"కాదు తాతయ్యా! కరణంగారి అబ్బాయికి వచ్చింది."
అతడి మాట పూర్తికాలేదు చెంప చెళ్ళుమంది. ఆ వేగానికి వెళ్ళి గోడ దగ్గిర పడ్డాడు. అప్పటికే చెంప వాచిపోయింది. తాతయ్య అంత ఉగ్రుడవటం జన్మలో చూడలేదు. "నా మనవడున్న తరగతిలో మొదటి మార్కు ఇంకొకడికి వచ్చి, ఆ సంబరం ఆ ఇంటిలో జరుగుతుందా?" అంటూ ఆవేశంతో రొప్పుతూ అక్కన్నుంచి వెళ్ళిపోయాడు.
కాని ఆయన సంగతి వేరు. సర్వాధికారాలూ వున్నవాడు. ఈమెకేం అధికారం వున్నది? అసలు తను కాబట్టి యిన్ని మార్కులయినా వచ్చినయ్. పాఠ్యపుస్తకాలు కూడా లేకుండా రెండు నెలల్లో నలభై, యాభైలు రావటం అంటే సామాన్యమైన విషయం కాదు. అది గుర్తించకుండా ఇన్ని మాటలంటుందే?
అతడికి కోపం వచ్చింది. కానీ ఉక్రోషం కూడా విరక్తిగా యింటిలోకి వెళ్ళిపోయాడు.
చిన్నక్క లోపలెక్కడో పని చేసుకుంటూ వుంది. "కొంచెం ఇది సాయంపట్టు నా ఒక్కదానికీ దింపటం చేతకావటంలేదు" అన్న మాటలు వినిపించి తలతిప్పి చూశాడు. అటక దగ్గరికి బల్ల లాక్కొని దానిమీద నిలబడి వుంది వైదేహి చేతులు పైకెత్తి, పైనుంచి ఆవకాయ జాడీ దింపటానికి ప్రయత్నిస్తూంది. ఆ భంగిమ ఎవరినైనా చలింపజేస్తుంది.
అతడు ఆమె దగ్గరికి వెళ్ళి దిగుతుందేమో అని చూశాడు కానీ తన ఒక్కత్తెకీ సాధ్యం కాదన్నట్టూ ఆమె అలాగే నిలబడి వుంది. అతడూ బల్ల ఎక్కాడు. చెరోవైపునా ఇద్దరూ చేతులు వేసి దింపటానికి ప్రయత్నించారు ఆమె వైపునుంచి ఎంతకి జాడీ లేవక పోయేసరికి అతడామె వైపు చూశాడు. పెదాలు బిగించి నవ్వుతూంది. ఆమె శరీరం తాలూకు ముఖ్యమైన అవయవాలన్నీ తనకి తగులుతున్నాయని అప్పుడే అతడికి తెలిసింది. అప్రయత్నంగా కాస్త దగ్గిరకి జరిగాడు.
ఇంతలో ఆమె రహస్యంగా చెప్పింది. "రాత్రి రమణి పెళ్ళికి పక్కవీధికి అందరూ వెళుతున్నారు. పరీక్షలని నేను వుండిపోతాను. నువ్వూ ఆగిపో...." అని ఆగి ".....ఈ రాత్రికి రెండింటికీ పెళ్లి" అంది.
మామూలు సమయాల్లో అయితే తటపటాయించేవాడే యుక్తాయుక్తాలు కూడా ఆలోచించేవాడేమోకాని ఇప్పుడు మందాకిని మీద కసిగావుంది. సరే అన్నట్టూ తలూపేడు.
* * * *
రాత్రి పదయింది.
చిన్నక్కా వాళ్ళూ అందరూ భోజనానికి అక్కడికే వెళ్లారు. మందాకిని కూడా వెళ్ళలేదు, కానీ అతడు పదింటికల్లా నిద్రపోయాడు. రంగారావు పదకొండింటికీ వచ్చాడు. "అందరూ ఎర్రా?" అని అడిగాడు. పెళ్ళికెళ్ళారని చెప్తే నాలిక్కర్చుకుని "అరె-నన్నూ రమ్మని చెప్పారే" అని సోమయాజి వైపు తిరిగి "నువ్వూ రారా" అన్నాడు.
కొంచెం తటపటాయించి అతడూ బయల్దేరాడు. లైటు వెలుతుర్లో పుస్తకం చదువుతూన్న వైదేహి మొహంలో ఏ భావమూ కనపడలేదు. తలెత్తి కూడా చూడలేదు.
