Previous Page Next Page 
వెన్నెల మెట్లు పేజి 4

 

    సౌందర్య మొహంలో ఏ భావమూ కనపడలేదు. పెదిమల మీద చిరునవ్వు మాత్రం మెరుస్తూంది. ఎఫిషియెంట్ సెక్రటరీలాగా, ఆమె పెర్కొలేటర్లో నుంచి కాఫీని పేపర్ కప్స్ లోకి వంపి, వాళ్ళిద్దరికీ సర్వ్ చేసింది.
    
    శ్రీరాం మెప్పుదలగా చూశాడు.
    
    ఆ తర్వాత మరో గంటలోపల అహ్లూవాలియా చేసిన కామెంట్ల లాంటివే మరో నలుగురు పార్టీల నోట విన్నాడు శ్రీరాం.
    
    జీవితం గడవడం కోసం గడప దాటిన ఆడదానికి ఈ సోకాల్డ్ సంస్కారవంతులు ఇచ్చే మర్యాద ఏ పాటిదో  అతనికి అర్ధమయింది.
    
                                                                * * * * * *
    
    హాస్పిటల్ నుంచీ ఇంటికెళ్ళగానే, మొహం కడుక్కుని, టవల్ తో తుడుచుకుంటూ, అద్దం ముందు నిలబడింది ప్రతిమ.
    
    అతను గుర్తొచ్చాడు.
    
    తననే పెళ్ళి చేసుకోవాలనే వూహ అతనికి ఎందుకు కలిగి ఉంటుంది?
    
    "నువ్వు 'యెంతో' బాగుంటావు కాబట్టి!" అంది అద్దం.
    
    అద్దాలు అబద్దాలు చెప్పవు.
    
    ఇందాక చెప్పింది శృతి, అతను వచ్చి పెళ్ళి ప్రపోజలు చెయ్యడానికి ముందు జరిగిన వృత్తాంతం.
    
    పది రోజుల క్రితం కాబోలు, శ్రీరాం వాళ్ళ అమ్మగారిని ఏదో చెకప్ కోసం హాస్పిటల్ కి తీసుకొచ్చాడట. కొంచెం సీరియస్ నెస్సూ, కొంచెం చిరునవ్వూ కలిపి పేషెంట్లను అటెండవుతున్న ఈ అందగత్తెను (ఇక్కడ శృతి ప్రతిమ నెత్తి మీద దెబ్బ వేసింది) చూసి, అతను తక్షణం ప్రేమ జ్వరం పేట్రేగిపోయి, పేషెంటయిపోయాడుట. ఆ తరువాత కొద్దిరోజుల పాటు ఈ అమ్మాయిని గౌరవప్రదమైన దూరం నుంచే గమనించి చూశాడుట. ఆ తరవాత శృతిని కాకా పట్టి, యాంకీ డూడిల్ అయిస్ క్రీం లంచం పెట్టి...
    
    అతను అసభ్యంగా ఎప్పుడూ ప్రవర్తించలేదు. ధైర్యంగా హాస్పిటల్ కి వచ్చేశాడు. చాలా నిజాయితీగా తన భావం బయటపెట్టేశాడు. కానీ అదేమిటి? మరీ అంత బిజినెస్ లైక్ గానా! 'నా టీవీల వ్యాపారంలో పార్ట్ నర్ షిప్పుకి మీరు అంగీకరిస్తారా?' అన్న పద్దతిలో చేశాడు మారేజి ప్రపోజలు!
    
    తనని పెళ్ళి చేసుకుంటాడుట! రెండ్రోజుల్లోగా సమాధానం చెప్పాలిట!
    
    ఈ లోపల ఆలోచించుకోవాలి తను!
    
    ఏం ఆలోచించాలో, ఎలా ఆలోచించాలో అర్ధం కాలేదు ప్రతిమకి. నిజానికి ఎప్పుడూ కూడా పెళ్ళి విషయం సీరియస్ గా ఆలోచించలేదు తను.
    
    చదువే తన లోకం ఇన్నాళ్ళూ! పుస్తకాల సాన్నిధ్యంలో ఇరవై నాలుగేళ్ళు గడిపేసిన తను, పెళ్ళి గురించి ఎప్పుడూ వివరంగా ఆలోచించలేదు. ఎలాంటి వాడిని చేసుకోవాలి? అతనేం చదివి ఉండాలి? కాపరం ఎలా ఉంటుంది...

    ఉహూఁ! నిజంగానే ఇవన్నీ ఆలోచించలేదు.
    
    కానీ...
    
    చదువైపోయిన తర్వాత ఉద్యోగం, ఆ తరవాత పెళ్ళి అన్న వూహ మాత్రం ఉండేది సహజంగానే!
    
    కాబోయే భర్త బహుశా డాక్టర్ అయి ఉంటాడు అన్న అస్పష్టమైన వూహ కూడా ఉంది.
    
