"ఉహూ"
"అయితే నేనే చెబుతాను. చెయ్యి యివ్వు" అంటూ చొరవగా అతని చెయ్యి తీసుకుని వడిలో పెట్టుకుని నవ్వుతూ అతనివైపు చూసింది. అతని వళ్ళంతా చెమటలు పట్టింది. శరీరం సన్నగా వణుకుతూంది. అంతా నిశ్శబ్దంగా వుంది. దూరంగా పెళ్ళివారి ఇంటి నుంచి వాద్య ధ్వని వినిపిస్తుంది. అంతే రాజా ఎక్కడో నిద్రపోతున్నాడు. ఆమె పరికిణీ మెత్తదనం అరచేతి వెనకవైపు నున్నగా తగులుతూంది. ఆ క్షణం అతను అంతా మర్చిపోయాడు. వర్ణనీయవస్తువే తిరగబడి వర్ణించినట్టు అన్నాడో కవి. అతని తెలియనితనం ఆమెకి హుషారునిస్తూంది.
"నీ చేతులెంత బలంగా వుంటాయబ్బా?"
...........
ఆమె చేతిని చెంపకి ఆనించుకుంది. అప్పుడే వచ్చింది నొప్పి బాణం వదిలినట్టు, కడుపులోంచి గుండెల్లోకి పాకింది, 'అమ్మా' అనుకుంటూ ముందుకు వంగాడు.
"ఏమైంది?"
"క......కడుపులో నొప్పి."
ఆమె కంగారుపడింది. ఈ సమయంలో అలతి ఉపద్రవం తెచ్చిపెట్టినందుకు అతనివైపు విసుగ్గా చూసి "వాముతేనా" అని అడిగింది.
"వద్దు అదే తగ్గిపోతుంది" కడుపు పట్టుకుని అన్నాడు. మరిక ఏమి చేయాలో తోచనట్టు అతనివైపే చూస్తూ వుండిపోయింది. అతను మెలికలు తిరుగుతున్నాడు. ఆమెకి భయం వేసింది. అంతలో దూరంగా ఎవరో వస్తున్న ధ్వని ఆమె నిలబడింది.
"నువ్వు వెళ్ళు వైదేహి - ఇది మామూలే కాసేపటికి అదే తగ్గిపోతుందిలే-"పల్ల మధ్య బాధని నొక్కిపడుతూ అన్నాడు.
ఆమె ఆమాట కోసమే ఎదురు చూస్తున్నట్లు, "ఎవరో వస్తున్నట్టున్నారు మరీ అవసరమైతే పిలువు" అనేసి వెళ్ళిపోయింది. బాధ తోడుగా అతను ఒక్కడే మిగిలాడు. ఇంతకుముందు ఎన్నడూ ఇంత నొప్పి రాలేదు. కళ్ళు మసకలు కమ్ముతున్నాయి. పూర్వం అయితే పెరట్లో, అదేరాయిమీద కూర్చుని తనని తానే ఓదార్చుకునేవాడు. ఇప్పుడిక ఇంట్లో కూడా ఎవరూ లేరు. అతడికి దుఃఖం వస్తూంది. ఆపుకోగలగటానికి అతని వయసెంతని?
అంతలో కెరటంలా మళ్ళీ నొప్పి వచ్చింది. ముందుకు తూలాడు.
సరిగ్గా అప్పుడే
ఒక చెయ్యి వచ్చి అతడిని పడకుండా ఆపింది. విశ్వాన్ని సాకిన చెయ్యి. ప్రపంచాన్ని శాసించే చూపు కరుణని వర్షించే కళ్ళు దయనిండిన స్పర్శ.
అతను తలెత్తి చూశాడు. నొప్పివలన వచ్చిన నీటితో కనుచూపు మసకబారింది. అయినా చూపుని పోల్చుకోగలిగాడు. అతని పెదాలు కదిలి ఏదో సంశయాన్ని వెలిబుచ్చబోయినయ్. అవసరమైనప్పుడు ప్రేమని ప్రదర్శించటం కోసం ప్రపంచాన్నైనా ఎదిరించాలన్నట్టు ఆమె వేళ్ళు అతన్ని సుతారంగా ఆపినయ్. చేతులు తలని దయగా వడిలోకి తీసుకున్నాయి. పెరట్లో అక్కడే అలాగే ఎవరన్నా చూస్తారన్న భయంకూడా లేకుండా.
ప్రపంచాన్ని జయించినంత నిర్భీతి, నిశ్చింత! పురుషుడు మరీ ఏకాకి అయినప్పుడు తనని తాను దాచుకుని ఓదార్చుకోవటానికి స్త్రీ చీరె చెరుగు ముడతల్ని సృష్టించాడనుకుంటా దేవుడు.
