Previous Page Next Page 
రేపల్లెలో రాధ పేజి 36


    "రామనాథం మాస్టారు ఆ వచ్చిన వాళ్ళెవరో మాత్రం నాకు తెలీదు!" అంది రాధ.
    
    "మాధవ్ గురించి మాట్లాడకుండా వీళ్ళతో మాట్లాడుతూ కూర్చుంటాడేమిటి మీ నాన్న?" అంది విసుగ్గా తిలక.
    
    రాధకీ అంతే విసుగ్గా ఉంది. బృందావనంలోని వేణునాదాన్ని వినడానికి ఒళ్ళంతా చెవులు చేసుకుని ఉంటె, చెవిలో జోరీగలు రొద పెట్టినట్లుగా, రాధ పరిస్థితి ఉంది.
    
    "ఈయన జగన్నాథంగారు వీళ్ళ అబ్బాయే శేఖర్ ఇంజనీరింగ్ పూర్తి చేసినప్పటినుండీ అమెరికా వెళ్తానని పట్టుబడుతున్నాడట..." అన్నాడు రామనాథం.
    
    సుబ్బారాయుడితో జగన్నాథం "నాకు ఇంకా ఇద్దరు చదివించాల్సిన  కొడుకులున్నారు. అందుకని వేడిని అమెరికా పంపించగల మామగారి కోసం వెదుకుతున్నాను!" అన్నాడు.
    
    రామనాథం బిగ్గరగా నవ్వి, స్పాన్సరింగ్ చేయగల మావగారు కావాలన్న మాట!" అన్నాడు.
    
    సుబ్బారాయుడు ప్రకాశంవైపు తిరిగి, "రాధతో కాఫీలు పంపించమని లోపల చెప్పు!" అన్నాడు.
    
    ప్రకాశం తల ఊపి లోపలికి నడిచాడు.
    
    పార్వతమ్మ లోపలికొచ్చిన మరిదిని రహస్యంగా, "ఎవరూ వాళ్ళూ? ఈ వేళప్పుడు వచ్చారేమిటి?" అంది.
    
    "తెలియదు రాధతో కాఫీలు పంపించమన్నాడు!" అన్నాడు.    

    "రాధతోనా?" ఆమె ఆశ్చర్యంగా అడిగింది.
    
    "ఊఁ!" అన్నాడు.
    
    రాధ కాఫీలు పట్టుకుని ముందు గదిలోకి వెళ్ళింది.
    
    "మా అమ్మాయి రాధ!" అని పరిచయం చేశాడు సుబ్బారాయుడు.
    
    "మహాలక్ష్మిలా ఉంది!" మెచ్చుకున్నాడు జగన్నాథం.
    
    "మీ అబ్బాయిని అమెరికా పంపించడం నాకో లెక్కలో పనికాదు. ఒకసారి వచ్చి పిల్లని చూస్తే ముహూర్తాలు పెట్టుకుందాం!" అన్నారు సుబ్బారాయుడు.
    
    రాధకి ఒక్కసారిగా తను నిలబడ్డ భూమి పాతాళంలోకి క్రుంగిపోతున్నట్లుగా అనిపించింది. తండ్రి శిబిచక్రవర్తిలా తన శరీరభాగాల్ని కోసి దానం చేస్తున్నట్లు తోచింది.
    
    జగన్నాథం సంతోషంగా "మావాడికి కావాల్సింది అమెరికా వెళ్ళడానికి అయ్యే ఖర్చులు భరించగల మావగారు. మిగతావన్నీ నేనెంత అంటే అంత గీసిన గీటు దాటడు!" అన్నాడు.
    
    "మా అమ్మాయి కూడా అంతే! దానికి ఏ లోటూ రాకుండా చూడటం తప్ప నాకింకేం కావాలీ? అది తప్ప ఎవరున్నారనీ...." అన్నాడు సుబ్బారాయుడు.
    
    "అబ్బాయి కూడా ఉంటె బాగుండేది. తాంబూలాలుకూడా పుచ్చేసుకునే వాళ్ళు!" అన్నాడు కూడా వచ్చిన ఒకాయన.
    
    రాధకి ఇత్తడి చెంబుతో ఆయన గుండుమీద కొట్టాలనిపించింది.
    
    గిరుక్కున లోనికి వచ్చి మంచంమీద వాలిపోయి దిండులో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండిపోయింది.
    
    "రాధా....! ఏమైంది? చెప్పు!" తిలక భుజం తట్టి కుదుపుతూ అడుగుతోంది.
    
    బయట సుబ్బారాయుడు పెళ్లి తన స్వగ్రామంలోనే జరిపిస్తాననీ, ఆ ఏర్పాట్ల గురించి మాట్లాడుతున్నాడు.
    
