"నేను ఏది దొంగతనం చెయ్యలేదు. నాలుగు సమోసాలు తీసుకున్నానంతే. అవి అమ్మి మమ్మికి ఉత్తరం పోస్టు చెయ్యడానికి కవరు కొందామనుకున్నాను. ఇన్నాళ్ళూ ఇక్కడ వర్క్ చేసాను కదా! నాకా మాత్రం శాలరీ రాదా?"
"ఏంటి!" గాండ్రించింది యజమానురాలు. "రూల్స్ మాట్లాడుతున్నావా? రూల్సు ఏది ఆ ఉత్తరం?" రాగని బాత్తునే గుప్పెళ్ళు విప్పి చూసింది. ఉత్తరం లేదు. సమోసాలతో పాటే ఉత్తరం జారిపోయింది. సమోసాలు పోయినందుకంటే దెబ్బలు తగిలినందుకు కంటే ఉత్తరం జారిపోయినందుకు ఎక్కువగా ఏడ్చింది రాగ. ఆ గయ్యాళి గంపకి పాప యేడుపు చూసి ఏమాత్రం జాలి కలగలేదు.
"నీ పని యిలా కాదు," అని యిడ్చుకుంటూ చీకటి గుయ్యారం లాంటి స్టోర్ రూమ్ లోకి తోసేసి బయట తలుపులు తాళం పెట్టేసింది. ఆకలి బాధ, భయం అన్నిటిని మించి మమ్మికి ఉత్తరం పోస్ట్ చెయ్యలేకపోయానన్న ఆశాభంగం. రాగ వొచ్చి పడ్డ సందడికి ఒక మూల ముడుచుక్కుర్చూన్న ఎలుక గాభారగా ముందుకు గెంతి రాగ కాళ్ళ దగ్గిర పడి భయంతో ఆత్మరక్షణ కోసం, ఆ లేత కాలుని కసిక్కున కొరికింది. "అమ్మా!" అని అరిచింది బాధతో రాగ.
ఎంత దారుణమైన సమస్య ఎదురైనా కృంగిపోయి కృశించిపోయి కూర్చోవడం అణుకి అలవాటు లేదు. చాలా తీవ్రంగా బాధపడుతుంది. కాని అలా బాధపడుతూ కూర్చుండిపోదు. కర్తవ్యం ఆలోచిస్తుంది, ఏదో ఒకటి చెయ్యడానికి పూనుకుంటుంది. డాన్సు స్కూలుకి వెళ్ళి వస్తోంది. చుట్టుపక్కల కొందరు "చూశావా! భర్త నుంచి విడిపోయింది, కూతురు తప్పిపోయింది అయినా టింగు రంగామని తయారై డాన్సు లాడ్డానికి పోతోంది" అని చెవులు కొరుక్కోవడం అణు చెవిన పడకపోలేదు. భోరుభోరున యేడిస్తే తప్ప మనసులో బాధ వుంది అనుకోలేని ముర్ఖుల్ని ఆమె లెక్కచెయ్యదు. అయినా యితరుల ముందు ప్రదర్శించడానికి కా బాధ?
స్కూలు కేకాదు హాస్పిటల్ కూడా వెళ్ళి వస్తోంది ఇప్పుడు. జీవన్ దగ్గిర జలజ అస్సలు వుండటం లేదు. అక్కడ అవసరం వుంది అనుకున్నప్పుడు మాత్రమే వుంది. ఆ అమ్మాయికి భాతదేశమంతా స్నేహితులున్నాట్టున్నారు. "ఎక్కడుంటున్నారు?" అంటే" ఫ్రెండ్స్ ఇంటిలో" అంటుంది. ఆ ఫ్రెండ్స్ ఆడవాళ్ళ, మగవాళ్ళ ని అణు యెప్పుడు అడగలేదు.
