మొహమాటాన్ని చంపుకుని వెళ్ళి అతడు జట్టు నాయకుడైన రమేష్ ని అడిగాడు. అతడికి సిగ్గుగానే వుంది. కొన్ని రోజుల క్రితం జరిగిన పోటీలో తను ఏ స్థాయిలో తన ప్రావీణ్యాన్ని చూపించాడో అతడింకా మర్చిపోలేదు. అందుకే కాస్త మొహమాటపడుతూనే వెళ్ళి అడిగాడు.
మిత్రులతో కబుర్లు చెపుతున్న రమేష్ అతడు అడుగుతున్నది అర్ధంకానట్టు ఒక క్షణం చూసి 'థూ' అని మొహం మీద తుంపర్లు పడేలా ఉమ్మేశాడు. పక్కనున్న వాళ్ళు నవ్వారు.
సోమయాజి మొహం అవమానంతో కందిపోయింది. రమేష్ మామూలుగా చెప్పి వుంటే ఏమై వుండేదో కానీ, ఇప్పుడు ఇలా ప్రవర్తించటం అతడి అహాన్ని దెబ్బతీసింది.
గుడ్లనీరు కక్కుకుని వెనుదిరగడానికి అతడు మునపటి సోమయాజి కాడు. లాగి పెట్టి రమేష్ చెంపమీద కొట్టాడు.
కొన్ని నెలల క్రితం తనని రమేష్ మురిక్కాలువలో పడేసి కొట్టిన విషయం ప్రతి అంశమూ దృశ్యంతో సహా అతనికి గుర్తుంది. అంతకి అంతా బదులు తీర్చుకోదలచుకున్నాడు.
మొదటి దెబ్బకి రమేష్ వెళ్ళి ఇసుకలో పడ్డాడు. ఆపడానికి వచ్చిన ఇద్దరు స్నేహితుల గడ్డాలు పగిలిపోయినాయ్. ఇంతలో రమేష్ లేచి తిరిగి మీదకు వచ్చాడు. సోమయాజి అతడి మెడ పట్టుకుని ముందుకు వంగి మోకాలితో కొట్టాడు. అతడు వెళ్ళి రోడ్డు పక్కన పడ్డాడు. ఇద్దరూ వగరుస్తున్నారు. రమేష్ ని అతడు ఆ రోజు వదిలిపెట్టదల్చుకోలేదు. వీధిలో అందరూ చూస్తూ వుండగా తనకి చేసిన అవమానానికి ప్రతీకారం యిది.
చిన్నక్క తిడుతూ తనకి స్నానం చేయించడం, తను వెళ్ళి గంజాయి సిగరెట్ తాగడం తల్చుకొన్న కొద్దీ అతడిలో ఆవేశం పెరిగిపోతోంది. దాంతోపాటూ జలమూ హెచ్చుతోంది. నిజానికి మామూలు పరిస్థితుల్లో అయితే రమేష్ అతడికన్నా బలవంతుడు. ఈ గొడవకి దూరం నుంచి పరిగెత్తుకొస్తున్నారు కొందరు. వాళ్ళు వచ్చేలోపులో చివరిదెబ్బ తీశాడు. రమేష్ వెళ్ళి నీటి గుంటలో పడ్డాడు. వగరుస్తూ లేచి "ఒరేయ్ నీమీద ఇంతకింతా పగ తీర్చుకుంటాన్రా" అన్నాడు.
"నీ మొహం" అంటూ వెనుదిరిగాడు సోమయాజి. చొక్కా అక్కడక్కడా చిరిగి, జుట్టు చెదిరిపోయి వచ్చిన సోమయాజిని గుమ్మంలోనే చూసి మందాకిని గాభరాపడి "ఏమైంది" అని అడిగింది. సోమయాజి నవ్వేసి "ఏమీ లేదు" అని లోపలికి వెళ్ళిపోయాడు. కానీ ఆమె వదిలిపెట్టలేదు. స్నానం చేసివచ్చాక తిరిగి అడిగింది. అతడు జరిగినదంతా చెప్పాడు. చెప్పి -
"జట్టులో నేనూ వుంటానన్న ఆశ ఇంతకు ముందు కాస్తో కూస్తో వుండేది. ఇప్పుడిక రమేష్ వుండగా ఇక నేనా స్కూల్లో ఫుట్ బాల్ ఆడటం అనే మాట కల్ల" అన్నాడు. అని "ఇంతకింతా పగ తీర్చుకుంటాడట. ఎట్లా తీర్చుకుంటాడో నేను చూస్తాను" సవాల్ చేస్తున్నట్టు అన్నాడు.
