అతని చెయ్యి సన్నగా కంపిస్తుంది.
"నేను జట్టులో చేరానన్నమాట నిజమేగానీ మాట నిలబెట్టలేను."
"ఏం, ఏమ్మా!"
"రమేష్ ని పిలిచి మాస్టారీ మాట చెప్పగానే కల్లు తాగిన కోతి అయ్యాడు. కానీ చేర్చుకోక తప్పలేదు. లెఫ్ట్ స్టాపర్ యిస్తున్నాడు. అంటే గోలు దగ్గరగా ఎడమవైపు వుండేవాడన్నమాట. అవతలి గోలు దగ్గరికి వెళ్ళే అవకాశం వుండదు. అన్నిటికన్నా ముఖ్యమయిన విషయం ఏమిటంటే - నాకు ఎడమకాలుతో ఆడటం అసలు రాదు."
"పట్టుదల వుంటే బొటనవేలితో ఆడవచ్చు. ఇదిగో ఈ గీత చూడు" అంటూ చిటికెనవేలు క్రింద కండరాన్ని లోపలికి వత్తి, ఏర్పడిన గీతని చూపిస్తూ "ఈ గీత ఇలా నిలువునా వుంది. కాబట్టి నువ్వో పెద్ద ఆటగాడివి అవుతావు" అంది. ఆమె వెళ్ళు తన చేతిని అలా మెత్తగా వత్తడం అతనికి అపురూపమయిన అనుభూతిని ప్రసాదిస్తున్నాయి.
"జీవితం గీతా, హృదయం గీతా వుంటాయిగానీ అరచేతిలో ఆటగాడయ్యే గీతలుండవు."
"ఉండవా.... పోనీలే అయితే."
"అహ - ఇంకేమయినా చెప్పు"
"ఇంకానా- ఇంకేం చెప్పను?"
"ఎల్లుండి నా పుట్టినరోజు. దానికేం బహుమతి యిస్తున్నావు?"
"అబ్బ! అవన్నీ ఈ జ్యోతిష్యంలో తెలియవు బాబూ! అన్నట్టు ఎల్లుండే నీ పుట్టినరోజా?"
"అవును- ఏం?"
"అవతలి ఎల్లుండి నా పుట్టినరోజు."
"భలే! నాకన్నా ఒక రోజు చిన్నదానివన్నమాట."
"ఇంకా నయం."
"నీకేం కావాలి పుట్టినరోజుకి?"
"ఏమిస్తావ్?"
"నీకేం కావాలో చెప్పు."
'ఎవరూ ఊహించనంతటి పెద్దవాడివి అయ్యాక అప్పుడు వచ్చి అడుగుతానులే. అలా అవడమే కావాలి ప్రస్తుతానికి.'
"నేను పెద్దవాన్నే కావాలంటే పొడుగు చూసుకుందామా!"
"అబ్బ! ఆ విషయాన్ని వదిలిపెట్టు."
"మరి చెప్పు అయితే."
"ఏం చెప్పను?"
"నాకెవరంటే ఎక్కువ యిష్టం."
"అవన్నీ ఈ జ్యోతిష్యంలో తెలియవు అని చెప్పానుగా."
"మరి తెలిసేవేమిటి?"
"నీ గురించి అడుగు."
'నేను.... నేను.... నేను."
"ఊఁ....నేను."
"ధీరోదాత్తున్ని అవుతానా?"
"ధీరో.... ఓ అదా" అని ఆమె చంద్రం గుర్తొచ్చి నవ్వసాగింది. పచ్చటి మెదక్రింద నల్లటి పూసమీద పడిన తెల్లటి కిరణం, ఆమె నవ్వుకి ఏడు రంగులై చెదరసాగింది. ఆమె నవ్వాపకుండా అంది- "తప్పకుండా అవుతావు. పోతే సరిగ్గా పట్టాలమీద పెట్టాలంతే."
తన చేతిని పట్టుకున్న ఆమె చేతిని రెండోచేత్తో స్పృశించాడు. ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఆమె సామీప్యం కొత్తగా వుంది. ఆమె వేళ్ళతో చిన్నపిల్లాడిలా ఆడుకుంటున్నాడు. ఆమె శరీరం మీద నుండి వచ్చే పరిమళం అతడిని వివశుడిని చేస్తూంది.
