఫోన్స్ లో నుంచి చెవుల ద్వారా మెదడులోకి.
   
    ఒక నిముషం ఉత్తరం ఆపి కిటికీలోంచి బయటకు చూస్తే సుకుమారంగా (మీలాగ) వూగుతున్న మల్లెతీగ, క్రింద క్రోటన్ మొక్కలు- మాధవిగారూ, ఈ వాతావరణం ఎంత బావుందో తెలుసా? చెప్తే చాలదు. అనుభవించాలి. స్పందించే హృదయం వున్నవాళ్ళెవరైనా ఈ టైములో చేసేపని ఒకటే. కవులైతే కవిత్వం, ప్రియుడైతె ప్రియురాలికి మూగబాసలు, నాలాగ స్నేహితురాలికి ఉత్తరం వ్రాయటం.....ఆకాశంలో ఎగిరే మేఘాలు ఉత్తరంకంటే ముందు నా భావాల్ని తెలియపర్చటానికి తొందరపడుతున్నాయి.
   
    నిజం మాధవిగారూ, స్నేహంలో ఆడ-మగ అన్న తేడా తీసుకురావడం నాకసలు ఇష్టముండదు. ఆడ-మగ అన్నభేదాలు శరీరానికే కానీ అంతరంగానికి లేవన్న సత్యాన్ని గ్రహింపగలిగి, మానసికంగా పరిపక్వంచెంది, ఆచరించగలిగే మనోధైర్యం వున్న వారి విషయంలోనే ఆ స్నేహానికి 'పరిపూర్ణత' లభిస్తుంది. మన స్నేహం పవిత్రమైనప్పుడు లోకం గురించి పట్టించుకోనక్కర్లేదు. మొన్న మనం సెకండ్-షోకి వెళ్ళినప్పుడు ఆ విషయమే చెపుదామనుకున్నాను. మీలాగే నేనూ మానసికంగా ఒంటరిని. ఎంతమందిలో వున్నా ఒంటరిగానే వుంటాను. మీ చెయ్యి  నా చేతిలోకి తీసుకున్నప్పుడు నా వేళ్ళు ఎందుకో వణికాయి. ఎంతోమంది చేతులు పరిశీలించాను. కానీ ఎప్పుడూ నాకిలా అనుభవము లేదు. ఎంతో మృదువుగా వున్నాయి మీ చేతులు మాధవిగారూ 'స్నేహంలో' స్వార్ధానికి స్థానముండదట. నేను నమ్మిన పవిత్రమైన స్నేహంకోసం ప్రాణాలివ్వటానికి కూడా సిద్దమే. మరి నా ప్రయత్నం విజయవంతం కావాలంటే- మీ సహకారంతో కూడిన చిరునవ్వే నాకు ఇన్స్ పిరేషన్ కావాలి. మీరు నవ్వుతుంటే ఎంతో బావుంటుంది. ఈ చెట్లన్నీ ఏమంటున్నాయో తెలుసా? మాలాగే నువ్వుకూడా నీ స్నేహితురాలితో మౌనంగా భాషించు-అని.
   
    నాకు ఇష్టమైన విషయాలు ఏమిటో తెలుసా మాధవిగారూ-
   
    1. వదులుగా వున్న పైజమా, లాల్చీ వేసుకుని గులాబీ చెట్లమధ్య కూర్చోవటం.
    2. వెన్నెల వెలుగులో, నీలగిరి తోటల్లో నడుస్తూ మాట్లాడటం.
    3. పున్నమిరాత్రి సముద్రపు ఒడ్డున స్నేహితురాలితో మాట్లాడుతూ కూర్చోవటం.
    4. వెల్లకిలా పడుకుని నా కిష్టమైన డాన్సింగ్ డాల్ ని గుండెల మీద పెట్టుకుని దాన్ని కదిలిస్తూ చూస్తూ వుండటం. (అన్నట్టు మీరు డాన్స్ నేర్చుకుని వుంటే బావుండేది మాడమ్. మీ ఫిజిక్ దానికి చాల బావుంటుంది. మీ భర్తగారికి ఇలాంటి అభిరుచులు ఏమీ వున్నట్టు లేవు. ఆయన్ని చూస్తే ఎప్పుడూ బిజినెస్ అన్నట్టు వుంటారు.)
   
    5. గుండెలవరకూ దుప్పటి కప్పుకుని సీలింగ్ వైపు చూస్తూ (ఈ మధ్య మీ గురించి) ఆలోచిస్తూ వుండటం.
   
    ఇలాటి కోర్కెలు, అలవాట్లు ఎన్నో వున్నాయి. వీటిని పక్కకి నెట్టేస్తూ కమర్షియల్ గా బ్రతకాలి. తప్పదు. బావ తిడుతూ వుంటాడు. చదువు ఆపుచేసి మూడేళ్ళయింది. ఏదైనా పని చేయకూడదా అని. రవ్వంత ఆప్యాయత కూడా నేను ఇంట్లో నోచుకోలేదు మాధవిగారూ.
   
    ఎందుకో మిమ్మల్ని చూస్తే మీరూ నా స్థితిలో వున్నారనిపిస్తుంది. ఎడారిలో ఒయాసిస్సులా మనిద్దరం ఒకరికొకరం ఈ పవిత్ర స్నేహ బంధంలో, పవిత్రమైన ఆలోచన్లని పంచుకుంటూ, ప్రాణ స్నేహితుల్లా మిగిలిపోదామా? మంచి స్నేహాన్ని మించే రిలీఫ్ లేదండీ మాధవిగారూ.
   
