Previous Page Next Page 
ఆనందోబ్రహ్మ పేజి 38

   

      అతడు తల వంచుకుని అక్కన్నుంచి వెళ్ళిపోయాడు. మాట్లాడలేదు. మాటలు రెట్టించలేదు. అతడు తన మాటలని ఎలా తీసుకున్నాడో ఏమనుకున్నాడో అని ఆ తర్వాత రవ్వంత బాధపడింది.

    రెండు రోజులపాటూ అతను కనపడలేదు. ఎప్పుడు ఇంటికి వస్తున్నాడో తెలీదు. ఎప్పుడు వెళుతున్నాడో తెలీదు. పరీక్షలు దగ్గిరపడుతున్నాయి. కాబట్టి చదవటం మాత్రం చదువుతున్నాడు. ఎలా సంపాదించాలా అన్నది ప్రశ్న, రకరకాలుగా ఆలోచించటం మాత్రం సాగించాడు కానీ, ఏమీ పాలుపోలేదు. ఆ సందిగ్ధంలోనే పరీక్షలయిపోయినాయి. ఎలా వ్రాశాడన్న ప్రశ్నేలేదు. ప్రథమ శ్రేణి తప్పదు కానీ యిప్పుడు సమస్య పరీక్షలంత చిన్నది కాదు. జీవితం అంత పెద్దది. దీన్ని ఎదుర్కోవాలి? అతడు పట్టుదలతో వున్నాడు. శలవులిచ్చారు. కానీ అతడు మనసుకి మాత్రం విశ్రాంతి లేదు. ఆలోచన.....ఆలోచన.....ఆలోచన.

    చివరికి ఒక రోజు అది పొగమంచులా విడిపోయింది.
   
    చాలా రోజుల తరువాత ఆమె ఇంటిభాగంలోకి అడుగుపెట్టాడు. "ఏం చేశావ్?" అని అడిగింది. నవ్వునీ, ఆనందాన్నీ దాచుకున్నాడు. "కూలీ కడుపునొప్పి కదా" అన్నాడు.
   
    "మరి?"

    "చాలా రోజులు ఆలోచించాను. జబార్లు తిరిగాను. ఇన్నాళ్ళకి కాస్త సులభమైన పని కనపడింది."
   
    "ఏమిటి?"
   
    "రోడ్డు పక్కనుండి పోతుంటే ఒక ముసలాడు కనపడ్డాడు. వాడికి బడ్డీలేదు. రోడ్డు ప్రక్కనే కూర్చుని క్షురకర్మ చేస్తున్నాడు. ఒక అరగంట సేపు గమనించాను. సులభమే అనిపించింది. ఎందుకలా నిలబడ్డావని అడిగాడు. నా మనసులో మాట చెప్పాను. నాకేదైనా పిచ్చెక్కిందా అన్నట్టు చూశాడు. నచ్చచెప్పాను. మొదట్లో వప్పుకోలేదు. రెండు గంటలు బ్రతిమాలాక కత్తెరా, దువ్వెనా చేతికిచ్చాడు. అంతలో ఒక కుర్రవాడు - పాపం ఎవరో అభాగ్యుడు వచ్చి పీటమీద కూర్చున్నాడు. అనుకుంటాం గానీ అదీ కష్టమైన కళే సుమా పోతే అదృష్టమేమిటంటే మనం ఏం చేసినా వాడికి కనపడదు. అద్దం ఇవ్వంకదా రోడ్డు పక్కన కూర్చుని చేయించుకునేవాడి షోకుకి అద్దం వొకటి కావాలా అని దబాయించవచ్చు. పాపం.....తలవంచుకుని జుట్టు నా కప్పగించి కూర్చున్నాడు. అరగంటలో పూర్తి చేశాను. మరీ అంత సిగ్గుపడేలా ఏమీ రాలెదనుకో ముసలోడు కూడా సంతోషించాడు. రెండు మూడు తలల అనుభవం వచ్చేసరికి మెలకువలు తెలిసినాయి. వారితో సమానం అయిపోయాను. నేనిలా సాయం చెయ్యటం వాడికీ సంతోషంగానే వున్నట్టుంది. చివరి కిద్దరం ఒక వ్యవహారంలోకి వచ్చాం. పొద్దున్న పదింటివరకూ అతడు కూర్చునేటట్టు - తరువాత మధ్యాహ్నం నేను వెళ్ళగానే కత్తెరా, దువ్వెనా నాకిచ్చి వాడు వెళ్ళిపోయి తిరిగి సాయంత్రం అయిదింటికీ వచ్చేటట్టూ....! అవి నాకిచ్చినందుకు బదులుగా రోజుకి అర్ధరూపాయి అద్దె నేను అతడికి చెల్లించేటట్టూ! ఈ శలవులు పూర్తయ్యే సరికి ఖర్చులు పోనూ బాగానే మిగిలేటట్టూ వుంది. అప్పుడిక యిలా మధ్యాహ్నం పూట రాబడి తక్కువగా వుండే సమయాల్లో ఖాళీగా కూర్చోవటంకన్నా నేను ఒక కత్తెర కొనుక్కోవచ్చు. సాయంత్రం స్కూలు నుంచి - ఓ అప్పుడు స్కూలు కాదు కాలేజీ వుంటుంది కదూ - కాలేజీ నుంచి వస్తూ వస్తూ ఓ అరగంటో గంటో కూర్చుంటే అయిదారు రూపాయలు సంపాదించవచ్చు. నాకెంతో ఆశ్చర్యంగా వుంది. నమ్మశక్యం కాకుండా వుంది. ఇదంత సులభమో అనిపిస్తుంది. దిగితే గానీ లోతు తెలీదన్న సామెతలో తప్పు కనిపిస్తుంది. ప్ర్రారంబిస్తే ఏ పని అయినా సులభమే అవుతుంది. చూస్తూవుండు పదిరోజులు తిరిగేసరికల్లా ఎంత ప్రావీణ్యత సంపాదిస్తానో..." అంటూ వెనుకనుంచి చేతులు ముందుకు తీశాడు. అతడి కంఠంలో మార్పు కనపడింది. సాంద్రత నిండిన స్వరంతో మంద్రమైన కంఠంతో అన్నాడు - "ఒకప్పుడు ఇవే నాకు గగన కుసుమాలు అయ్యాయి. నా ఆకలే నాకు సమస్య అయి, నువ్వన్నట్లు తప్పంతా ఎదుటి వాళ్ళమీదకు తోసేయించింది. ఇప్పుడు నన్ను నేను గెలిచాను! నా యీ మొట్టమొదటి విజయాన్ని పంచుకోవటం కోసం - నాతోపాటూ నీకూ.... ఇదిగో తీసుకో" అంటూ దోసిలి ముందుకు సాచేడు.
   
