Previous Page Next Page 
ఆనందోబ్రహ్మ పేజి 40

  

          చాలాసార్లు అతను దాన్ని చూసుకుని 'ఎంత గొప్పగా వ్రాశానా!' అని తనలో తనే పొంగిపోయేవాడు. ఇప్పుడు అవే వాక్యాలు ఎంతో నిస్తేజంగా కనపడుతున్నాయి. తన ప్రేమని చెప్పడానికి ఈ మాటలు సరిపోవు. చంద్రం లాంటివాడు ఇలాంటి వాటిని రోజుకి పది అల్లి ఒకేసారి పదిమందికి యివ్వగలడు. ఈ కవులూ, కళాకారులూ కలిసి మాటల విలువని తగ్గించేస్తున్నారు. ఒక మనసులో భావాన్ని ఇంతకన్నా నిజాయితీగా చెప్పలేని మాటలెందుకు? ఒకప్పుడు అనుకునేవాడు వ్యాసుడు-భానుడు-శ్రీనాథుడూ-వీళ్ళు గొప్ప కవులని, ఉహూ కాదు. వీరెవరూ ప్రేమని మాటల్లోకి అనువదించలేరు. అసలు ప్రే-మ అన్న రెండక్షరాలు కూడా ప్రేమకి అర్ధం చెప్పలేవు.
   
    అతను కాగితాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి నీళ్ళలో వదలసాగాడు. అవి పడవల్లా వెళ్ళిపోతూ వుంటే దుఃఖం వచ్చింది. అంతలో ఆమె మాటలు కూడా గుర్తువచ్చాయి. అవును. ఏడుపు ధీరోదాత్తత కాదు. సాధించవలసింది చాలా వుంది. ఆమె ముందు వీరుడిలా నిలబడాలంటే ముందు రమేష్ ని సాధించాలి...ఎలా?
   
    రమేష్, చంద్రం, లెక్కల మాస్టారూ, రాజా, డ్రిల్లు మా....అందరూ ఒక్కటే.
   
    అతనికి చప్పున ఒక ఆలోచన స్ఫురించింది. లేచాడు.
   
                          *    *    *    *
   
    "ఏమిటీ?"
   
    "అవును నువ్వే నాతో రావాలి."
   
    "నేనా! ఎందుకు?"
   
    "నేనేం అడిగితే అది చేస్తానన్నావ్"
   
    "కానీ...." అంది మందాకిని.
   
    "కానీ లేదు. అర్ధణా లేదు. నువ్వు వస్తున్నావంతే."
   
    దార్లో ఆమెకు చెప్పవలసింది చెప్పాడు. ఆమె ఒక క్షణం తెల్లబోయి అంతలోనే సర్దుకుంది.
   
    .... శలవు అవడం వల్ల స్కూలు ఆవరణ అంతా ఖాళీగా వుంది ఒకరిద్దరు టీచర్లు కనపడ్డారు.
   
    ఇద్దరూ వరండాలో నుంచి లోపలికి నడిచారు.
   
    తెల్లకాగితం మీద రూళ్ళు గీస్తున్న డ్రిల్లుమాస్టారు గుమ్మం దగ్గర పడిన నీడని చూసి తలెత్తి ఆశ్చర్యం దాచుకుని "లోపలికి రండి" అన్నాడు మర్యాదగా వాళ్ళు వచ్చి కూర్చున్నాక "ఏమిటిలా వచ్చారు?" అని అడిగాడు.
   
    "కొన్ని నెలల క్రితం ఇంకో స్కూలు నుంచి మావాడు ఇక్కడకు వచ్చాడండీ. చాలా మంచి ఆటగాడు. జట్టులో అతడిని ఎంపిక చేయలేదట. చాలా బాధపడుతున్నాడు" నాటకీయంగా అంది.
   
    మాస్టారు సోమయాజికేసి చూస్తూ "క్రిందటిసారి ఆట నువ్వేదో పాడు చేశావుట కదా!" అన్నాడు గుర్తు తెచ్చుకోవటానికి ప్రయత్నం చేస్తూ.
   