వీళ్ళు వెళ్ళేసరికి ముహూర్తం దగ్గిర పడుతూంది.
ఆ ఆవరణలోకి ప్రవేశించగానే సోమయాజి ఆశ్చర్యపోయాడు. అతడి మనసులో ప్రవేశించిన ఒకే ఒక ప్రశ్న "-ఇదేం పెళ్ళి" అని.
ఇరవై గజాల షామియానా వేశారు. మేకులు దిగ్గొట్టి తాళ్ళు కట్టారు. ఓ యాభై రేకుల కుర్చీలు వేశారు. అరుగుమీద మండపం వెల వెలబోతూంది. అందరూ ఇంకా తిండి యావలోనే వున్నారు. కంచాలు పట్టుకుని నిలబడి తింటున్నారు. కొంతమంది బల్లదగ్గిర తిండి లాక్కోవటం కోసం గుంపుగా చేరారు. పెళ్ళికి కావల్సిన ఒక ముఖ్యమైనది - అక్కడ లేదు......'కళ'.
తమింట్లో జరిగిన ఆఖరి పెళ్ళి పెద్దక్క చిన్నకూతురుది ఇంకా కళ్ళకు కట్టినట్టే వుంది. పదిరోజులముందే హడావుడి మొదలయ్యేది. పాలు పితికే వాడిక్కూడా హడావుడే. గుమ్మాలకి మామిడాకుల తోరణాలు, ముంగిట్లో ముగ్గుల ఆభరణాలు....ఇక ఆడవాళ్ళకయితే చెప్పక్కర్లేదు, చేతినిండా పనే, కందులు, పసుపు, మినుములు, దంపుళ్ళూ, జల్లెళ్ళూ.....కబుర్లూ, కాకరకాయలు! గుమ్మడికాయ వండొద్దని సరసాలాడే బావగార్లు, బజార్లో మంచి ఆనపకాయలే దొరకటంలేదనీ ఎదురుదెబ్బ తీసే మరదళ్ళు -
మనస్సుల్లో కల్మషం వుండేది కాదు కాబట్టి హాయిగా మాట్లాడుకునేవారు. ఇక పిల్లల సంగతయితే చెప్పనే అక్కర్లేదు. కొబ్బరాకులు, కట్టిన స్థంభాల చుట్టూ పరుగుల్తో ఆటలు - 'ఎంతవాడివైపోయావురా వెంకట్రావూ' అని కళ్ళు పెద్దవి చేసుకుని చూసే బామ్మలు- 'ఏవేఁ ఇంకా ఏ విశేషమూ లేదా' అని మనవరాల్ని పలకరించే అమ్మమ్మలూ-ఏరీ వీళ్ళంతా?
పెళ్ళికి రెండ్రోజుల ముందరే గదిలో చేరి పేకాట మొదలుపెట్టే పెద్దన్నయ్యలూ, చుట్ట కాలుస్తూ పెళ్లిపందిరి క్రింద కూర్చుని తమ పరిధిలో రాజకీయాలు చర్చించే పెద్దమావయ్యలూ...ఏరి వీళ్ళంతా? పల్లకీ ఎలాగూ లేదు. మూడ్రోజుల ముందే మ్రోగవలసిన మంగళవాయిద్యాలేవి? జీవితపు ఒక అపూర్వమైన అనుభూతిని పదిలంగా దాచుకోవటానికి పెళ్లి కూతురికీ, కొడుక్కీ మనం యిస్తున్న అనుభవం ఏమిటి? ఇదా?? ఇదేనా??? వెలసిపోయిన షామియానా, మంత్రాలు మర్చిపోయిన బ్రాహ్మ డూ-అసలిది మాత్రం ఎందుకు? ఒక కాగితం మీద ఇద్దరికీ పెళ్లి జరిగినట్టూ వ్రాసిస్తే పోలా....? ఏమో ఇంకొన్నాళ్ళకి అదే జరుగుతుందేమో ఈ యాంత్రికమైన జీవితంలో ఈ మాత్రం సమయం కూడా వృధా పర్చటం ఎందుకని మనిషి అనుకున్నరోజు, పెళ్ళి లేకుండా కేవలం కలిసి వుండటమే జరుగుతుందేమో.