బాధల్నించీ-ఈ ప్రపంచపు సంకీర్ణ ధ్వనులనుంచీ, కదిలే నాచు మొక్కల్లాటి ఆలోచనాల నుంచీ విముక్తి.....ఓ స్త్రీ నువ్వు తల్లివా-చెల్లివా? అక్కవా? ప్రేయసివా? ఎవరైతేనేం - నాకీ మాత్రం ఓదార్పూ, చేయూతా ఇవ్వు చాలు. నా ఊపిరితో ప్రపంచాన్ని నిలుపుతాను. వెలిగే నా వేళ్ళ క్రొవ్వొత్తులతో ఈ తిమిసాంద్రకారాన్ని పారద్రోలుతాను.
"ఎప్పటినుంచి వస్తూంది నొప్పి?"
"ఈ మధ్యే అప్పుడప్పుడు."
"మరి మందు వేసుకోలేదా?"
అతనికి తన బావగారు చేసిన పని గుర్తొచ్చింది. కడుపునొప్పి మాత్రలకి బదులు చౌకరకం తలనొప్పి మాత్రలు తెచ్చి ఇవ్వటం గురించి ఆమెకు చెప్పాడు. ఆమె స్థబ్దురాలై విన్నది కానీ ఏమీ మాట్లాడలేదు. ఆ విషయం అక్కడితో ఆగిపోయింది.
మరి నాలుగు రోజులు గడిచినయ్!
దమయంతి వెళ్ళిపోయాక చిన్నక్కకి విసుగు ఎక్కువైంది. పని ఎక్కువ అవటంతో ప్రతీ చిన్న దానికి చిరాకు పడసాగింది. సోమయాజి స్కూలునుంచి వచ్చేసరికి మధ్యాహ్నం ఒంటిగంట అయ్యేది. అప్పటి వరకూ ఇంటిడు చాకిరీ చేసి ఆవిడ వసారాలో చాపవేసుకుని కునుకుతీసేది. అతడే వంటింట్లోకి వెళ్ళి తన అదృష్టాన్ని పరిశీలించుకునేవాడు. ఒక్కోరోజు బాగానే వుండేది. ఒక్కోరోజు మాత్రం నాలుగైదు గరిటల కన్నా ఎక్కువ అన్నం వుండేదికాదు.
ఆ రోజు మరీ తక్కువ వుంది.
నిజానికి ఆ రోజు అతడు చాలా ఆకలిమీదున్నాడు.
దాదాపు ఖాళీగా వున్న గిన్నెను చూస్తే.....కాలితో తన్నాలన్నంత ఉక్రోషం వచ్చింది. నిస్సహాయతతో కూడిన దుఃఖం వచ్చింది. అన్నం తినకుండ బయటకు వచ్చేశాడు. చిన్నక్క నిద్రపోతూంది.
మందాకినీ వాళ్ళ భాగంముందు తలుపులేసే వుంది. అతడు లోపలి వెళ్ళాడు. మంచంమీద కూర్చుని మందాకిని ఏదో అల్లుతూంది. "ఏమిటలా వున్నావు?" అని అడిగింది.
అతడు వెంటనే సమాధానం చెప్పలేదు.
'ఏం మాట్లాడవేం?"
అతడు కొద్దిసేపు ఆగి, నెమ్మదిగా "నాకు ఆకలేస్తూంది" అన్నాడు. ఆమె చేతిలో గుడ్డ జారవిడిచి లేచి దగ్గరకొచ్చి "ఏమిటీ" అంది అర్ధంకానట్టూ.
"నాకు కడుపునిండా అన్నం కావాలి. నిండా కడుపునిండా" అన్నాడు. నిస్సహాయంగా అరుస్తున్నట్టూ క్రింది పెదవిని పంటితో నొక్కిపట్టి దుఃఖం బైటపడకుండా ప్రయత్నిస్తున్నా అది కనపడుతూనే వుంది.
"అదేమిటి! ఇంట్లోలేదా" ఆమె విస్మయంగా అడిగింది.
"లేదు వుండదు ఏరోజూ వుండదు" కసిగా అన్నాడు.
ఆమె మరింత దగ్గరగా వచ్చి "అసలేమైంది?" అనడిగింది.
దమయంతి వున్నప్పటినుంచీ ఇప్పటివరకూ జరిగిన దాని గురించీ, మారుతున్న పరిస్థితుల గురించీ చెప్పుకుంటూ వచ్చాడు. అంతా చెప్పి, "ఈ రోజు మరీ తక్కువ వుంది" అన్నాడు గాద్గదికమైన స్వరంతో.
"ఎన్నాళ్ళనుంచీ జరుగుతుందిలా?"