ఎంత స్నేహంలోనైనా తన హద్దులో తానుండాలని తెలుసు. అది గాక జలజ ఎంతవరకు తనకు దగ్గిరగా వచ్చినట్లే వస్తూ ఎంతో దూరంలో వున్నట్లు తోస్తుంది. మాటలు వింటున్నంత సేపూ ఆమె తెలివి, విచక్షణ, అవగాహన శక్తి ఆశ్చర్యం కలిగిస్తాయి. అయితే ప్రవర్తనలో ఎవర్ని, దేనిని లక్ష్యపెట్టని ఒక విశృంఖల రేఖ ఎదుటివాళ్ళని - ముఖ్యంగా అత్యదునికత సంస్కారం జిర్ణించుకొని వాళ్ళని భయపెడ్తుంది.
జీవన్ పూర్తిగా కోలుకున్నాడు. అతడ్ని హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేసేశారు.
"నన్ను హైదరాబాద్ వెళ్ళి పొమ్మంటావా?" అడిగాడు. లోలోపల నిట్టూర్చింది. ఇంత జరిగినా అదే అహం, అదే రాజసం, కధల్లోనూ, సినిమాల్లోనూ తప్ప మనుషులంత తేలిగ్గా మార్తారా?
"రాగ తప్పిపోయింది. ఈ సమయంలో నువు ఒక్కదానివి వుండలేవు . నీకు తోడుగా వుంటాను" అని అనలేదు ఇప్పటికి.
"హైదరాబాద్ వెళ్ళి తీరాలా?"
"వర్క్ షాప్ చూడ్డానికి ఒక్కణ్ణి పెట్టె వచ్చాను. నువు వుండ మంటే మరో నెల్రోజులుంటాను."
మరోసారి నిట్టూర్పు అణుచుకుంది అణు.
వర్క్ షాప్ లాంటివి యజమాని స్వయంగా చేసుకుంటే తప్ప పైకి రావు. మరోకరి మీద పూర్తిగా భారం వొదిలేయకూడదు. నరనరాన జిర్ణించుకుపోయిన నిర్లక్ష్యం ఎలా పోతుంది? పోగొట్టుకోడానికి ప్రయత్నాలేమైనా చేస్తే కదా!
"రాగ తప్పిపోయింది కదా! అది దొరికేవరకు ఇక్కడే వుండండి. ఎప్పుడూ ఏ అవసరమోస్తుందో?"
అత్మభిమానాన్ని అణుచుకుని ప్రాదేయపడుతున్నట్లు అడిగింది.
"ఉంటాను. ఉంటాను. హైదరాబాద్ వెళ్ళను" సంబరంగా అన్నాడు.
అణు కోసం- అణు ని ఉద్దరించడానికున్నట్లు ఆమె వెంట అపార్టుమెంటుకి వచ్చేశాడు. అతడు ఆ అవకాశమే ఎదురు చూస్తున్నాడని అణుకి బాగా తెలుసు ఎవరో ఒకరు రాజీ పడవలసిందే.
ఆ రోజు డాన్సు స్కూలు నుంచి అణు వచ్చే సరికి అత్తగారు వంట చేస్తోంది. తెల్లబోయింది అణు. పెళ్ళై ఆ కుటుంబంతో పరిచయం అయినది మొదలు అత్తగారు వంట చేయడం ఏనాడూ చూడలేదు.
"వంట మీరు చేస్తున్నారేమిటి? వంట మనిషి ఏమైంది?" అడిగింది.
"డానికి జ్వరం వచ్చిందంట. వారం రోజుల వరకు రాలేనని చెప్పి పోయింది. ఏం ఫర్వాలేదు. నేను చేస్తాలే వంట!" అంది రాణి అచ్చయ్యమ్మ. అలసిపోయి డాన్సు స్కూల్ నుంచి రాగానే వంటపని నెత్తిమీద పడకుండా ఎవరో ఒకరు చెయ్యడం అణుకి సుఖంగా తోచినా అత్తగారి చేత వంట చేయించలేక, " మీరు కూర్చోండి. నేను వంట చేస్తాను" అంది.