    అందులో రెండరటి పళ్ళున్నాయ్!
   
    ఆమె వాటివంక చూడటంలేదు. అతడివైపు చూస్తోంది! కంటికి నీటి పొర అడ్డుగా నిలవడంతో ఆ మసక పొరలలోంచి అతడు అస్పష్టంగా కనపడుతున్నాడు. బలిచక్రవర్తి ఎదుట నిలబడి మూడో కాలు ఎక్కడ పెట్టను అని ధీమాగా అడుగుతూన్న వామనుడిలా ఇంతింతై, వటుడింతయై విశ్వవ్యాప్తమై పోయినట్టూ కనపడుతున్నాడు. అప్పుడు అతడిలో ముల్లోకాలూ కనిపించినాయి ప్రజాపతులూ, ధనుజులూ, దేవతలు, అనిలానల ప్రభ్రుతులూ, సప్తసముద్రాలూ, కులగిరులూ - అన్నీ ఆ మూర్తిలో గోచరించినవి. అతడి తాతయ్య అతడికి జాతక కర్మాదులు నిర్వర్తించి ఉపనయనం చేసి వుండవచ్చుగాక! వేదసారాన్ని నూరిపోసి వుండొచ్చుగాక జీవిత సారాన్ని నూరిపోసింది మాత్రం ఆమెయే. ఇక అతడిని ఎవరూ ఆపలేరు. ఎడారిలో పడేసినా ఖర్జూరాన్ని పండిస్తాడు. ఆమె అతడివైపు ఆప్యాయంగా చూసింది. ఆ క్షణం అతడి వ్యక్తిత్వం ఎంతో పెరిగిపోయినట్టు అనిపించింది! కానీ వటుడెంతైనా ఆమె ముందు చిన్నవాడే అమాయకమైన నవ్వుతో, ఒక చేతిలో కమండలం, మరో చేతిలో జింకతోలు పట్టుకుని నిలబడ్డ పిల్లవాడు -ముద్దొస్తున్నాడు.
   
    అతడికేమివ్వగలదు? వరచేలంబులో, మాడలో, ఫలములో, వన్యంబులో, గోవులో, హరులో, రత్నములో, రథములో - ఉహూఁ-ఇవేమీ ఇవ్వలేక ఆపుకోలేని ఆప్యాయతతో అతడి మొహాన్ని దగ్గిరగా లాక్కొని బుగ్గలమీద గట్టిగా ముద్దు పెట్టుకుంది. ఆ పెదవుల తడి అతడి చెక్కిలిమీద ఉంగరంలా గుండ్రంగా అంటింది.
   
    అతడు చప్పున లోపలికి పరుగెత్తాడు. కొద్దిసేపటివరకూ ఏం చెయ్యాలో తోచలేదు. అద్దంలో చూసుకున్నాడు. ఆమె పెదాలు ఇంకా అక్కడే వున్నట్టు చల్లగా వుంది. వేళ్ళతో సుతారంగా అక్కడ రాసేడు. గుండెని మంచు మధ్యలో పెట్టినట్టూ, శరీరం ఘనీభవించినట్టూ వుంది. కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు తెరిచాడు. మళ్ళీ మూసుకున్నాడు. కూర్చుంటే లేచి తిరగాలనిపిస్తుంది. తిరుగుతూంటే కూర్చోవాలనిపిస్తుంది. మాటిమాటికీ అద్దంలో చూసుకోవాలనిపిస్తుంది.
   