చెప్పాడు.
"మరేం చేసేవాడివి?"
"అలాగే అర్ధాకలితో పడుకునేవాడిని."
"నీ కెన్నేళ్ళు?"
సంబంధంలేని ఆ ప్రశ్నకి అతడు విస్మయం చెంది సమాధానం చెప్పాడు. ఆమె అతడివైపు సాలోచనగా చూస్తూ "ఎందుకు నీమీద నీకింత జాలి?" అంది.
అతడు చకితుడయ్యాడు. ఆమె మాటలు అర్ధంకాలేదు. అంతలో ఆమె అన్నది -
"నాకు భోజనంలేదు అని నువ్వనగానే నేను కన్నీళ్లు పెట్టుకుని 'రా-మా ఇంట్లో చేద్దూవుగాని' అంటాననుకున్నావా? మనసు కరిగిపోయి కన్నీళ్ళతో విస్తరేసి వడ్డించి నువ్వు తింటూంటే జాలితో గుమ్మానికి జారబడి నిలబడి చూస్తూ వుంటాననుకున్నావా? ఏమీ చెయ్యను, ఎందుకు చెయ్యాలి. వాళ్ళెంత పెడుతున్నారన్నది కాదు ప్రశ్న - కాస్త ఆకలైతే రెండు అరటిపళ్ళు కొనుక్కోలేవూ? డబ్బుల్లేవు అనకు. అందుకే నీ వయసెంత అని అడిగాను. ఈ వయసులో నీ అంతట నీకు అరటి పళ్ళు కొనుక్కోగలిగే శక్తి వుందని నేను నమ్ముతున్నాను. అంతేకాని ఎవరో నాకేదో చేయలేదని కుమిలిపోవటం కాదు."
అతడు విస్పారితమైన కనులతో ఆమెవైపు చూశాడు. మధ్యాహ్నపు టెండ ఆమె మొహంమీద పడుతూంది. "సోమయాజీ! చాలా కాలంనుంచి నిన్ను గమనిస్తూ వస్తున్నాను. నీ కళ్ళలో అదోలాటి కసివుంది. ఈ ప్రపంచంమీదా మనుష్యులమీదా ద్వేషం నీలో రోజురోజుకి పెరుగుతున్నట్టూ నాకు తోస్తుంది. నీవు ఏమైనా అనుకో అది అంత మంచిదికాదు సుమా".
అతడు విభ్రాంతుడై ఆమెవైపు చూశాడు. చాలా కొత్తకోణం అది. సమస్యని కొత్త కోణంలోంచి విశ్లేషించి చూపే వాస్తవం అది. అయినా అతడు తల అడ్డంగా వూపుతూ, "నీకు తెలీదు. నీకు తెలీదు" అన్నాడు. ".....తాతయ్య వున్నప్పుడు వీళ్ళంతా ఎలా వుండేవారో నీకు తెలీదు. నిజానికి తను నాకు చిన్నత్త అవుతుంది. కానీ చిన్నక్క అనే పిలిచేవాడిని. అంతలా కలిసిపోయి వుండేవాళ్ళం. కానీ-కానీ ఇదేమిటి?" అతడి గొంతు తడబడింది. "ఎందుకు ....యిలా జరుగుతుంది? ఎందుకు మనుష్యులు యిలా మారిపోయారు?"
"మారిపోవటానికి వాళ్ళకి హక్కు వుందనీ ఎందుకు మారిపోయారని ప్రశ్నించే అధికారం నీకులేదు. నేను చెప్పేది అదే! నీ చేతగానితనానికి అవతలి వాళ్ళేదో చేస్తున్నారనీ, అందుకే నువ్విలా అయిపోయావాణీ సమర్ధించుకోవటం మొదలుపెడతావో, అప్పట్నుంచే నువ్వు జడుడివి అవటం ప్రారంభిస్తావు. ఇంకేమీ చెయ్యలేవు. ఇది నీ ఒక్క విషయంలోనే కాదు. ప్రపంచంలో అందరికి వర్తిస్తూంది. నీ ఉనికికి అనుగుణంగా నీ సిద్దాంతాన్ని నిర్మించుకుని, అదే గొప్పదన్న భ్రమలో మునిగిపోకు. యుద్ధం చెయ్యి సోమయాజీ! యుద్ధం చెయ్యి! అప్పుడు నీ మీద జాలిపోతుంది. అదీ వేదాంతం అంటే! ఆశావాదంలోంచి వచ్చేది వేదాంతం! నిరాశావాదంలోంచి వచ్చేది శ్మశాన వైరాగ్యం!! రెండింటికీ తేడా వేదాలు చదివిన వాడిని-నీకు నేను చెప్పగలిగేపాటిదాన్ని కాను."