"ఏం ఫరవాలేదు. ఇవాళ తిను. వంట బాగుండకపొతే నువే చెసుకుందువు గాని"
రాణి అచ్చయ్యమ్మాదేవి వంట చేయడమే గాక, అచ్చు వంట మనిషి లాగే , కొడుకుని, కోడల్ని కూర్చోబెట్టి వడ్డించింది. వంటలు రుచిగానే వున్నాయి. ఒకరోజు కాదు వారం రోజులు అలాగే చేసిందావిడ. తరువాత అడిగింది.
"నిజం చెప్పు నా వంటలు బాగున్నాయా?"
"నిజంగా బాగున్నాయి"
"వంటమనిషి చేసినట్లున్నాయా?"
"వంటమనిషి చేసినదాని కన్నా బాగున్నాయి."
"మొహమాటానికి అంటున్నావా?"
"కాదు. నిజంగా చెప్తున్నా, నేను కుడా యింత బాగా వంట చేయలేను."
"అయితే నన్ను నీ వంటమనిషిగా పెట్టుకుని, వంటమనిషి కిచ్చినట్లే నెలకి మూడు వందలు యిస్తావా?"
నిర్ఘాంతపోయింది అణు. మెరుపులా గుర్తొచ్చింది, ఆరోజు ఆవిడ తన పర్సులోంచి ఇరవై రూపాయలు తీసుకున్నందుకు చిన్నబుచ్చి మాట్లాడింది. బహుశా అదే యివిడ స్వతంత్ర్యంగా సంపాదించుకోవాలన్న తపన కలిగించిందేమో? కలిగిన షాక్ క్షణాలలో తేరుకుంది.
"మధ్యలో మన్పిస్తే మన వంటమనిషి ఊరుకుంటుందా?"
"డానికి ఎక్కడో హాస్టల్లో ఐదువందల రూపయల జీతానికి ఉద్యోగం దొరికిందట మనకోసం వేరే మనిషిని చుస్తానంది. నేనే వద్దన్నాను. తనకి వచ్చిన వంటలన్నీ నాకు నేర్పమని అడిగి నేనే నేర్చుకున్నాను."
"నిజం చెప్పండి ఆరోజు నన్నడక్కుండా నా పర్సులోంచి ఇరవై రూపాయలు తీసుకున్నారని చిరాకు పడ్డందుకెనా? ఈ నిర్ణయానికి వచ్చింది."
"అదొక్కటే గాదు. నువు లేనప్పుడు ఏం తోచక వంటమనిషి రమ్మంటే వాళ్ళింటికి వెళ్ళాను. సంతయిల్లట. ఇంచుమించుగా మన యిల్లు లాగే వుంది. ఇంట్లో అందరూ ఏదో ఒక పని చేస్తున్నారు.
కోడలు అప్పడాలు వత్తుతోంది. కొడుకు ఇడ్లి చట్ని, కారప్పొడి, పెద్ద అల్యూమినియం గిన్నెలో పెట్టుకుని రోజు యిళ్ళమ్మట తిరిగి అమ్ముకోస్తాడు. మనవలు చదువుకుంటున్నారు. మన వంటమనిషిని ఎవరూ చులకనగా చూడరు. ఆవిడ చెయ్యి జాపి ఎవర్ని ఏమి అడగక్కరలేదు. పైగా మనవలకి తనే అవి యివి బోలెడంత బహుమానాలు తెచ్చి పెడ్తుందని అదంతా చూశాక నాకంటే ఆ వంటమనిషి జీవితమే మెరుగనిపించింది. ఈ వయసులో యీ దశలో నేను చెయ్యగలపనులేమున్నాయి? అందుకే వంట నేర్చుకున్నాను.