"పగ తీర్చుకోవడమంటే ఒకరికొకరు వీధినపడి కొట్టుకోవటం కాదు ఎత్తుకు పై ఎత్తువేసి ప్రత్యర్ధిని చిత్తుచేయడం! తెలివితేటల్తో దెబ్బకొట్టాలి."
"ఏం చేద్దాం?"
"అది నాకేం తెలుసు? అయినా ప్రతీదీ నేనే చెప్పాలా యేమిటి? నువ్వే ఆలోచించు ఏం చేయాలో."
అతడొకరోజుపాటు ఆలోచించాడు. ఏమీ తోచలేదు. రెండో రోజు కూడా ఆలోచించాడు.
జట్టు ఎంపికచేసే రోజు దగ్గిరపడింది. అది దగ్గిరయ్యే కొద్దీ అతనికి మరింత కంగారు హెచ్చింది. తనే వెళ్ళి డ్రిల్లు మాస్టారిని అడిగొద్దామనుకొన్నాడు. ఇస్తే యిస్తాడు- లేకపోతే లేదు.
తనకి వచ్చిన ఈ ఆలోచనని మందాకినికి చెపుదామని ఆ భాగంవైపు వెళ్ళాడు. తలుపు దగ్గరగా వేసి వుండటంతో ఆగాడు. అంతలో లోపల నుంచి మాటలు వినిపించాయి.
తలుపుల మధ్య నుంచి లోపలి దృశ్యం కనబడుతూంది.
రోమన్ రాజుల కాలంలో సైనికుడు కూర్చున్నట్లు మోకాళ్ళమీద కూర్చుని వున్నాడు చంద్రం. చేతులు సాచి 'నువ్వు నా దేవతవి' అంటున్నాడు.
సోమయాజి మరింత లోపలికి తొంగిచూడటానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆమె గోచరమనలేదు. కంఠం మాత్రం వినపడింది. "నిజమా చంద్రం" అని.
"నిజం మందాకినీ! అసలు గత రెండు నెలలుగా నా మనసులో భావాల్ని నీకెలా తెలపాలా అని మధనపడుతూ వచ్చాను. చివరికి గేయ రూపంలో అల్లి పత్రికకి పంపినట్లు పంపి నీ అభిప్రాయం తెలుసుకోవాలనే ఆ కుర్రవాడికిచ్చాను."
"కుర్రవాడు" అంటే తనే అని గ్రహించాడు సోమయాజి ఈ లోపులో ఆమె "అయితే నేను దేవతనే నంటావ్." అంది.
"నా మనసులో జరిగే ప్రతి ఊహకీ, ప్రతి కల్పనకీ, ప్రతి రచనకీ నువ్వే వూపిరివి. నాకేమనిపిస్తుందో తెలుసా?"
"ఏమనిపిస్తుంది చంద్రం?"
"నీ వళ్ళో తలపెట్టుకుని నా బాధ మర్చిపోవాలని."
"ఎప్పటినుంచి? గత రెండు నెలల నుంచా?"
అందులో శ్లేష అర్ధంకాక "అవును" అన్నాడు. "నీకు తెలీదు మందాకినీ. నాకెన్ని బాధలున్నాయో."
"నిజమా చంద్రం?"
"అవును మందాకినీ! ఏ అర్ధరాత్రో మెలకువ వస్తుంది. మరి నిద్ర పట్టదు. మనసు బాధగా మూలుగుతుంది. ఆప్యాయతతో సాచిన రెండు చేతుల మధ్య సేద తీరాలనిపిస్తుంది. ఇన్నాళ్ళూ తపించిపోయాను మందాకినీ ఇన్నాళ్ళూ రవ్వంత ప్రేమకోసం."
"నీకేం కావాలి చంద్రం! కాస్త అర్ధమయ్యేటట్లు చెప్పు?"
"నాకు స్నేహం కావాలి మందాకినీ!"
"దానికేం? అప్పుడప్పుడు వచ్చిపోతూండు. అభ్యంతరమేముంది?"
"నాకు తెలుసు నీ మనసు. నా వూపిరి నిండా...."
'గత రెండు నెలల్నుంచీ నీ వూపిరి నేనేగానీ, అంతకు ముందెవరు చంద్రం?'
వెంటనే జవాబు రాలేదు. "నువ్వే నా మొదటి స్పందనని మందాకినీ, నీ గురించి నాకేమీ తెలియనక్కర్లేదని చూడగానే అన్పించింది."
"ఏమని? మనది జన్మజన్మల అనుబంధమనా?"
'సరిగ్గా చెప్పావు నీ చెయ్యి ఇలా యివ్వు మన స్నేహం ఎన్నటికీ వాడిపోదని' అంటూ సాచాడు.
ఆమె తాపీగా "మొదటినుంచీ నేను నీలో గమనించింది ఒకటే చంద్రం" అన్నది.
