Read more!
 Previous Page Next Page 
వెన్నెల మెట్లు పేజి 3

 

    "సీనియర్ కేంబ్రిడ్జి పాసయ్యాను ఇంతలో మా డాడీ చనిపోయారు. ఆయన ఆర్మీలో కెప్టెన్ గా పనిచేసేవారు. డాడీ చనిపోయాక అమ్మ దిగులుతో జబ్బుపడింది. ట్రీట్మెంట్ కీ వాటికీ డాడీ పెన్షన్ సరిపోదు. అందుకని కాస్త కుదుటపడేదాకా జాబ్..."
    
    "టైప్ రైటింగ్, షార్ట్ హాండ్ పాసయ్యారా?"
    
    "నేను పరీక్షలు పాస్ కాలేదు. బట్ - గెటాన్ అయిపోగలను - మీరు అవకాశమిస్తే!" అంది సౌందర్య చాలా నిజాయితీగా. ఆమె ఇంగ్లీషు ఉచ్చారణలో కాన్వెంట్ యాస వినబడుతోంది.
    
    "డిక్టేషన్ తీసుకుంటారా?" అంటూ పెన్సిలూ, పాడ్ అందించాడు శ్రీరాం.
    
    "ష్యూర్!" అంటూ వాటిని అందుకుంది సౌందర్య.
    
    అతను డిక్టేట్ చేయడం మొదలెట్టాడు. తామరతూడులా ఉన్న సౌందర్య చెయ్యి వేగంగా కదులుతూ రాస్తూంది. స్లీవ్ లెస్ టాప్ వేసుకోవడంవల్ల భుజందాకా నగ్నంగా, ఆరోగ్యవంతమైన గోధుమరంగులో కనబడుతోంది ఆ చెయ్యి.
    
    అతను చివరి పధం చెప్పిన తర్వాత మరో నిమిషానికి రాయడం ముగించి, తలెత్తి చూసింది సౌందర్య.
    
    "కంప్లీట్ అయిందా?" అన్నాడు శ్రీరాం.
    
    నవ్వుతూ తల వూపింది.
    
    "టైప్ చేసి తీసుకురండి."
    
    లేచి నిలబడింది సౌందర్య. అప్పుడు గమనించాడు అతను. ఆ అమ్మాయి చాలా పొడుగు. దాదాపు అయిదడుగుల ఎడంగుళాలు ఉండవచ్చు. పొడుగుకి తగిన ఒళ్ళు కూడా ఉంది. ఆమెని సుతారంగా నొక్కితే, ఆరోగ్యం కారేటట్లు ఉంది. పట్టులా కనబడుతున్న జుట్టు భుజాల కిందదాకా కత్తిరించి ఉంది. లేత పసుపురంగు కాటన్ టాపూ, చాకొలెట్ రంగు కార్ డ్రాయ్ జీన్సూ, మేడలో సన్నటి స్టీలు చెయినూ, కొంచెం భారంగా కనబడుతున్న వక్షస్థలం.
    
    'అచ్చం నీతూసింగే!' అనుకున్నాడు శ్రీరాం. 'చిత్రం! ఎంత దగ్గరి పోలిక!'
    
    సౌందర్య నడిచి వెళుతుంటే ఆమె వెనుక భాగం లయబద్దంగా కదులుతోంది. అందమైన విన్యాసంలా వుంది ఆ నడక.
    
    ఆమె నడిచి వెళుతున్నంతసేపూ తదేకంగా చూసిన శ్రీరాం ఆమె గది దాటగానే తెప్పరిల్లి, నవ్వుకుని భుజాలు ఎగరేశాడు.
    
    పది నిమిషాల తర్వాత పేపర్సు టైప్ చేసి తీసుకొచ్చింది సౌందర్య.
    
    పరీక్షగా చూశాడు శ్రీరాం.
    
    కొన్ని తప్పులు ఉన్నాయి- టైపింగ్ అంత నీట్ గా లేదు.
    
    "వోకే! మీరు వెళ్ళి కూర్చోండి! నేను మళ్ళీ పిలుస్తాను." అన్నాడు.
    
    "థాంక్యూ సర్!" అని లేచి, ఒక్కసారి ఆరాటంగా అతని కళ్ళలోకి చూసి, ఏదో చెప్పబోయి, అంతలోనే మళ్ళీ మనసు మార్చుకుని, తలుపు వైపు నడిచింది.
    
    స్వింగ్ డోర్ తెరవబోతూ చటుక్కున వెనక్కి తిరిగి, "సర్! చెబుతున్నందుకు క్షమించండి! ఈ జాబ్ నాకు చాలా అవసరం! మా అమ్మకి ట్రీట్ మెంటు..." అని మాట తేల్చేసింది సౌందర్య.
    
    ఒకసారి ఆమెని సానుభూతిగా చూసి, "చెబుతాను! వెయిట్ చెయ్యండి!" అన్నాడు.
    