    మొన్న మీ చెయ్యి చూసినప్పుడు, మీరెందుకో మానసికంగా బాధపడుతున్నారనీ, ఈ ప్రపంచంలో ఎవరూ మీ మంచితనాన్ని అర్ధం చేసుకోలేరని అనిపించింది. ఆ చేతిని అలాగే చాలాసేపు పట్టుకుని వుండిపోవాలన్న కోర్కె కలిగింది గానీ, అంతలో మీ భర్త వచ్చారు. పవిత్రమైన స్నేహాన్ని ప్రపంచం అర్ధం చేసుకోదు.

    మీకు నాతో శాశ్వత స్నేహం ప్రమాదకరం అనిపిస్తే, పోనీ కొంతకాలం చేయండి. ప్రేమయొక్క రుచి చూపిస్తాను. లేవటం-పని, భర్త, విసుగు, ఒంటరిజీవితం- వీటితో అలిసిపోయిన మీకు ఈ రొటీన్ జీవితం నుంచి బోర్ కొట్టకుండా వుండాలి అంటే నాలాటి నిజమైన స్నేహితుడు వుండాలి. అలాటి స్నేహితుడు మీకు ఈ నెలలో దొరుకుతాడని మీ చేతిరేఖలు చెపుతున్నాయి. మన పరిచయం యాదృచ్చికం కాదని తోస్తోంది.
   
    ..... జీవితంలో నేను అధిక ప్రాధాన్యత ఇచ్చేది స్నేహానికి, స్నేహాన్ని అత్యుత్తమ పీఠంపై వుంచినందుకు ప్రతిఫలం మీరు నాకు స్నేహితురాలిగా లభ్యమవటం. నా రొటీన్ జీవితంలో మీ పరిచయం గొప్ప రిలీఫ్! నన్నొక మంచి స్నేహితుడిగా గుర్తుంచుకోండి. అంతకన్నా మీ నుంచి ఏమీ ఆశించను. నాకు కావాల్సింది కాస్త ఓదార్పు, బాధలో వున్నప్పుడు గుండెల్లోకి తీసుకుని నేనున్నాను సుమా అనే స్నేహం కావాలి నాకు. ఈ ప్రపంచంతో విసిగిపోయాను మాధవిగారూ నేను.
   
    'గుండెల్లోకి తీసుకుని' అని వ్రాసినందుకు మీకు కోపం వచ్చిందా? లేక నవ్వొచ్చిందా? మీ గుం.....బాబోయ్ వద్దులెండి. మీకు కోపం వస్తుంది.
   
    నిర్మలమైన మనసుతో చేసే నా ఈ స్నేహాన్ని మీరొప్పుకుంటారా మాధవిగారూ? I Like you always and expects always likings from you. మీ కళ్ళలో ఏదో తెలియని బాధ గూడు కట్టుకుని వుందని నాకు అనిపిస్తూంది మాధవీ! ఈ ఉత్తరం అంతా చదివి, అందంగా 'ప్లక్' చేసిన మీ కనుబొమ్మలు తీవ్రంగా ముడివేస్తే నేనేం చేయలేను. నా స్వచ్చమైన స్నేహహస్తాన్ని మీరు అందుకోలేకపోయారని అనుకుంటాను. మీకు ఇష్టం లేకపోతే, ఈ ఉత్తరాన్ని చించివేయండి. ఎందుకంటే ఈ ఉత్తరంలో ఏమీ తప్పు లేకపోయినా, ఒక వ్యక్తి ఇంకొకరికి ఉత్తరం వ్రాసినప్పుడు ఒక మాడ్యులేషన్, ఒక వేవ్ లెంగ్త్ లో తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తాడు. అది మరొకరికి మరొకలా అర్ధమౌతుంది. మొన్న నేను వచ్చినప్పుడు మీ ఆయన చెయ్యికూడా చూద్దామనుకున్నాను. కానీ నేను కేవలం నాకు అత్యంత ఆప్తులైన వారి చేతులు మాత్రమే చూస్తాను. అర్ధమైందనుకుంటాను. ఈ ప్రపంచంలో ఒక అబ్బాయి, ఒక అమ్మాయి కేవలం స్నేహితులుగా ఎందుకు వుండకూడదని నా ప్రశ్న. చూస్తాను. దీనికి మీ సమాధానం ఎలా వుంటుందో! నా నిర్మలమైన, స్వచ్చమైన స్నేహాన్ని మీరు అందుకోవాలని అనుకున్న పక్షంలో, మీ నిస్సార జీవితంలో నేనొక అందమైన పవిత్రమైన మలుపు అనుకుంటే, మిమ్మల్ని ఆరాధిస్తున్న వ్యక్తిగా నేనంటే మీకు ఇష్టముంటే ఈ ఉత్తరం మీకు 14వ తేదీ అందుతుంది. ఆ రోజు సాయంత్రం మీ ఇంటికి వస్తాను. తెల్లచీర కట్టుకోండి. (తెలుపు స్వచ్చదనానికి నిదర్శనం) గులాబీల్లాంటి మీ పెదవుల మీద మల్లెలాటి చిరునవ్వుతో ఈ స్నేహితుడికి  స్వాగతం చెప్పాలి. ఇట్లు- మీ జి.యస్. సుధాకర్.
   
    రవితేజ చేతిలోంచి కాగితాలు క్రిందికి జారిపోయాయి.
   
    కొంచెంసేపు శిలా ప్రతిమలా అలాగే నిలబడిపోయాడు.

 Previous Page Next Page