అతడు ముందుకు జరిగాడు.
అతడి ముందు విశ్వమూ, గోళాలూ, నక్షత్రాలూ, ప్రపంచమూ, సర్వమూ గిర్రున తిరుగుతున్నాయి. అతడు పైకి పోతున్నాడు. శంఖంలాంటి మెడ, నునుపైన గెడ్డమూ, పల్చటి చెక్కిలీ.
"యాజీ!" అతడు ఆగలేదు.
భుజాల మీదనుండి వేసిన చేతులు జడ క్రిందనుంచి మెడ పైకి వెళ్ళాయి. బొటనవ్రేలితో బుగ్గల్ని నొక్కిపట్టిన వేళ్ళతో తలని బలంగా పైకెత్తి ముందుకు వంగుతూ ఆమె మొహంలోకి చూశాడు.
ఒక మండుతున్న అగ్ని గోళం సామీప్యంలో మంటలు నాల్కలు సాచి ఎగజిమ్మినట్లు... 'నువ్వేనా, నిజంగా నువ్వేనా' అని ఆ నమ్మలేని కళ్ళు అడుగుతున్నట్లు.....అతడి మనసు ఆమె చూపుచేత సపాటమై ఘరట్ట నిఘట్టితమైంది.
పెనుగాలి తాకిడికి అప్పుడే చిగురువేసి పెరుగుతున్న లేలేత లతా కదిలి కంపించినట్లు ఆమె అటు తిరిగి, కిటికీ రెక్కమీద చెయ్యివేసి మోచేతిపైన తల దాచుకుంది. ఆమె రోదిస్తూందో లేదో చెప్పటం కష్టం. కానీ రోదనకన్నా భయంకరమైన నిశ్శబ్దం అతడిని కదిలించి వేస్తూంది.
అతడు చేష్టలుడిగి నిలబడ్డాడు. మనసు ఆలోచించటం మానేసింది. అది కోపమా - తనమీద తనకే అసహ్యమా? లేక ఆనందమా? ఏవీకాదు. అన్నిటికన్నా అతీతమయిన స్థబ్దత. గొంతులో దుఃఖం అడ్డుపడ్డట్టూ వుంది. నాలుగు గోడలూ అక్కడినుంచి పరిపోవాలన్న భావం తీవ్రమవుతూంది. ఆమె మౌన రోదన రంపమై అతడి హృదయాన్ని పరపరా కోస్తూంది. తల వంచుకుని అక్కడినుంచి కదిలిపోయాడు.
కాలం గురించిన ప్రసక్తి వస్తే ఇరవై నాలుగు గంటలు గడిచినయ్. సోమయాజీ ఈ ఇరవై నాలుగు గంటలూ మన్నుతున్న పామల్లే ఒక మూలే కూర్చుండిపోయాడు. ఎవరితోనూ మాట్లాడలేదు. పెరట్లోకి వెళ్తాడు......బయటకు వస్తాడు...మళ్ళీ పెరట్లోకి వెళతాడు.... అక్కడా వుండలేడు. కాలుగాలిన పిల్లి వలె తిరుగుతాడు. బయటకు వెళ్ళాలంటే భయం. మందాకిని కనపడుతుందేమోనన్న భయం. ఉహూ భయం కాదు. బిడియం.
ఆమె కొట్టినా బావున్ను. తిట్టినా బావున్ను. ఈ నిశ్శబ్దం భయపెడుతుంది. తనమీద తనకి నమ్మకం పోయింది. ఏ పనిచేసినా నిరాసక్తతే. ఆకలి లేదు, నిద్రరాదు. ఊరికే తల గట్టిగా విదిలించి దీన్నంతా మర్చిపోవాలన్న కోర్కె. కాలం వెనక్కి జరిగి నిన్నటి నుంచి మళ్ళీ తిరిగి ప్రారంభం అయితే బావుణ్ణు అన్న భావం మాటిమాటికీ కలుగుతూంది.