అతడి మనసు వికలమయింది. అక్కడ వుండలేకపోయాడు. ఇంటికి తిరిగి వచ్చాడు. చిత్రమేమిటంటే ఇల్లు చేరుకునేవరకూ అతనికి వై దేహి సంగతే గుర్తులేదు. అతన్ని జాగ్రత్తగా గమనిస్తే ఒక విషయం బోధపడుతుంది. అతడు అనుభవం కోసం తహతహలాడటంలేదు. వయసుకీ మనసుకీ మధ్య కొట్టుమిట్టులాడుతున్నాడు. తనకేది కావాలో నిర్ణయించుకోలేకపోతున్నాడు. సాంప్రదాయానికీ-ఆధునిక సంస్క్రుతికీ మధ్య కాలి బంతి ఆపుతున్నాడు.
తలుపు కొట్టిన సోమయాజిని చూసి వైదేహి నవ్వింది. "ఇక రావేమో అనుకున్నాను" అంది. అతడు మాట్లాడలేదు.
"పెళ్లి మొదలైందా?"
"ఇంకా ఒక గంట పడుతుందనుకుంటాను."
కొంచెం నిశ్శబ్దం. అతడేమైనా అంటాడేమో అనుకుంది. అతడు మాట్లాడకపోయేసరికి తనే "పెరట్లో కూర్చుంధామా" అంది. మగవాడు స్త్రీలా బిడియపడితే స్త్రీ మగవాడవుతుంది.
అతడు అన్యమనస్కుడై కూర్చున్నాడు. మనసిక్కడలేదు. ఏదో వ్యధ. రసాస్వాదన సమయంలో కూడా వ్యధ వుంటుందా? తనకు తాను ప్రేక్షకుడైతే వుంటుంది. ఆ ప్రేక్షకుడు బయటవారికి కనబడడు. తనే కనపడతాడు. అంతర్చక్షువవుతాడు.
"ఎప్పుడూ నువ్వు అదోలా వుంటావేం?"
"ఎలా వుంటాను?"
"ఏదో పోగొట్టుకున్నవాడిలా."
అతను జవాబు చెప్పలేదు.
"నీకు జ్యోతిష్యం వచ్చా?"
"ఉహూఁ రాదు?"
"ఛీ! నీ కసలు ఏమీ తెలీదు."
"ఏం తెలీదు?"
"అమ్మాయిలతో ఏం మాట్లాడాలో తెలీదు."
.............
"ఏవైనా కబుర్లు చెప్పు."
"ఏం చెప్పను."
"అదికూడా నేనే చెప్పాలా?"
"......అయితే చెప్తాను.... వింటావా..... ఏం చెప్పను.....ఊఁ......శ్రీహర్ష నైషధం గురించి చెప్పనా......"
"బాబోయ్! పురాణాలు వద్దు."
"మరేం చెప్పను?"
"శృంగారం గురించి చెప్పు."
"పెద్దమావయ్య పాడించేవాడు- ఆ పాట చెప్పనా-జానపదం."
"చెప్పు."
"చందమామోయ్- చందమామా.....వాడిపిక్కలూ సన్నం-మావోఁమావఁ..... వాడి భుజమే వున్నది భూచక్ర గొంగళి- అది పదిగళ్ళు భూమిపై పరిచినా చాలమ్మమావోఁమావాఁ.....నడుంకాడ వున్నది పచ్చలా పిడిబాకు.....అది ఎదలోనా నాటినా చాలమ్మా.....మావోఁమావాఁ"
వైదేహి పడిపడి నవ్వింది. అతడి చేతిని చేతులలోకి తీసుకుంటూ- "అమ్మో ఏమో అనుకున్నాను. చాలా తెలుసే" అంది. అతడి కడుపులోంచి సన్నటి నొప్పి గుండెల్లోకి ఎగజిమ్మింది-క్షణం సేపే. అంతలో సర్దుకుంది. అతడూ నవ్వాడు. నిజానికి అందులో అంత నవ్వొచ్చేది ఏముందో అతనికి తెలీదు. ఏదో వుందని తెలుసంతే! ఆమెతో మాట్లాడాలంటే ఆ స్థాయికి దిగి మాట్లాడాలని మాత్రం తెలిసింది. శ్రీనాథుడి గురించీ, శ్రీహర్షనైషధం గురించీ మాత్రం కాదు. ఆస్థాయికి దిగి మాట్లాడటం ఇబ్బందికరంగా ఉంది. అయినా ఆమెని వదులుకోవాలని లేదు. చీకటిరాత్రి ఆమె సామీప్యం వయసుకు మాత్రమే తెలిసిన ఏదో సంతృప్తినిస్తూంది. అది మనసుకు తెలియటంలేదు.
"నిజంగా నీకు జ్యోతిష్యం తెలీదా?"