    కారే రాజులు రాజ్యముల్ గలుగవే.... వారేరీ సిరి మూటగట్టుకుని పోవంజాలిరే? మనసైన ఒక మగువ బుగ్గపై ముద్దివ్వ, ఆ అనుభూతి చాలదే అవనిపై జీవింప -
   
    దాదాపు అరగంట అలా గడిచింది. గుండె వేగం తగ్గలేదు. కాళ్ళు వణకటం తగ్గలేదు. ఆగలేదు. రక్తప్రసరణం తగ్గలేదు. కనురెప్ప లల్లాడటం తగ్గలేదు.
   
    అతడు మరి ఇంట్లో ఆగలేక బయటకు నడిచాడు. వీధిలోకి అడుగు పెట్టాడు. నాలుగిళ్ళు దాటాక చంద్రం అతడిని ఆపుచేశాడు.
   
    "ఏమిటీ మధ్య ఎక్కడా కనబడటం లేదు" లోపలికి తీసుకువెళ్తూ అడిగాడు చంద్రం.
   
    "పరీక్షలు కదా"
   
    "ఏమంటుంది ఆవిడ?"

    "ఎవరు?"
   
    "అదేనోయ్ మీ పక్కభాగంలో దిగింది - మందాకిని."
   
    సోమయాజి మాట్లాడలేదు.
   
    "మీరిద్దరూ మంచి స్నేహితులటగా - వైదేహి చెప్పిందిలే."
   
    ఆమె తనని గమనిస్తుందన్న మాట అనుకున్నాడు.
   
    "మందాకిని బాగా  చదువుకున్నదట కదా"
   
    "ఏమో నాకు తెలీదు."
   
    చంద్రం బల్లమీద నుంచి కాగితాలు తీసి కవరులో పెట్టి అతికిస్తూ "ఇవిగో ఇవి నేను వ్రాసినవి. ఆమెకిచ్చి, చదివి అభిప్రాయం చెప్పమను. లేకపోతే చదివిన తరువాత నేనే వచ్చి స్వయంగా తిరిగి తీసుకుంటాన్లే" అన్నాడు.
   
    సోమయాజి ఏమీ ఎదురు చెప్పలేకపోయాడు. అతడికి ఎవరితోనూ ఎక్కువ పరిచయం లేదు. కాదంటే ఏమనుకుంటాడో అనుకుని అతడు ఆ కాగితాన్ని తీసుకుని బయటికి వచ్చేసేడు.
   
    వచ్చి మందాకిని కిచ్చాడు.
   
    ఆమె విస్మయంతో కవరు విప్పి కాగితాలు తీసింది. మొదటి రెండు పంక్తులూ చదివింది. అంతలో తలెత్తి తనవైపే చూస్తున్న సోమయాజితో "సర్లే, ఇక నువ్వెళ్ళు" అంది.
   
    అతడు కాస్త ఆశాభంగం చెందాడు.
   
    ఆమె మామూలుగా "సరే" అనకుండా, తనతో కలిసి ఆ విషయం చర్చిస్తుందనుకున్నాడు. ఆమె ఆ కాగితంలో ఏముందో చెప్పకపోవడం తననుంచి ఒక రహస్యం దాయడంలా అనిపించింది. అది అతడికి బాధ కలిగింది. ఈ మధ్య అతనికి తను చేసిన ప్రతి పనీ ఆమెకి చెప్పాలనిపిస్తోంది. అలాగే ఆమె చేసిన ప్రతి పనీ తనకి చెపితే బావున్ననిపిస్తోంది. ఆరాధన స్థాయినుంచి మనిషి ప్రేమస్థాయికి వెళ్ళినప్పుడే ఈ స్థితి వస్తుంది. ఆ స్థితిలోనే అతడు "పెదవి అంచున నిశ్శబ్దం...." అని ఒక కవితకూడా వ్రాసుకున్నాడు.
   
    రెండు రోజులు గడిచినయ్!
   
    ఆ రోజే అతడికి ఒక విషయం తెలిసింది. ఈ వేసవి సెలవుల్లో జిల్లా స్థాయిలో ఫుట్ బాల్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో ఆ జిల్లాలో వున్న అన్ని పాఠశాలలూ పాల్గొంటాయి. తమ స్కూలు తరపున రమేష్ నాయకత్వంలో స్కూలు జట్టు, మరి పది పదిహేను రోజుల్లో జిల్లా కేంద్రానికి బయల్దేరబోతూంది. చాలా ప్రతిష్టాకరమైన పోటీలు ఇవి. అందులో పాల్గొంటే తర్వాత కాలేజీ చదువులకి ఉపయోగపడుతుంది. ఇక కాలేజీపై చదువు వుండదేమో అన్న భయం ముందు వుండేది. ఇప్పుడు లేదు. అంతేకాదు. ఇప్పుడు అతడి పేర్న కొంత డబ్బు కూడా వుంది.

 Previous Page Next Page