"నా తప్పులేదు. నా తప్పులేదు" అనుకొన్నాడు కొంచెంసేపు. "అవును నా తప్పేం వుంది' అని సమర్ధించుకో చూసేడు. కానీ ఆలోచన ఎక్కడ ప్రారంభమయినా చివరికి 'నిన్న' దగ్గరకొచ్చి ఆగిపోతుంది. కిటికీ రెక్క దగ్గిర ఆమె అటు తిరిగి నిలబడి మొహాన్ని దాచుకునే దృశ్యం దగ్గిరకి వచ్చి ఆగి మనసు విరిగి వికలమవుతోంది. బురద నీటిని కుదుపూతే అడుగునుంచి మురికి నల్లగా పైకి వచ్చినట్లు, ఆ భావం దగ్గిరే బాధ పునరావృతమవుతోంది. ఏం చేసినా ఆ ఆలోచనే ఏదో జీర్ణంకాని అనుభూతి.
ఆ రాత్రి కూడా అతడు మామూలుగా వరండాలో పడుకున్నాడు. తలక్రింద చేతులు పెట్టుకొని పై కప్పుకేసి చూస్తూ వెల్లకిలా.....నిద్రరాని కళ్ళతో వ్యధనిండిన మనసుతో.
పది... పదకొండు... పదకొండున్నర.
బయట ఏదో అలికిడి అయ్యింది. ఏదో ఘర్షణ.
అతడు చప్పున లేచి కూర్చున్నాడు. బయట మళ్ళీ చప్పుడు అయ్యింది. సోమయాజి తలుపు తీసుకుని బయటకు వచ్చాడు.
మసక చీకట్లో బయట దృశ్యం క్షణంపాటు అర్ధంకాలేదు.
మందాకిని భర్త చేతుల్లో చంద్రం గింజుకుంటున్నాడు. తలుపు తెరచుకున్న శబ్దానికి భర్త తలెత్తి చూశాడు. అదే అదనుగా చంద్రం అతడి చేతుల్లోంచి తప్పించుకొని పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. మందాకిని భర్త అతడిని తిరిగి పట్టుకునే ప్రయత్నం చేయలేదు. రొప్పుతూ నిలబడ్డాడు.
సోమయాజి అతడి దగ్గరకు వెళ్ళాడు. వాళ్ళిద్దరికీ మధ్య అంతగా పరిచయం లేదు. అతడి పేరు సుబ్బారావు.
"ఏమైంది?" అని అడిగాడు సోమయాజి.
"నేను వచ్చేటప్పటికి యిదిగో ఈ ఎదుటి గోడ దగ్గిర నిలబడి వున్నాడు. నాకు అనుమానం వేసింది. చప్పుడు కాకుండా దగ్గిరకి వచ్చి చూతును కదా, నా అనుమానం నిజమే అయింది. ఇదిగో దీన్ని ఇక్కడ వదిలేసి పరుగెత్తబోయాడు. కాసిని నీళ్ళు బాల్చితో పట్రా. ఎవరికీ నిద్రాభంగం కలిగించకు."
"నీళ్ళా౧ ఎందుకు?"
అంటూ సోమయాజి ఏదో ప్రశ్నించబోయి మనసు మార్చుకుని లోపలికి వెళ్ళాడు. నిద్రపోతున్న వాళ్ళకి మెలకువ రాకుండా బాల్చీతో నీళ్ళు పట్టి తీసుకొచ్చాడు ఈ లోపులో సుబ్బారావు ఓ పాత చీపురుకట్ట సంపాదించాడు.
"ఎవరైనా చూస్తే బాగోదు. లేవకముందే కడిగేయాలి."
బాల్చీని ఎదురింటి గోడ దగ్గరగా పెడుతూ, ఆ మాటలకి తలెత్తి చూసిన సోమయాజి మసక చీకట్లో ఆ గోడమీద అక్షరాల్ని చూసి మిన్ను విరిగి మీదపడ్డట్టు కంపించిపోయాడు.
"ఒకే గూటి పక్షుల విహారలీల
మందాకినీ సోమయాజుల మదనక్రీడ"
-అని వుందిక్కడ.
అతడొక శిలాప్రతిమై, సుబ్బారావు చేసేపన్లని చూస్తూ చేష్టలుడిగి నిలబడ్డాడు. చేయి కదపాలన్నా శక్తి చాలడం లేదు. మెదడుని ఐసుముక్కల మధ్య వుంచినట్టు వుంది.