    "ఆ రోజునేదో పొరపాటు జరిగిపోయింది మాస్టారూ!"
   
    "ఆమె వుండబట్టి అలా మర్యాదగా మాట్లాడుతున్నాడు కానీ, సోమయాజి ఒక్కడే అయితే పొమ్మనేవాడు.

    "అవకాశం ఇవ్వడానికి ఇదేం తరగతికీ తరగతికీ మధ్య పోటీలనుకున్నావా అబ్బాయ్! జిల్లా స్థాయి పోటీలు."
   
    "పోనీ ముందొకసారి చూసి, నచ్చితేనే జట్టులో చేర్చుకోండి" అందామె అభ్యర్దిస్తున్నట్లు.
   
    "చూడటానికి ఇంకే రకమైన పోటీలుకానీ, ఆటలు కానీ లేవు. పది రోజుల్లో జట్టు బయల్దేరుతుంది."
   
    "మీకీ ఆతల సంగతి బాగా తెలుసు. అతగాడి విద్యని పరీక్షించాలంటే డానికి పోటీయే కావాలా ఏమిటి? మీరే ఒకసారి చూడండి. మీకు సంతృప్తికరంగా లేకపోతే అతడే విరమించుకుంటాడు."
   
    "ఎలా?" అని అడిగాడు "నేనొక్కన్నే ఎలా చూడటం?"
   
    "మీరే ఏదైనా పోటీ పెట్టండి."
   
    ఆయన కొంచెంసేపు కన్నార్పకుండా సోమయాజివైపు చూసి, ఏదో ఆలోచన స్ఫురించినట్లు లేచి "నాతో రా" అన్నాడు. సామానులు భద్రపరిచే గది తాళం తీసి అందులోనుంచి ఒక కాలి బంతిని బయటకు తీసి "పద" అన్నాడు.
   
    ఆయనా ఒకప్పుడు గొప్ప ఆటగాడే! మందాకిని దూరంగా నిలబడింది. ఇద్దరూ ఆటస్థలంలోకి వెళ్ళారు. ఆయన గోలుకి ముందున్న పెనాల్టీ స్పాట్ దగ్గర బంతిని పెట్టి వెళ్ళి గోలు మధ్య నిలబడి 'కొట్టు' అన్నట్టు సైగచేశాడు.
   
    సోమయాజి కదల్లేదు. అతని మొహంలో ఏ భావమూ లేదు. ఆమె అతడివైపు 'ఇంకా ఆలస్యం ఎందుకు' అన్నట్లు చూసింది. గోలు మధ్యలో మాస్టారు ఎదురు చూస్తున్నాడు.
   
    సోమయాజి అక్కడున్న బంతిని పట్టుకుని వెనక్కి వెళ్ళి, సరీగ్గా ఆటస్థలం మధ్యలో ... ఆట ప్రారంభమయ్యేటప్పుడు బంతిని మొట్టమొదట ఎక్కడ పెడతారో అక్కడ పెట్టాడు. తర్వాత పది అడుగులు వెనక్కి వెళ్ళి కొట్టడానికి సిద్దమయ్యాడు.
   
    మాస్టారికి ఒక్కక్షణం అతని ఉద్దేశ్యం అర్ధంకాలేదు. అయ్యాక నిటారుగా నిలబడ్డాడు. 'ఈ కుర్రవాడికి మతిపోయిందా ఏమిటి' అనుకుంటూ.
   
    అంతలో సోమయాజి బాణంలా వచ్చి బంతిని కొట్టాడు. అది ఎగిరి వాలుగా గోడవైపుకి రాసాగింది. చాలాదూరం నుండి వస్తూ వుండటం వలన మాస్టారుకి అది బాగా కనపడుతూంది. రెండు అడుగులు ముందుకేసి దాన్ని పట్టుకోవటానికి ఆయన సంసిద్దుడయ్యాడు.
   