    తర్వాత మిగిలిన అమ్మాయిల్ని ఇంటర్వ్యూ చేశాడు శ్రీరాం. వాళ్ళు తెచ్చి పెట్టుకున్న నగలూ, చౌకరకం లిప్ స్టిక్ లూ - ఇవన్నీ చూసేసరికి అతనికి వెగటేసింది. అందుకని వాళ్ళందరినీ వెయిట్ చెయ్యమనకుండానే పంపించేశాడు.
    
    చివరికి మిగిలింది సౌందర్య ఒక్కతే!
    
    "అనిల్! ఆ నీతూసింగ్ ని లోపలికి పంపు. అపాయింట్ మెంట్ ఆర్డర్ పుటప్ చేసి తీసుకురా!" అన్నాడు శ్రీరాం.
    
    అనిల్ నవ్వాడు. "నీతూసింగ్ కాదు బాస్! సౌందర్యా సింగ్!"
    
    "యా! యా! సౌందర్య! పూర్ మాన్స్ నీతూ! సెండ్ హర్ ఇన్!"
    
    కొద్ది క్షణాల తర్వాత సౌందర్య లోనికి వచ్చింది.
    
    "మిమ్మల్ని సెక్రటరీగా అపాయింట్ చేస్తున్నాను. కన్సాలిడేటెడ్ సేలరీ అయిదొందలు. వోకే?" అన్నాడు.
    
    సౌందర్య మొహం సంతోషంతో వెలిగిపోయింది.
    
    "థాంక్యూ! థాంక్యూ సో మచ్! చిన్న కంపెనీల్లో - సారీ మీది, ఐ మీన్ మనది - చిన్న కంపెనీ అంటున్నానని మరోలా భావించకండి! చిన్న కంపెనీల్లో మామూలుగా మూడొందలకి మించి ఇవ్వరని విన్నాను. అయిదువందలు! థాంక్స్ ఎ లాట్!" అంది.
    
    "మీకు బిజినెస్ తెలియదు!" అని నవ్వాడు శ్రీరాం.
    
    "ఎప్పుడూ మనకి వస్తూంది తక్కువ అని బీద అరుపులు అరవాలి, మనం ఇస్తూంది ఎక్కువ అని బుకాయించాలి. ఇలా అయితే మీరు మన కంపెనీలో నెగ్గలేరు. వందరూపాయలు ఖరీదు చేసే వస్తువుని టాక్సులూ, ఖర్చులూ, లాభాలూ కలిపి మూడొందలకు అమ్ముతాం! మీరు జాలిపడిపోతూ, 'దీని అస్సలు ఖరీదు వంద రూపాయలే!' అని చెప్పారంటే కస్టమర్సు ఠారుమని పరుగెత్తిపోతారు! జాగ్రత్త!" అన్నాడు.
    
    నవ్వి, "నేర్చుకుంటాను బాస్!" అంది సౌందర్య.
    
    అరగంట తర్వాత---
    
    ఆ రోడ్డుమీదే ఉన్న జాక్సన్ కంపెనీనుంచి అహ్లూవాలియా వచ్చాడు.
    
    "లేటయినా మంచి పిట్టనే పట్టావు, యార్! దీని సీట్ చూడు! టెంప్టింగ్ కర్వ్స్!" అన్నాడతను అసభ్యంగా.
    
    "అలా మాట్లాడకు! ఆ అమ్మాయి చాలా డీసెంట్ గరల్సే --- బట్టలు విప్పేసి, పక్కలోకి దూకేవరకూ!" అన్నాడు అహ్లూవాలియా.
    
    "అందరు అమ్మాయిలూ డిసెంట్ గరల్సే --- బట్టలు విప్పేసి, పక్కలోకి దూకేవరకూ!" అన్నాడు అహ్లూవాలియా.
    
    "నీది చాలా డర్టీ మైండు!" అన్నాడు శ్రీరాం, చనువుగా తిడుతూ.
    
    "డర్టీ అంటే గుర్తొచ్చింది. ఐ వాన్నా టెల్ యూ ఏ డర్టీ జోక్! బాగా తిరగనేర్చిన అమ్మాయి ఒకతి తిరుగుబోతు కుర్రాన్ని ఒకన్ని ట్రాప్ చేసి పెళ్ళి చేసుకుందిట. పెళ్ళయ్యాక ఒకరోజు భార్యాభర్తలిద్దరూ హాయిగా ఎంజాయ్ చేస్తుంటే ఎవరో తలుపు తట్టారుట.
    
    'అమ్మో! మా ఆయనొచ్చాడు' అందిట భార్య, పక్కన ఉన్నది భర్తేనని మర్చిపోయి!
    
    భర్త అదిరిపడి లేచి, కిటికీలోనుంచి దూకి పారిపోయాడుట!" అని చెప్పి "హ్హ హ్హ హ్హ హ్హ" అని తన జోక్ కి తనే నవ్వాడతను. నవ్వుతున్నంతసేపూ వోరకంటితో సౌందర్యవైపు చూస్తున్నాడు, ఆ అమ్మాయి రియాక్షన్ కోసం!

 Previous Page Next Page