    ఇతను ఎం.బి.ఏ. చదివాడుట. మంచి బిజినెస్ ఉందిట. చక్కటి కుటుంబం అని శృతి సర్టిఫై చేస్తూంది.
    
    అతని రూపం గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది ప్రతిమ. అతన్ని తను ఎప్పుడూ పరీక్షగా చూడలేదు. ప్రతిరోజూ బస్టాప్ దగ్గరికి వచ్చేవాడు కాబట్టి యధాలాపంగానే, అప్రయత్నంగానే, అతన్ని గమనించేది. అదీ ఒక్క క్షణంసేపు మాత్రమే! వెంటనే చూపులు మరల్చేసుకునేది.
    
    అందుకని ఇప్పుడు గుర్తు తెచ్చుకుందామనుకున్నా అతని రూపం, చేతలు సినిమా రీలులాగా గిర్రుమని కళ్ళ ముందు తిరగలేదు. ఫోటోలో తీస్తున్నప్పుడు కెమెరా కదిలిపోయి, అంత సరిగా రాణి ఏడెనిమిది స్టిల్ ఫోటోల లాగా అతని రూపం మనసులో అస్పష్టంగా మెదులుతూంది. ఒక రోజు స్కూటర్ మీద కూర్చుని కూలింగ్ గ్లాసెస్ తీస్తున్నాడు. మరో రోజు బంగారు పూత పూసినట్లున్న సిగరెట్ ప్యాకెట్ లో నుంచీ సిగరెట్ తీస్తున్నాడు. అలాగే ఇంకో స్టిల్. మరో స్టిల్.
    
    అతనేం చేస్తున్నా, సినిమా అడ్వర్టయిజుమెంట్ షార్ట్స్ లో మోడల్ లాగా, స్టయిలిష్ గా ఉంటాడు. అతనిలో అందం కంటే ఆకర్షణ ఎక్కువ. అతని కోసం కుట్టినట్లే కాక, అతనికోసమే పుట్టినట్లున్న బట్టలు ---
    
    ఫరవాలేదు బాగానే ఉంటాడతను.
    
    తను సరే అంటే పెద్దవాళ్ళతో మాట్లాడుతాడుట.    
    
    తను సరేనంటే!
    
                                                            * * * * *
    
    ఇంతకీ ఆ అమ్మాయి తనని పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకుంటుందా, ఒప్పుకాదా? టెన్షన్ భరించలేకపోతున్నాడు శ్రీరాం.
    
    ఒప్పుకోకపోవడానికి తనలో ఏం తక్కువ? ఆస్తి ఉంది. కొద్దో గొప్పో అందం వుంది. బంగళా వుంది, కారు వుంది, స్కూటరు వుంది.
    
    రోరింగ్ బిజినెస్ ఉంది!
    
    చాలామంది డాక్టర్లు డాక్టర్లనే పెళ్ళి చేసుకోవడానికి ఇష్టపడతారేమో!
    
    తను డాక్టరు కాడు! అదొక్కటే లోపం తనలో -అది అసలు లోపం అనుకుంటే!
    
    కోణార్క టెంపుల్లో ఉండే శిల్పంలా ఉంటుంది ప్రతిమ!
    
    అంత అందగత్తె తనని చేసుకోవడానికి ఒప్పుకుంటుందా? ఒప్పుకోదా?
    
    నరాలు తెగిపోయే సస్పెన్సు!
    
    స్కూటరుని కేశవరావు ఆఫీసులోకి పోనిచ్చాడు.
    
    ఈ పాటికి ఆ బ్రోకరుగాడు తన పని పూర్తి చేయించి ఉంటాడు.
    
    ఆ పేపర్సు అందుకోగానే తను ఆ బేవార్సు కేశవరావుగాడి పని పడతాడు.
    
    తనకి ఇంక ఈ ఆఫీసులో నూకలు....కాదు....రూకలు చెల్లిపోయాయని ఆ లంచగొండి ఇంకా గ్రహించి ఉండడు.
    
    కేశవరావు ఆ రోజు కూడా అలవాటుగానే ఆఫీసు టైంకి అరగంట ముందు వచ్చేసి, తన బ్రోకరుతో ఆ రోజుటి లావాదేవీలన్నీ చర్చించాడు. ఆ ఆఫీసులో ఒక్కొక్కడికీ ఒక్కొక్క బ్రోకరున్నాడు. ప్రతి పనికీ ఖచ్చితమైన రేట్లున్నాయక్కడ. వాటితోపాటు "అనధికారకమైన వ్యక్తులను సంప్రదించరాదు" అని ఒక అధికారికమైన జోక్ కూడా బోర్డుకి రాసి చెట్టుకి తగిలించబడి వుంటుంది.
    
    శ్రీరాంని చూడగానే, "మీరు క్యాంటీన్ లో కూచుని ఉండండ్రి సాబ్!" అంటూ వెళ్ళి కేశవరావుని పిలుచుకు వచ్చాడు బ్రోకరు.

 Previous Page Next Page