    నిజానికి బంతి గోలు స్తంభం పక్కగా పోతుంది. అసలు సోమయాజి బంతిని పట్టుకుని అంతదూరం వెళ్ళినప్పుడే ఆయన దాన్ని తేలికగా తీసుకున్నాడు. ఇప్పుడు మరింత తేలిగ్గా దానివైపుకి జరిగాడు. అదే అతను చేసిన తప్పు. అప్పటి వరకూ గాలిలో ఒక మూలగా వెళుతున్న బంతి, భూమ్మీద పడగానే మెరుపులా పక్కకి తిరిగింది. క్రికెట్ లో అయితే దీన్ని "స్పిన్" అంటారు. ప్రాంతీయ బంతాటలో "స్క్రూషాట్" అంటారు.
   
    బంతిని చాలా మామూలుగా కొట్టిన భావం అవతలివారికి కలిగిస్తూ, ఇలా గిర్రున తిప్పగల అత్యంత గొప్ప ప్రావీణ్యం, ఈ పల్లెటూరి కుర్రవాడికి వుంటుందని మాస్టారు వూహించలేదు. ఆయనకి మతిపోయింది. ఈ లోపులో బంతి గోలు మధ్యకి దూసుకుపోయింది. జరిగింది తెలుసుకోవడానికి ఆయనకీ రెండు నిముషాలు పట్టింది.
   
    ఆ మరుసటిరోజే అతడు జట్టులో చేర్చుకోబడ్డాడు.
   
                                 9
   
    "ఏదీ నీ చెయ్యి ఇలా యివ్వు" అన్నదామె.
   
    "ఎందుకు?"
   
    "చెపుతాగా. యివ్వు."
   
    అతను చెయ్యి అందించాడు.
   
    "నీకు జ్యోతిష్యం చెప్పనా" నవ్వుతూ అంది.
   
    మల్లెపూల చెండుతో ఎవరో చెళ్ళున కొట్టినట్టయింది. నుదుట చిరు చెమట పట్టింది.
   
    వైదేహితో ఆ రాత్రి జరిగిన సంభాషణ గుర్తొచ్చింది.
   
    'నీకేమీ తెలియదు బాబూ' అని వైదేహి అనటం.... వయసులో వున్నా అబ్బాయిగానీ, అమ్మాయిగానే జ్యోతిష్యం చెబుతానంటే దాని అర్ధమేమిటో తనకి తర్వాత అర్ధం అవటం....
   
    ఆమె అతఃది మొహంలోకి చూస్తూ "నువ్వు చాలా గొప్పవాడివి అవుతావు నిజంగా చాలా... ... ..." అంది.
   
    అతను వినటం లేదు. ఆమెను చూస్తున్నాడు. గుండ్రటి మొహం. ఆరోగ్యంతో ఎర్రబడిన పెదవులు, గెడ్డం పక్కన చిన్న పుట్టుమచ్చ. నవ్వే కళ్ళు, వెలుగుతో మెరిసే పెదవుల మీద తడి.....
   
    "ఏం మాట్లాడవేం?"
   
    "ఏం మాట్లాడను?"
   
    "అంత గొప్పవాడివి ఎలా అవుతానూ అని అడగవేం."
   
    "ఎలా అవుతాను?"
   
    "మీ మాస్టారి దగ్గరికి నీతోపాటు నన్ను తీసుకువెళ్ళాలి అన్న ఆలోచన వచ్చిందీ అంటే అది నీ అభివృద్దికి గుర్తు. అవతలివారి బలహీనతల మీద ఆడుకునే తెలివితేటలు.."
   
    అతను ఆమెనే చూస్తున్నాడు.
   
    "ఇప్పుడు చేస్తే చేశావు కానీ ఇంకెప్పుడూ చెయ్యకు. అసలు అక్కడే తిడదామనుకున్నాను. కానీ ఎలాగయినా జట్టులో చేరాలన్న నీ ఆరాటం చూసి వూరుకున్నాను" కోపాన్ని అభినయిస్తూ అంది. తన చేయి ఇంకా ఆమె చేతిలో వుండటాన్ని అతను గమనిస్తున్నాడు.

 Previous Page Next Page