"ఏమిటీ?"
"ఆత్మవంచన."
ఆ క్షణంలో చంద్రం ముఖం ఎలావుందో చూడాలని సోమయాజి చాలా ఉత్సాహపడ్డాడు. కానీ తలుపు కాస్తే తెరచివుంది. అంతలో ఆమె కంఠం వినిపించింది.
"రెండు ఆత్మవంచనలు కలిస్తే ప్రేమ అంటారన్న సామెత నీలాంటి వారినుంచే పుట్టిందనుకుంటాను. బహుశా నా స్థానంలో ఇంకే పదిహేనేళ్ళ అమ్మాయో వుంటే నీ బాధల ఉపశమనానికి కావల్సిన సానుభూతి యిచ్చి తాను నాశనమై వుండేదేమో! స్నేహం పేరిట ప్రమాణాలు చేసుకోవడం పేరుతో చేయీ చేయీ కలిసి మొదలయిన ఈ స్పర్శ. ఆ తరువాత తాదాత్మ్యత పేరుతో చెయ్యి చెక్కిలి చేర్చుకోవడంతో పరిణామం చెంది ఎక్కడికి దారితీస్తుందో, తీయాలని నువ్వు అనుకుంటున్నావో నాకు తెలుసు. నువ్వు నా ముందు ఇలా మోకాళ్ళ మీద కూర్చుని "నిన్ను నేను ప్రేమిస్తున్నాను" అనకుండా 'నీ పట్ల ఆకర్షణతో నిన్ను వాంచిస్తున్నాను' అని వుంటే కనీసం నీ నిజాయితీ కయినా సంతోషించి వుండేదాన్నేమో! ఇంకెప్పుడూ ఎవరి ఒళ్లోనూ తల పెట్టుకుని ఏడవడానికి ప్రయత్నించక. స్త్రీ గురించి నీకేమీ తెలియదు చంద్రం! ఒక ధీరోదాత్తుడు తన దగ్గర చంటిపిల్లాడయినందుకు స్త్రీ సంబరపడుతుందే తప్ప, నీలా బలహీనతకి సుకుమారత్వం ముసుగు వేసుకునే వాడిని కాదు. మానసికంగా పరిణతి చెందని ఆడపిల్లలు నీ మాటలకి సులభంగా మోసపోతారు. వెళ్ళి అక్కడ ప్రయత్నం చెయ్యి అన్నట్లు ఇవిగో నీ అముద్రిత రచన్లు. ఇక వెళ్ళు."
జేవురించిన మొహంతో బయటకు వచ్చిన చంద్రం, బయటే నిలబడివున్నా సోమయాజిని చూసి మరింత కలతపడి అక్కడి నుంచి వడివడిగా వెళ్ళిపోయాడు.
సోమయాజి లోపల మందాకిని దగ్గరగా వెళ్ళలేదు. బయట పెరట్లో కెళ్ళాడు.
ఒంటరిగా వుండాలన్పించింది.
ఆ క్షణమే అతనికి ఒక గొప్ప విషయం అర్ధమైంది.
తను ఎంతో మానసికంగా వ్యధ చెంది, ఆ వ్యధలోంచి స్పందన పొంది అనాలనుకున్న ఒక మాటని - ఒక వాక్యాన్ని- ఒక భావాన్ని - మరో మగవాడు చాల మామూలుగా, స్త్రీతో అదేదో వ్యాపారం చేసినట్లు అనేస్తున్నాడు.
ఇక ఆ మాటలకి విలువేముంది?
అతను గదిలోకి వెళ్ళి తన పెట్టెలోనుంచి ఒక కాగితాన్ని తీసుకున్నాడు. చుట్టూ అందమైన లతలతో మధ్యలో చిన్న గేయం. ఎన్నాళ్ళ తపనతో భాషగా మార్చి, పదాల సారాలుగా పేర్చి కూర్చి వ్రాసుకున్నది.
"పెదవి అంచున పేరుకున్న నిశ్శబ్దం అందంగా చెదిరేవేళ-
తీరం చేరిన ఆనందాన్ని తన తరగల
తరంగిణీ నృత్యంతో మాత్రమే చూసి
తరంగం మాయమవుతుందెందుకని?
కనురెప్ప పరదాల చాటునుంచి వచ్చే సందేశం
మనసు చేరేలోపులో సందేహమవుతుం దెందుకని?
నా కలలకి కథావస్తువా! నీ కెలా చెప్పను?
నీ ముంగురుల కదలికలో నాకు ప్రపంచం కనబడుతుందని!
నీ కనురెప్పల చప్పుళ్ళలో నాకు వేదం వినపడుతుందని!"