    వింటున్న ప్రకాశం భరించలేనట్లు "అన్నయ్యా....వదినని కూడా ఒక్కమాట అడిగీ..." అన్నాడు.
    
    "మీ వదినకి ఏం తెలుసు ప్రకాశం? కూతురూ, అల్లుడూ టింగు రంగా అంటూ అమెరికా వెళ్లిపోతారంటే ఎగిరి గంతేసి ఒప్పుకుంటుంది!" అన్నాడు సుబ్బారాయుడు.    

    "అయినా ఇక్కడ ఎక్కి జేర్లగిలబడితే అక్కడ ముందుకి వాలచ్చు. ఇవాళా రేపూ మన ఊరు రావడం కన్నా మెరికా వెళ్ళడమే త్వరగా అవుతుంది. మీరూ, చెల్లెమ్మ కూడా వెళ్ళి రావచ్చు సరదాగా!" అన్నాడు జగన్నాథం.
    
    ఆ మాటకి సుబ్బారాయుడు సంతోషంగా నవ్వి, "ఈ రోజు మీరు కనిపించి ఈ సంబంధం విషయం చెప్పి మంచి పనిచేశారు రామనాథం గారూ!" అన్నాడు.
    
    "మనం నిమిత్తమాత్రులం... అంతా పైవాడి దయ!" అన్నాడు రామనాథం.
    
    లోపల రాధ హృదయం గట్టుతెగిన గోదారే అయింది.
    
    "ఏమైందే తల్లీ.... చెప్పి ఏడు!" విసుక్కుంది తల్లి.
    
    "మా అమ్మ కదూ... ఏడుపు ఆపి, ఏం జరిగిందో చెప్పమ్మా?" బతిమాలుతోంది శాంత.
    
    "పార్వతీ!" గట్టిగా కేకేశాడు సుబ్బారాయుడు.
    
    కూతుర్ని వదిలిపెట్టి కంగారుగా పైట కొంగు భుజం నిండుగా కప్పుకుని బయటకు వెళ్ళింది పార్వతమ్మ.
    
    "మా ఆవిడ...." వాళ్ళకి పరిచయంచేసి, "పార్వతీ! ఈయన జగన్నాథం బావగారు వీళ్ళఅబ్బాయికి మన రాధని ఇద్దామనుకుంటున్నాను" అన్నాడు సుబ్బారాయుడు.
    
    నమస్కారం అనబోయిన ఆమె పెదవులు అలాగే వుండిపోయాయి అయోమయంగా చూస్తూ వుండిపోయింది.
    
    "నువ్వు లోపలకెళ్ళు" అని, "మేం మంచిరోజు చూసుకుని పట్నం వస్తాం" అన్నాడు వాళ్ళతో.
    
    "అయితే మేం యింక శెలవు తీసుకుంటాం" అంటూ లేచారు వాళ్ళు.
    
    వాళ్ళని బయటిదాకా సాగనంపి లోపలికి వచ్చేసరికి సుబ్బారాయుడికి ఇంటిల్లిపాదీ కొలువుదీరి అతడ్ని నిగ్గదీస్తున్నట్లుగా చూస్తూ కనిపించారు.
    
    అతను రాధ దగ్గరికి నడిచి, ఆమె తలమీద చెయ్యివేసి నిమురుతూ, "ఆరోజు నీ ఇష్టమే నా ఇష్టం నాన్నా! నీకన్నా నాకు బాగా తెలుసా? అన్నావు గుర్తుందా? ఆ క్షణం నిన్ను కన్నందుకు గర్వంతో పులకరించి పోయానమ్మా! నేనేం చేసినా నీ మంచికోసమే అని నమ్ము! నువ్వు నా మాట కాదనవన్న నమ్మకంతో వాళ్ళకి మాటిచ్చాను. నువ్వు కాదంటే.... నేను మిగలను. మాట పోయాక ప్రాణం మాత్రం వుండి ఏం లాభం?" అన్నాడు ఆ మాటకి రాధ దిగ్గున తలెత్తి తండ్రి నోటిని తన చేత్తో మూసింది. ఎర్రని ఆమె కళ్ళల్లో బాధ రెపరెపలాడింది!
    
    "అయినా  ఆ పరిస్థితి నా బంగారు తల్లి రానివ్వదని నాకు తెలుసులే" అని ప్రేమగా ఆమె తల నిమిరి అక్కడ నుండి గంభీరంగా వెళ్ళిపోయాడు.
    
    శాంత ప్రకాశంవేపు చూసింది.
    
    ప్రకాశం పార్వతమ్మ వేపు చూశాడు.
    
    పార్వతమ్మ రాధవేపు చూసింది.

 Previous Page Next Page